Wednesday, 25 October 2017

శివయోగసాధన - శివుని యందు ధ్యానము - స్వామి శివానందసగుణ ధ్యానం- సగుణధ్యానం అంటే సాకరరూపం మీద ధ్యానం. ఒక విలుకాడు ముందుగా స్థూలమైన, పెద్ద వస్తువుపై గురి పెడతాడు. అటు తర్వాత మధ్యస్థంగా ఉన్న వస్తువుపై, అంతిమంగా చిన్న మరియు సూక్ష్మ వస్తువులపై బాణం సంధిస్తాడు. అలాగే, మొదట సగుణ ధ్యానంతో ప్రారంభించి, మనసు తర్ఫీదు పొంది, క్రమశిక్షణగా ఉన్నప్పుడు, అతడి నిరాకర, నిర్గుణ ధ్యానం చేయవచ్చు. సగుణ ధ్యానం అనేది నిర్దిష్ట వస్తువుపై ధ్యానం. సగుణ ధ్యానం అనేది కేవలం తన ఇష్టదైవం మీదే దృష్టి నిలపడం విశేషంగా ఇష్టమైన భక్తునకు నచ్చుతుంది. సగుణ ఉపాసన విక్షేపాన్ని తొలగిస్తుంది. మూడు నుంచి ఆరు నెలల వరకు శివుని మూర్తిపై త్రాటకాన్ని సాధన చేయండి.

అర్ధగంట నుంచి రెండు గంటలవరకు మూర్తి రూపంపై మానసికంగా త్రికుటిలో (రెండు కనుబొమ్మల మధ్యలో) ధ్యానం చేయండి. ఈశ్వరుడు విశ్వంలో ప్రతి వస్తువులో ఉనట్లుగా చూసి భావించండి. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు, దేవత యొక్క మంత్రమైన 'ఓం నమః శివాయ' అను మానసికంగా మననం చేసుకోండి. ఈశ్వరుని గుణాలనైన సర్వవ్యాపకత్వం, సర్వశక్తివంతం, సర్వజ్ఞత్వము గురించి భావన చేయండి. ఈష్టదేవత నుంచి సాత్త్విక గుణాలు మీ వైపు వస్తునట్లుగా భావించండి. మీరు ఈ సాత్త్విక గుణాలను కలిగి ఉన్నట్లుగా భావించండి. ఇదే శుద్ధ లేదా సాత్త్విక భావన. మీరు సాధనలో చిత్తశుద్ధితో ఉంటే, ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో మీ ఇష్టదేవతా దర్శనం కలుగుతుంది. దీన్ని ఆచరించండి. ఇది ఏకాగ్రతకు సహాయపడుతుంది. మూర్తి యొక్క వివిధ శరీరభాగాలపై, శివుని చిత్రంపై, మనసుని నిలుపుతూ ధ్యానించండి. మీరు మామూలుగా కూర్చున్న ఆసనంలోనే కూర్చోండి. ఆయన నామాన్ని జపిస్తూ, ఆయన గుణాలైన ఆనందం, కాంతి, ప్రేమ మొదలైనవి ధ్యానిస్తూ ఆయన మూర్తివైపు కాసేపు చూడండి. జ్వలించే వెలుగుతో ఆయన్ను మీ హృదయంలో లేదా రెండు కనుబొమ్మల మధ్య ఆసీనుడిని చేసుకోండి. ఇప్పుడు మానసికంగా ఆయన పాదపద్మాలను ధ్యానించి, మీ నమస్సులు అందించండి. ఇప్పుడు మనసుని ఆయన నడుముకు కట్టుకున్న ఏనుగు చర్మం మీదకు, ఆయన హృదయాన్ని అలంకరించిన రుద్రాక్ష మాల మీదకు, సుందరమైన నీలకంఠం మీదకు, ధ్యానంతో ప్రసరిస్తున్న చక్కని కాంతి కలిగిన నిర్మలమైన ముఖం మీదకు, అంతర్ముఖ దృష్టి కలిగిన అర్ధ-నీమిలిత నేత్రాల మీదకు, ఫాలభాగం మధ్యలో ఉన్న అద్భుతమైన మూడవనేత్రం మీదకు తీసుకెళ్ళండి. అటు తర్వాత జటాజూటం, చల్లని చంద్రరేఖ మరియు జటల నుంచి ఉబికివస్తున్న పవిత్రగంగ మీదకు మనసును తీసుకెళ్ళండి. ఒక చేతిలో ఉన్న త్రిశూలం, ఇంకో చేతిలో ఉన్న ఢమరుకం మీదకు మనస్సును త్రిప్పండి. అన్ని విశేషాలు ముంగించేవరకు మీ మనసును అలా త్రిప్పండి. అప్పుడు మీ మనసును ముఖం యందు కానీ లేదా ఆయన పాదాలయందు కానీ నిలపండి. ఈ ప్రక్రియను పునఃపునః మననం చేయండి. నిరంతర సాధన ద్వారా, మీరు ధ్యాననిష్ఠులై శివునితో ఏకమవుతారు.

నిర్గుణ ధ్యానం:  ఇది శివుని తత్త్వమైన సర్వవ్యాపకత్వము, అవ్యక్తము, పరంబ్రహ్మ స్వరూపం పై ధ్యానం. ఈ ధ్యానంలో మీరు శివుడిని పరంబ్రహ్మంగా, నిరాకార, నిర్గుణ, సనాతన, అనంతుడిగా ధ్యానిస్తారు. ఆయన్ను శుద్ధుడు, సచ్చిదానందుడు, వ్యాపించిన ఆత్మస్వరూపుడు; నిత్య, శుద్ధ, సిద్ధ, బుద్ధ, ముక్త సనాతనమైన సర్వతంత్ర స్వతంత్రమైన బ్రహ్మంగా, అనంతమైన శుద్ధ చైతన్య సముద్రంగా ధ్యానిస్తారు. ఇప్పుడు మిమ్మల్ని సర్వోత్కృష్టము, ఇంద్రియాతీతమైన శివ స్వరూపంగా గుర్తించుకోండి. చైతన్య, పరిపూర్ణ, ఏకసార, శాంత, మార్పు చెందని ఉనికిగా మిమ్మల్ని భావించండి.

ప్రతి అణువు, ప్రతి త్రసరేణువు, ప్రతి నాడి, రక్త నాళం, ధమని శక్తివంతమైన ఈ ఆలోచనలతో ప్రతిధ్వనించాలి. శివోహం అని పెదవితో జపించడం (పెదవి విరుపు/ నోటి మాట) అంత ఫలదాయకం కాదు. అది హృదయం, మస్తిష్కం మరియు ఆత్మ ద్వారా జరగాలి. ఈ భావన నిరంతరం కలిగి ఉండాలి. శివోహం అనే మంత్రాన్ని మననం చేస్తున్నప్పుడు దేహాత్మభావనను త్రోసివేయండి. మీరు శివోహం జపిస్తునప్పుడు ఇలా భావించండి:

నేను అనంతుడను  శివోహం శివోహం
సమస్తమైఅ కాంతిని నేను  శివోహం శివోహం 
సమస్త ఆనందాన్ని నేను  శివోహం శివోహం 
సమస్త కీర్తిని నేను   శివోహం శివోహం 
సమస్త శక్తిని నేను   శివోహం శివోహం 
సమస్త జ్ఞానం నేను   శివోహం శివోహం 
సమస్త ఆత్మానందం నేను   శివోహం శివోహం 

పైన చెప్పిన భావనలపై నిరంతరం ధ్యానించండి. ఉత్సుకత మరియు ఆసక్తితో నిరంతర ప్రయత్నం అనేది ఆవశ్యకమైనవి. విడువకుండా పైన చెప్పిన భావాలను మానసికంగా మననం చేయండి. మీరు సాక్షాత్కారం పొందుతారు.


- స్వామి శివానంద 

No comments:

Post a Comment