Monday 22 January 2018

శ్రీ రాముల దివ్యనామ స్మరణ సేయుచున్న చాలు (2)



తారక శ్రీ రామనామ ధ్యానం జేసిన చాలు
వేరు వేరు దైవములను వెదక నేటికే మనసా

తారకమంటే సంసార సాగరం నుంచి ఉద్ధరించేదని అర్ధం. శ్రీ రామనామం తారకము. ఆ నామము చాలట, ఈ సంసారమనే ఊబిలో నిండా మునిగిపోయినవాడిని సైతం బయట పడవేయడానికి. అలాంటి ఆ రామానామన్ని ధ్యానం చేస్తే చాలు. వేరేవేరే దేవతల కోసం వెతకడమందుకు అంటున్నారు. అంటే ఇతర దేవతలను తక్కువ చేయడం కాదు. శ్రీ రామ నామంలోనే అన్నీ ఉన్నాయి. రామ నామంలో 'ర'కారం అగ్నిబీజం. అది పాపాలను దహించివేస్తుంది. రామ, రామ అంటూ స్మరిస్తూ ఉంటే, సంచితమనే పెద్ద దూదికుప్ప, ఆ నామ మహాత్యం అనే అగ్నిలో కాలపోతుంది. మకారం మోక్షప్రాప్తినుస్తుంది. సంచితం ఖాళీ అయితే, జన్మపరంపర తగ్గుతుంది. దానితో పాటే మోక్షం కూడా వస్తున్నది. అందులోనే అమృతబీజం కూడా ఉన్నది. అది నీకు మృత్యు భయం లేకుండా చేస్తోంది. మరణ సమయంలో, భీతిల్లకుండా, సమయం ఆసనమవ్వగానే, ఆ శ్రీ రామనామ స్మరణతో చేస్తూ, దేహాన్ని విడిచే స్థితిని అందిస్తున్నది. దానికి ముందు శ్రీకారం లక్ష్మీ స్వరూపం. అది ధర్మబద్ధమైన సంపదలను ఇచ్చి, తద్వారా ఆ సంపదలతో ధర్మబద్ధమైన కామం తీరి, సంతృప్తికి దోహదమవుతోంది. అది వివేక వైరాగ్యాలకు దారితీస్తుంది. అంటే ఒక పక్క లౌకిక ప్రయోజనం, ఇంకొక పక్క పారమార్థిక ప్రయోజనం, రెండూ ఏకకాలంలో తీరుతున్నాయి. ఇహము, పరమూ, రెండూ దక్కుతున్నాయి. ఎందువల్ల? కేవలం తారకమైన ఆ శ్రీ రామనామ ధ్యానం వల్ల. అందుకే అది చేస్తే చాలే ఓ మనసా! ఇది చాలా సులభమైన మార్గము.

డబ్బు కోసం ఒక దేవతా స్వరూపాన్ని లేదా మంత్రాన్ని, మోక్షం కోసం వేరొక రూపాన్ని లేదా మంత్రాన్ని, ఇలా మనకున్న అనే కోరికల కోసం ఎన్నో మంత్రాలను చేయడమెందుకే? అవి చేస్తే సరిపోతాయా? వాటికి ఎన్నో నియమాలు కూడా పాటించాలే ఓ మనసా! ఇలా చూడు. శ్రీ రామనామం సులభమైనది. ఇది సూటియైన మార్గము. ఇందులోనే దేవతలంతా ఉన్నారు. శ్రీ రాముడు సర్వదేవతాత్మకుడు. రామ శబ్దంలో రా అనేది 'నమో నారాయణాయ' అనే అష్టాక్షరీ మహామంత్రంలో ముఖ్యమైన్ వర్ణం. మ అనేది 'నమః శివాయ' అనే పంచాక్షరీ మహామంత్రంలో ముఖ్యమైన అక్షరం. ఈ రెండూ రామనామంలోనే ఉన్నాయి. అంటే అటు శివుడు, ఇటు విష్ణువు.... ఇద్దరి రూపం రాముడు. ఆయనే పరతత్త్వము. అలాంటి రామనామాన్ని వదిలి, వేరేవేరే దేవతల కోసం వెతకడమెందుకే ఓ మనసా! అన్ని నామాలు ఎందులో కలుస్తాయో, సకల దేవతలు ఎక్కడ లీనమవుతారో, ఆ పరబ్రహ్మమైన రాముడి తారకనామాన్నే ధ్యానం చేయవే ఓ మనసా! 

ఇంకా ఉంది....

No comments:

Post a Comment