Tuesday 23 January 2018

శ్రీ రాముల దివ్యనామ స్మరణ సేయుచున్న చాలు (3)

శ్రీ రాముల దివ్యనామ స్మరణ సేయుచున్న చాలు
ఘోరమైన తపములను కోర నేటికే మనసా ||
తారక శ్రీ రామనామ ధ్యానం జేసిన చాలు
వేరు వేరు దైవములను వెదక నేటికే మనసా ||

ఇలా అన్న రామదాసు గారు, తర్వాత చరణంలో ఏమన్నారో చూడండి.

భాగవతుల పాదజలము - పైన జల్లుకొన్న చాలు
భాగీరథికి పొయ్యేననే - భ్రాంతి యేటికే 
భాగవతుల వాగామృతము - పానము జేసిన చాలు
బాగు మీర నట్టి యమృత - పాన మేటికీ మనసా ||

భాగవతులు అంటే భక్తులు. భక్తుల పాదాలను కడిగిన నీరు, తలమీద చల్లుకుంటే చాలునట, గంగకు వెళ్ళాలనే భ్రాంతి ఎందుకు అంటున్నారు. నిజమైన భక్తుడు అన్నిటియందు భగవంతునినే చూస్తాడు. మంచి, చెడు, మేలు, కీడు అంటే విచక్షణ ఉపయోగించడు. మంచి జరిగినా, అది భగవత్ కటాక్షమే. కీడు వాటిల్లినా అది ఆయన అనుగ్రహమే. ఎందుకంటే ఆయన ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదనె ఎఱుక భక్తునికి ఉంటుంది. అతను, అన్నింటా దైవాన్నే చూస్తాడు. నిజానికి అలా చూడగలగడమే పెద్ద యోగము. అలాంటి భక్తుడి పాదధూళిని తన నెత్తిన జల్లుకోవడానికి పరమాత్ముడే తపిస్తాడని మనకు నారదునికి శ్రీ కృష్ణునికి మధ్య జరిగిన ఒక సంవాదంలో కనిపిస్తుంది. భాగవతులు ఎంత గొప్పవారంటే, దేవతలు సైతం వారి పాదాలను ఆశ్రయించి ఉంటారు. ఎందుకంటే దేవతలకు స్వర్గలోక భోగాలు ఉండవచ్చు, కానీ వారికి కూడా స్వామి యందు నిరంతర ధ్యానం ఉంటుందని చెప్పలేము. భక్తునికి భగవంతునితో ఉన్న స్వతంత్రం వేరు. అది వర్ణించలేనిది. అనుభవించవలసినది మాత్రమే. అలాంటి భాగవతోత్తముని పాదాలు పరమపవిత్రం. అందుకే మనం దేవాలయాన్ని సందర్శించే ముందు, గడపుకు నమస్కరిస్తాం. ఎందుకంటే ఆ గడప మీద ఇంతకముందు ఎందరో భాగవతుల పాదధూళి సోకి ఉంటుంది. వాళ్ళ పాదస్పర్శ చేత అది మరింత పవిత్రమై ఉంటుందని.  

అలాంటి భాగవతులు కనిపిస్తే, వారి పాదజలాన్ని తలమీద జల్లుకుంటే, ఇక అంతకంటే ఏమి కావాలి? కానీ అది ఊరికే లభిస్తుందా? వారు పాదపూజలకు ఒప్పుకుంటారా? నిరంతరం ఆ దైవం మీద దృష్టి నిలిపి ఉంటారు. వారికి ఆడంబరాలేమీ పట్టవు. అయినా మన అదృష్టం కొద్దీ అలాంటి భాగవతుడు దొరికితే, ఆలస్యం చేయకుండా, ఆయన పాదాలను కడిగి ఆ నీటిని శిరస్సుపై చల్లుకోమంటున్నారు. ఎక్కడో దూరంలో ఉన్న గంగకు వెళ్ళాలన్న భ్రాంతి ఎందుకు? గంగ పవిత్రమైనదే. కానీ అక్కడకు వెళ్ళడం ఎంతో కష్టతరం. కానీ నడిచి వెళుతున్న భాగవతుని పాదధూళినైనా పట్టుకుని, తలమీద చల్లుకోవడం సులభమే కదా. అలాగే గంగకు వెళితే, స్నానం చేసి వచ్చేస్తాం. అదే ఒక భాగవతుని చెంతకు వెళితే, నిజమైన సత్సంగం కూడా దొరుకుతుంది. అంటే బాహ్యస్నానము, ఆంతరస్నానము. రెండూ ఏక కాలంలో జరుగుతున్నాయి. అందుకే ఓ మనసా! ఎక్కడో దూరంలో ఉన్న గంగకు వెళ్ళాలనే భ్రాంతి వదులు. నీకు దగ్గరలో ఉన్న భాగవతుని పాదాలను పట్టుకోవే. అదే రాముడిని చేరడానికి సులభమైన ఉపాయమే. 

ఇంకా ఉంది....

No comments:

Post a Comment