Saturday 10 August 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 2వ భాగము

మొదటి అధ్యాయము 

గురువు యొక్క పాత్ర 

అఙ్ఞానతిమిరాంధస్య ఙ్ఞానాంజనశలాకయా |చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః || 

అజ్ఞానమనే అంధకారంతో మూసుకొని పోయిన కళ్ళకు, జ్ఞానమనే అంజనం పూసి, సత్యాన్ని చూపి, అజ్ఞానం నుంచి బయటకు తీసుకువచ్చే గురువునకు నమస్కారములు- గురు గీత

గురువు అనే వాడు జీవునకు దేవునికి మధ్య ఉన్న నిజమైన లంకే/సంబంధము. అతను (తత్త్వమసి - అదే నువ్వు అనే మహావాక్యంలో చెప్పిన) ఇది(జీవుడు) నుంచి అది(ఈశ్వరుడు) కి చేరిన వాడు కనుక అతనికి రెండు లోకాలతో స్వచ్ఛమైన, నిరాటంకమైన సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. అతను నిత్యమైన, అమరమైన భగవంతుని ముందు నిల్చుని ఉంటూనే, క్రిందకు వంగి, ఒక చేత్తో శ్రమపడుతున్న జీవులను పైకి ఎత్తుతారు. ఇంకో చేత్తో వారిని నిరతిశయ ఆనందానికి, సచ్చిదానంద భూమిక తీసుకువెళ్తారు.

సద్గురువు


కేవలం పుస్తక పఠనమే వ్యక్తిని గురువు స్థాయికి తీసుకువెళ్లదు. ఏ వ్యక్తి అయితే వేదాలను చదివాడో మరియు అనుభవం ద్వారా, అపరోక్షానుభూతి ద్వారా ఆత్మను తెలుసుకున్నాడో, అతను మాత్రమే గురువుగా చెప్పబడతాడు. జీవన్ముక్తుడు లేదా ముక్తుడైన మునియే నిజమైన గురువు. అతడే సద్గురువు. అతడు బ్రహ్మముతో సమానమైనవాడు, బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడు.

కేవలం సిద్ధులు పొందినంత మాత్రం చేతనే ఒక యోగి గొప్పవాడని లేదా అతను ఆత్మసాక్షాత్కారం పొందాడని ప్రకటించడానికి వీలులేదు. సద్గురువులు ఎలాంటి మహిమలు గాని, సిద్ధులు గాని చూపరు. కొన్నిసార్లు అలౌకికమైన విషయాలు ఉన్నాయని సాధకుడిని ఒప్పించేందుకు, వారి మనసులో విశ్వాసాన్ని నెలకొల్పేందుకు, వారు వాటిని ప్రదర్శించవచ్చు. సద్గురువు లెక్కలేనన్ని సిద్ధులు కలిగి ఉంటారు. ఆయన దైవికమైన సకల ఐశ్వర్యాలను, దైవీసంపదను కలిగి ఉంటారు. 


సద్గురువు అంటే సాక్షాత్తు పరబ్రహ్మము. ఆయన ఆనంద, జ్ఞాన మరియు దయాసముద్రుడు. ఆయన జీవులకు అధిపతి, ముందుకు నడిపించువాడు, నాయకుడు, నావికుడు. ఆయన ఆనందానికి మూలం స్థానము. ఆయన మీ యొక్క సకల బాధలను, దుఃఖాలను మరియు ఆటంకాలను తొలగిస్తారు. ఆయన మీకు సరైన దైవికమైన మార్గము చూపుతారు. ఆయన మీ యొక్క అజ్ఞానమును చింపివేస్తారు. ఆయన మిమ్మలిని అమరులుగా, దైవంగా మార్చుతారు. ఆయన మీ లోని నీచమైన మరియు పాపిష్టి ప్రకృతిని మార్చివేస్తారు. ఆయన మీకు జ్ఞానమనే తాడును ఇచ్చి, సంసారమనే సముద్రంలో మునిగిపోకుండా రక్షిస్తారు. ఆయనను కేవలం ఒక మనిషిగా భావించకండి. మీరు గనక ఆయన్ను మనిషిగా భావన చేస్తే, మీరు ఒక పశువుతో సమానము. మీ గురువును పూజించి, గౌరవంతో ఆయనకు నమస్కరించండి.

గురువే దేవుడు. గురువు నుంచి వచ్చిన వాక్కు భగవంతుని వాక్కే అయివుంటుంది. ఆయన ఏమీ బోధించవలసిన పనిలేదు. కేవలం ఆయన సమక్షంలో ఉండడమో లేదా ఆయనతో సంగం కలిగి ఉండడమే వ్యక్తిని ఉద్ధరిస్తుంది, ఉన్నతమైన ఆశయ సాధన దిశగా ప్రేరేపిస్తుంది, నిద్రాణమైన శక్తులను కదిపి లేపుతుంది. గురువు సమక్షంలో ఉండటమే జ్ఞానోదయము. ఆయన సంగం/ సమక్షంలో ఉండటమే ఆధ్యాత్మిక విద్యాభ్యాసము. గురు గ్రంథ సాహిబ్ చదవండి. గురువు యొక్క గొప్పతనం మీకు తెలిసి వస్తుంది. 

మనిషి ఇంకో మనిషి నుంచి మాత్రమే నేర్చుకోగలడు. అందుకే భగవంతుడు గురువు రూపంలో బోధ చేస్తాడు. నీవు అలవర్చుకోవలసిన మానవుని యొక్క పరిపూర్ణమైన ఆదర్శమే నీ గురువు. నిన్ను నువ్వు ఏ విధంగా మలుచుకోవాలి అనేదానికి గురువు అనేవాడు ఒక నమూనా వంటివాడు. అటువంటి గొప్ప జీవాత్మను పూజించి, గౌరవించడానికి నీ మనస్సు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. 


గురువే మోక్షద్వారము. సర్వోత్కృష్టమైన సచ్చిదానంద తత్వానికి ఆయనే ప్రవేశమార్గము, సింహద్వారము. కానీ సాధకుడు దాని ద్వారా లోనికి ప్రవేశించాలి. గురువు అనే వాడు సాయం అయితే, ప్రయోగాత్మకమైన సాధన అనే అసలు కార్యాన్ని ఆచరించాల్సిన బాధ్యత సాధకుని మీదే ఉంటుంది.

No comments:

Post a Comment