Sunday, 11 August 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 3వ భాగము
గురువు యొక్క అవసరము 

ఆధ్యాత్మిక ప్రయాణం ఆరంభించేవాడికి గురువు అవసరము. ఎలాగైతే ఒక దీపాన్ని వెలిగించాలంటే, అంతకు ముందు నుంచే వెలుగుతున్న మరో దీపం ఎలా అవసరమో, అలాగే జీవుని జ్ఞానోదయానికి, జ్ఞానోదయం చెందిన వేరొక జీవుడు అవసరము. 

కొంతమంది స్వంతంగా ఏళ్ల తరబడి ధ్యానం చేస్తారు. ఆ తర్వాత, వాళ్లు గురువు యొక్క అవసరం ఉందని తెలుసుకుంటారు. మార్గంలో వాళ్లకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఈ ఆటంకాలు లేదా విఘ్నాలను నివారించడం లేదా దాటడం ఎలాగో వారికి తెలియదు. అప్పుడు వారు గురువు కోసం అన్వేషణ ప్రారంభిస్తారు.

బద్రీనాథ్ చూసిన వ్యక్తి మాత్రమే బద్రీనాథ్ చేరటానికి వెళ్లే మార్గం చెప్పగలరు. అలాగే ఆధ్యాత్మిక పథంలో, మార్గం తెలుసుకోవడం మరింత కష్టము. మనసు నిన్ను ఎన్నోసార్లు పక్కదారి పట్టిస్తుంది. గురువు మార్గంలో ఉన్న ఆటంకాలను, గోతులను తొలగించి సరైన మార్గంలో ముందుకు వెళ్లేలా చేయగలరు. "ఈ మార్గము మోక్షానికి చేరుస్తుంది. ఇది బంధానికి కారణం అవుతుంది" అని గురువు నీకు చెబుతారు. ఈ మార్గదర్శనం లేకుండా బద్రీనాథ్ చేరాలనుకుంటే, నీవు ఢిల్లీ చేరుకున్నట్లు తెలుసుకుంటావు.

గ్రంథములు అనేది అరణ్యం వంటివి. వాటిలో గందరగోళానికి గురి చేసే ఎన్నో భాగాలు ఉన్నాయి. అందులో కొన్ని విషయాలు పూర్తిగా పరస్పర విరుద్ధంగా ఉంటాయి, మరియు కొన్నిటికి నిగూఢమైన అర్ధాలు, బహువిధములైన ప్రముఖత, మరియు బయటకు చెప్పని/ దాచబడిన వివరణలు ఉన్నాయి. ఒక గ్రంథంలో చెప్పబడిన విషయానికి వివరణ వేరొక గ్రంథంలో దొరుకుతుంది. వీటి యొక్క సరైన అర్ధాన్ని నీకు వివరించేందుకు, నీలో ఉన్న సందేహాలను, గందరగోళాన్ని తొలగించేందుకు, వాటిల్లో చెప్పబడిన విషయాలు నీ ముందు ఉంచేందుకు, నీకు గురువు అవసరము. 

గురువు అనే వాడు ఆధ్యాత్మిక పథంలో ఉన్న ప్రతి ఒక్క సాధకునికి ఖచ్చితంగా అవసరము. గురువు మాత్రమే నీలోని దోషాలను పసిగట్టగలరు. అహంకారం యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే నీ లోని లోపాలను నీవు గుర్తించలేవు. ఎలాగైతే ఒక వ్యక్తి తన వెనుక భాగాన్ని అనగా వీపును చూడలేడో, అలాగే తన సొంత తప్పులను తాను తెలుసుకోళేడు. తనలో ఉన్న దుర్గుణాలను, దోషాలను తొలగించుకోవడానికి అతనికి గురువు దగ్గర ఉండటం జీవించడం అవసరము.

గురువు యొక్క నీడలో ఉన్న సాధకుడు ఏనాడు దారితప్పకుండా (పథభ్రష్టుడు కాకుండా) సురక్షితంగా ఉంటాడు. గురువుతో సత్సంగము అనేది భౌతిక ప్రపంచం యొక్క అన్ని రకాల ఆకర్షణలు మరియు ప్రకూల శక్తుల నుంచి కాపాడే కవచము మరియు కోట వంటిది.

గురువు దగ్గర విద్యాభ్యాసం చేయకుండా పరిపూర్ణత పొందిన వారిని ప్రమాణంగా చూపి, గురువు అవసరం లేదు అని చెప్పకూడదు. ఎందుకంటే అలాంటి వారు సాధారణమైన వారు కాదు. ఆధ్యాత్మిక జీవితంలో వారు అసాధారణమైన వారు. గత జన్మల్లో వారు ఎంతో తీవ్రంగా చేసిన శుశ్రూష (గురుసేవ), అభ్యాసం మైర్యు ధ్యానం కారణంగా ఈ జన్మలో వారు ఆధ్యాత్మిక గురువులుగా అవతరించారు. వారంతా ఇంతకముందే గురువు దగ్గర విద్యాభ్యాసం చేశారు. ఈ జన్మ అనేది గత జన్మ నున్చి వచ్చిన అవిచ్ఛిన్నమైన ఆధ్యాత్మిక పరిణామం మాత్రమే. కాబట్టి గురువు యొక్క ప్రముఖతను తగ్గించకూడదు. 

కొందరు బోధకులు సాధకులను తప్పు ద్రోవ పట్టిస్తారు. "మీ గురించి ఆలోచించండి. ఏ గురువును శరణం వేడకండి" అని వారు అంటారు. ఎవరైనా గురువులను అనుసరించవద్దు అని చెబితే వాడు శ్రోతలకు చెప్పేదేంటంటే, తానే గురువని నర్మగర్భంగా చెబుతున్నారు. అలాంటి దొంగ గురువుల దగ్గరకు వెళ్ళకండి. వారి మాటలను వినకండి.
\మహాత్ములందరికీ గురువులు ఉన్నారు. ఋషులు, మునులు, దేవదూతలు, జగద్గురువులు, అవతారాలు, మహా పురుషులన్దరికీ వారెంత గొప్ప వారైనా, వారికి గురువులు ఉన్నారు. శ్వేతకేతు సత్యం యొక్క తత్వాన్ని ఉద్దాలక మహర్షి నుంచి, మైత్రేయుడు యాజ్ఞవల్కుని నుంచి, నారదుడు సనత్కుమారుని నుంచి, భృగువు వరుణుని నుంచి, నచికేతుడు యముని నుంచి, ఇంద్రుడు ప్రజాపతి నుంచి నేర్చుకున్నారు; మరియు మరింకెందరో వినయంగా జ్ఞానుల వద్దకు వెళ్లారు. కఠోర బ్రహ్మచర్యం, తీవ్రమైన క్రమశిక్షణతో కూడిన సాధన చేసి వారి నుంచి బ్రహ్మవిద్యను పొందారు. కృష్ణ భగవానుడు తన గురువు అయినా సాందీపాని మహర్షి పాదాల వద్ద కూర్చున్నారు. రామునకు ఉపదేశం చేసి వశిష్టుడు గురువు అయ్యాడు. దేవతలు కూడా బృహస్పతిని గురువుగా కలిగి ఉన్నారు. గొప్ప దివ్య జీవులు, దేవతలు సైతం గురువు దక్షిణామూర్తి పాదాల వద్ద కూర్చున్నారు. 

ఆధ్యాత్మికతను కొత్తగా ప్రారంభించిన వానికి మొట్టమొదటగా వ్యక్తిగత గురువు అవసరము. దైవాన్ని అతడు గురువుగా భావించి సాధన ప్రారంభించలేడు. అతనికి శుద్ధమైన మనస్సు ఉండాలి. నైతికమైన పరిపూర్ణత ఉండాలి. అతను ఎంతో పుణ్యశాలి అయి ఉండాలి. అతను దేహాత్మ భావనకు పై స్థాయిలో ఉండాలి. అప్పుడు మాత్రమే అతను భగవంతుడిని గురువుగా కలిగి ఉండవచ్చు.

No comments:

Post a Comment