Sunday 25 August 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 7వ భాగము



గురు పరంపర

ఆధ్యాత్మిక జ్ఞానం అనేది గురు పరంపరకు చెందిన విషయము. అది గురువు నుంచి శిష్యునకు అందుతుంది. గౌడపాదాచార్యుల వారు ఆత్మవిద్యను తన శిష్యుడైన గోవిందాచార్యులకు ఇచ్చారు. గోవిందాచార్యులు తన శిష్యుడైన శంకరాచార్యులకు అందించారు; శంకరాచార్యులు తన శిష్యుడైన సురేశ్వరాచార్యులకు అందించారు; మస్త్యేంద్రనాథుడు తన శిష్యుడైన గోరఖ్‌నాథునకు జ్ఞాన బోధ చేశారు. గోరఖ్‌నాథుని నుంచి నివృత్తినాథునకు, నివృత్తినాథుని నుంచి జ్ఞానదేవునకు వచ్చింది. శ్రీ రామకృష్ణ పరమహంసకు తోతాపురి గారు జ్ఞానం అందించారు. మరియు శ్రీ రామకృష్ణులు స్వామి వివేకానంద ఇచ్చారు. జనక మహారాజు యొక్క జీవితాన్ని మలిచిన వారు మహర్షి అష్టావక్రుడు. గోరఖ్‌నాథుడే రాజా భర్తృహరి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని రూపొందించారు. తమ మనస్సులు చంచల స్థితిలో ఉండగా, శ్రీ కృష్ణభగవానుడు అర్జునుడు మరియు ఉద్ధవుడు ఆధ్యాత్మికపథంలో నిలదొక్కుకునేలా చేశారు.

ఉపదేశము/ దీక్ష - దాని యొక్క అర్ధము

భక్తునికి భక్తిమార్గంలో ఉన్న గురువు భక్తి యోగంలోకి దీక్ష ఇస్తారు. వేదాంతం నేర్చుకునే విద్యార్థికి మహా వాక్యాలను జ్ఞాని ఉపదేశిస్తారు. హఠయోగి లేదా రాజయోగి ఇంకొకరిని తన మార్గంలో దీక్ష ఇచ్చి తీసుకువస్తారు. కానీ నిజమైన ఆత్మసాక్షాత్కారం పొందిన యోగి, పూర్ణ జ్ఞాని లేదా పూర్ణ యోగి, ఏ మార్గంలోకైనా దీక్ష ఇవ్వచ్చు. శ్రీ శంకరాచార్యులు లేదా శ్రీ మధుసూదన సరస్వతి వంటి మహా పురుషులు ఒక సాధకుడిని, తాను ఏ మార్గానికి తగినవాడో, ఆ మార్గంలోకి దీక్ష ఇచ్చి ప్రవేశపెడతారు. గురువు తన శిష్యుడు లేదా సాధకుని యొక్క అభిరుచులు, స్వభావము మరియు శక్తిసామర్ధ్యాలను దగ్గరగా పర్శీలించి, అతనికి అత్యంత తగిన మార్గం నిర్ణయిస్తారు. అతని హృదయం అపవిత్రంగా ఉంటే కొన్నేళ్లు నిస్వార్థ సేవ చేయమని అతడిని గురువు ఆదేశిస్తారు. అప్పుడు ఆ విద్యార్ధికి తగిన మార్గం గ్రహించి, అతనికి ఆ మార్గంలో దీక్ష ఇచ్చి ప్రవేశపెడతారు. 

దీక్ష ఇవ్వడం లేదా ఉపదేశించడం అంటే మంత్రాన్ని చెవిలో చదవడం కాదు. రామ అనే వాడు కృష్ణుని యొక్క ఆలోచనల వల్ల ప్రభావితమైతే, రామునకు కృష్ణడి నుంచి ఎప్పుడో దీక్ష వచ్చేసిందని అర్ధము. ఒక మహాపురుషుడు రాసిన పుస్తకాలను చదివి సత్య మార్గంలో ఒక సాధకుడు పయనిస్తూంటే, అతని యొక్క బోధనలను అనుసరిస్తుంటే, ఆ యోగి అతనికి అప్పటికే గురువు అయ్యాడు.

No comments:

Post a Comment