Sunday 31 May 2020

హిందూ ధర్మం - 278 (కర్మ సిద్ధాంతం - 18) (స్వతంత్రేచ్ఛ)



స్వతంత్రేచ్ఛ 

అన్నీ కర్మ ప్రకారం జరిగితే ఇక మనకు పాపపుణ్యాల పేరుతో కష్టసుఖాలు ఎందుకు ? అన్ని కర్మను అనుసరించి మనౌ లభిస్తున్నప్పుడు కొత్తగా ప్రయత్నించడం ఎందుకు అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అదీగాక చాలామంది విదేశీయులు కర్మసిద్ధాంతాన్ని 'ఫేటలిజం' అని అనేస్తారు. 'ఫేటలిజం' అనే పదానికి "అన్నిటికి అదృష్టమే ప్రధానమనే మతం" అని అర్థం వస్తుంది. కర్మసిద్ధాంతం దీనికి పూర్తిగా విరుద్ధం.

ఒక పని చేయాలా వద్దా అనే స్వతంత్రత జీవునకు ఉంటుంది. కానీ దాని కర్మఫలం మీద అతనికి అధికారం ఉండదు. శ్రీ కృష్ణ పరమాత్మ గీతలో చెప్పింది కూడా ఇదే. 'కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనా' - నీకు కర్మ చేయడంలోనే అధికారం ఉంది. అంటే మంచి చేస్తావా లేఖ చేడు చేస్తావా అనేది నీ ఇష్టం. నీకు అందులో పూర్తి స్వేచ్ఛ వుంది. కానీ నీవు చేసిన కర్మకు, నీకు నచ్చిన ఫలం పొందే అధికారం లేదు. అంటే చెడు చేసి, దానికి సత్ఫలితాన్ని పొందే అవకాశం నీకు లేదు. కనుక నీవే నిర్ణయించుకోవాలి. 

ఉదాహరణకు - నా నోటికొచ్చింది నేను మాట్లాడుతాను, తిడతాను, అరిషడ్వర్గాలకు లోనై నిందలు వేస్తాను, అవమానించి క్రిందకు లాగుతాను. ఇదంతా నా కర్మలో ఉంది గనకే నేను చేస్తున్నానని అంటావా ? అలా సమర్ధించుకోలేవు. అలా సమాధాన పరుచుకున్నా శాస్త్రం ఒప్పుకోదు. నేను చేసింది దుష్కర్మ. కనుక దానికి తగ్గ ఫలితం నీకు ఈశ్వరుడిస్తాడు. నువ్వు భక్తుడివనో, కొబ్బరికాయలు కొడతావనో, అర్చనలు చేస్తావానో, ధర్మరక్షణ చేస్తున్నావనో నీకు శిక్ష తగ్గించి వేయడు. నువ్వు చేసినదానికి నువ్వు అనుభవించవలసిందే. ఇక్కడ ఈశ్వరుడు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడు. 

జీవుడు ఒక పని (కర్మ) చేయాలంటే అతడి మీద అతని పూర్వపు ఆలోచనలు, వాసనలు, వృత్తులు, సంస్కారాలు ప్రభావం చూపిస్తాయి (వీటి గురించి మనం ముందే చెప్పుకున్నాము, అవి చదవండి). కానీ కొత్తగా నీకు కొంత స్వేచ్ఛ కూడా ఉంటుంది. నీకు నచ్చింది నువ్వు చేయవచ్చు. దానినే స్వతంత్రేచ్ఛ అంటారు. (ఇచ్ఛ అంటే కోరిక/ will). 

అనగా నీ కర్మ ప్రకారం నీకు ఒకటి లభ్యం కాకపోవచ్చు, కానీ నీ స్వతంత్రేచ్ఛతో, దృఢ సంకల్పంతో నువ్వు ప్రయత్నం చేస్తే, నీకు అది లభ్యం కావచ్చు. నీ ప్రయత్నం యొక్క తీవ్రతను బట్టి నువ్వు దుస్సాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసుకోవచ్చు. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. అది కర్మసిద్ధాంతమే చెబుతుంది.  

ఇంకా ఉంది .....  

No comments:

Post a Comment