Friday 1 May 2020

పని సంస్కృతి నేర్పిన భగవాన్ రమణ మహర్షి

భగవాన్ ప్రతీ రోజు తెల్లవారుఝామున 3 గంటలకు లేచి తమ కాల కృత్యాలు తీర్చుకున్నాక వంటగది లోకి వెళ్లి చట్నీ రుబ్బడం చేసేవారు ఉదయము అల్పాహారం కొరకు.

ఇలా రోజూ చేస్తుండడము వల్ల భగవాన్ చేతికి బొబ్బలు వచ్చినవి. ఇది గమనించిన విశ్వనాథ స్వామి అనే భక్తుడు ఎన్నో సార్లు భగవాన్ కి నచ్చ చెప్పేవారు చేతికి బొబ్బలు పెట్టుకుని ఇలా రుబ్బడము వంటి పనులు చేయవద్దు అని. కానీ భగవాన్ ఆ మాటలు లెక్క చేయకుండా రోజు వంట గదిలో ఈ చట్నీ రుబ్బడము చేసేవారు.

ఇంక ఇది చూడలేని విశ్వనాథ స్వామి ఒక రొజు భగవాన్ కంటే ముందే లేచి చట్నీ రుబ్బడము, మరియు భగవాన్ ఏయే పనులు చేసేవారో అవి అన్నీ పూర్తి చేసారు. వంట గది నుండి బయటికి రాగానే భగవాన్ ఎదురు పడి తన పనిని ఎందుకు చేసావు అని నిలదీశారు. దానికి విశ్వనాథ స్వామి కంట నీరు పెట్టుకుని "భగవాన్ మీరు బొబ్బలు ఎక్కిన చేతితో రుబ్బడము నేను చూడలేక పోతున్నాను" అన్నాడు .

అప్పుడు భగవాన్ అన్నారు "ఇంతకు ముందు నేను బిక్షకు వెళ్ళేవాడిని. ఇప్పుడు ఆశ్రమము వారు నాకు ఉచితముగా భోజనము పెడుతున్నారు. అందుకే నేను వంట గదిలో ఏదో ఒక పని చేస్తుంటాను. ఈ రోజున నువ్వు నా వంతు పనిని చేసావు కావున కనీసము నీ ధోతీని ఇవ్వు ఉతికి పెడతాను" అన్నారు. ఇది విన్న విశ్వనాథ స్వామి కన్నీళ్లు పెట్టుకుని భోరున ఏడ్చేసాడు.

-----

ఏ పని చేయకుండా జీతం తీసుకోవడం, తిని కూర్చోవడం తప్పని లోకానికి చాటి, పని సంస్కృతి నేర్పారు భగవాన్ రమణ మహర్షి.

No comments:

Post a Comment