Tuesday 10 October 2023

శ్రీదత్త పురాణము (282)

 


(6) ఆయన వక్షఃస్థలం విశాలంగా బలిసి ఉంటుంది. చేతులు ఎర్రగా ఉదరం పల్చగా ఉంటాయి. ఆయన విశాలమైన పిరుదులతో అందంగా ఉంటాడు. ఆయన కటిస్థలం విశాలంగా ఉంటుంది. (7) ఆయన తొడలు అరటిబోదెలవలె ఉంటాయి. మోకాళ్ళు, పిక్కలూ చక్కగా ఉంటాయి. గుల్ఫాలు (చీలమండలు) గూఢంగా ఉంటాయి. పాదాల పైభాగాలు తాబేటి పైభాగాలవలె విలసిల్లుతుంటాయి. (8) అరికాళ్ళు ఎర్రతామరపువ్వులవలె అందంగా ఉంటాయి. మృగ చర్మమును వస్త్రంగా ధరిస్తాడు. ఆ యోగి ప్రతిక్షణమూ తనను తలచుకొన్న వారి వద్దకు చేరుతుంటాడు. (9) ఆయనకు జ్ఞానోపదేశం చేయటమంటే ఆసక్తి. ఆపదలు తొలగించడం ఆయన దీక్ష. సిద్ధాసనం వేసుకొని ఆయన నిటారుగా కూర్చుంటాడు. ఆయన నవ్వుముఖంతో ఉంటాడు. (10) ఆయన ఎడమచేత వరదముద్రా, కుడిచేత అభయముద్రా ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఆయన బాలురు, ఉన్మత్తులు, పిశాచులు-మొదలగు వారితో కూడి కనబడుతూ ఉంటాడు. (11) ఆయన త్యాగి, భోగి, మహాయోగి, నిత్యానందుడు, నిరంజనుడు, సర్వరూపి, సర్వదాత, సర్వగామి, సర్వకాముదుడు. (12) ఆయన తన సర్వావయాలకూ భస్మం పూసుకొంటాడు. సర్వమహాపాతకాలనూ నాశనం చేస్తాడు. ఆ జీవన్ముక్తుడు భోగాలనూ, మోక్షాలన్నీ ప్రసాదిస్తాడు, ఇందులో సంశయం లేదు. (13)


ఇలా ధ్యానించి, వేరే తలంపు లేకుండా నా వజ్రకవచం పఠించాలి. సర్వత్ర నన్నే దర్శిస్తూ నాతో సంచరించాలి. (14) దిగంబరుడు, భస్మసుగంధం పూసుకొన్నవాడు, చక్రం, త్రిశూలం, డమరువు, గద ఈ ఆయుధాలు - ధరించినవాడు, పద్మాసనంతో కూర్చున్నవాడు, యోగీంద్రులూ, మునీంద్రులూ, నిత్యమూ "దత్తా, దత్తా" అను నామస్మరణతో ఆయనకు నమస్కరిస్తుంటారు. (15)


No comments:

Post a Comment