Showing posts with label దమము. Show all posts
Showing posts with label దమము. Show all posts

Tuesday, 17 June 2014

హిందూ ధర్మం - 86 (దమము)

దమము అంటే మనసును చెడు నుంచి నిగ్రహించడం. పూర్వం ఒక సాధువు ఉండేవారు. ఆయన భోధనలు వినడానికి చాలామంది వచ్చేవారు. అందులో ఒకాయనకు బాగా డబ్బు గలవాడు. అతను ఎన్ని బోధనలు విన్నా, మనసు వాటిని స్వీకరించేది కాదు. ఆ విషయాన్ని సాధువుకు చెప్పి, ఏదో ఒకరోజు తన ఇంటికి బిక్షకు రమ్మని ఆహ్వానించాడు. చాలా రోజుల తర్వాత సాధువు ఈ ధనవంతుడి ఇంటికి భిక్షకు వెళ్ళగా, అతను రుచికరమైన వంటలను తయారు చేయించాడు. బిక్ష వేసే సమయానికి సాధువు తన ఇసుకతో నిండిన భిక్షా పాత్రను ధవంతుడు ముందు పెట్టాడు. ఆ పత్రను చూసి, అందులో భిక్ష వేయడానికి నిరాకరించాడు ధనవంతుడు. 'ఆగిపోయావేం? భిక్ష వేయవా?' అన్నారు సాధువు. అందులో భిక్ష ఎలా వేయాలి స్వామి? పాత్ర మొత్తం దుమ్ముధూళితో ఉంది అని బదులిచ్చాడు ధనవంతుడు. దానికి బదులుగా సాధువు 'అంతేనాయానా! మలినమైన పాత్రలో భిక్ష వేస్తే, అది స్వీకరించడానికి అర్హత కోల్పోతుందని ఆలోచించావు. మరి మలినమైన మనసు మంచి విషయాలను ఎలా స్వీకరిస్తుంది చెప్పు? నీవు ముందు చెడు విషయాలను విసర్జించు. మనసుకు మంచి విషయాలనే అందించు. అప్పుడు మనసు శుద్ధి చెందుతుంది. పరిశుద్ధి చెందిన మనసు గురువు ఉపదేశాలను యధావిధిగా స్వీకరిస్తుంది' అని వెళ్ళిపోయాడు. ఈ కధ మనకు బోలెడు నీతిని చెప్తోంది.

మనసు ఎప్పుడు చెడు విషయాలను చూచుటకు, వినుటకు, మాట్లాడుటకు, ఆలోచించుటకు అలవాటు పడితే, ఇక మంచిని ఎలా స్వీకరిస్తుంది. స్వీకరించినా, ఎలా ఆచరించగలుగుతుంది. అందుకే ధర్మాన్ని ఆచరించేవారు దమాన్ని (మనో నిగ్రహాన్ని) పాటించాలంటారు మనుమహర్షి. మన ఇంట్లో దేవుడు ఫోటోని కానీ, విగ్రహాన్ని కానీ ఎక్కడైనా పెట్టవలసి వస్తే, ఎంత జాగ్రత్త చూపుతాం. సరైన స్థలం చూస్తాం, అది శుచిగా ఉందో లేదో చూస్తాం, అక్కడ మళ్ళీ ఒకసారి శుభ్రం చేసి, అప్పుడు ఫోటో తగిలిస్తాం. అంతేకానీ మేకు ఉందని తీసుకెళ్ళి అశుద్ధమైన ప్రదేశంలో తగిలిస్తామా? ఇంట్లో ఫొటో తగిలించడానికే అంత జాగ్రత్త చూపిస్తే, మనసులో దేవుడిని నిలపడానికి ఇంకెంత జాగ్రత్త పడాలి. మనసు కుళ్ళు, కోపం, కుట్రలు, చెడు ఆలోచనలతో నిండి ఉంటే, ఇక అందులోకి దేవుడు ఎలా ప్రవేశిస్తాడు? ప్రవేశించినా, ఆయన కూర్చోడానికి సరైన స్థలమే లేకుండా మనసును దుష్ట ఆలోచనలతో నింపితే, ఆయన అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. అది మనం పరమాత్ముడికి చేసే అవమానం కాదా? అందుకే దమాన్ని పాటించమన్నారు పెద్దలు. మనసును పాప కార్యాల నుంచి, శాస్త్రవిరుద్ధమైన జీవనం నుంచి, నిషిద్ధకర్మల నుంచి వెనక్కు మళ్ళించడం, నిగ్రహించడం, నిరోధించడం దమము.

 To be continued .................

Monday, 10 March 2014

హిందూ ధర్మం - 33 (మనో నియంత్రణకు మార్గాలు)

ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లో, మెనెజ్‌మెంట్ కోర్సుల్లో ఇతరులను మెనెజ్ చేయడం ఎలాగో నేర్పిస్తారు. కానీ భారతీయ సంస్కృతి, తనను తాను అదుపు చేసుకోవడం, తనను తాను మెనెజ్ చేసుకోవడం నేర్పుతుంది. తనను తాను అదుపు చేసుకోలేనివాడు, ప్రపంచాన్ని ఎలా మెనెజ్ చేయగలడని ప్రశ్నిస్తుంది. మొత్తం భారతీయ తత్వశాస్త్రమంతా మనల్ని మనం ఎలా మెనెజ్ చేసుకోవాలో నేర్పిస్తాయి. దేవుంద్రుడిని జయించిండం గొప్ప కాదయ్యా, నీ మనసును గెలవడమే గొప్ప అని ఘోషిస్తాయి. మనసును ఎలా గెలవాలో, మార్గం చూపిస్తాయి.

మనకు (ఆత్మకు), శరీరానికి మధ్య వారధి ఊపిరి. ఊపిరి ఆగిన మరిక్షణం జీవితం ముగిసిపోతుంది. మనసు, దాని ఆలోచన సరళి మనం తీసే ఊపిరి మీద ఆధారపడి ఉంటుంది. మనం ఆవేశానికి, కోపానికి గురైనప్పుడు ఊపిరి వేగం పెరుగుతుంది. ఆనందం, విచారం, సుఖం, దుఃఖం మొదలైన సందర్భాలలో ఊపిరి తీయడంలో మార్పులు సంభవిస్తాయి. అందువల్ల మనసును నిగ్రహించాలంటే ఊపిరిని అదుపు చేయాలి. అదుపు చేయడం అంటే ముక్కు మూసుకోమని కాదు. ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం అంటే ప్రాణమును (వాయువును) నియంత్రిచడం. ప్రాణాయామం తెలిసిన గురువు దగ్గరే ఈ విద్య నేర్చుకుని చేయాలి, అంతేకానీ ప్రాణాయామ విషయంలో సొంత ప్రయోగాలు పనికిరావు.

ఇక మనసును, ఇంద్రియాలను అదుపు చేయగల వాటిలో ముఖ్యమైనది ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం చేయడం వలన మనసుకు నిలకడ వస్తుంది. ఈ రోజు రకరకాల ధ్యాన ప్రక్రియలను అనేక మంది గురువులు భోషితున్నారు. 20 వ శతాబ్దంలో ప్రపంచం చూసిన గొప్ప గురువు భగవాన్ రమణ మహర్షి. ఆయన ఒకానొక యోగ ప్రక్రియ గురించ్ చెబుతూ, మీ శ్వాసను గమనించండి అన్నారు. ఊపిరిని అదుపు చేయవలసిన అవసరం లేదు. మీరు నిత్యం గాలి తీసుకుని వదిలిపెడుతూనే ఉన్నారు. దాన్ని కేవలం గమనించండి. మహషి చెప్పిన ఈ విధానం వలన మనసు ఆత్మలో ఐక్యం అవుతుంది. బయటి వస్తువులతో సంబంధం కోల్పోతుంది. దీనికి దేశకాల నియమం లేదు.  

మూడవది మనసును అదుపు చేయాలంటే యోగా చేయాలి. యోగాసనాలు మనసును, ఇంద్రియాలను అదుపు చేస్తాయి. శ్రద్ధను పెంచుతుంది. యోగా కూడా ఈ విద్య తెలిసిన గురువు దగ్గర నేర్చుకోవడం ఉత్తమం. అప్పుడే సక్ర్మంగా వస్తుంది, ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. వీటితో పాటు నామపజం. మీకు నచ్చిన దేవుడి నామాన్ని కానీ, స్తోత్రాన్ని కానీ జపిస్తూ ఉండడం వలన మనసు అదుపులోకి వస్తుంది. ఈ పద్దతుల వలన దమము, ఇంద్రియ నిగ్రహము అలవడతాయి. అయితే అన్నిటికంటే ముఖ్యం మన సంకల్పం. ఎన్ని చేసినా ఇంద్రియ నిగ్రహాన్ని, దమాన్ని అలవర్చుకోవాలన్న ఆసక్తి ఉండాలి.

To be continued...........

Thursday, 6 March 2014

హిందూ ధర్మం - 30

ఉదాహరణకు ఒక విదార్ధికి పరీక్షలు దగ్గర పడుతున్నాయని ఆందోళన మొదలైందనుకుందాం. ఆ క్షణమే అతని మనసులోకి ప్రకృతిలో ఇంతకముందు అనేక మంది విద్యార్ధులు ఆందోళన పడినప్పుడు ఉత్పన్నమైన తరంగాలు అతడిని బంధిస్తాయి. వెంటనే అతని ఆందోళన ఇంకా పెరుగుతుంది. అది తీవ్రమైనప్పుడు, అతడి మనసు అదుపుతప్పి, చదివింది గుర్తురాన్నివకుండా చేసి, పరీక్షలో ఫెయిల్ అయ్యేలా చెయ్యచ్చు.రోగి విషయంలోనూ అంతే.

మన గురించి మనం అల్పంగా, నీచంగా భావించడమే పాపం. నేను ఎందుకు పనికిరాను, నేను బలహీనుడిని, నాకు ఏమీ రావు అని అనుకోవడం, ఆత్మనూన్యతకు లొనవడమే పాపం. అటువంటి ఆలోచనలను నిరోధించడమే దమము.

పాపం అన్నది చేయనవసరంలేదు, మనసులో భావించినా చాలు, పాపం చేసినట్టే అంటుంది ధర్మం.

When the mind is vacant, evil thoughts enter. Evil thinking is the beginning point of adultery. Through a lustful look only, you have already committed adultery. Mental actions are real actions. God judges a man by his motives. Worldly people judge a man by his external physical actions ......................- Swami Sivananda. 

స్వామి శివానందగారు ఈ విధంగా అంటారు. "ఖాళీ మనసులోకి చెడు ఆలోచనలు ప్రవేశిస్తాయి. చెడు ఆలోచనలు చేయడమే పాపానికి మొదటిమెట్టు. తీవ్రమైన కామపూరిత దృష్టితో చూసిననతమాత్రమునే నీవు వ్యభిచారానికి పాల్పడ్డావు. మానసిక చర్యలే నిజమైన చర్యలు. మానవుడి ఉద్దేశాలను బట్టి అతడు ఏలాంటివాడనేది దేవుడు నిర్ణయిస్తాడు. ప్రాపంచిక ప్రజలు మనిషిని అతడి బాయ చర్యల ద్వారా నిర్ధారిస్తారు ..................................."

ఉదాహరణకు ఒకరి గురించి చెడుగా మాట్లాడటం, ఒకరిపై నిందలు వేయడం నేరం, పాపం. మీరు ఒకరి గురించి చెడుగా మాట్లాడవలసిన అవరసంలేదు, వాళ్ళ గురించి మీ మనసులో చెడుగా భావించినా, అది కూడా పాపమే అంటుంది ధర్మం. ఎందుకంటే ఆలోచనలే ప్రవర్తనకు ఆధారం. మీరు ఏ విధంగా ఆలోచిస్తారో, అదే విధంగా ప్రవర్తిస్తారు. వెళ్ళకూడని ప్రదేశాలకు బాహ్యంగా వెళ్ళకున్నా, మనసులో వెళ్ళినట్టు భావన చేస్తే, అక్కడ కూడా పాపం పడుతుంది. మంచికి కూడా ఇది అన్వయం అవుతుంది. మీరు దేవాలయానికి నడుచుకుంటూ వెళ్ళలేకపోయినా, మనసులో దేవాలయానికి వెళ్ళినట్టు భావన చేస్తే, అప్పుడు కూడా పుణ్యం పడుతుంది.

To be continued...........

Published: 06-March-2014
1st Edit: 13-April-2015

Tuesday, 4 March 2014

హిందూ ధర్మం - 28

ఈ ప్రపంచాన్ని ఇంద్రియాల ద్వారా మనసు చూస్తోంది. మీరు పాపం చేయాలన్నా, పుణ్యం చేయాలన్నా, దానికి ఆధారం మనసే. సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైనది మనసు. ఇక్కడున్న మనసు మరొక క్షణంలో వేరొక చోట ఉంటుంది. మనసుది చంచల స్వభావం అంటే ఒక చోట కుదురుగా ఉండదు. #దమము అంటే మనసును పాప కార్యాల నుంచి, అధర్మం నుంచి నిగ్రహించడం, అంటే కంట్రోల్ చేయడం, ట్రెయిన్ చేయడం. అసలు మనసును ట్రయిన్ చేయడమెందుకు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

స్వామి వివేకానందులు ఇలా చెప్తారు. మనం చేసిన ప్రతి పనికి మనం ప్రతి ఫలం ఏ విధంగా అనుభవిస్తామో, అదే విధంగా మనం చేస్తున్న ఆలోచనలు కూడ మన మీద, సమాజం మీదా ప్రభావం చూపిస్తాయి, తిరిగి ప్రతిచర్య (Reaction) గ్రహిస్తాయి. మనం గమనిస్తే, ఒక వ్యక్తి చెడు పనులకు అలవాటు పడితే, రోజురోజుకు మరింత చెడ్డవాడిగా మారిపోతున్నాడు, అతను మంచి పనులు చేయడం మొదలుపెడితే, మరింత మంచివాడిగా మారిపోతున్నాడు. ఎందుకు?

నేను ఒక పని చేస్తున్నామంటే, నా మనసు ఒక ప్రత్యేక స్థితిలో ఉంటుంది. దాని నుండి కొన్నిvibrations  ఉద్భవిస్తాయి. ప్రపంచంలో నా మానసిక స్థితికి సమానమైన స్థితిలో వేరే ఏ ఇతర వ్యక్తులు మనసులు ఉంటాయో, వారి ఆలోచనలతో నా మనసు ప్రభావితం అవుతుంది. ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక గదిలో అనేక సంగీత వాయిద్యాలను ఒకే రకంగా ట్యూన్ చేసి పెట్టి, అందులో ఏ ఒక్క సంగీత వాయిద్యాన్నైనా ఒక ప్రత్యేక రాగంతో మ్రోగిస్తే, మిగితా అన్ని సంగీత పరికరాలు ఎవరు మ్రోగించకుండానే, అదే విధమైన రాగంతో శబ్దం చేస్తాయి. దీని గురించి ఫిజికల్ సైన్సు చెబుతుంది.

అదే విధంగా ఒకే స్థితిలో ఉన్న వివిధ మనసులు, ఒకే ఆలోచనతో సమానంగా ప్రభావితం అవుతాయి. నేను ఒక చెడుపని చేస్తుంటే, నా మనసులో కొన్ని తరంగాలు(vibrations) ఏర్పడతాయి, అవి ప్రపంచంలో నా మానసిక స్థితిని పోలిన ఇతర మనసులపై ప్రభావం చూపుతుంది. దాంతో వారు కూడా చెడు పనులు అధికంగా చేస్తారు. నేను మంచి పని చేస్తే, నా మానసిక స్థితిని పోలిన ఇతర మనసులపై దాని ప్రభావం పడి, వారు కూడా మంచి పనులు చేస్తారు. అట్లాగే వారి మానసిక స్థితి మన మనసుపై అదే విధమైన ప్రభావం చూపిస్తుంది. అంటే మన ఆలోచనలు మంచిగా ఉంటే, మన మనసు మంచి Vibrationsను గ్రహించి, మనం మంచివారిగా మారుతాం. అదే చెడుగా ఉంటే, చెడ్డవారిగా మారుతాం. అందుకే మన ఋషులు మనసును చెడు ఆలోచనల నుంచి నిగ్రహించండి అన్నారు.

To be continued...........

Friday, 21 February 2014

హిందూ ధర్మం - 23

మనసును పాప కార్యాల నుంచి, శాస్త్రవిరుద్ధమైన జీవనం నుంచి, నిషిద్ధకర్మల నుంచి వెనక్కు మళ్ళించడం, నిగ్రహించడం, నిరోధించడం దమము. దమం గురించి అర్ధమవ్వాలంటే, ధర్మంలో వెరొక లక్షణమైన ఇంద్రియ నిగ్రహం గురించి తెలిసి ఉండాలి.

4. ఇంద్రియ నిగ్రహం: ఇంద్రియాలను అదుపు చేసుకోవడం. ఇంద్రియాలంటే మనసుకు, బయట ప్రకృతికి/ప్రపంచానికి వారధి వంటివి. మనకు మొత్తం 10 ఇంద్రియాలు ఉన్నాయి. వాటిని రెండుగా విభజించారు.

మొదటి 5 జ్ఞానేంద్రియాలు :
శ్రోత్రం (చెవులు) - వినికిడి కోసం,
త్వక్ (చర్మం) - స్పర్శకు కారణం అయింది
చక్షుః (కళ్ళు) - ప్రపంచాన్ని చూస్తుంది,
రసన (నాలుక) - రుచి చూస్తుంది,
ఘ్రాణ (ముక్కు) - వాసన పీల్చడం ద్వారా మెదడుకు సంకేతాలు పంపిస్తుంది

తరువాతివి కర్మేంద్రియాలు.
వాక్కు (నోరు)- మటలను బయటకు పంపుతుంది,
పాణి (చేతులు) - అనేక పనులు ఉపయోగ పడతాయి,
పాదం (కాళ్ళు) - మనిషి యొక్క కదికల కోసం,
పాయువు (మలద్వారము) - శరిరంలో మలాన్ని విసరిజిస్తుంది (బయటకు పంపుతుంది),
ఉపస్థ (మూత్రద్వారము) - సంతానానికి కారణమవుతుంది

ఈ పదింటిని దశ ఇంద్రియాలంటారు.
వీటి గురించి వివరంగా చెప్పుకుందాం.

To be continued................... 

Thursday, 20 February 2014

హిందూ ధర్మం - 22

3. దమము - అంటే మనో నిగ్రహము, మనసును నిగ్రహించుకోవడం, అదుపులో పెట్టుకోవడం అని అర్ధం.. మీరు మీ మనసుమాట వినడం కాదు, మీ మనసు మీరు చెప్పినమాట వినాలి. మీరు చెప్పినట్టు నడుచుకోవాలి. మీ ఆజ్ఞను శిరాసావహించాలి. అదే దమము. జ్ఞానయోగ మార్గంలో ఉన్న సాధకునికి దమమే పునాది. మహాభారతం శాంతిపర్వం కూడా దమం యొక్క వైభవాన్ని ప్రశంసిస్తూ 'ధర్మానికి అనేక శాఖలున్నా, దమమే (మనోనియత్రణయే) అన్నిటికి మూలం అని అంటుంది.

ఆధ్యాత్మికత గురించి తెలియని వారికి ఉభవించే మొదటి సందేహం 'నా మనసు నా మాట వినడం ఏమిటి? మనసంటే నేనే కదా. నా ఆలోచనలనే నేను కదా. ఇది ఎలా సాధ్యం?'. ఇది చాలా సాధారణంగా తలెత్తె సందేహం. దీనికి భారతీయ తత్వజ్ఞానం చక్కటి సమాధానం ఇస్తుంది. నిజానికి నువ్వు నీ మనసు కాదు, నీ శరీరం కూడా కాదు. నువ్వు శరీరానికి, మనసుకు అతీతమైన వాడివి. నువ్వు మనసును, శరీరాన్ని నడిపిస్తున్న చైతన్యస్వరూడివి, నువ్వు ఆత్మవి అంటుంది. శరీరానికి, మనసుకు, ఆత్మకు మధ్య గల భేధాన్ని, దూరాన్ని స్పష్టంగా చూపిస్తుంది.

ఈ లోకంలో మనసే బంధానికి, మోక్షానికి కారణం అంటుంది గీత. మనకున్న సగం కష్టాలకు, భాధాలకు కారణం మన మనసు గురించి మనకు తెలియకపోవడమే. మనకున్నభాధలకు, కష్టాలకు కారణం మన మానసిక స్థితి. మనసును సక్రమంగా అర్ధం చేసుకుంటే, ఈ ప్రపంచంలో ఉన్న బాధలన్నీ ఈ క్షణంలోనే నశించిపోతాయి. ఇది ఏ సైకాలజీనో, లేక మరే ఇతర ఆధునిక సైన్సు  చెప్పిన విషయం కాదు. మన ఋషులు, యోగులు చెప్పినమాట. ఇది యధార్ధం. ఇది అర్ధం కావాలంటే సాధన చేయాలి.

To be continued...................

Originally published: 20 Feb 2014
1st Edit: 22 April 2015