Thursday 20 February 2014

హిందూ ధర్మం - 22

3. దమము - అంటే మనో నిగ్రహము, మనసును నిగ్రహించుకోవడం, అదుపులో పెట్టుకోవడం అని అర్ధం.. మీరు మీ మనసుమాట వినడం కాదు, మీ మనసు మీరు చెప్పినమాట వినాలి. మీరు చెప్పినట్టు నడుచుకోవాలి. మీ ఆజ్ఞను శిరాసావహించాలి. అదే దమము. జ్ఞానయోగ మార్గంలో ఉన్న సాధకునికి దమమే పునాది. మహాభారతం శాంతిపర్వం కూడా దమం యొక్క వైభవాన్ని ప్రశంసిస్తూ 'ధర్మానికి అనేక శాఖలున్నా, దమమే (మనోనియత్రణయే) అన్నిటికి మూలం అని అంటుంది.

ఆధ్యాత్మికత గురించి తెలియని వారికి ఉభవించే మొదటి సందేహం 'నా మనసు నా మాట వినడం ఏమిటి? మనసంటే నేనే కదా. నా ఆలోచనలనే నేను కదా. ఇది ఎలా సాధ్యం?'. ఇది చాలా సాధారణంగా తలెత్తె సందేహం. దీనికి భారతీయ తత్వజ్ఞానం చక్కటి సమాధానం ఇస్తుంది. నిజానికి నువ్వు నీ మనసు కాదు, నీ శరీరం కూడా కాదు. నువ్వు శరీరానికి, మనసుకు అతీతమైన వాడివి. నువ్వు మనసును, శరీరాన్ని నడిపిస్తున్న చైతన్యస్వరూడివి, నువ్వు ఆత్మవి అంటుంది. శరీరానికి, మనసుకు, ఆత్మకు మధ్య గల భేధాన్ని, దూరాన్ని స్పష్టంగా చూపిస్తుంది.

ఈ లోకంలో మనసే బంధానికి, మోక్షానికి కారణం అంటుంది గీత. మనకున్న సగం కష్టాలకు, భాధాలకు కారణం మన మనసు గురించి మనకు తెలియకపోవడమే. మనకున్నభాధలకు, కష్టాలకు కారణం మన మానసిక స్థితి. మనసును సక్రమంగా అర్ధం చేసుకుంటే, ఈ ప్రపంచంలో ఉన్న బాధలన్నీ ఈ క్షణంలోనే నశించిపోతాయి. ఇది ఏ సైకాలజీనో, లేక మరే ఇతర ఆధునిక సైన్సు  చెప్పిన విషయం కాదు. మన ఋషులు, యోగులు చెప్పినమాట. ఇది యధార్ధం. ఇది అర్ధం కావాలంటే సాధన చేయాలి.

To be continued...................

Originally published: 20 Feb 2014
1st Edit: 22 April 2015

No comments:

Post a Comment