Tuesday 17 June 2014

హిందూ ధర్మం - 86 (దమము)

దమము అంటే మనసును చెడు నుంచి నిగ్రహించడం. పూర్వం ఒక సాధువు ఉండేవారు. ఆయన భోధనలు వినడానికి చాలామంది వచ్చేవారు. అందులో ఒకాయనకు బాగా డబ్బు గలవాడు. అతను ఎన్ని బోధనలు విన్నా, మనసు వాటిని స్వీకరించేది కాదు. ఆ విషయాన్ని సాధువుకు చెప్పి, ఏదో ఒకరోజు తన ఇంటికి బిక్షకు రమ్మని ఆహ్వానించాడు. చాలా రోజుల తర్వాత సాధువు ఈ ధనవంతుడి ఇంటికి భిక్షకు వెళ్ళగా, అతను రుచికరమైన వంటలను తయారు చేయించాడు. బిక్ష వేసే సమయానికి సాధువు తన ఇసుకతో నిండిన భిక్షా పాత్రను ధవంతుడు ముందు పెట్టాడు. ఆ పత్రను చూసి, అందులో భిక్ష వేయడానికి నిరాకరించాడు ధనవంతుడు. 'ఆగిపోయావేం? భిక్ష వేయవా?' అన్నారు సాధువు. అందులో భిక్ష ఎలా వేయాలి స్వామి? పాత్ర మొత్తం దుమ్ముధూళితో ఉంది అని బదులిచ్చాడు ధనవంతుడు. దానికి బదులుగా సాధువు 'అంతేనాయానా! మలినమైన పాత్రలో భిక్ష వేస్తే, అది స్వీకరించడానికి అర్హత కోల్పోతుందని ఆలోచించావు. మరి మలినమైన మనసు మంచి విషయాలను ఎలా స్వీకరిస్తుంది చెప్పు? నీవు ముందు చెడు విషయాలను విసర్జించు. మనసుకు మంచి విషయాలనే అందించు. అప్పుడు మనసు శుద్ధి చెందుతుంది. పరిశుద్ధి చెందిన మనసు గురువు ఉపదేశాలను యధావిధిగా స్వీకరిస్తుంది' అని వెళ్ళిపోయాడు. ఈ కధ మనకు బోలెడు నీతిని చెప్తోంది.

మనసు ఎప్పుడు చెడు విషయాలను చూచుటకు, వినుటకు, మాట్లాడుటకు, ఆలోచించుటకు అలవాటు పడితే, ఇక మంచిని ఎలా స్వీకరిస్తుంది. స్వీకరించినా, ఎలా ఆచరించగలుగుతుంది. అందుకే ధర్మాన్ని ఆచరించేవారు దమాన్ని (మనో నిగ్రహాన్ని) పాటించాలంటారు మనుమహర్షి. మన ఇంట్లో దేవుడు ఫోటోని కానీ, విగ్రహాన్ని కానీ ఎక్కడైనా పెట్టవలసి వస్తే, ఎంత జాగ్రత్త చూపుతాం. సరైన స్థలం చూస్తాం, అది శుచిగా ఉందో లేదో చూస్తాం, అక్కడ మళ్ళీ ఒకసారి శుభ్రం చేసి, అప్పుడు ఫోటో తగిలిస్తాం. అంతేకానీ మేకు ఉందని తీసుకెళ్ళి అశుద్ధమైన ప్రదేశంలో తగిలిస్తామా? ఇంట్లో ఫొటో తగిలించడానికే అంత జాగ్రత్త చూపిస్తే, మనసులో దేవుడిని నిలపడానికి ఇంకెంత జాగ్రత్త పడాలి. మనసు కుళ్ళు, కోపం, కుట్రలు, చెడు ఆలోచనలతో నిండి ఉంటే, ఇక అందులోకి దేవుడు ఎలా ప్రవేశిస్తాడు? ప్రవేశించినా, ఆయన కూర్చోడానికి సరైన స్థలమే లేకుండా మనసును దుష్ట ఆలోచనలతో నింపితే, ఆయన అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. అది మనం పరమాత్ముడికి చేసే అవమానం కాదా? అందుకే దమాన్ని పాటించమన్నారు పెద్దలు. మనసును పాప కార్యాల నుంచి, శాస్త్రవిరుద్ధమైన జీవనం నుంచి, నిషిద్ధకర్మల నుంచి వెనక్కు మళ్ళించడం, నిగ్రహించడం, నిరోధించడం దమము.

 To be continued .................

No comments:

Post a Comment