Showing posts with label శరణాగతి. Show all posts
Showing posts with label శరణాగతి. Show all posts

Friday, 31 July 2020

శరణాగతి గురించి రమణులు



Many visitors came on one occasion and they all saluted
Sri Bhagavan with the single prayer,

“Make me a bhakta. Give me moksha.”

After they left Sri Bhagavan said, thinking aloud:

All of them want bhakti and moksha.
If I say to them,
‘Give yourself to me’
they will not.
How then can they get what they want ?

~ From Talks with Sri Ramana Maharshi : 543

Monday, 6 February 2017

అనన్యశరణాగతి - భగవాన్ ఉపదేశం - శ్రీ రమణాశ్రమ లేఖలు

శరణాగతి
(6 వ భాగం)



10-4-1947
ఈ ఉదయం ఆంధ్ర యువకులొకరు శ్రీవారి కొక (భగవాన్ రమణ మహర్షి గారికి) జాబు వ్రాసి చేతికిచ్చారు. అందులో "స్వామి, భగవానుని యందు అనన్యశరణాగతి చెందితే, సర్వం లభిస్తుందటారు గదా. అనన్య శరణాగతి అంటే ఒక చోట స్థిరంగా కూర్చుని ఏ చింతలు లేకుండా శరీరపోషణ కావశ్యకమైన ఆహారాదుల చింత గూడా వదలి సదా భగవంతుని స్మరించుటేనా? వ్యాధిగ్రస్థుడనైతే, ఔషధసేవకై యత్నించక స్వస్థతాస్వస్థతలు భగవదధీనం చేయుటేనా? గీతలో స్థిరప్రజ్ఞుని గుఱించి "విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః, నిర్మమో నిరహంకార స్స శాంతిమధిగచ్ఛతి" - 2-21 అనటం వల్ల, సమస్త కోరికలు త్యజించుటనిగదా తేలుతుంది. అందువల్ల, మనం భగవంతుని స్మరిస్తూ ఆహారపానీయాదులు భగవదాదేశమై ఆయాచితంగా లభిస్తే, స్వీకరించటమా? లేక, స్వల్పంగా యత్నించటమా? భగవాన్, ఈ శరణాగతి రహస్యం వివరించి అనుగ్రహించా"లని ఉన్నది.

భగవాన్ చూచి, సావధానులై సమీపస్థులతో "ఇదుగో, అనన్యశరణాగతి అంటే, ఏ చింతలు లేకుండా ఉండాలనటం సత్యమేగాని, దేహపోషణ కావశ్యకాలైన అన్నపానాదుల చింత గూడా వదలవలెనా అంటే ఏం చెప్పగలం. భగవదాదేశమై ఆయాచితంగా వస్తే తినవలెనా? కొద్ది ప్రయత్నం చేయవలెనా. అంటారే; దానంతటదే వస్తుందనుకో. మింగనైనా మింగాలా? అది మాత్రం యత్నంకాదూ? 'వ్యాధిగ్రస్థుడనైతే ఔషధం సేవించాలా? స్వస్థతాస్వస్థతలు భగదధీనం చేసి, ఊరుకోవాలా?' అంటారు. 'క్షుద్వ్యాధేః ఆహారం' అన్నఆరు. దీనికి రెండర్థాలున్నవి. క్షుత్తున్నూ, వ్యాధి వంటిదే గనుక క్షుత్తనే (క్షుత్తు= ఆకలి) వాధికి ఆహారమనే ఔషధ మవసరమనీ, వ్యాధికి ఔషధం వలే, ఆకలికి ఆహారం ఇవ్వాన్లనీ చెప్పారు. శంకరులు రాసిన సాధనా పంచకంలో "క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం బిక్షౌషధం భుజ్యతాం" అని ఉన్నది. క్షుత్తనే వ్యాధ్కి భిక్షాన్నం తినమన్నారు. బిక్షకైనా పోవాలిగదా? అంతా కళ్ళు మూసుకుని కదలక కూర్చుని 'వస్తే తింటా'మంటే లోకయాత్ర నడిచేదెట్లా? అందువల్ల వారి వారి సంస్కారాన్ననుసరించి ప్రాప్తమైనది అనుభవిస్తూ కర్తృత్వ రాయిత్యంగా ఉందాలి. నేణు చేస్తున్నాననే భావనే బంధం. ఆ బంధం లేకుండా ఉండే విధానం యోచించి తెలుసుకోవాలిగాని, ఆకలికి ఆహారం, వ్యాధికి మందు ఇవ్వవచ్చునా? లేదా? అని శంకలు పెట్టుకుంటే, అంతులేకుండా శంకలు వస్తూనే ఉంటవి. ఊ అని మూల్గవచ్చునా? ఊపిరి పీల్చవచ్చునా? అన్న శంకగూడా బయలుదేరుతుంది. ఈశ్వరుడనుకో, కర్మనుకో, ఏదొ ఒక కర్త వారి వారి సంస్కారాన్ని బట్టి అన్నీ తానే నడుపుతాడు. భారం అతని మీద వేసి, బంధం లేకుండా ఉంటే నడిచేది తానే నడుస్తుంది. భూమి మీద నడుస్తూ ఉంటాం. అడుగడుక్కు కాలు ఎత్తాలి, నిలపాలి అని గమనిస్తామా, దానంతటది నడక సాగటం లేదూ? ఉచ్చ్వాస నిశ్వాసాలూ అంతే. క్షణక్షణం ఊపిరి పీల్చాలి, విడవాలి అని ప్రయత్నించటం లేదే. ఆ విధంగానే ఇదీను. ఏదైనా విడువాలంటే విడవగలమా? చేయాలంటే చేయగలమా. తెలిసీ తెలియక అప్రయత్నంగానే లోగడ ఎన్నో పనులు జరుగలేదా? ముందు జరుగవా? భగవానునందు అనన్యశరణాగతి చెందటమంటే, ఇంతర చింతలన్నీ వదిలి మనసు అతని యందే లగ్నం చేయాలి. ఎంతెంత మగ్నం చేస్తామో, అంతంతగా ఇంతర చింతలు దూరమౌతవి. మనోవాక్కాయ కర్మలన్నీ భగవత్పరంగా ఉంటే, మన కార్యభారం ఆయనమీదే ఉంటుంది. కృష్ణభగవాన్ అర్జునునితో-

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్

అన్నారు. అర్జునునకు యుద్ధం చేయవలసినపని ఉన్నది. అందువల్ల భారం నా మీద వేసి, పని చేయవోయ్, నీవు నిమిత్తమాత్రమే సుమా. అంతా నేనే చూచుకుంటాను, నిన్నేదో బాధించ"దన్నారు కృష్ణ భగవాన్. అయితే, ఈ అనన్య శరణాగతి చేయటానికి ముందు చేసేదెవరో తెలుసుకోవాలి. ఏ చింతనా లేకుంటే గాని, శరణాగతి కాదు. ఏ చింతనా లేనప్పుడు ఉండేది తానే గదా? తనకు తానే శరణాగతి చెందగలడన్నమాట. భక్తిపరమైతే, భగవానునందే భారం వేసి, తన కర్మ సాగిస్తుంటే, క్రమంగా తానెవరో తనకే బోధపడుతుంది. ఏదైనా ఫలితం ఒకటే. శరణాగతి అంటే తన్ను విచారించి తెలుసుకుని, తాను తానుగ నిలుచుటే; తన్ను విడిచి అన్యం ఏమున్నది?" అన్నారు భగవాన్.

"అది తెల్సుకునే మార్గమో?" అన్నాడా యువకుడు. "గీతలో ఎన్నో మార్గాలు చెప్పారు. ధ్యానం చేయమన్నారు. దానికి శక్తి లేదూ, భక్తి, కాకుంటే యోగం, నిష్కామ కర్మ, ఇంకా ఎన్నో చెప్పారు. ఏదొ ఒక మార్గాన్ననుసరించి పోవాలి. తానెప్పుడూ ఉండేవాడేకదా? సంస్కారాన్ననుసరించి పనులు వాటంతటవే జరుగుతుంటవి. చేసేది నేననే భావనే బంధం. విచారణవల్ల దాన్ని పొగొట్టుకుంటే ఈ ప్రశ్నలే రావు. కళ్ళు మూస్కుని కూర్చున్నతనే #శరణాగతి కాదు. అంతా అదే విధంగా కూర్చుకుంటే లోకయాత్ర సాగేదెట్లా?" అని భగవాన్ అంటూ ఉండగా, భోజనశాలలో గంట మ్రోగింది. "అదుగోనయ్యా గంట, లేచిపోవద్దూ?" అని నవ్వుతూ లేచారు భగవాన్.

మూలం - శ్రీ రమణాశ్రమ లేఖలు; సూరి నాగమ్మ.

(ఇంకా ఉంది)

Thursday, 2 February 2017

శరణాగతి (3 వ భాగం)



శరణాగతి చేయడానికి ఒక విధానమంటూ లేదు, ఒక ప్రత్యేక సమయం కూడా లేదు. అది spontaneous గా, ఆ క్షణంలో కలిగే భావన. పరిస్థితులే ఆ స్థితికి తీసుకెళతాయని చెప్పేకంటే ఈశ్వరుడే అలాంటి సందర్భాన్ని కలిగిస్తాడని చెప్పడం సమంజసంగా ఉంటుంది.. నేను ఫలాన రోజు, ఫలాన సమయాన భగవంతునికి శరణాగతి చేస్తానని అనుకుంటే జరిగేది కాదు. శరాణగతి చేస్తున్నానని చెప్పడానికి ఒక భాష లేదు, స్తోత్రం లేదు. భగవాన్ రమణులు అంటారు శరణాగతి మౌఖికం కాదు, షరతులతో చేసేది కాదు (Surrender is non-verbal and unconditional). అది ఆ సమయంలో, ఇంకా చెప్పాలంటే ఆ క్షణంలో, కలిగే భావన. ఆ మరుక్షణం నుంచి నీదంటూ ఏదీ ఉండదు. ఎందుకంటే శరణాగతి అంటే సర్వం భగవంతునికి సమర్పించడమే. ఆయన ఇచ్చింది ప్రసాదంగా స్వీకరించడమే. జరిగిన, జరుగుతున్న, జరగబోయే ప్రతీదాన్ని బేషరతుగా (unconditional), ఆనందంగా దైవప్రసాదంగా స్వీకరించడమే.

శరణాగతి అంటే అహాన్ని ఈశ్వరుని పాదాల వద్ద త్యజించడం. అహాన్ని వదిలేస్తే, అన్నీ అవే వదిలిపోతాయి. అప్పుడు నేను చేస్తున్నాను అనే భావన ఉండదు, నాది అని ఉండదు, నేను అంతవాడిని, ఇంతవాడిని అనుకోవడం ఉంది. అవమానమైన, సన్మానమైనా ఈశ్వర ప్రసాదమే. ఆనందమైనా, విచారమైనా ఈశ్వరానుగ్రహమే. ఇతరులలో దోషాలు ఎంచడం ఉండదు. ఎవరు ఎలా ఉన్నా, అదంతా ఈశ్వరుడి లీలయే. అందరిని అంగీకరిస్తాడు. ఇకప్పుడు కోపతాపాలకు తావు ఉండదు. అంతా ఆయనకే అర్పించాకా, మన యోగక్షేమాల గురించి మనమెందుకు చింతించాలి? అందువల్ల శరణాగతి చేశాక, కోరికలు కోరడం ఆగిపోతుంది. ఇతరులు అలా ఉన్నారు, ఇలా ఉన్నారని ఈశ్వరుని ఫిర్యాదులు చేయవు, మనసులో కూడా అనుకోవు. నీకు నచ్చనట్టు జరగకున్నా, ఈశ్వరుడిదే భారం కనుక అన్నీ యథాతధంగా, రెండవ మాట లేకుండా, ఆనందంగా అంగీకరిస్తావు.

అందుకే గురుదేవులు సద్గురు శివానంద మూర్తిగారు అంటారు- శరణాగతి అంటే పరిణామం యొక్క విజయం, కర్మ యొక్క ఫలం, మరియు కర్మ వెనుకనున్న ఉద్దేశ్యం వంటివన్నీ ఆయనవే అని అర్దం చేసుకుని, విశ్వసించడం. నువ్వు శరణాగతి చేస్తే, అడగడం ఆగిపోతుంది, ఫిర్యాదులు నిలిచిపోతాయి. ప్రతీది ఆయన ప్రసాదంగానే స్వీకరిస్తావు; ఏది జరిగినా ఈశ్వరేచ్ఛ ప్రకారం, నీ గురువు అనుమతితోనే జరిగిందని గ్రహించి, స్వీకరించు. అదే శరణాగతి. జ్ఞానానికి అదే పాస్‌పోర్టు.

Surrender is understanding and believing that the success of the result, the result of the action and the intention of the action are all ‘His’. If you have surrendered, asking stops. Complaints cease. Every thing is accepted as his ‘Prasadam’.

Know and accept that whatever happens is according to the will of God and with the permission of your Guru. This is surrender; this is the passport to Jnana.

(ఇంకా ఉంది)

Wednesday, 1 February 2017

ధ్యానం గురించి స్వామి చిన్మయానంద సూక్తి





All our experiences, joys, sorrows, successes and failures, pains and pleasures, honor and dishonor, are His prasada: Let us accept them all in humbleness and gratitude. If we orient our life's plans on this essentially divine basis, we need not sit for meditation- all life will become one meditation.

- Swami Chinmayananda


శరణాగతి (2 వ భాగం)



భగవంతుడికి అన్నీ తెలుసు. ఆయన సర్వజ్ఞుడు. ఆయన ఎప్పుడూ మంచి మాత్రమే చేస్తాడు. ఎవ్వరికీ అపకారం చేయడు అనే భావన కలిగి ఉన్నప్పుడు, నాకు ఏది మంచిదో కూడా ఆయనకే తెలుసు. నేను అనవసరంగా అది అని, ఇది అని బాధపడేకంటే, ఆయన మీద భారం వేసి, ఆందోళన చెందకుండా, ఆయన ఏది ఇస్తే, అది ప్రసాదంగా స్వీకరిస్తాను అని బలమైన విశ్వాసంతో ఉండడమే శరణాగతి.

నువ్వు నమ్మింది జరుగుతుంది అని కాదు. నీవు నమ్మింది జరిగినా, జరగకున్నా, జరిగింది నీకు ప్రస్తుతానికి మంచిది అనిపించకున్నా, భగవంతుడు మంచి మాత్రమే చేస్తాడు అని భావన కలిగి ఉండటమే విశ్వాసం అని అంటారు ఛాయ అధర్వణ వేద పండితులు శ్రీధర్ గురూజీ.

భగవద్గీత ఆప్తవాక్యం. భగవానుడు ప్రేమతో కలియుగంలో మానవుల కోసం ఎన్నో విషయాలను అందులో చెప్పాడని అన్నారు సద్గురు శివానంద మూర్తి గారు. అందులో భగవానుడు ఎన్నో ప్రమాణాలను చేశాడు. నామే భక్తః ప్రణశ్యతి (భగవద్గీత 9-31) అన్నాడు. నన్ను నమ్మినవాడు ఎన్నటికీ నశించడు. అతడు అధర్మవర్తనుడైనా, నన్ను నమ్మాడు కనుక క్రమంగా ధర్మవర్తనుడై, శాశ్వతమైన శాంతిని పొందుతాడని చెప్పాడు. అతడిని ఉద్దరించడం నా కర్తవ్యం అని కూడా స్పష్టం చేశాడు.

అంతేనా 18 వ అధ్యాయంలో
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ! 
అహం త్వా సర్వపాపేభ్యోమోక్షయిష్యామి మా శుచః !! 66

భావం - అన్ని ధర్మాలను విడిచిపెట్టు, నన్ను మాత్రమే శరణు వేడు. నేను నిన్ను అన్ని పాపాల నుంచి విముక్తుడిని చేసి, మోక్షం ప్రసాదిస్తాను.

అన్ని ధర్మాలను విడిచిపెట్టడమంటే బాహ్యంలో కాదు. భార్యా/ భర్తని, పిల్లల్ని చూసుకోవాలి, ఉద్యోగం కూడా చేయాలి. ఇతరమైన ప్రయత్నాలన్నీ విడిచి నన్ను మాత్రమే శరణు వేడు అంటున్నాడు. అంటే మనసులో చీకుచింతలు వదిలెయ్, భవిష్యత్తు గురించి ఆందోళన పడకు; గతంలో పాపాలు చేశానంటావా? గతం గడిచిపోయింది, ఇప్పుడు బాధపడి వ్యర్ధం, ఇకముందు మళ్ళీ ఆ తప్పులు చేయకు. జరిగిపోయిన దాని గురించి కూడా బాధపడకుండా వర్తమానంలో నా మీద మనసు నిలిపి ఉంచు. నీకు మోక్షం నేను ఇస్తాను అన్నాడు.

9 వ అధ్యాయంలో ఏమన్నాడో చూడండి.

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే 
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ - 22

ఎవరైతే వెరొక ఆలోచన లేకుండా నా యందే మనసు నిలిపి, నాకు దగ్గరగా (మానసికంగా) ఉంటారో, అటువంటి వారి యోగక్షేమాలను 'వ్యక్తిగతంగా' నేను వహిస్తాను.

వేరే ఇతర చింతలు (ఆలోచనలు) వద్దు. నా మీద విశ్వాసం కలిగియుండు. ఎల్లప్పుడు నన్నే మనసులో నిలుపుకో. నీ యోగక్షేమాల బాధ్యత నాది అన్నాడు. ఇవన్నీ ఆయన చేసిన శపథాలు. నా మీద భారం వేయవయ్యా! నీ భారం నేను మోస్తాను అని ఆయన అభయం ఇస్తున్నప్పుడు, మనం దేనికి భయపడాలి? ఎందుకు భయపడాలి? భయపడితే మనకు ఆయన మీద ఉన్నది విశ్వాసం కాదు, అవిశ్వాసం.

ఆయన గీతలో కూడా చెప్పింది శరణాగతియే.

(ఇంకా ఉంది)

Tuesday, 31 January 2017

శరణాగతి (1 వ భాగం)



శరణాగతి
(1 వ భాగం)

శరణాగతి అంటే భగవంతుని మీద పూర్తి భారం వేసి, అన్యమైన ఆలోచనలను, ఆందోళలను విడిచిపెట్టడం. శరణాగతి గురించి భగవాన్ రమణ మహర్షి గొప్పగా చెప్పారు. రమణ మహర్షి ఆత్మసాక్షాత్కారానికి చూపిన రెండు మార్గాల్లో ఒకటి ఆత్మవిచారణ అయితే, రెండవది శరణాగతి. ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించి, నడిపిస్తున్నది, లయం చేస్తున్నది భగవంతుడే. ఇది ఒట్టి మాటలలో చెప్పుకుంటే యాంత్రికంగా ఉంటుంది. దాంతో పాటు ఎన్నో సందేహాలు కూడా కలుగుతాయి. అదే అనుభూతి కలిగినప్పుడు, వివేకం కూడా జనిస్తుంది. అప్పుడు సందేహాలకు తావు ఉండదు. ఆయన ఆజ్ఞతోనే సమస్తమూ జరుగుతోంది, భవిష్యత్తులో ఏది జరగాలో కూడా ఆయనే నిర్ణయిస్తాడు. నేను చేస్తున్నాను, నా వల్ల అది జరిగింది, ఇది జరిగింది, నేనలా చేస్తాను అనుకోవడమే అహంకారం. ఎందుకంటే నా, నీ ద్వారా సమస్తమూ చేస్తున్నవాడు భగవానుడే. అన్నీ ఆయన చేస్తున్నాడనే వివేకంతో, అన్నీ ఆయనకే అర్పించి, ఇతర ఆలోచనలు చేయకుండా, తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించడమే శరణాగతి.

దీని గురించి #భగవాన్ రమణులు ఇలా అంటారు. భక్తులలో ఉత్తమ భక్తుడెవరు? స్వరూపమైన భగవంతుని యందు ఎవడు తనను తాను అర్పించుకుంటాడో, అతడే భక్తశ్రేష్ఠుడు. ఆత్మచింతన తప్ప ఇతర చింతలు (ఆలోచనలు) పుట్టడానికి కొంచమైనా చోటివ్వక, ఆత్మనిష్ఠాపరుడై ఉండడమే తనను ఈశ్వరునికి అర్పించుకోవడం. ఈశ్వరుని మీద ఎంత భారం వేసినా, ఆయన దానిని భరించగలడు. సకల కార్యాలను ఒక పరమేశ్వర శక్తి నడుపుతున్నప్పుడు, మనం దానికి లోబడి ఉండడం మాని, ఇలా చేయాలి, అలా చేయాలి అని సదా చింతించడం ఎందుకు? రైలు బండి బరువులన్నిటిని మోయగలదని తెలిసియుండి, ప్రయాణీకులైన మనము మన చిన్నమూటను కూడా అందులో పడవేసి సుఖంగా ఉండక, దానిని నెత్తికెత్తుకుని ఎందుకు కష్టపడాలి?

ఎంత చక్కగా చెప్పారో చూడండి. పైన చెప్పిన ఉపమానంలో ఈ ప్రపంచమే రైలుబండి అనుకుందాము. ఈ ప్రపంచం అనే రైలులో మనము కూడా ప్రయాణికులము. ఒక స్టేషనులో ఎక్కి, ఇంకొక చోట దిగిపోతాము. ఇలా ఎందరో ప్రయాణిస్తున్నారు. అది ఎందరిని ఎక్కించుకున్నా, అందరిని లాగే శక్తి దానికి ఉంది. అలాగే ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి ఈశ్వరునికి ఉంది. అందుకే కదా విష్ణు సహస్రనామం విశ్వం విష్ణుః అంటూ ప్రారంభించబడింది. కేవలం ఈ ప్రపంచాన్నే కాదు, సమస్త బ్రహ్మాండాలను అసలే భారం లేకుండా మోస్తున్నవాడు భగవానుడు. ఈ బ్రహ్మండాలన్నిటిలో ఈ విశ్వం చిన్న కణిక. అందులో ఈ ప్రపంచమెంత? అందులో నువ్వెంత? నువ్వు వీటిలోనే ఉన్నప్పుడు నీ భారం కూడా ఆయన మీదే ఉంది. ఈ క్షణంలో కూడా నీ భారం వహిస్తున్నవాడు ఆయనే. రైలు బండి ఎక్కినవాడు, నెత్తి మీద మూటలు దింపి, క్రింద పెట్టి, హాయిగా ప్రయాణాన్ని ఆనందించి, గమ్యం వచ్చినప్పుడు దిగిపోక, ఆ మూటను నెత్తిన పెట్టుకుని, అనవసరంగా కష్టపడటం, గమ్యం ఎప్పుడు వస్తుందా, ఎక్కడ దిగాలో అంటూ కంగారు పడటం, అనవసరమూ, అవివేకము కూడా. అలాగే ఈ సమస్త ప్రపంచాన్ని నడుపుతున్న ఆ భగవంతుండే నీ భారాన్ని కూడా మోస్తున్నాడనే ఎరుక కలిగి ఉంటూ, జరిగిన వాటి గురించి బాధపడక, జరగబోయే వాటి గురించి చింతించక, వర్తమానంలో, ఈశ్వరునిపై విశ్వాసంతో, ఆనందంగా ఉండడమే #శరణాగతి.

(ఇంకా ఉంది)