Monday 6 February 2017

అనన్యశరణాగతి - భగవాన్ ఉపదేశం - శ్రీ రమణాశ్రమ లేఖలు

శరణాగతి
(6 వ భాగం)



10-4-1947
ఈ ఉదయం ఆంధ్ర యువకులొకరు శ్రీవారి కొక (భగవాన్ రమణ మహర్షి గారికి) జాబు వ్రాసి చేతికిచ్చారు. అందులో "స్వామి, భగవానుని యందు అనన్యశరణాగతి చెందితే, సర్వం లభిస్తుందటారు గదా. అనన్య శరణాగతి అంటే ఒక చోట స్థిరంగా కూర్చుని ఏ చింతలు లేకుండా శరీరపోషణ కావశ్యకమైన ఆహారాదుల చింత గూడా వదలి సదా భగవంతుని స్మరించుటేనా? వ్యాధిగ్రస్థుడనైతే, ఔషధసేవకై యత్నించక స్వస్థతాస్వస్థతలు భగవదధీనం చేయుటేనా? గీతలో స్థిరప్రజ్ఞుని గుఱించి "విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః, నిర్మమో నిరహంకార స్స శాంతిమధిగచ్ఛతి" - 2-21 అనటం వల్ల, సమస్త కోరికలు త్యజించుటనిగదా తేలుతుంది. అందువల్ల, మనం భగవంతుని స్మరిస్తూ ఆహారపానీయాదులు భగవదాదేశమై ఆయాచితంగా లభిస్తే, స్వీకరించటమా? లేక, స్వల్పంగా యత్నించటమా? భగవాన్, ఈ శరణాగతి రహస్యం వివరించి అనుగ్రహించా"లని ఉన్నది.

భగవాన్ చూచి, సావధానులై సమీపస్థులతో "ఇదుగో, అనన్యశరణాగతి అంటే, ఏ చింతలు లేకుండా ఉండాలనటం సత్యమేగాని, దేహపోషణ కావశ్యకాలైన అన్నపానాదుల చింత గూడా వదలవలెనా అంటే ఏం చెప్పగలం. భగవదాదేశమై ఆయాచితంగా వస్తే తినవలెనా? కొద్ది ప్రయత్నం చేయవలెనా. అంటారే; దానంతటదే వస్తుందనుకో. మింగనైనా మింగాలా? అది మాత్రం యత్నంకాదూ? 'వ్యాధిగ్రస్థుడనైతే ఔషధం సేవించాలా? స్వస్థతాస్వస్థతలు భగదధీనం చేసి, ఊరుకోవాలా?' అంటారు. 'క్షుద్వ్యాధేః ఆహారం' అన్నఆరు. దీనికి రెండర్థాలున్నవి. క్షుత్తున్నూ, వ్యాధి వంటిదే గనుక క్షుత్తనే (క్షుత్తు= ఆకలి) వాధికి ఆహారమనే ఔషధ మవసరమనీ, వ్యాధికి ఔషధం వలే, ఆకలికి ఆహారం ఇవ్వాన్లనీ చెప్పారు. శంకరులు రాసిన సాధనా పంచకంలో "క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం బిక్షౌషధం భుజ్యతాం" అని ఉన్నది. క్షుత్తనే వ్యాధ్కి భిక్షాన్నం తినమన్నారు. బిక్షకైనా పోవాలిగదా? అంతా కళ్ళు మూసుకుని కదలక కూర్చుని 'వస్తే తింటా'మంటే లోకయాత్ర నడిచేదెట్లా? అందువల్ల వారి వారి సంస్కారాన్ననుసరించి ప్రాప్తమైనది అనుభవిస్తూ కర్తృత్వ రాయిత్యంగా ఉందాలి. నేణు చేస్తున్నాననే భావనే బంధం. ఆ బంధం లేకుండా ఉండే విధానం యోచించి తెలుసుకోవాలిగాని, ఆకలికి ఆహారం, వ్యాధికి మందు ఇవ్వవచ్చునా? లేదా? అని శంకలు పెట్టుకుంటే, అంతులేకుండా శంకలు వస్తూనే ఉంటవి. ఊ అని మూల్గవచ్చునా? ఊపిరి పీల్చవచ్చునా? అన్న శంకగూడా బయలుదేరుతుంది. ఈశ్వరుడనుకో, కర్మనుకో, ఏదొ ఒక కర్త వారి వారి సంస్కారాన్ని బట్టి అన్నీ తానే నడుపుతాడు. భారం అతని మీద వేసి, బంధం లేకుండా ఉంటే నడిచేది తానే నడుస్తుంది. భూమి మీద నడుస్తూ ఉంటాం. అడుగడుక్కు కాలు ఎత్తాలి, నిలపాలి అని గమనిస్తామా, దానంతటది నడక సాగటం లేదూ? ఉచ్చ్వాస నిశ్వాసాలూ అంతే. క్షణక్షణం ఊపిరి పీల్చాలి, విడవాలి అని ప్రయత్నించటం లేదే. ఆ విధంగానే ఇదీను. ఏదైనా విడువాలంటే విడవగలమా? చేయాలంటే చేయగలమా. తెలిసీ తెలియక అప్రయత్నంగానే లోగడ ఎన్నో పనులు జరుగలేదా? ముందు జరుగవా? భగవానునందు అనన్యశరణాగతి చెందటమంటే, ఇంతర చింతలన్నీ వదిలి మనసు అతని యందే లగ్నం చేయాలి. ఎంతెంత మగ్నం చేస్తామో, అంతంతగా ఇంతర చింతలు దూరమౌతవి. మనోవాక్కాయ కర్మలన్నీ భగవత్పరంగా ఉంటే, మన కార్యభారం ఆయనమీదే ఉంటుంది. కృష్ణభగవాన్ అర్జునునితో-

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్

అన్నారు. అర్జునునకు యుద్ధం చేయవలసినపని ఉన్నది. అందువల్ల భారం నా మీద వేసి, పని చేయవోయ్, నీవు నిమిత్తమాత్రమే సుమా. అంతా నేనే చూచుకుంటాను, నిన్నేదో బాధించ"దన్నారు కృష్ణ భగవాన్. అయితే, ఈ అనన్య శరణాగతి చేయటానికి ముందు చేసేదెవరో తెలుసుకోవాలి. ఏ చింతనా లేకుంటే గాని, శరణాగతి కాదు. ఏ చింతనా లేనప్పుడు ఉండేది తానే గదా? తనకు తానే శరణాగతి చెందగలడన్నమాట. భక్తిపరమైతే, భగవానునందే భారం వేసి, తన కర్మ సాగిస్తుంటే, క్రమంగా తానెవరో తనకే బోధపడుతుంది. ఏదైనా ఫలితం ఒకటే. శరణాగతి అంటే తన్ను విచారించి తెలుసుకుని, తాను తానుగ నిలుచుటే; తన్ను విడిచి అన్యం ఏమున్నది?" అన్నారు భగవాన్.

"అది తెల్సుకునే మార్గమో?" అన్నాడా యువకుడు. "గీతలో ఎన్నో మార్గాలు చెప్పారు. ధ్యానం చేయమన్నారు. దానికి శక్తి లేదూ, భక్తి, కాకుంటే యోగం, నిష్కామ కర్మ, ఇంకా ఎన్నో చెప్పారు. ఏదొ ఒక మార్గాన్ననుసరించి పోవాలి. తానెప్పుడూ ఉండేవాడేకదా? సంస్కారాన్ననుసరించి పనులు వాటంతటవే జరుగుతుంటవి. చేసేది నేననే భావనే బంధం. విచారణవల్ల దాన్ని పొగొట్టుకుంటే ఈ ప్రశ్నలే రావు. కళ్ళు మూస్కుని కూర్చున్నతనే #శరణాగతి కాదు. అంతా అదే విధంగా కూర్చుకుంటే లోకయాత్ర సాగేదెట్లా?" అని భగవాన్ అంటూ ఉండగా, భోజనశాలలో గంట మ్రోగింది. "అదుగోనయ్యా గంట, లేచిపోవద్దూ?" అని నవ్వుతూ లేచారు భగవాన్.

మూలం - శ్రీ రమణాశ్రమ లేఖలు; సూరి నాగమ్మ.

(ఇంకా ఉంది)

1 comment:

  1. గురూపదేశ రత్నమాల

    https://www.youtube.com/watch?v=6SgRgl0mW3c

    ReplyDelete