Wednesday, 12 November 2014

స్థావర, జంగమ లింగాలు

శివుడిని మూర్తి రూపంలో కంటే లింగరూపంలో ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు విశేషంగా ఉంటాయి. పరమేశ్వరుడి విగ్రహాన్ని పూజించేవారికంటే, శివలింగారాధన చేసేవరిలో తేజస్సు, శక్తి అధికంగా ఉంటాయని కృష్ణపరమాత్మ మహాభారతంలో చెప్తారు. మనకు లోకంలో చాలా రకాల లింగాలు కనిపిస్తాయి. అందులో ఈ రోజు ఒక 2 లింగాల గురించి చెప్పుకుందాం. 

లింగం అంటే గుర్తు, ప్రతిరూపం (Symbol) అని అర్దం. అన్నిటియందు ఆ పరమశివుడు అంతర్యామిగా ఉన్నాడు. ఈ సృష్టి అంతా లింగమే. అందుకే రుద్రం ఈ జగత్తు అంతా వ్యాపించి ఉన్న శివతత్వాన్ని ప్రకటించింది.

కొండలు, పర్వతాలు, నదులు, శిలలు, మొక్కలు, చెట్లు ..... ఇలా కదలనివాటిని స్థావరములు అంటారు. ఈ స్థావరములన్నీ శివస్వరూపం అంటున్నది శివ పురాణం. అందుకే ఇవన్నీ స్థావర లింగాలు అంటున్నది శివ పురాణం. మనం మొక్కలకు నీరు పోస్తే (ఏ చెట్టైనా కావచ్చు), అది కూడా శివార్చనగా భావించి అనుగ్రహం ప్రసాదిస్తాడు పరమశివుడు. అట్లాగే ప్రకృతి వనరులను విచ్చలవీడిగా దోచుకోవడం స్థావర లింగ రూపంలో ఉన్న శివుడికి చేసే అపచారం అయితే ప్రకృతి వనరులను సంరక్షించుకోవడం, అవస
రమైనంత మేర, వృధా చేయకుండా వాడుకోవడం శివుడికి ఇచ్చే గౌరవం. ఇంకా చెప్పాలంటే నీరు వృధా చేయడం కూడా శివుడికి అపచారమే. ఇది దీని కిందే వస్తుంది.        

రెండవది జంగమ లింగం. జంగమాలంటే కదిలేవి అని అర్దం. జంతువులు, మనుష్యులు, పక్షులు, క్రిమికీటకాలు లాంటివి. ఇవి కూడా శివుడి స్వరూపాలే. వీటిని జంగమ లింగాలు / లింగం అంటారు. ఆపదలో ఉన్నవారికి పవిత్ర భావనతో, ఏ ఉపకారం ఆశించకుండా చేసే సాయం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, దైవభావంతో పెద్దలకు, దీనులకు సేవ చేయడం జంగం లింగానికి చేసే అర్చన. ఇక ఇది చలికాలం, అనేకమంది చలికి వణుకుతూ రోడలపై పడుకుంటారు. అటువంటి వారికి దుప్పట్లు పంచడం, ముష్టివారికి కాసింత అన్నం పెట్టడం, చదువు యందు ఆసక్తి ఉన్న పేద విద్యార్ధులకు పుస్తకాలు పంచిపెట్టడం, పీజు కట్టడం కూడా ఈ జంగమ లింగానికి అర్చన క్రిందే వస్తుంది.  

మనకు శివ పూజ చేయాలన్న తపన ఉండాలి కానీ, అందుకు అనేక మార్గాలు చూపించాడు మహాశివుడు.

ఓం నమః శివాయ

Tuesday, 11 November 2014

అక్బర్ - బీర్బల్ - 4 ప్రశ్నలు

ఒకప్పుడు అక్బర్ బాదుషా తన మంత్రి ఐన బీర్బల్ను 4 ప్రశ్నలు అడిగెను.......

1.....దేవుడు యెచట నివసించును?

2...అతని పని యేమి?

3....అతడేమి భుజించును?

4...కేవల సంకల్ప మాత్రంచే సమస్తము చేయగలిగి ఉండగా అతడు మానవ రూపము యేల ధరించవలె?..

అప్పుడు బీర్బల్ ఈ క్రింది విధంగా సమాధానాలు ఇచ్చెను..

1....దేవుడు సర్వవ్యాపకుడు,,అతడు పవిత్రులైన తన భక్తుల హృదయంలో కానబడును..నీవు కూడా అతనిని నీ హృదయము నందు గాంచ వచ్చును...

2..అతడు ఉన్నత స్థితియందున్న వారిని పతనమొనర్చి ,,పతితులను ఉన్నత స్థితికి గొంపోవును...

3...అతడు జీవుల యొక్క అహంకారమును భుజించును..

అటు పిమ్మట 4వ ప్రశ్నకు అలోచించి తగిన సమాధానము నొసంగుటకై బీర్బల్ కొంత గడువును కోరెను..
తదంతరము బీర్బల్ అక్బరు యొక్క బిడ్డను రక్షించుచున్న దాది వద్దకువచ్చి ఆమెతో ఇట్లనెను..`ఈ దినము నాకు నీవు ఒక విషయమై సహకరించవలెను..నేను అక్బరుకు ఒక నిశ్చితమైన వేదాంత ప్రశ్నకు సమాధానము చెప్పవలసి ఉన్నది..అక్బరు ఈ చెరువు వద్దకు తన శిశువుతో ఆడుటకై వచ్చినపుడూ ఆ శిసువును యెచటనైన దాచి ఉంచి, శిశువు యొక్క ఈ బొమ్మను నీ వద్ద ఉంచుకొనుము.. ఆ శిశువు పడిపోవుచున్నట్లు చేసి, ఆ బొమ్మను చెరువులో పారవేయుము.. అప్పుడు జరగనున్న తమాషాను గమనించుము.. దీనినంతటిని నైపుణ్యముతో చేయుము.. నీవు నైపుణ్యత కలదానివని నాకు తెలియును..: అని చెప్పీతడామెకు పదిరూపాయిలు పారితోషికముగా ఇచ్చెను.. ఆమె మిక్కిలి సంతుష్టియై అతను చెప్పినట్లు చేయుటకు అంగీకరించెను..
అక్బరు తన సాయంకాలపు షికారు నుండి తిరిగి వచ్చి చెరువు పక్కనున్న బల్లపై కూర్చుండెను.. అప్పుడు బిడ్డను తీసుకొని రమ్మని దాదిని అడిగెను.. అప్పుడా దాది చెరువు ప్రక్కకు వెళ్ళి బొమ్మబిడ్డను తెస్తూ అది పడిపోవుచున్నట్లుగా నటిస్తూఆ బొమ్మ శిశువును చెరువులో పడవేచెను..
అక్బరు ఆ బిడ్డను రక్షించుటకై చెరువులో దూకుటకు పరుగెత్తెను.. అప్పుడు బీర్బల్ అడ్డము వచ్చి `నీ బిడ్డ ఇచ్చటనే ఉన్నాడు.. దొందర పడకుడు..: అని పలికెను..

బీర్బల్ యొక్క అమర్యాదతో కూడిన ప్రవర్తనకు అక్బరు మిక్కిలి కోపోద్రిక్తుడై అతనిని మంత్రి పదవి నుండి తొలగించి శిక్షించుటకై ఆజ్ఞాపించెను..

నేనిప్పుడు మీ 4వ ప్రశ్నకు అనుభవ పూర్వకమైన సమాధానమొసంగితినని: పలికెను.. మీరు నాపై యెందుకు కోపగించుకొన్నారు.? మీ బిడ్డను రక్షించుటకై అనేకమంది సేవకులుండగా మీ బిడ్డయందున్న వాత్స్చల్యము బట్టి మీరే నీటియందు దూకుటకు సిద్ధపడ్డారు.. అదే విధంగా భగవంతుడు కేవలము తన సంకల్పమాత్రము చేతనే సమస్త కార్యములను చేయు సామర్ధ్యము కలిగి ఉండియూ అతడికి తనభక్తులయందు ప్రేమచే వారికి దర్శనం ఇచ్చుటకై అతడు ఈ భువిపై అవతరించును..ఈ విషయము మీకు అర్ధమైనదా?
ఈ విషయమంతయూ విని అక్బరు మిక్కిలి సంతసించి బీర్బల్కి విలువైన బహుమతులను,వజ్రఖచిత ఉంగరమును ,శాలువాను అర్పించెను..

ఇట్లు భగవంతుడు మానవజాతిని ఉద్ధరించుటకై అవతరించు చుండును....
సేకరణ: Jnana Valli 

Thursday, 6 November 2014

అరుణాచల శివ

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా

చిదంబర దర్శనం, తిరువళ్ళూర్‌లో జన్మించడం, కాశీలో మరణించడం, అరుణాచల స్మరణం ముక్తిని ప్రసాదిస్తాయి. మనకున్న పంచభూత శివ క్షేత్రాల్లో అగ్నితత్వానికి ప్రతీకయైన అగ్నిలింగం అరుణాచలంలో ఉంది. ఒకసారి బ్రహ్మ, విష్ణువుల మధ్య వివాదం వచ్చినప్పుడు, ఆ వివాదం తీర్చడానికి, పరమశివుడు ఈ అరుణాచల క్షేత్రంలోనే మహాతేజోవంతమైన అగ్నిలింగంగా తన రూపాన్ని ప్రదర్శించాడని స్థలపురాణం.

అరుణాచలం పర్వతమే పరమశివుడు, పరమశివుడే అరుణాచల పర్వతం. అందుకే ఇక్కడ గిరిప్రదక్షిణం పేరున కొండ చుట్టు ప్రదక్షిణం చేస్తారు. అరుణాచలం పర్వత గుహలలోనే శ్రీ దక్షిణామూర్తి ఇప్పటికి ఉన్నారు. అరుణాచలం ఒక అద్భుతం. ఈ అరుణాచలంలోనే రమణ మహర్షి ఆశ్రమం ఉంది. అరుణాచల పర్వతం మీద కార్తీక పూర్ణిమ రోజు వెలిగించే కార్తీక దీపం చూడడానికి దేశవిదేశాల నుంచి లక్షల మంది జనం తరిలివస్తారంటే తిశయోక్తి కాదు. ఈ రోజు అరుణాచలంలో వెలిగించే జ్యోతే పరమశివుడు. ఈ క్షేత్రంలో శివుడి పేరు అరుణాచలేశవరుడు, అమ్మవారి పేరు అపితకుచాంబిక.

తమసోమా జ్యోతిర్గమయా - ఓ పరమాత్మ, మేము ఈ అజ్ఞానమనే అంధకారం నుంచి జ్ఞానమనే వెలుగులోని వెళ్ళెదము గాకా అన్న ఉపనిషత్ వాక్యానికి ఈ జ్యోతియే నిదర్శనం అని చెప్పవచ్చు. ఈ అరుణాచల కార్తీక దీపాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మన మనసుకు జ్ఞానం పొందేలా ప్రేరణ కలుగుతుంది.

చిదంబరంలో శివ దర్శనం అంత సులువు కాదు, తిరువళ్ళురులో జన్మించడం మన చేతిలో లేదు, కాశీలో చావడానికి వెళ్ళినా, అక్కడకు వెళ్ళినవారందరూ అక్కడే మరణించరు, ఈ అరుణాచలాన్ని స్మరించడం మాత్రం మన చేతిలోనే ఉంది. మీరు, నేను అనుకుంటే వచ్చేది కాదు ముక్తి, పైవాడి అనుగ్రహం ఉండాలి. అందుకోసం వాడి అనుగ్రహం పొందాలి. వాడి అనుగ్రహం కోసం నిత్యం అరుణాచలాన్ని స్మరించండి.   
     
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా

Wednesday, 5 November 2014

కార్తీక పౌర్ణమి

కార్తీక పౌర్ణమి విశేషాలు
జ్వాలాతోరణం - శివకేశవులకు ప్రీతికరమైన పవిత్ర కార్తీక మాసంలో అత్యంత మహిమాన్వితమైన రోజు కార్తీక పౌర్ణమి. మనకు ఆశ్వీయుజ అమావాస్య దీపావళి అయినట్టు, కార్తీక పూర్ణిమ దేవతలకు దీపావళి అని చెప్తారు. ఈ రోజు చేసే స్నాన, పాన, దాన, దీప దానములతో పాటు చూసినంత మాత్రంగానే అనంతమైన పుణ్యఫలాలు ప్రసాదించే ఉత్సవం "జ్వాలతోరణం".

కార్తీకపౌర్ణమి సాయంత్రం శివాలయాల్లో, ఆలయప్రాంగణంలో, ప్రధాన ఆలయానికి ఎదురుగా రెండు ఎత్తైన కర్రలు నాటి, మరొక కర్రను ఆ రెండింటిని కలుపుతూ అడ్డంగా కట్టి, ఆ కర్రను ఎండుగడ్డితో చుట్టి, ఆ గడ్డిని నిప్పుతో వెలిగిస్తారు. ఇది మండుతూ తోరణ శివలింగంగా ఉంటుంది. దీనికి జ్వాలాతోరణం అని పేరు. దీని క్రింది నుంచి పల్లకిలో శివపార్వతులను దాటిస్తారు, భక్తులు కూడా ఈ జ్వాలాతోరణం క్రింది నుంచి దాటుతారు.

దీనికి సంబంధించి రెండు కధలు ఉన్నాయి.

ఒకటి, త్రిపురాసురలనే 3 రాక్షసులను పరమశివుడు సంహరించింది ఈ రోజునే అని పురాణం చెప్తోంది. అందువల్ల దీనికి త్రిపుర పౌర్ణమి అని పేరు. దుష్టులైన రాక్షసులను సంహరించిన శివుడుం కైలాసానికి చేరగా, తన భర్తకు దృష్టి దోషం (దిష్టి) కలిగిందని భావించిన పార్వతీమాత, దృష్టిదోష పరిహారం కోసం జ్వాలాతోరణం జరిపించింది.

రెండవ కధ అమృత మధనానికి సంబంధించినది. కృతయుగంలో అమృతంకోసం దేవతలు,రాక్షసులు కలిసి క్షీరసముద్రాన్ని చిలికినప్పుడు పొగలు కక్కుతూ హాలాహలం (కాలాకూట విషం) పుట్టింది. హాలాహలం లోకాన్ని నాశనం చేస్తుందన్న భయంతో దేవతలందరూ పరుగుపరుగున పరమశివుడి వద్దకు వెళ్ళి రక్షించమన్నారు. జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీపరమేశ్వరులు. లోకహితం కోసం పరమశివుడు దానిని స్వీకరించాడు కానీ మ్రింగితే అయన కడుపులో ఉన్న లోకాలు కాలిపోతాయి, బయటకు విడిచిపెడితే, దేవతలకు ప్రమాదం అని భావించి ఆ విషాన్ని తన కంఠంలోనే పెట్టుకున్నాడు. అప్పుడు శివుడు గరళ కంఠుడు / నీల కంఠుడు అయ్యాడు. ఇది జరిగాక పరమశివునితో కలిసి పార్వతి దేవి కుటుంబసమేతంగా  మూడుసార్లు జ్వాలాతోరణం దాటింది. ఈ జ్వాలాతోరణంలో కాలగా మిగిలిన గడ్డిని పశువుల ఆహారంలోనూ, ధాన్యం నిలువ ఉంచే ప్రదేశంలోనూ పెట్టడం చేత పశువృద్ధి, ధాన్యవృద్ధి జరుగుతుంది.

ఈ జ్వాలాతోరణం దర్శించడం వల్ల సర్వపాపాలు హరింపబడతాయని,ఆరోగ్యం చేకూరుతుందని, అపమృత్యువు నివారింపబడుతుందని శాస్త్రం చెప్తోంది. జ్వాలాతోరణం క్రిందినుండి వెళ్ళడం వలన నరకద్వారా ప్రవేశం తొలుగుతుంది. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ దేహం నుంచి బయటకు రాగానే, ఆ ఆత్మను ఒక కుక్క భై అనే గట్టి అరుపులతో తరుముతుంది, తెలిసినా వాళ్ళు ఎవరు ఉండరు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఆ పరిస్థితిలో దిక్కుతోచని ఆత్మ చీకటిలోకి వెళ్ళిపోతుంది. అయినా ఆ కుక్క వెంటబడడం ఆగదు. అలా చాలా దూరం వెళ్ళాక, దూరంగా ఒక కాంతి కనపడుతుంది. అక్కడికి వెళ్తే తప్పించుకోవచ్చన భ్రమతో ఆత్మ ఆ దిశగా పరుగెట్టి, ఒక భయకరంగా మండుతున్న జ్వాలల తోరణాల నుంచి వెళ్ళి, నరకంలోకి ప్రవేశిస్తుంది. ఆత్మ వెంటపడి తరిమిన్న కుక్క భైరవుడు, శివగణాలలో ఒకడు. అప్పుడు ఆత్మ అనుభవించే బాధా వర్ణనాతీతం. అటువంటి పరిస్థితి రాకూడదని, తన బిడ్డలెవరు బాధపడకూడదని, మన మీద ప్రేమతో జగత్తుకు తండ్రి అయిన పరమశివుడు తనతో కలిసి కార్తీకపౌర్ణమి రోజున జ్వాలతోరణం దాటే వారికి ఈ నరకబాధ నుంచి విముక్తినిస్తాడు. అందుకే ప్రతి శివాలయంలో కార్తీకపౌర్ణమి నాడు విశేషంగా జ్వాలతోరణం జరుపుతారు.

ముఖ్యమైన విధులు: ఈ రోజు చేసే ఉపవాసానికి విశేషఫలం ఉంటుంది. కార్తీక పూర్ణిమ నాడు ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక్క దీపమైనా వెలిగించి ఈ క్రింది శ్లోకం చదవాలి.

కీటాఃపతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః |
దృష్ట్వా ప్రదీపం న హి జన్మభాగినః
భవంతి త్వం శ్వపచాహి విప్రాః ||

ఈ దీపం చుసిన ప్రభావం చేత కీటకాలు (insects), పక్షులు, దోమలు, చెట్లు,మొక్కలు, ఉభయచరాలు (amphibians) అన్ని కూడా, అవి ఏ ఏ రూపాల్లో ఉన్నాయో, ఆ రూపాల్లోనే అవి మోక్షం పొందాలని, వాటికి మరుజన్మ ఉండకూడదని ప్రార్ధిస్తున్నా అని అర్ధం.ఎంతో పుణ్యం చేసుకుంటే మనకీ జన్మ వచ్చింది, ఈ జన్మలో మనం బుద్ధి ఉపయోగించి, వేదం చెప్పినట్టు బ్రతికి, జ్ఞానం పొంది, మోక్షం సాధించవచ్చు. కానీ, మిగితా జీవులకు ఆ అవకాశం లేదు. మనకు ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశి ఏదో ఒక రకంగా ఉపకారం చేస్తూనే ఉంటాయి. వాటికి ప్రత్యుపకారం చేయడం మన ధర్మం. వాటికి ప్రత్యుపకారం చేయడం కోసం, మనకు లాగే అవి భగవంతున్ని చేరుకోవడం కోసం దీపాన్ని వెలిగించి, ఈ స్తోత్రాన్ని చదవాలి.

Tuesday, 4 November 2014

కార్తీక పౌర్ణమి - సముద్ర స్నానం

కార్తీకపూర్ణిమ, సముద్ర స్నానం.

శాస్త్రంలో సముద్రస్నానానికి ప్రత్యేకత ఉంది. ఆషాడ, కార్తీక, మాఘ, వైశాఖ పూర్ణిమలకు తప్పకుండా సముద్ర స్నానం చేయాలి. ఈ స్నానం సూర్యోదయానికి పూర్వమే చేయాలి.

కార్తీక మాసంలో చంద్రకిరణాల నుండి అమృతబిందువులు వర్షిస్తాయి, అవి మానసిక, శారీరిక ఆరోగ్యాన్ని ఇస్తాయి. అంతేకాదు, చంద్ర కిరణాలతో మధుమేహానికి ఔషధం తయారుచేసే పద్ధతి మనం దేశంలో ఉంది. ఈ చంద్రకిరణాలు, చంద్రుడి ప్రభావం నీటిపై అధికంగా ఉంటుంది, పూర్ణిమ రోజున మరింత విశేషంగా ఉంటుంది. చంద్ర కిరణ ప్రభావిత నీటిలో చేసే స్నానం అనేక రోగాలను నయం చేస్తుంది. అందుకోసమే కార్తీక పూర్ణిమ రోజున సూర్యోదయానికి పూర్వమే సముద్రస్నానం చేయాలి.

ఇక ఆయుర్వేద పరంగా చెప్పుకుంటే, ఈ రోజు చేసే సముద్రస్నానం చలికారణంగా మన చర్మం మీద ఏర్పడిన పగుళ్ళను, గాయాలను నయం చేస్తుంది. శరీరంలో అధికంగా పేరుకుపోయి బద్దకాన్ని కలిగించే విద్యుత్ అయస్కాంత శక్తిని తొలగిస్తుంది. ఉదర, కాలేయ సంబంధిత రోగాల బారినపడకుండా రక్షిస్తుంది.  

కనుక సముద్ర స్నానం చేయాలనుకునేవారు తగిన ఏర్పాట్లు చేసుకోండి.     

Monday, 3 November 2014

కార్తీక శుద్ధ ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి

ఓం నమో లక్ష్మీనారాయణాయ
కార్తీక శుద్ధ ద్వాదశి

కృతయుగంలో ఇదే రోజున దేవతలు - రాక్షసులు అమృతం కోసం మందరపర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసి, పాలసముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారని పురాణ వచనం. అందువల్ల దీనికి చిలుకు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అని పేరు.

యోగనిద్ర నుండి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మెల్కొన్న శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా దేవతలతో కూడి ఈరోజు తులసివనం (బృందావనం) / తులసి కోటలోనికి ప్రవేశిస్తాడని,  ఆయన్ను పూజించడానికి దేవతలు, ఋషులు, యక్షులు, కిన్నెర, కింపురుషులు, సిద్ధులు, యోగులు మొదలైనవారంతా వస్తారని బ్రహ్మ దేవుడే చెప్పాడు.

అందువల్ల ఈ రోజు విష్ణుప్రతిమను తులసికోటలో ఉంచి పూజిస్తే సకల పాపాలు నశించి, విష్ణులోకానికి వెళతారని, ఈరోజు చేసిన పూజ, ఎంతటి ఘోరమైన పాపాలను కూడా అగ్నిహోత్రంలో వేయబడిన ప్రత్తిపోగును కాల్చివేసినట్లుగా కాల్చివేస్తుందని పురాణవచనం.

ఉసరి చెట్టు విష్ణుస్వరూపం. తులసి లక్ష్మీ స్వరూపం. ఈ రోజు తులసి - దామోదర వ్రతం చేస్తారు. అంటే తులసి ఉసరిక చెట్లకు కల్యాణం చేస్తారు. ఈ కల్యాణం చేస్తే లక్ష్మీనారాయణులకు కల్యాణం చేసిన ఫలం కలుగుతుంది. ఈరోజున తులసి మొక్క వద్ద దీపం వెలిగించినవారికి విష్ణుకృప కలుగుతుంది. తులసివనంలో శ్రీకృష్ణ విగ్రహం వద్ద ఎవరు దీపారాధన చేస్తారో, వారికి అనంతమైన పుణ్యం లభిస్తుంది. మరణం తరువాత వైకుంఠానికి వెళతారు. ఈ రోజున తులసి వనంలో విష్ణువును పూజించనివారికి పూర్వపుణ్యాలు కూడా నశించి నరకానికి పోతారని, కోటి జన్మల పాటు పాపిగా పుడతాడని, పూజించినవారు స్వర్గానికి వెళతారని, బ్రహ్మహత్యాపాతకం వంటి అనేకమైన మహాపాపాలు కూడా నశించి మహామహా పుణ్యాలు పొందుతారని పురాణం చెబుతోంది. వెలుగుతున్న దీపాల మధ్య తులసివనంలో ఉన్న విష్ణువు లేక ఉసరి చెట్టును కాని చూసి నమస్కరిస్తే వారి కోరికలు సిద్దిస్తాయి.

ఈ రోజున తులసిమొక్క వద్ద తప్పకుండా దీపదానం చేయాలి. ఒక దీపం దానం చేస్తే ఉపపాతకములు నశిస్తాయి. పది దీపాలు దానం చేస్తే శివసానిద్ధ్యం, ఇంతకుమించి దీపాలు దానం చేస్తే స్వర్గలోకానికి అధిపత్యం లభిస్తుందని, బ్రహ్మా మొదలైన దేవతలకు కూడా దీపదానం వల్లనే ఆ వైకుంఠంలో శాశ్వతమైన స్థానం కలిగిందని పురాణంలో కనిపిస్తుంది. దీపం వెలింగిచడానికి ఆవునేయి ఉత్తమము. లేకుంటే నువ్వుల నూనె మాత్రమే వాడాలి. తులసి మొక్క ముందు ముగ్గులు వేసి, దీపాలతో అలంకరించి, తులసి స్తోత్రాలు చదవాలి.                       

Sunday, 2 November 2014

భోధన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి

ఓం నమో నారాయణాయ

కార్తీక శుద్ధ ఏకాదశి, భోధన ఏకాదశి  


కార్తీకశుద్ధ ఏకాదశికే భోధన ఏకాదశి, దేవ-ప్రబోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని పేర్లు. ఆషాడ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిద్ర నుండి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్థాన ఏకాదశిగా అయ్యింది. దీనినే హరి-భోధిని ఏకాదశి అని కూడా అంటారు.

తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్యవ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహభారత యుద్ధంలో బీష్ముడు ఈ ఏకాదశినాడే అస్త్ర సన్యాసం చేసి, అంపశయ్య మీద శయనించాడు. యజ్ఞవల్క్య మహర్షి ఈరోజునే జన్మించారు.

ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణువును పూజించి, రాత్రి జాగరణ చేసి, మరునాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణుపూజ చేసి, పారణ చేసి (భోజనం చేసి) వ్రతాన్ని ముగించాలి.

 ఈ ఏకాదశి మహత్యాన్ని గురించి బ్రహ్మదేవునికి నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కందపురాణంలో కనిపిస్తుంది. "ఈ ఏకాదశి పాపాలను హరిస్తుంది. 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది. కొండంత పత్తిని ఒక చిన్న నిప్పు రవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగ ఒక జీవుడు,తన వేలజన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి  ఉపవాస వ్రతం. ఈ రోజు చిన్న మంచిపని (పుణ్యకార్యం) చేసినా, అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుంది. ఈ ఏకాదశి వ్రతం చేసినవారికి సాధించలేనివి ఏమి ఉండవు. ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నతస్థానం కలగడంతో పాటు పాపాపరిహారం జరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోటిరెట్ల పుణ్యం ఒక్కసారైన ఈ ఏకాదశి  ఉపవాస వ్రతం చేసినవారికి లభిస్తుంది" అని బ్రహ్మదేవుడు నారదునితో పలుకుతాడు.

ఇంకా ఈ వ్రతంలో ఒకరికి చేసే అన్నదానం వలన సూర్యగ్రహణసమయంలో పవిత్ర గంగాతీరాన కోటిమందికి అన్నదానం చేసినంత ఫలితం లబిస్తుంది. వస్త్రదానం చేయడం వలన, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇవ్వడం వలన ఈ లోకంలోనే గాక మరణానంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి. 

ఈ రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్దులు, యోగులు అందరూ విష్ణులోకం చేరి కీర్తనలతోనూ, భజనలతోనూ, హారతులతోనూ శ్రీమహావిష్ణువును నిద్రలేపుతారు. అందువల్ల ఉత్థాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు (uncertain death) దోషం తొలగిపోతుందని ధార్మిక గ్రంధాలు చెప్తున్నాయి. అందువల్ల అందరు విష్ణుమూర్తికి హరతి ఇవ్వండి. ఏవైనా కారణాల వల్ల హారతి ఇవ్వడం కుదరకపోతే దేవాలయానికి వెళ్ళండి. అక్కడ స్వామికి ఇచ్చె హారతిని కన్నులారా చూడండి, వీలైతే స్వామికి హారతి కర్పూరం సమర్పించండి. అపమృత్యు (uncertain death) దోషం పరిహారం జరుగుతుంది. స్వామి అనుగ్రహం కలుగుతుంది.

ఓం నమో నారాయణాయ

ఓం శాంతిః శాంతిః శాంతిః