Showing posts with label శివుడు. Show all posts
Showing posts with label శివుడు. Show all posts

Friday, 13 March 2020

Thursday, 12 March 2020

శివపురాణం నుంచి సూక్తి



“Brahma emerged from the right side of Mahesa, Vishnu from the left and Nilarudra from his heart. In the beginning, intoning AUM, Sadasiva created the universe. Siva is Pranava and Pranava is Siva.”

― Ramesh Menon, SIVA PURANA

Wednesday, 14 February 2018

Saturday, 23 July 2016

‎కబాలి‬ - కపాలి - కపాలేశ్వర స్వామి

‎కబాలి‬ అనేది తమిళపదం. కపాలి అనే పదం నుంచి వచ్చింది. తమిళ భాషలో ప లేదు కనుక బ అని ఉపయోగించారు. కపాలి అంటే శివుడు. చెన్నైలోని మైలాపూర్ లో కపాలేశ్వర స్వామి దేవస్థానం కూడా ఉంది. ఇక్కడ పరమశివుడి కోసం ఉమా దేవి నెమలి రూపంలో తపస్సు చేసిన కారణంగా ఈ ఊరికి మైలాపూర్ అని పేరు వచ్చింది. ఈ స్థలపురాణం ఇదే దేవాలయంలో స్థల వృక్షమైన పున్నాగ చెట్టు కింద చిన్న కోవెలలో చెక్కబడి ఉంది. మయిల్ అంటే నమలి అని తమిళంలో అర్దం. ఈ క్షేత్రానికి పురాణ ప్రాశస్త్యం ఉంది. ఇది పురాతన దేవాలయం, 7 వ శతాబ్దంలో పల్లవులు నిర్మించారట. ఇక్కడ శివుడిని కపాలీశ్వరుడని, అమ్మవారిని కర్పగాంబళ్ అని పిలుస్తారు. ఇక్కడ నర్తనవినాయకుడు కొలువై ఉన్నాడు. నాయనార్లలో ముఖ్యులైన 7 వ శతాబ్దానికి చెందిన అప్పర్, జ్ఞానసంబంధర్‌లు ఈ ఆలయంలో వెలిసిన శివుడిని ఉద్దేశ్యించి కీర్తించారు. అలాగే ఇక్కడ శివుడిని బ్రహ్మదేవుడు పూజించాడని, ఆయనే లింగప్రతిష్ట చేశాడని, ఈ క్షేత్రానికి శుక్రపురి, వేదపురి అనే పేర్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది.





సుందరమైన ఈ ఆలయం సందురతీరంలో ఉంది. సా.శ.1566 లో మైలాపూర్ పోర్చుగీస్ వారి చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఆలయాన్ని కూల్చివేశారు. ఆ తర్వాత మళ్ళీ, ఇప్పుడున్న ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించారు. ఆ తర్వాత ఈ ఆలయాన్ని మిషనరీలు వివాదాస్పదం చేశాయి. ఈ ఆలయం మీద కొన్ని కుట్రలు చేసి, రాజకీయ మద్ధతుతో, అసత్యాలనే సత్యాలుగా ప్రచారం చేసి, తమిళనాడులో ద్రవిడ క్రైస్తవాన్ని ప్రోత్సహించి, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయాన్ని రాజీవ్ మల్హోత్రా గారు, తాను రాసిన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు (Breaking India) అనే పుస్తకంలో వివరించారు.

రజనీకాంత్ ఆధ్యాత్మికమార్గంలో ఉన్న వ్యక్తి, సంస్కారవంతుడు, భక్తుడు కూడా. తెలుగునేల మీద చాగంటి కోటేశ్వర రావు గారు చేసిన ప్రవచనం వలన ఎంతోమందికి అరుణాచలం గురించి తెలిసింది. ఇప్పుడు తెలుగు ప్రాంతం నుంచి అరుణాచలం వెళుతున్న వారిలో సగం మంది చాగంటి వారి ప్రవచనం వినడం వల్లనే వెళ్తున్నారని అక్కడి ప్రజలు చెప్పారు. అలాగే తమిళ నాట రజనీకాంత్ వల్లనే చాలామంది అరుణాచలం మొదలైన శైవ క్షేత్రాలకు వెళుతున్నారట. మంచి పేరున్న నటుడైన రజనీకాంత్ తన సినిమా పేర్లకు అరుణాచలం, లింగ, బాబా మొదలైన పేర్లను కావాలనే ఎంచుకుని, ఆయా క్షేత్రాల, గురువుల పట్ల ప్రజల్లో అవగాహన తీసుకువచ్చారని ఈ మధ్యే అక్కడున్నవారి ద్వారా తెలిసింది. ఇదిగో ఇప్పుడిలా మళ్ళీ కబాలి పేరుతో కపాలీశ్వర స్వామి గురించి తమిళ ప్రజలకు చాటి చెప్తున్నారు. ఉన్నతమైన స్థానంలో ఉండి ప్రజలను మంచి మార్గంలో నడిపించడం చాలా గొప్ప కదా.

గమనిక - నేనేమీ రజనీకాంత్ ఫ్యాన్‌ను కాదు. ఆ మాటకు వస్తే నేను సినిమాలు చూసి చాలా సంవత్సరాలయ్యింది. టివి చూసేది కూడా చాలా తక్కువ. ఏదో ఒక క్షేత్రం గురించి చెప్పుకోవచ్చు, నాలుగు మంచిమాటలు పంచుకోవచ్చని చేస్తున్న ప్రయత్నమే ఇది.

హర హర మహాదేవ
జై కపాలీశ్వరా

Tuesday, 17 February 2015

శివరాత్రి కధ - 4 (విజ్ఞానం)

శివరాత్రి కధ- 4 (విజ్ఞానం)

త్రిమూర్తులకు భేధం లేదని చెప్పి మహాశివుడు అదృశ్యమవుతాడు. అప్పుడు ఆ శివలింగం అనంతమైన ఆ శూన్యంలో, జలంలో అండంగా మారుతుంది. ఆ అండం నుంచి సృష్టి జరగాలనీ చేయాలని బ్రహ్మ తపస్సు చేస్తాడు. ఈలోగా ఆ అండంలోనికి విష్ణువు ప్రవేశిస్తాడు. విష్ణువంటే ప్రాణశక్తి కనుక విష్ణువు ప్రవేశంతో సృష్టి మొదలవుతుంది. కర్దమ, దక్ష, మరీచి మొదలైన ప్రజాపతులను బ్రహ్మ సృష్టి చేస్తాడు. ఆ తరువాత జను, పక్షి, క్రిమి, కిటక, రాక్షస, దేవ, మానవ మొదలైన సంతతి పెరిగిందని పురాణం చెప్తున్నది.

పురాణం ఒట్టి కధ కాదు, అందులో చాలా విజ్ఞానం, నీతి, జీవన విధానం, ధర్మం ఇమిడి ఉంటాయి. ఈ శివరాత్రి కధలో అటువంటి ఆశ్చర్యకరమైన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం.

శూన్యం తప్ప ఏమి లేదు అని పురాణం అంటుంది. అవును, ఈ విశ్వం శూన్యం నుంచి వచ్చి, తిరిగి శూన్యంలోనే లయమవుతుందని ఆధునిక సైసు ఒప్పుకుంది. ఒక శూన్యమంతా నీటితో నిండి ఉంది అన్నది పురాణం. అంతరిక్షంలో ఈ భూమిని ముంచెత్తగల స్థాయిలో నీరు ఉన్నదని, అది ఈ భూమికి చాలా దూరంగా ఉందని ఈ నాటి అంతరిక్ష శాస్త్రవేత్తలు నొక్కి చెబుతున్నారు, అంగీకరిస్తున్నారు.

మనకు కనిపించే ఈ విశ్వమే కాదు, వందల కోట్ల విశ్వాలు భగవంతుని సృష్టిలో ఉన్నాయని భారతీయ గ్రంధాలు చెప్తున్నాయి. ఈ విశ్వమంటే ఒక బ్రహ్మాండం. మనకు అనేక బ్రహ్మాండాలు ఉన్నాయని, వాటికి అనేక బ్రహ్మలు ఉన్నారని పురాణాల్లో కనిపిస్తుంది. బ్రహ్మ విష్ణువు యొక్క నాభి కమలం నుంచి పైకి రావడం అంటే, అనంతమైన భగవత్ సృష్టిలో ఒక బ్రహ్మాండం యొక్క ఆవిర్భావం జరగడమని అర్దం. ఇటువంటి అనేక బ్రహ్మాండాలు, ప్రతి క్షణం ఉద్భవిస్తుంటాయి, నశిస్తుంటాయి. సముద్రపుఅలలపై వచ్చే నీటి బుడగలవలే అనేక బ్రహ్మాండాలు ప్రతిక్షణం విష్ణువులో ఐక్యం అవుతాయని, కొత్తవి వస్తుంటాయని మన వాళ్ళు చెప్పారు. అదే విషయాన్ని ఈ నాటి శాస్త్రవేత్తలు అంగీకరించారు. ఈ గెలాక్సికి అవతల, భూమిని పోలిన అనేక గ్రహాలు ఉన్నాయని ఈ రోజు చెప్తున్నారు. బ్రహ్మ తన ఉనికిని గురించి తాను బయట శోధించి విఫలం కావడం, తరువాత తపస్సు ఒక సందేశం. విశ్వమంతా వెతికినా, మానవుడి ఉనికి యొక్క రహస్యం బాహ్యప్రపంచంలో దొరకదు, తన ఉనికిని గురించి తెలుసుకోవాలంటే అంతర్ముఖత చెందాలి, అంటే లోపలికి చూడాలి, తనలో ఉన్న ఆత్మను చూడాలి. అప్పుడే తన ఉనికి గురించి సమస్తము తెలుస్తుంది. ఒక రకంగా అష్టాంగయోగంగా అర్ధం చేసుకోవచ్చు.

ఇక శివుడు లింగరూపంలో రావడం అన్నది పెద్ద వైజ్ఞానికి సత్యం. దీన్ని ఆధునిక కాస్మాలజిస్ట్‌లు ఒప్పుకున్నారు.

ఈశా ఫౌండేషన్ స్థాఫుకులు జగ్గీవాసుదేవ్ గారు శివలింగం గురించి ఈ విధంగా చెప్పారు. 'శివలింగం ellipsoid అంటే 3-Dimensional ellipse ఆకారంలో ఉంటుంది. Modern cosmologistsలు galaxy ల మధ్యభాగాన్ని(core) ఫొటొ తీసినప్పుడు ప్రతి galaxy core కూడా ellipsoid  ఆకారంలోనే ఉంది. నిరాకారమైన (unmanifest) శక్తి (energy) ఒక సాకార (manifest) రూపాన్ని సంతరించుకునే క్రమంలో, రూపాంతరం చెందే క్రమంలో, అది మొట్టమొదటగా ellipsoid అంటే లింగాకారాన్ని సంతరించుకుంటుంది అని పురాణం, ఆధునిక సైన్సు చెప్తున్నాయి'. ఈ బ్రహ్మాండమే లింగము, శివలింగం బ్రహ్మాండానికి సంకేతం అంటాయి శివ, లింగ పురాణాలు. ఎప్పుడైన పిల్లలు శివలింగం అంటే ఏంటీ అని అడిగినప్పుడు ఈ విషయాన్ని నిర్భయంగా, గర్వంగా చెప్పండి.

ఈ లింగం ఆద్యంతాలు లేకుండా పెరగడం అంటే, ఈ బ్రహ్మాండం నిత్యం వ్యాపిస్తూ ఉంటుందనడానికి సంకేతం. బ్రహ్మ, విష్ణువులు కొన్ని కోట్ల సంవత్సరములు ప్రయాణం చేసినా, లింగం యొక్క ఆది, అంతాలను తెలుసుకోలేకపొవడం, ఈ బ్రహ్మాండాన్ని, విశ్వాన్ని దాటి వెళ్ళాలంటే కొన్ని కోట్ల కాంతి సంవత్సరములు పడుతుందని, అది సాధ్యం కాని విషయమని, ఈ బ్రహ్మాండం ఎంత మేర వ్యాపించి ఉన్నదో చెప్పడం కష్టమని తెలియజేయడమే. దీన్నే ఆధునిక శాస్త్రవేత్తలు అంగీకరించలేదా?

లింగపురాణం అంతరిక్షం గురించి, దాని వయసు గురించి ఏ విషయాలైతే స్పష్టం చేసిందో, సరిగ్గా అవే విషయాలను ఆధునిక శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.

ఇవన్నీ మన ఆధునిక విజ్ఞానం అభివృద్ధి చెందిన తరువాత చెప్తున్న విషయాలు కాదు, మన పురాణాలు ఏవైతే చెప్పాయి వాటినే చెప్పుకుంటున్నాం. ఒకప్పుడు మనవన్నీ పుక్కిటి పురాణాలు అని వెక్కిరించిన పాశ్చ్యాతులే ఈ రోజు ఇవన్నీ సత్యాలని అంగీకరిస్తున్నారు, కొత్త కనుగొన్నామని చంకలు గుద్దుకుంటున్నారు. అంతే. కానీ మనం మాత్రం ఇవన్నీ పాతకాలపు మాటలని పక్కనపడేస్తున్నాం.

ఓం నమః శివాయ

Originally published : 27-Feb-2014 (Mahasiva ratri)
Republished 1st time: 17-Feb-2015 (MahaSiva ratri)
శివలింగం దేనికి సంకేతం? Published:  18-Nov-2012
http://ecoganesha.blogspot.in/2012/11/blog-post_18.html

Monday, 16 February 2015

శివరాత్రి కధ - 3

కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు. అహంకారమమకారాలు ఎంతటి పనినైనా చేయిస్తాయి. సృష్టికర్త అయిన బ్రహ్మ, తన ఆధిపత్యం కోసం 'తాను లింగం యొక్క పైభాగాన్ని చూసినట్ట్లుగా దొంగసాక్ష్యం చెప్పమన్నాడు. అబద్ధం చెప్పడం పాపం అంటుంది మొగలి పువ్వు. తాను సృష్టికర్తననీ, తన ఆదేశాలనీ పాటించితీరవలసిందే అన్నాడు. చేసేది లేక అసత్యపు సాక్ష్యానికి కేతకీ పుష్పం ఒప్పుకుంది.

ఇంతలో కామధేనువు కనపడింది. ఎక్కడి నుండి వస్తున్నావు అని అడుగగా, ఈ దివ్యజ్యోతిర్లింగాన్ని దర్శించి వస్తున్నా అని చెప్తుంది బ్రహ్మతో. నువ్వు దీనీ అగ్రభాగం చూశావా? అని అడుగగా, చూశాను అంటుంది. అయితే నువ్వు కూడా నా తరపున సాక్ష్యం చెప్పాలి అంటాడు.

తాము మొదటి నిశ్చయించుకున్న ప్రదేశానికి మొగలిపువ్వు, కామధేనువుతో చేరుకుంటాడు. విష్ణువు తన ఓటమిని అంగీకరిస్తాడు. బ్రహ్మ మాత్రం తాను, లింగం యొక్క అగ్రభాగాన్ని చూశానని, తానే గొప్పవాడినని, కామధేనువు, మొగలిపువ్వులే సాక్ష్యాలని చెప్తాడు. ఎప్పుడు, ఎవరు ఏమి చెస్తున్నారో ఆ పరమాత్ముడికి తెలియదా?.

అప్పుడు ఆ లింగం నుంచి 'ఓం','ఓం','ఓం' అని ప్రణవం వినిపిస్తుంది. లింగం యొక్క దక్షిణభాగం నుంచి అకారం, ఉత్తరం నుంచి మకారం, దాని తరువాత నాదం వినిపిస్తున్నాయి. అదే ఓంకారం.  వెంటనే ఆ దివ్యలింగం నుండి ఒక మహాశక్తి పుట్టింది. 10 చేతులతో, తెల్లని వర్ణంతో, 5 తలలతో, త్రిశూలం, ఢమరుకం ధరించిన ఒక దివ్యమైన, సుందరమైన ఆకారం ఏర్పడింది. ఆయనే పరమశివుడు. అబద్దం చెప్పిన బ్రహ్మ మీద పరమేశ్వరునికి కోపం కట్టలుతెంచుకుంది. ఆయన కోపం నుండి వీరభధ్రుడు పుట్టాడు. అసత్యాలు పలికితే ఎమవుతుందో, ఎలాంటి శిక్ష పడుతుందో ఇది తెలియజేస్తుంది. అబద్దం చెప్పిన బ్రహ్మ ఇదవ తలను నరికేశాడు వీరబధ్రుడు. బ్రహ్మనే హతమారుద్దాం అనుకున్నాడు, కానీ, బ్రహ్మ పశ్చాతాపడ్డాడు. క్షమించమని వేడుకున్నాడు. ఆ భీఖర సన్నివేశం చూడలేక బ్రహ్మను కాపాడమని విష్ణువు కూడా శివుడిని వేడుకున్నాడు. బ్రహ్మను వదిలేశాడు వీరభధ్రుడు.

అబద్దం చెప్పిన మొగలిపువ్వు భయంతో వణికిపోతోంది. దాని వైపు చూసిన శివుడు, నీవు అసత్యం పలికినందుకుగానూ నువ్వు నా పూజకు పనిరావు, నీతో నేను పూజింపబడను అని శపించాడు. అందుకే మొగలిపువ్వు శివపూజకు పనికిరాదు. చేసిన తప్పు తెలుసుకుని భాధపడి ఈశ్వరుని వేడుకుంది మొగలిపువ్వు. చేసిన తప్పు తెలుసుకున్నందుకు సంతోషించి నీవు నా పూజకు అర్హత కోల్పోయినా, నా పూజల కొరకు చేసే అలంకారాల్లో వాడబడతావు అన్నాడు.

శివుడు కామధేనువు వైపు చూస్తూ "కామధేనువు బ్రహ్మ అగ్రభాగం చూసినట్టూ నిలువుగా తన తల ఊపింది. కాని తోక మాత్రం అబద్దమని చెబుతు అడ్డంగా ఊపింది. అందువల్ల ఆవు తోక భాగం పూజనీయమవుతుంది. ఉదయం లేవగానే ఎవరు ఆవు తోక భాగం చూస్తారో, వారికి సకల శుభాలు కలుగుతాయి. అలా కాకుండా దాని మొహం చూస్తే దరిద్రం పడుతుంది" అని పలికాడు సదాశివుడు.

నిజాయతీగా నిజం ఒప్పుకున్న విష్ణువును చూసి, ఆనందపారవశ్యంతో నువ్వు సర్వలోకములయందు నాతో సమానంగా పూజింపబడతావు అంటూ వరం ఇచ్చాడు. ఇక్కడ ఓ విషయం మర్చిపోకూడదు. శివుడికి, విష్ణువుకు బేధం లేదు. వాళ్ళను ఇద్దరుగా వేరు చేసి చెప్పడం కూడా దోషం అవుతుందేమో. శివకేశవులు కలిసి ఆడిన మహానాటకం ఇది. అసత్యం పలికేవాళ్ళకు ఏ గతి పడుతుందో చెప్పడానికి, సత్యంగా, నిజాయతీగా బ్రతికేవాళ్ళకు సాక్షాత్తు భగవంతునికి సమాన స్థానం వస్తుందని తెలియపరచడానికి వారు ఆడిన దివ్య క్రీడ ఇది.

అటు తరువాత బ్రహ్మ, విష్ణువులిద్దరూ ఆ లింగాన్ని పూజించారు.

బ్రహ్మ మురారి సురార్చిత లింగం
నిర్మల బాసిత శోభిత లింగం
జన్మజ దుఖః వినాశక లింగం
తత్ప్రణమామి సదా శివలింగం

ఆఖరున శివుడు, బ్రహ్మ, విష్ణువులతో మనం ముగ్గురం ఒకే శక్తి యొక్క వేర్వేరు తత్వాలము. మన ముగ్గురికి ఎంత మాత్రమూ తేడా లేదు అని పలుకుతాడు.

ఈ మహాలింగం ఉద్భవించిన రోజే శివరాత్రి. ఆ రోజు రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలం అంటారు. ఆ కాలంలోనే మహాశివుడు దివ్య లింగంగా ప్రకటితమయ్యాడు. అందుకే శివనామంతో శివరాత్రికి జాగరణ చేస్తూ, ఈ కధను గుర్తు చేసుకుంటూ, మనలో ఉన్న పరమశివుడిని జాగృతం చేస్తాం.

ఓం నమః శివాయ 

Sunday, 15 February 2015

శివరాత్రి కధ - 2

బ్రహ్మ విష్ణువుతో పోరాటం చేయడం అంతా విష్ణుమాయ. విష్ణుమాయ చేత కప్పబడ్డాడు కనుక బ్రహ్మకు ఏమి గుర్తు రావడం లేదు. ఇద్దరు యుద్ధంలో మునిగియున్న సమయంలో కళ్ళు మిరమిట్లు గొలిపే వెలుగుతో, పెళపెళ శబ్దం చేసుకుంటూ విద్యుత్ స్థభం/మహాతేజో లింగం ఒకటి ప్రత్యక్షమైంది. దానికి ఆది, అంతాలు లేవు. అది అలా వేగంగా పెరుగుపోతూనే ఉంది. అది వ్యక్తావ్యక్తస్వరూపం. సమస్త విశ్వానికి మూలమైనది. విష్ణువు వేసిన మహేశ్వరాస్త్రమూ, బ్రహ్మ వేసిన పాశుపతాస్త్రమూ ఆ మహాకాంతి స్థంభంలో కలిసిపోయాయి.

ఆ లింగాన్ని చూసిన విష్ణువు మోహితుడయ్యాడు. బ్రహ్మ కూడా ఆశ్చర్యపోయాడు. ఆ లింగం నుండి 'మీ ఇద్దరిలో ఈ లింగం యొక్క ఆదిని కాని, అంతమును కానీ, ఎవరు తెలుకుని, ముందు ఈ ప్రదేశానికి చేరుకుంటారో వారే గొప్పవారు' అని మాటలు వినిపించగా, అప్పుడు విష్ణువు బ్రహ్మతో 'ఈ యుద్ధం ఇక్కడితో చాలిద్దాం. ఇప్పుడు మనమిద్దరం కాకుండా మూడవ శక్తి ఇక్కడ ఉన్నది. దాని గురించి తెలుసుకుందాం. బ్రహ్మ! నువ్వు హంస రూపంలో ఈ లింగం యొక్క పై భాగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయ్యి, నేను వరాహ రూపంలో ఈ లింగం యొక్క క్రింది భాగాన్ని, ఆరంభ భాగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను' అన్నాడు. ఇద్దరూ వారివారి నిర్దేశిత రూపాల్లో అన్వేషణ ప్రారంభించారు.  

విష్ణువు కొన్ని కోట్ల సంవత్సరాల పాటు పయనించినా, ఆ లింగం యొక్క ప్రారంభ స్థానం కనుగినలేకపోయాడు. ఎంత క్రిందకు వెళ్ళినా, ఆ లింగం యొక్క మూలం ఇంకా దొరకడంలేదు. తనకు ఇది సాధ్య కాదని శ్రీ మన్నారాయణుడు, యుద్ధం జరిగిన ప్రదేశానికి చేరుకుంటాడు.

బ్రహ్మదేవుడు ఎంతో కాలం పైకి ప్రయాణించినా, ఆ లింగం చివరి భాగం అంతుబట్టడం లేదు. అది ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంది. ఏం చేయాలో బ్రహ్మకు అర్ధం కావడంలేదు. తన అధిపత్యాన్ని నిరూపించుకోవాలని, విష్ణువుకంటే తనకే అధిక గౌరవం దక్కాలని బ్రహ్మ భావించాడు.

ఇంతలో పై నుంచి కేతకీ పుష్పం క్రిందకు వస్తోంది. ఆ పుష్పాన్ని ఆపి, నువ్వెక్కడి నుంచి వస్తున్నావని అడుగుతాడు బ్రహ్మదేవుడు. నేను ఈ మహాలింగాన్ని అర్చించి క్రిందకు వస్తున్నా అంటుంది, అయితే నీకు దీని అగ్రభాగం తెలుసా? నువ్వు చూశావా? అని బ్రహ్మదేవుడు అడుగుతాడు. చూశానండీ! కానీ ఈ లింగం పెరిగిపోతూనే ఉన్నది. నేను దీని అగ్రభాగాన్ని తాకి, కొన్ని కోట్ల సంవత్సరముల నుంచి క్రిందకు పడుతూనే ఉన్నాను. ఈ లింగం చాలా పెద్దది. ఇది ఇప్పటికి ఇంకా పెరిగిపోయి ఉంటుంది. దీని అగ్రభాన్ని తెలుసుకోవడం అసాధ్యం అంటుంది కేతకీ పుష్పం.  

To be continued............

శివరాత్రికి ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి?

సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత్ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు.

శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు.


1.ఉపవాసం

శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేయాలి. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం.

ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్ధం దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్ధాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది.  మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరు చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం.

2. జీవారాధాన

అట్లాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహారపదార్ధాలు మిగిలుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే అవుతుంది. అందుకే స్వామి వివేకానంద 'జీవారాధానే శివారాధాన' అన్నారు. ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి. కనుక శివరాత్రి రోజున పేదలకు ఆహారం ఇవ్వడం వంటివి చేయడం వలన శివుడి అనుగ్రహం త్వరితంగా లభిస్తుంది. శివుడి మీద పాక్యెట్ పాలు పోయనవసరంలేదు, నీళ్ళు పోసినా శివుడు సంతోషిస్తాడు. కాసిన్ని పాలు శివుడికి సమర్పించి, మిగితావి జీవుల యందున్న శివునికి సమర్పించండి.

శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా, మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, నిలబడాలి. వెన్ను నిటారుగా ఉండడమంటే చాలామంది వెన్నుపూస మీద భారం వేసి కూర్చుంటారు, అలా చేస్తే నడుమునొప్పి వస్తుంది. మీ శరీర బరువు చాతి భాగంలో పడేలా కూర్చోవాలంటారు స్వామి వివేకానంద. ఇది మాత్రమే నిటారుగా కూర్చోవడం అనే విషయంగా పరిగణైంచబడుతుంది, శ్రద్ధను పెంచుతుంది. ఒక్కరోజులో నిటారుగా కూర్చోవడం కష్టమవ్వచు. అసలు ఇలాంటి  అలవటు నిత్య జీవితంలో చాలా మంది లేకపోవచ్చు. మరి ఏం చేయాలి? శివరాత్రికి కనీసం ఒక రెండు రోజుల ముందు నుంచి నేల మీద నిద్రించడం చేత వెన్ను రోజంతా సహకరిస్తుంది. నేల మీద అనగానే అచ్చంగా నేల మీద నిద్రించమని కాదు, చాప, లేక దుప్పటి, బొంత ...... పరుపు కాకుండా, ఏదో ఒకటి వేసుకుని శయనించడం వలన రోజంతా నిటారుగా కూర్చోవడానికి వెన్ను సహకరిస్తుంది.

3. మౌనవ్రతం

శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసికప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. చాలామంది మౌనవ్రతమని చెప్పి, మాట్లాడకుండా రకరకాల సైగలు చేస్తారు, కొందరు మౌనంగా కూర్చుని టి.వి. చూస్తారు, ఇంకొందరు టైపు చేయడమే కదా, మాటలతో పనేంటీ అని చాటింగ్ చేస్తారు.ఇవేమీ మౌన వ్రతం అనిపించుకోవని అర్దం చేసుకోండి. మీరు మాట్లడటం ఆపేసినంత మాత్రం చేత, మనసుతో మట్లాడటం లేదా? సైగలతో మాట్లాడటం లేదా? వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయములు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివుని పై కేంద్రీకరించాలి. అవసరమైతే శివాలయానికి వెళ్ళండి, అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. మీరు అభిషేకం చేయించుకోకపోయిన ఫర్వాలేదు, శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులచే చదవబడుతున్న రుద్ర - నమకచమకాలను వినండి. ఆ తర్వాత వచ్చే ఫలితాలను చూడండి.

ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పని చేస్తున్నవారికి ఆ రోజు సెలవు ఉండకపోవచ్చు. విదేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అవసరమైంతవరకే మాట్లాడండి, అనవసరమైన మాటలు కట్టిపెట్టండి. ఎవరితోను గొడవ పడకండి, తిట్టకండి. సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి. ఇంటి వచ్చాక, కాళ్ళుచేతులు ముఖం శుభ్రపరుచుకుని, శివుడి ముందో, ఆలయంలోనో కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా కూర్చోండి.  

4.అభిషేకం

శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది.

5.జాగరణ

శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది, తమస్సును తొలగిస్తుంది. సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా, ఆ సమయంలో మట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది. 

6.మంత్ర జపం

శివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ చేయాలి. దేవాలయానికి వెళ్తే, అక్కడ రుద్రం చదువుతుంటారు. ఆ రుద్ర నమక-చమకాలు వింటూనో, ఇతర ప్రవచనాలు వింటూనో చేసే జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది.

శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్నిసందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముంగించాలి. అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసినవారు, తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణఫలం దక్కుంతుదని చెప్తారు.

Saturday, 14 February 2015

శివరాత్రి కధ - 1

శివరాత్రి యొక్క ప్రాశస్త్యం గురించి లింగ, శివ పురాణాల్లో చకట్టి కధ ఒకటి ఉంది. (సంక్షిప్తంగా)

ఒకానొక సృష్టి ఆరంభ సమయంలో విశ్వమంతా శూన్యంతో నిండి ఉంది. నిజానికి అసలు విశ్వమే లేదు. అంతటా పరబ్రహ్మం నిండి ఉంది. ఆ బ్రహ్మ పదార్ధానికి చలి, వేడిములు తెలియవు. ఆది, అంతములు లేవు. శూన్యమంతా నీటితో నిండి ఉన్న ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ఆ నీటిపై యోగనిద్రలో ఉండగా, అతని బొడ్డు నుంచి ఒక పద్మం ఉద్భవించింది. అనేక రేకులు కలిగిన ఆ కలువ పుష్పానికున్న కాడ వేల సూర్యుల కాంతితో వెలిగిపోతోంది. ఆ పద్మం యొక్క కణాల నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. అతనికి చుట్టూ పద్మం తప్ప ఏమి కనిపించడంలేదు. దాంతో 'నేనెవరు? నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేనేమి చేయాలి? నేను ఎవరి పుత్రుడిని? నన్నెవరు సృష్టించారు?" అంటూ ప్రశ్నలు వేసుకుంటూ, ఆ కలువపూవ్వు మొత్తం తన ఉనికిని గురించి తెలుసుకునేందుకు వెతకసాగాడు.

తన ఉనికి తెలుస్తుందేమోనని ఆ పద్మం యొక్క మధ్యభాగాన్ని చేరుకోవడం కోసం ప్రయత్నించాడు. ఆఖరున ఆ పద్మం యొక్క కాడ ద్వారా క్రిందకు దిగి, ఆ పద్మం చుట్టు తిరుగుతూ ఒక 100 ఏళ్ళు గడిపాడు. కానీ దానికి యొక్క మధ్యభాగం కనబడలేదు. తన ఏ కణం నుంచైతే పుట్టాడొ, ఆ కణం దగ్గరకే వెళితే తన ఉనికి తెలుసుకోవచ్చునని, ఆ ప్రదేశాన్ని వెతకడంలో మరో వంద ఏళ్ళు తిరిగినా, సమాధానం దొరకక అలసిపోయాడు, విశ్రాంతి తిసుకుంటున్నాడు.

ఇంతలో ఓ బ్రహ్మ! తపస్సు ఆచరించు అన్న మాటలు వినపడగా ఒక 12 ఏళ్ళు తపస్సు చేయగా, శ్రీ మహా విష్ణువు నాలుగు భుజములతో, శంఖు, చక్ర, గదా, పద్మాలను ధరించి దర్శనమిచ్చాడు. బ్రహ్మను మాయ కప్పేసింది. బ్రహ్మ విష్ణువును నువ్వెవరు? అని అడుగుతాడు. శ్రీ మన్నారాయణుడు 'ఓ పుత్రా! నిన్ను శ్రీ మహావిష్ణువు సృష్టించాడు' అంటూ పరోక్షంగా తన ఎవరో చెప్తాడు.

విష్ణువుతో 'నన్ను నీ పుత్రుడంటున్నావు? ఈ సమస్త జగత్తుకు నేనే విధాతనూ అంటూ వాదించాడు బ్రహ్మ.

నన్ను నీ పుత్రుడు అనడానికి నీకేం అధికారం ఉంది? అంటూ ప్రశ్నించగా, నన్ను గుర్తించలేదా, నేను నీ తండ్రిని, శ్రీ మహా విష్ణువును అంటూ శ్రీ మన్నారాయణుడు జవాబిస్తాడు. అది అంగీకరించని బ్రహ్మ విష్ణువుతో యుద్ధానికి సిద్ధమవుతాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కాస్త, అస్త్ర శస్త్రాలు ప్రయోగించుకునే వరకు చేరింది.

To be continued............

Friday, 13 February 2015

మహాశివరాత్రి - ఉపవాసం

ఓం నమః శివాయ

17, ఫిబ్రవరి, 2015, మంగళవారం, మాఘ బహుళ చతుర్దశి, మహాశివరాత్రి సంధర్భంగా శివరాత్రి ఉపవాసం గురించి ఒక కధ చెప్పుకుందాం.

శివుడు కరుణ చూపాలి, అనుగ్రహించాలి అనుకుంటే ఎన్నో విచిత్రాలు చేస్తాడు. పూర్వం ఏమి తెలియని ఒక బోయవాడు ఉండేవాడు. పక్షులు, జంతువులు వేటాడి బ్రతికేవాడు. ఒకసారి వేట కోసం జంతువులను వెతుకుతూ అడవికి వెళ్ళాడు కానీ ఒక్క జంతువు కనపడలేదు. జంతువులను చంపకపోతే అతనికి, అతని భార్యకు ఆహారం ఉండదు. అందువల్ల ఆ రోజు వేటాడిన తరువాతే ఇంటికి వెళ్దాం అనుకున్నాడు. చాలాసేపు వెతికిన తరువాత ఓపిక నశించి అక్కడే ఉన్న ఒక చెట్టు ఎక్కుదామని క్రింద ఉన్న రాయి మీద కాలు వేసి, ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అది ఒక శివలింగం, కానీ ఆ బోయవానికి అది శివలింగం అనే సంగతి తెలియదు. అతడు ఎక్కింది మారేడు చెట్టు. చాలాసేపు ఎదురు చుశాడు. అతనికి దాహం వేయడంతో తనతో పాటు తెచ్చుకున్న నీటిని త్రాగుదామనుకున్నాడు, కాని భార్య గుర్తుకురావడంతో నోటిలో పోసుకున్న నీటిని ఉమ్మేశాడు. అవి క్రింద ఉన్న రాయి (శివలింగం) మీద పడ్డాయి. అది ఆ శివలింగానికి జరిగిన అభిషేకంగా శివుడు భావించాడు. శబ్దం చేస్తే జంతువులు రావని నిశ్శబ్దంగా దాహంతోనూ, ఆకలితోను, మౌనంగా రాత్రంతా అలాగే కూర్చున్నాడు.


రాత్రవుతోంది కాని తన భర్త ఇంటికి రాకపోవడంతో ఆందోళనగా అతని భార్య అతని కోసం వెతకడానికి బయలుదేరింది. ఆమె కూడా ఏమి తినలేదు. తన భర్త కోసం గాలిస్తూ ఆమె దగ్గరలో ఉన్న ఒక శివాలయం వద్దకు చేరుకుంది. ఆ రోజు శివరాత్రి. భక్తులు తన్మయత్వంతో భజనలు, అభిషేకాలు చేస్తున్నారు. ఆమె ఆ భజనలు విని, వాటికి ఆకర్షితురాలయై, భజన తరువాత ఏమైనా పడతారేమో అని, ఆ భజనలు వింటూ అక్కడే కూర్చుంది. కానీ భజనలో మమేకమై ఆకలిని మరిచిపోయింది.

`ఈ బోయవాడికి బాగా ఆకలి వేయడం వలన అతనికి నిద్రరాలేదు. అతనికి కూర్చొవడం ఇబ్బందిగా ఉండడంతో, అప్పుడప్పుడు కదిలాడు. అతను కదిలిన ప్రతిసారి మారేడు చెట్టుకున్న మారేడు దళాలు రాలి, క్రింద ఉన్న శివలింగం మీద పడ్డాయి. అలా ప్రతి జాములోను (అంటే ప్రతి మూడు గంటలకు) పడుతూనే ఉన్నాయి. అది శివుడు అతని వలన జరిగిన అర్చనగా భావించాడు. ఈ విధంగా అడవిలో బోయవాడు, గుడిలో అతని భార్య రాత్రంతా జాగరణ చేశారు.


ఉదయం సూర్యోదయం జరగగానే అతను తన భార్యను వెతుకుతూ గుడికి చేరుకుని, ఒకరినిఒకరు చూసుకుని సంతోషపడసాగారు. ఇంతలో ఆ గుడి పూజారి వచ్చి వీళ్ళకు ప్రసాదం పెట్టాడు. ఏమి దొరకక ఆకలితో ఉన్న వాళ్ళీద్దరు, ఆ ప్రసాదాన్ని స్వీకరించారు. అక్కడితో వాళ్ళ ఉపవాసవ్రతం పూర్తయ్యింది అని శివుడు భావించాడు. ఈ వ్రతం చేయడంతో వారిలో మార్పు వచ్చింది. వేటాడడం మానేసి మంచివృత్తిని ఎంచుకుని ధర్మంగా జీవించారు.

ఇద్దరు మరణించగానే వారి ఆత్మలను తీసుకువెళ్ళడానికి యమభటులు వచ్చారు. అప్పుడే శివభటులు కూడా వచ్చి వారిని కైలాసానికి తీసుకువెళతామనగా, వీళ్ళు ఎన్నో పాపాలు చేశారు, అనేక జంతువులను చంపారు. వీరు నరకానికే వెళ్ళాలన్నారు యమభటులు. అప్పుడు శివభటులు "వీరు ఆ మహాశివరాత్రి నాడు చేసిన ప్రతి పనిని కూడా పరమశివుడు తన పూజగా భావించి, వీరికి అనంతమైన పుణ్యాన్నిప్రసాదించాడు. వీరు చెసిన వ్రతానికి వీరి పాపం మొత్తం భస్మమైపోయింది. అందువల్ల వీరికి కైలాసంలో ఉండే అవకాశం ఏర్పడింది" అని పలికి వారిని కైలాసానికి తీసుకుపోయారు. అందుకే జన్మకో శివరాత్రి అన్నారు.

మహాశివరాత్రి నాడు ఉపవాసం, శివనామంతో జాగరణ చేయడం, శివలింగాన్ని పూజించడం వలన అనంతమైన పుణ్యం, శివును ఆశీర్వాదం కలుగుతాయి. శివుడు ఆసుతోషుడు అంటే చిన్న చిన్న పూజలకే పొంగిపోయి వరాలిచ్చేవాడు. అటువంటి శివయ్య ఆశీర్వాదంతో జీవితాన్ని సంతోషదాయకం చేసుకోండి.


ఓం నమః శివాయ

Saturday, 15 November 2014

శివుడు గొప్పా? లేక విష్ణువు గొప్పా?

సాధారణంగా శివుడు గొప్పా? లేక విష్ణువు గొప్పా? అనే సందేహం లోకంలో కలుగుతూ ఉంటుంది. అందుకు సంబంధించిన ఒక అధ్బుతమైన కధ ఉంది.

ఒకప్పుడు దేవతలకు రామేశ్వరం అనే పదం ఏ సమాసానికి చెందినది అనే సందేహం కలిగింది. 'రామస్య ఈశ్వరః' అని అంటే రామునికి ఈశ్వరుడు(ప్రభువు) అని అర్ధం వస్తుంది. అది శివాధిక్యం (శివుడే గొప్పవాడని) చెబుతుంది. శివ ధనస్సు విరిచిన రాముడు శివుని కంటే ఏ విధంగా తక్కువ? విష్ణుమూర్తిని అడిగి సందేహ నివృత్తి చేసుకుందాం అని వైకుంఠం వెళ్ళారు దేవతలు. విషయం చెప్పారు, మీరు, ఇంకా శివుడిలో ఎవరు గొప్పా అని అడిగారు. దానికి సమధానంగా విష్ణువు ఇంత చిన్న విషయానికి ఎంతదూరం వచ్చారు? ఈ పదాన్ని చూస్తేనే తెలుస్తోంది, రామస్య ఈశ్వరః, ఈశ్వరుడే రామునికి అధికారి, నాకంటే శివుడే గొప్పవడు అని అన్నాడు విష్ణువు.  

ఈ విష్ణువు వినయంతోనో, అహంభావం ఉండకూడదనే ఉద్దేశ్యంతోనో, మొహమాటంతోనో ఇలా చెప్పి ఉంటాడు అని దేవతలు భావించి, తమ సందేహ నివృత్తి కోసం కైలాసానికి బయలుదేరారు. దానికి సమాధానంగా శివుడు ఇందులో సందేహాఇంచడానికి ఏముంది? రాముడె ఈశ్వరుడుగా గలవాడు (రాముడు (విష్ణువు) తనకు అధికారి అని, విష్ణువు తనకంటే గొప్ప అని) అన్నాడు.

వీళ్ళిద్దరితో పెట్టుకుంటే కుదరదు అని, దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారుట. వీరి బాధ విన్న బ్రహ్మగారు "రామేశ్వరుడంటే రాముడొకడూ, ఈశ్వరుడొకడు అని అర్దం కాదయ్య, రాముడే ఈశ్వరుడు, ఈశ్వరుడే రాముడు" అన్నారు.    

విష్ణుస్తత్పురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వరః |
ఉభయోరప్యతృప్తానా మాత్మభూః కర్మధారయమ్ ||

అసలు విళ్ళిద్దరికి బేధం లేదు అని బ్రహ్మగారు సెలవిచ్చారు. అందుకే శ్రుతి అంటుంది

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే |
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః ||

శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, శివుడి హృదయం ఏమిటని పరిశీలన చేస్తే విష్ణువు ఉంటాడు, విష్ణు హృదయాన్ని పరిశీలిస్తే శివుడు ఉంటాడు. అందుకే శాస్త్రం శివుడిని దూషిస్తే అది విష్ణువుకు కోపం కలిగిస్తుందని, విష్ణువును దూషిస్తే, వారు శివుని ఆగ్రహానికి లోనవుతారని చెప్తుంది.

శివుడు, విష్ణువు రెండుగా కనిపిస్తున్న ఒకే శక్తి. ఇద్దరూ ఒక్కటే. శివుడు నిత్యం కళ్ళు మూసుకుని విష్ణువును ధ్యానిస్తే, విష్ణువు నిత్యం శివనామస్మరణ చేస్తాడు. వారిద్దరిని కలలో కూడా వేరుగా భావించరాదు.

సేకరణ : బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనం

Thursday, 13 November 2014

శివాలయ దర్శనం - ప్రదక్షిణ విధానం : వివిధ ఆశ్రమాలవారు అనుసరించవలసిన పద్ధతులు

శివాలయ దర్శనం - ప్రదక్షిణ విధానం : వివిధ ఆశ్రమాలవారు అనుసరించవలసిన పద్ధతులు

బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు ప్రవచనం


Wednesday, 12 November 2014

స్థావర, జంగమ లింగాలు

శివుడిని మూర్తి రూపంలో కంటే లింగరూపంలో ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు విశేషంగా ఉంటాయి. పరమేశ్వరుడి విగ్రహాన్ని పూజించేవారికంటే, శివలింగారాధన చేసేవరిలో తేజస్సు, శక్తి అధికంగా ఉంటాయని కృష్ణపరమాత్మ మహాభారతంలో చెప్తారు. మనకు లోకంలో చాలా రకాల లింగాలు కనిపిస్తాయి. అందులో ఈ రోజు ఒక 2 లింగాల గురించి చెప్పుకుందాం. 

లింగం అంటే గుర్తు, ప్రతిరూపం (Symbol) అని అర్దం. అన్నిటియందు ఆ పరమశివుడు అంతర్యామిగా ఉన్నాడు. ఈ సృష్టి అంతా లింగమే. అందుకే రుద్రం ఈ జగత్తు అంతా వ్యాపించి ఉన్న శివతత్వాన్ని ప్రకటించింది.

కొండలు, పర్వతాలు, నదులు, శిలలు, మొక్కలు, చెట్లు ..... ఇలా కదలనివాటిని స్థావరములు అంటారు. ఈ స్థావరములన్నీ శివస్వరూపం అంటున్నది శివ పురాణం. అందుకే ఇవన్నీ స్థావర లింగాలు అంటున్నది శివ పురాణం. మనం మొక్కలకు నీరు పోస్తే (ఏ చెట్టైనా కావచ్చు), అది కూడా శివార్చనగా భావించి అనుగ్రహం ప్రసాదిస్తాడు పరమశివుడు. అట్లాగే ప్రకృతి వనరులను విచ్చలవీడిగా దోచుకోవడం స్థావర లింగ రూపంలో ఉన్న శివుడికి చేసే అపచారం అయితే ప్రకృతి వనరులను సంరక్షించుకోవడం, అవస
రమైనంత మేర, వృధా చేయకుండా వాడుకోవడం శివుడికి ఇచ్చే గౌరవం. ఇంకా చెప్పాలంటే నీరు వృధా చేయడం కూడా శివుడికి అపచారమే. ఇది దీని కిందే వస్తుంది.        

రెండవది జంగమ లింగం. జంగమాలంటే కదిలేవి అని అర్దం. జంతువులు, మనుష్యులు, పక్షులు, క్రిమికీటకాలు లాంటివి. ఇవి కూడా శివుడి స్వరూపాలే. వీటిని జంగమ లింగాలు / లింగం అంటారు. ఆపదలో ఉన్నవారికి పవిత్ర భావనతో, ఏ ఉపకారం ఆశించకుండా చేసే సాయం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, దైవభావంతో పెద్దలకు, దీనులకు సేవ చేయడం జంగం లింగానికి చేసే అర్చన. ఇక ఇది చలికాలం, అనేకమంది చలికి వణుకుతూ రోడలపై పడుకుంటారు. అటువంటి వారికి దుప్పట్లు పంచడం, ముష్టివారికి కాసింత అన్నం పెట్టడం, చదువు యందు ఆసక్తి ఉన్న పేద విద్యార్ధులకు పుస్తకాలు పంచిపెట్టడం, పీజు కట్టడం కూడా ఈ జంగమ లింగానికి అర్చన క్రిందే వస్తుంది.  

మనకు శివ పూజ చేయాలన్న తపన ఉండాలి కానీ, అందుకు అనేక మార్గాలు చూపించాడు మహాశివుడు.

ఓం నమః శివాయ

Tuesday, 28 October 2014

శివారాధన

ఓం నమః శివాయ

కార్తీకమాసంలో శివారాధనకు చాలా ప్రత్యేకత ఉంది. శివం అంటే శుభం, శోభనం, మంగళం అనే అర్దాలున్నాయి. దేవాదిదెవుడు, మహాదేవుడు, లయకారుడైన శివుడు భోళాశంకరుడు (అంటే అడిగిన వెంటనే వరాలు కురిపిస్తాడు, కొద్దిగా పూజ చేసిన, బోలెడు ఫలితాన్ని ఇస్తాడు, చిన్న సేవకే మురుసిపోతాడు). యోగ సంప్రదాయంలో శివుడు యోగులు యోగి, సృష్టిలో ఆదియోగి. శివుడి ద్వారానే లోకానికి యోగా, ధ్యానం మొదలైన విద్యలు పరిచయమయ్యాయి. కనుక యోగ సాధన చేసేవారు, పురోగతి కోసం తప్పకుండా శివారాధన చేయాలి.

శివారాధన చాలా సులువు. పెద్దగా పూజా సంభారాలు అవసరంలేదు, ఆడంబరాలు అసలే అవసరంలేదు. కాసిన్ని నీరు అభిషేకిస్తే చాలు, పొంగిపోతాడు. మంత్రాలు రావన్న బాధ అవసరంలేదు, ఓం నమః శివాయ అన్న మంత్రం చాలు. శివుడు యోగి అయినా, ఐశ్వర్యానికి అధిపతి. పూజించినవారికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. దక్షిణామూర్తి రూపంలో విద్యను, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. శివుడు విద్యను ప్రసాదిస్తాడు కనుకే అక్షరాభ్యాసంలో ముందుగా "ఓం నమః శివాయ సిద్ధం నమః" అని రాయిస్తారు.

అటువంటి శివుడికి కార్తీకం అత్యంత ప్రీతికరం. ఈ కార్తీకంలో ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి. పెద్దగా ఆర్భాటం అవసరంలేదు. చిన్న శివలింగానికి, ఒక గ్లాసుడు మంచినీరు పోస్తూ, ఓం అని కానీ, లేక ఓం నమః శివాయ అని కానీ, మనసులో స్మరించుకుంటే చాలు, పెద్ద అభిషేకం చేసినట్టు పొంగిపోతాడు. అభిషేకం చేసే అవకాశం లేకపోతే, కనీసం మానసికంగా పూజించినా చాలు. మీ మనసులోనే ఒక శివలింగాన్ని ఊహించుకుని, మీరు మీకు నచ్చిన ద్రవ్యాలతో అభిషేకం చేస్తునట్టు భావించి, మనసులో పూజించినా, ఫలితం వేసేస్తాడు పరమశివుడు.

శివపూజకు స్త్రీపురుష భేధం లేదు, వర్ణాశ్రమ బేధం అంతకంటే లేదు, ఎవరైనా, పరమశివుడిని అర్చించవచ్చు. ఉదయమే అరించాలన్న నియమం లేదు. శివుడికి ప్రదోష పూజ చాలా విశిష్టవంతమైంది. ప్రదోషం అంటే సాయంకాల సమయం. ఉదయమంతా ఆఫీసులో గడిపినా, సాయంకాలం ఇంటికి వచ్చాకా, ఆరాధన చేయవచ్చు. ఈ కార్తీకం నుండి శివారాధన ప్రారంభించండి.  

Sunday, 10 March 2013

శివారాధన

‎|| ॐ || ఓం నమః శివాయ || ॐ || 
"తన్మే మనః శివసంకల్పమస్తు" 

ॐ ఈరోజు చాలామంది హాస్టల్స్ లో ఉంటున్నారు. కొందరు ఇంటికి దూరంగా ఉంటున్నారు. మరి వారు శివారాధన ఏలా చేయాలి? దానికి సమాధానం పరమశివుడు శివపురాణంలో చెప్తారు. 

ॐ నిత్యం పూజించేది స్థూలలింగం. అది అందుబాటులో లేకపోతే స్థావర లింగాన్ని గానీ, జంగమ లింగాన్ని కానీ అర్చిచమన్నారు. స్థావరాలు అంటే చెట్లు, లతలు, తీగలు. మన నిత్యం ఏ చెట్టునైనా శివుడిని భావుస్తూ దానికి నీరు పోస్తే అది తన అర్చనగా స్వీకరిస్తానన్నాడు భోళా శంకరుడు.

ॐ జంగామాలంటే పక్షులు, జంతువులు, క్రిమికీటకాలు. ఇవన్ని శివస్వరూపాలు. వీటికి ఆహారం వేస్తే అది తనను ఆరాధించినట్టుగా భావిస్తానన్నాడు శివుడు.

ॐ నిత్యం మొక్కలు, చెట్లకు నీరు పోద్దాం. పశుపక్ష్యాదులకు ఆహారం పెడదాం. శివప్రేమకు పాత్రులవుదాం.

"తన్మే మనః శివసంకల్పమస్తు"

ॐ ఇవే కాకుండా భావలింగం కూడా ఉంది. ఎంతో పుణ్యం చేస్తే కానీ ఈ మానవజన్మ రాదు. వచ్చినా ఈ సనాతనధర్మంలో పుట్టాలంటే రావాలంటే మరింత అదృష్టవంతులై ఉండాలి. అలా జన్మించినవారూ ఆ ఈశ్వరుడు ఎక్కడొ లేడు, తమలోనే ఉన్నాడు, తమ ఆత్మ కూడా శివస్వరూపమే అనే సత్యాన్ని జ్ఞానం ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు వారిలో భావలింగంగా స్వామీ ప్రకటితమవుతాడు. కానీ ఇది అంత సులభంగా జరిగే ప్రక్రియ కాదు కనుక స్తూలలింగాన్ని నిత్యం ఆరాధించడం వలన ఎప్పటికైనా మనకు ఆ భావలింగాన్ని అర్చించే అవకాశం కలుగుతుంది.

"తన్మే మనః శివసంకల్పమస్తు"

ॐ తత్వతః చూసినప్పుడు భూమి శివస్వరూపం. భూమి మీదున్న ప్రకృతి పార్వతీ స్వరూపం. భూమిని, ప్రకృతిని కలుషితం చేస్తూ, పరమేశ్వరుడిని ఎంత ఆరాధించినా అది వ్యర్ధమే అవుతుంది.

ॐ పర్యావరణ పరిరక్షణ పరమశివారాధన. పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని రక్షిస్తూ పశుపతిని(శివుడిని) ఆరాధించండి. శివానుగ్రహం పొందండి.

|| ॐ || ఓం నమః శివాయ || ॐ ||
"తన్మే మనః శివసంకల్పమస్తు"