Friday, 17 April 2015

స్వామి సచ్చిదానంద సూక్తి

దేనికి భయపడకండి

భగవంతునిపై పూర్తి విశ్వాసం కలిగి ఉండండి. భయం దరిదాపుల్లోకి కూడా వెళ్ళకండి. గుర్తుంచుకోండి. 'ఏదైనా జరగవలసినదుంటే అది జరిగే తీరుతుంది. మంచిది, ఏదైనా జరగనీ, నేను ధైర్యంగా ఉంటాను. జరగబోయే దాన్ని నేనెలాగూ ఆపలేను మరి నేను భయపడి ఉపయోగమేమిటి?' అని భావన చేయండి.

నీకు నిజంగా విశ్వాసం ఉంటే నువ్వు దేనికి భయపడవలసిన పనిలేదు. అలా అని అజాగ్రత్తగా ఉండమని చెప్పడంలేదు. జాగ్రత్తగా ఉండండి, కానీ దేనికి భయపడకండి.

- స్వామి సచ్చిదానంద


Sunday, 12 April 2015

హిందూ ధర్మం - 154 (ఋగ్ వేదం)

వేదామంతా ఒక్కటే అయినా మంత్రపద్దతిని అనుసరించి వేదాలను నాలుగుగా చెప్తారు. అందులో మొదటిది ఋగ్ వేదం. 'ఋచ్యతే స్తూయతే యయాసాఋక్' - దేవతలను ఉద్దేశించి చేసే స్తుతులను ఋక్కులు అంటారు. దేవతలు అనగానే అనేకమంది అనుకోకూడదు. ఈశ్వరుడికి అనేక గుణములు, శక్తులు ఉంటాయి. ఆయా గుణాలను అనుసరించి చెప్పినప్పుడు, ఒకే ఈశ్వరుడిని వేర్వేరు దేవతలుగా అభివర్ణిస్తారు. ఈ వేదం ప్రధానంగా పరమాత్మ, ఆత్మ, ప్రకృతి యొక్క గుణాలు, లక్షణాలు వివరిస్తుంది. అదికాక దృశ్యాదృశ్య (కంటికి కనిపించే, గోచరమైన జగత్తు గురించి, కంటికి కనిపించని అగోచరమైన జగత్తు విశేషాల గురించి) జగత్తు వివిధ లక్షణాల గురించి వివరిస్తుంది. రసాయన (chemistry), భౌతిక (physics), గణిత (Mathematics), ఖగోళ (Astronomy), విశ్వోద్భవ (Cosmology) శాస్త్రాల యొక్క ప్రాధమిక అంశాలను వివరిస్తుంది. మానవుడి పూర్తి జీవితంలో అనుసరించవలసిన ధర్మాల గురించి, అనుగమించవలసిన ఆదర్శాల గురించి చెప్తుంది. సాయానచార్యుడి మాటల్లో చెప్పాలంటే సమస్త భౌతిక (Physics), అధిభౌతిక (Meta Physics), ఆధ్యాత్మిక విషయాల యొక్క లక్షణాలు, ప్రకృతి, పనితీరు వివరిస్తుంది. వేదాలన్నిటిలో ఋగ్వేదమే పెద్దది. అందులో 10 మండలాలు, 1025 సూక్తాలు, 10581 ఋక్కులు ఉన్నాయి.

ఒకప్పుడు వేదంలో ఉండే ప్రతి శాఖకు బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు ఉండేవి. కానీ భారతదేశం మీద జరిగిన దండయాత్రల్లో అనేకమంది వేదపండితులు చంపబడ్డారు, గ్రంధాలయాలు, వైదిక గ్రంధాలు కాల్చబడ్డాయి. ఆ కారణం చేత ఇప్పుడు మనకు పూర్తి వేదభాగము లభ్యమవ్వడం లేదు. ఋగ్వేదంలో అన్ని మండలాలకు ఇప్పుడు బ్రాహ్మణాలు లభించడం లేదు. ఋగ్వేదానికి సంబంధించి ప్రస్తుతం ఐతరేయ, శాంఖ్యాయన, కౌస్తికీ బ్రాహ్మణాలు మాత్రమే లభిస్తున్నాయి.

1008 ఉపనిషత్తులను ఋషులు మనకు అందించగా, ఇప్పుడు కేవలం 108 మాత్రమే లభ్యమవుతున్నాయి. వాటిలో కేవలం 11 మాత్రమే అందరికి అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఋగ్వేదానికి సంబంధించి ఐతరేయ ఉపనిషద్ ఒక్కటే లభిస్తోంది. వైదిక ధర్మంలో యజ్ఞానికి ప్రత్యేక స్థానం ఉంది.  యజ్ఞయాగాదుల్లో నాలుగువేదాలు తెలిసిన నలుగురు పండితులు పాల్గొంటారు. అందులో ఎవరికి వారికే ప్రత్యేక స్థానం, మర్యాద, గౌరవం ఉన్నాయి. ఋగ్వేదం అధ్యయనం చేసి, యజ్ఞంలో పాల్గొనే ఋగ్వేద పండితుడిని 'ఋత్విక్కు' అంటారు.

To be continued ...................

Saturday, 11 April 2015

ముస్లింలు జాతీయ జీవన స్రవంతిలో ఎందుకు కలవరు?

జస్టిస్ ముర్తాజా ఫాజిల్ ఆలీ భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 1975-85 కాలంలో వ్యవహరించేరు. 1980లలో లక్నోలో మైనారిటీ విద్యా సంస్థల గురించి జరిగిన సదస్సుకు ఆయన అధ్యక్షత వహించేరు. ముస్లింలు జాతీయ జీవన స్రవంతిలో కలవడంపై ఆయన తన అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చేరు.

"ముస్లింలు జాతీయ జీవన స్రవంతిలో ఎందుకు భాగస్వాములు కాలేదు? దానికి ఎవరు బాధ్యులు?
"నాకు బాగా గుర్తుంది. నా చిన్నతనంలో నేనొక గ్రామంలో ఉండేవాడిని. మా గ్రామంలో హిందూ-ముస్లిం సమస్య ఉండేది కాదు. మా మొహర్రం ఉత్సవంలో హిందువులు పాల్గోనేవాళ్ళు. హోలీ, దీపావళి పండగలలో మేమూ పాల్గోనేవాళ్ళం. కాలేజీ చదువు కోసం నేను పట్నం వచ్చేను. పేదవాణ్ణి కాబట్టి ఒక మురికివాడలో ఉండేవాణ్ణి. అక్కడ కూడా నాకు హిందూ-ముస్లిం సమస్య కనబడలేదు.

"స్వరాజ్యం వచ్చిన తరువాతే హిందూ-ముస్లింల సమస్య ఇంతగా పెరిగిపోయింది. దీనికి కారణం ఏమిటి? ముస్లింల వద్దకి వివిధ రకాల హిందూ రాజకీయ నేతలు వచ్చి ఏం చెబుతున్నారు? ముస్లింల అస్తిత్వం నేడు ప్రమాదంలో పడిందనీ, మెజారిటీ సమాజం వారిని కబలించి వేస్తుందనీ, తమ పార్టీలు మాత్రేమే వారిని కాపాడగలదనీ, కనుక తమకే వోటు వేయందనీ చెబుతున్నారు.

"ఇంకో పార్టీ వాళ్ళు వచ్చి ముస్లింల 30 శాతం ప్రత్యేక అధికారం కల్పిస్తామంటే, వేరొకరు 50 శాతం ప్రత్యేక అధికారాలు కల్పిస్తామంటారు. అధికార దాహంతో అన్ని పార్టీల హిందూ నేతలూ ముస్లిం వోట్ల కోసం, ముస్లింలకు తమ పార్టీనే ఎక్కువ సదుపాయాలూ కలగజేస్తుందని పోటీపడి మా ముందు జుట్లు పట్టుకుంటూ ఉంటే, మేము (ముస్లింలు) అమాయకంగా మాకు ప్రత్యక అధికారాలు వద్దు మేము జాతీయ జీవన స్రవంతిలో కలిసిపోతాం అని చెప్పమంటారా? ఎందుకు కలిసిపోవాలి? ముస్లిమ్లకేమన్నా పిచ్చా?

"ముస్లింలు జాతీయ జీవన స్రవంతిలో కలవాలంటే ముందు అధికార దాహం కల రాజకీయ నాయకులను సరిచేయండి. వారిని జాతీయ స్రవంతిలోకి తీసుకురండి. ఈ రాజకీయ నేతలే నేడు ప్రధాన జీవన స్రవంతిలో లేరు. వారిలో అధికార దాహం మాత్రమే ఉంది. అధికారం కోసం వాళ్ళు దేశాన్ని కూడా ముక్కలు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. రాజకీయ నాయకులు సరైన రీతిలో మారితే ఒక్క సంవత్సరంలోనే ముస్లింలంతా జాతీయ జీవన స్రవంతిలో భాగస్వాములు కాగలరు అని నేను వాగ్దానం చేస్తున్నాను."

ఇవి జస్టిస్ ముర్తాజా గారు చెప్పిన మాటలు. ఇవి నూటికి నోరు పాళ్ళూ నిజం కూడా.

అయితే నాకొక సందేహం. పార్శీలు బయటి నుంచి వచ్చి మన దేశంలో ఆశ్రయం పొందినవారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అప్పటి మన పాలకులు ముస్లింలు, క్రైస్తవుల లాగే పార్శీలకు కూడా మైనారిటీలుగా హోదా ఇచ్చి ప్రత్యేక హక్కులు ఇస్తామంటే దానిని పార్శీలు తిరస్కరించేరు. ఈ దేశంలో ఆశ్రయం పొందిన తాము ప్రత్యేకంగా ఎటువంటి గుర్తింపునూ పొందాలనుకోవటంలేదనీ, ఈ జాతి ప్రధాన జీవన స్రవంతిలో తామూ భాగస్వాములుగా కొనసాగుతామనీ అన్నారు. జంషెడ్ జీ టాటా, రతన్ టాటా వంటి వారు ఎందరో పారశీకులే. వారు పారిశ్రామికంగా దేశాభివృద్ధికి అందించిన సేవలు ఎవరూ మరచిపోలేనివి. మరి ముస్లింలు పార్శీల వలె ఎందుకు మైనారిటీ సౌకర్యాలను తిరస్కరించరు? జాతీయ జీవన స్రవంతిలో ఎందుకు కలవరు? దీనికి బాధ్యులు ఒక్క హిందూ రాజకీయ నాయకులేనా? ముస్లిం నాయకులు, మత పెద్దలు ఇందుకు బాధ్యులు కారా? వారు తమ స్వార్థం కోసం సాధారణ ముస్లిం ప్రజానీకాన్ని జాతీయ ప్రధాన స్రవంతిలో కలవకుండా వేరు చేయటం లేదా? దేశంలోని మతపరమైన కల్లోలాలకు వారు కూడా కారణం కాదా?

Source: రాజసులోచనం 

Sunday, 5 April 2015

హిందూ ధర్మం - 153 (వ్యాసుడు వేదవిభాగం చేయుట)

వ్యాసుడు సాక్షాత్తు శ్రీ మన్నారాయణ స్వరూపుడు. అనంతమైన వేదాన్ని జ్ఞాపకంలో ఉంచుకోవడం కలియుగంలో మానవులకు సంభవం కాదని, అసలు మొత్తం వేదం అధ్యయనం చేయుటకు వారి ఆయుర్దాయం సరిపోదని గ్రహించి, వారి మేధాశక్తి తక్కువగా ఉంటుందని, వేదంలో కొద్ది భాగాన్ని మాత్రమే గ్రంధస్థం చేశారు. వేదం అంతా ముఖ్యమైనదే అయినా, అందులో కూడా అతి ముఖ్యమైనది, కనీసం మానవులకు తెలియవలసిన భాగాన్ని నాలుగు వేదాల నుంచి సేకరిచి, వాటిని తిరిగి సంకలనం చేశారు. ఆ భాగాల్లో మిగిలిన అన్ని భాగాల యొక్క స్పర్శ ఉండేలా చూశారు. వేదం కోటి భాగాలనుకుంటే అందులో కేవలం 1 వంతు మాత్రమే వ్యాసుడు గ్రంధస్థం చేశారు.

అలా వ్యాసుడు తిరిగి వేదవిభాగం చేసి, నాలుగు వేదాలను గ్రంధస్థం చేశారు. అవే ఋగ్ వేదం, యజుర్ వేదం, సామవేదం, అధర్వణ వేదం. వాటికి అశ్వలాయనుడు మొదలైన మహర్షులు రాసిన వ్యాఖ్యానాలను చేర్చారు (వేదాలకు ఋషులు రాసిన వ్యాఖ్యానాలను బ్రాహ్మణాలు అంటారు). అవేగాక ఆరణ్యకాలు, ఉపనిషత్తులను కూడా వాటికి జోడించి వేదానికి సమగ్రమైన రూపాన్నిచ్చారు. అనంతమైన వేదాన్ని విభాగం చేశారు కనుక ఆయనకు వేదవ్యాసుడనే పేరు వచ్చింది. అప్పటివరకు వారి పేరు కృష్ణద్వైపాయనుడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. వ్యాసుడు వేదాన్ని గ్రంధస్థం చేశారు, అనగా వేదాన్ని ఒక పుస్తక రూపంగా అందించారు, కానీ ఆయన వేదాలను రచించలేదు. వేదం అపౌరుషేయం (మానవుల చేత రచించబడినది కాదు), వేదములు ఈశ్వరీయములు (ఈశ్వర ప్రసాదితములు).

వ్యాసుడే లేకుంటే ఇంత జ్ఞానం మానవజాతికి అందేది కాదు. అందువలననే 'వ్యాసోఛిష్టం జగత్సర్వం' అంటారు, వ్యాసుడు ఉఛ్చిష్టమే (వదిలివేసిన భాగం / ఎంగిలి) ఈ జగత్తంతా అని. మానవజాతికి ఇంత మేలు చేసిన వ్యాసుడిని స్మరించుకుని, పూజించి, కృతజ్ఞతలు తెలుపడం కోసం ఆషాఢ పూర్ణిమను వ్యాసపూర్ణిమగా, గురు పూర్ణిమగా జరుపుకుంటారు. నిజానికి గురుపూర్ణిమ రోజున మాములు గురువులను కాదు, వ్యాసుడినే పూజించాలి. తమతమ గురువులలో వ్యాసుడిని చూసుకోవాలి. వ్యాసుడు చేసిన మేలుకి ఇప్పటికి మానవజాతి ఋణపడి ఉంది.

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||

వేదాలను గ్రంధస్థం చేసిన తర్వాత తన 4 శిష్యులకు ఒక్కో వేదాలను నేర్పి, వాటిని అప్పగించి వేదప్రచారం చేయించారు. వైదికపరంపరను నిలిపారు. పైలుడికి ఋగ్ వేదాన్ని, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, జైమినికి సామవేదాన్ని, సుమంతుడికి అధర్వణ వేదాన్ని అప్పగించారు. ఇంత చేసిన వ్యాసుడు ఒక మత్స్యకన్యకు జన్మించారు. వ్యాసుడికి కులం అంటగట్టడం సరికాదు కాని కొందరికి అర్దమయ్యేలా చేప్పాలంటే మానవజాతి చేతులెత్తి మొక్కే వ్యాసుడు ఎస్.సి. వర్గానికి చెందినవాడవుతాడు. హిందూధర్మం బ్రాహ్మణుల కుట్ర, వేదం బ్రాహ్మణులు తమ స్వార్ధానికి రాసి, ఇతరులపై రుద్దారని ప్రచారం చేసే మూర్ఖశిఖామణులు ఈ విషయాన్ని విస్మరించడం గమనార్హం.  

To be continued ......................

Saturday, 4 April 2015

స్వామి వివేకానందా సూక్తులు

కోరికలు తేనె పూసిన కత్తివంటివని తెలుసుకోవడమే వైరాగ్యం.

మనల్ని బలహీనుల్ని చేసే వాటిని గత వేయి సంవత్సరాలుగా కూడగట్టుకున్నాం. ఇప్పుడు మనకు కావలసింది బలం. బలహీనతలకు బానిసలం కాకుండా ఉండడమే స్వాతంత్ర్యం.

మహా వీరుడైన హనుమంతుణ్ణి మీ ఆదర్శంగా చేసుకోవలసిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ఈయన తన ఇంద్రియాలను పరిపూర్ణంగా అదుపులో ఉంచుకోవడమేకాక అద్భుతమైన సూక్ష్మబుద్ధి కలవాడు. గురువుకు ఏ మాత్రం ఎదురు చెప్పని విధేయత, కఠోరమైన బ్రహ్మచర్యం - ఇవే విజయరహస్యాలు.

Everyone on the spiritual path must worship Hanuman first. He is a perfect sannyasi [monk, swami, holy man], a perfect brahmachari [mind constantly on God and a celibate], a perfect bhakta [devote]. He is perfect in every way - Swami Vivekananda

జపం అంటే దివ్యనామోచ్చరణ. భక్తుడు జపం ద్వారా అనంతత్త్వానికి చేరుకుంటాడు.

కర్మాచరణ చిత్తశుద్ధిని కలిగిస్తుంది. విద్య (ఆధ్యాత్మిక జ్ఞానం) ప్రాప్తింపజేస్తుంది.

మనలో లేనిదాన్ని మన వెలుపల చూడలేం.

నరకం ద్వారానైనా సత్యాన్ని చేరడానికి సాహసించు.

పరనిందా అంతా మనలను నిజానికి నిందితులను చేస్తుంది.

శ్రద్దాభావంతో ఏమి చేసినా మేలే చేకూరుతుంది. ఎంత చిన్న పనినైనా, సవ్యంగా చేస్తే మహాద్భుత ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి ఎంత చిన్న కార్యాన్నైనా శ్రద్ధతో నిర్వహించాలి.

మానవుడు ముక్తిని పొందగలిగేది ఈ లోకంలో మాత్రమే.

మహోన్నతమైన ఆదర్శం ఎన్నుకొని, ఆ ప్రకారం నీ జీవితాన్ని మలుచుకో.

'నువ్వు దుష్టుడివి' అనవద్దు. 'నువ్వు మంచివాడివి', కానీ 'మరింత మెరుగవ్వాలి' అని మాత్రం అనండి.

హనుమంతుణ్ణి, జగజ్జననినీ స్మరించండి.మరుక్షణం మీలోని దౌర్బల్యం పిరికితనాలు మటుమాయమవుతాయి.

- స్వామి వివేకానందా

Friday, 3 April 2015

శ్రీ హనుమాన్ జయంతి

ఓం శ్రీ హనుమతే నమః

04 ఏప్రియల్ 2015, శనివారం, చైత్ర పౌర్ణిమ, శ్రీ హనుమాన్ జయంతి (తెలుగునాట కొన్ని ప్రాంతాల్లో చైత్ర శుద్ధ పౌర్ణిమ రోజున, కొన్ని ప్రాంతాల్లో వైశాఖ బహుళ దశమి రోజున జరుపుకుంటారు.)

కలౌ కపి వినాయకౌ : అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు వినాయకుడు, హనుమంతుడు.

కేసరి, అంజనాదేవీల కుమారుడు శ్రీ హనుమంతుడు. ఏకాదశ(11) రుద్రులలో ఒకరు శ్రీ ఆంజనేయస్వామి. పరమశివును అంశతో జన్మించారు. సప్త(7) చిరంజీవులలో ఒకరు. ఆంజనేయస్వామి వారు హిమాలయాల్లో కైలాసమానస సరోవరం సమీపంలో రామ నామ జపం చేస్తూ ఈనాటికి జీవించి ఉన్నారు. టిబెట్‌లో హనుమంతుడు తపస్సు చేసిన గుహను ఇప్పుడు కూడా చూడవచ్చు.

ఎక్కడ రామనామం చెప్తారో, ఎక్కడ శ్రీ రామాయణం చెప్తుంటారో, ఎక్కడ రామజపం జరుగుతుందో అక్కడ ఆనందభాష్పాలు కారుస్తూ, నమస్కరిస్తున్న తీరులో చేతులు జోడించి శ్రీ ఆంజనేయస్వామి కూర్చుని ఉంటారు. చినిగిపోయిన వస్త్రాలు ధరించిన ముసలి వయసు వ్యక్తి రూపంలో వచ్చి, రామకధ చెప్పే సభలో ఒక మూలున కూర్చుంటారు. అందరు రాకముందే వచ్చి, అందరు వెళ్ళిపోయేవరకు ఉంటారు.

భూతప్రేతపిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తేనే భయపడి పారిపోతాయి. మహా రోగాలు నయమవుతాయి. చేసేపని పట్ల శ్రద్ధ పెరుగుతుంది. శని బాధలు తొలగిపోతాయి. బుద్ధి కలుగుతుంది, బలం పెరుగుతుంది, కీర్తి లభిస్తుంది, దైర్యం వస్తుంది.

హనుమతుడికి 5 సంఖ్య చాలా ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయండి. అరటిపళ్ళు, మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. వీలుంటే 5 పళ్ళు సమర్పించండి. 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.

04 ఏప్రియల్, చైత్ర పౌర్ణిమ నుండి 13 మే, వైశాఖ బహుళ దశమి వరకు 40 రోజుల (మండలం) పాటు ప్రతిరోజు 1,3,5,11 లేక 41.....(మీకు వీలైనన్ని సార్లు)హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇలా చేయడం చాలా శుభకరం, అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. కొరిన కోరికలు నెరవేరుతాయి. హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది. సంతానం కలగాలని కోరుకునే దంపతులు ఇద్దరు, ఈ 40(మండలం) రోజుల పాటు కఠిన బ్రహ్చర్యం పాటిస్తూ, నిష్ఠగా హనుమాన్ చాలీసా పారాయణ చేసి, రోజు స్వామికి పండ్లు తప్పనిసరిగా నివేదన చేసి, నైవేద్యంగా స్వీకరించడం వలన చక్కటి సంతానం హనుమ అనుగ్రహంతో కలిగి తీరుతుంది.  

ఓం శ్రీ హనుమతే నమః
Originally Published: Hanuman Jayanti 2013
1st Edit: 13-04-2014
2nd Edit: 03-04-2015

గ్రహణం జాగ్రత్తలు

సూర్యగ్రహణానికి 12 గంటల ముందు నుంచి, చంద్రగ్రహణానికి 9 గంటల ముందు నుంచి ఆహారం తినకూడదు.

చిన్నపిల్లలు, ముసలివారు, రోగులకు సడలింపు. వారు మాత్రం గంట ముందు నుంచి ఆహారం తినడం నిషిద్ధం.

త్వరగా జీర్ణమయ్యే ఆహారం తినాలి.. తేలికైన ఆహారం తీసుకోవడం మంచిది. గ్రహణసమయానికి ఆహారం అరిగిపోవాలి/ జీర్ణమవ్వాలి, కడపు ఖాళీగా ఉండాలి.

1980-83 మధ్య కాలంలో భారతదేశంలో గ్రహణసమయంలో పాటించే ఆచారాల మీద పరిశోధన చేశారు విదేశీయులు. ఆ తర్వాత ఆ ఫలితాలు పత్రికల్లో ప్రచురించబడ్డాయి. వారి పరిశోధనలో తేలిందేమిటంటే హిందువులు గ్రహణ సమయంలో పాటించే ఆచారాలు ఎంతో శాస్త్రీయమైనవి, ఆరోగ్యప్రదమైనవి. గ్రహణ సమయంలో వచ్చే అతినీలలోహిత కిరణాలు మానవులకు చేటు చేస్తాయి. ఆహారపదార్ధాలను విషతుల్యం చేస్తాయి. అటువంటి ఆహారపదార్ధాలను స్వీకరించడం వలన దీర్ఘకాలంలో దుష్ఫలితాలుంటాయి. గ్రహణ కిరణాలు సోకకుండా ఉండేందుకు భారతీయులు వాడే ధర్భ ఎంతో శక్తివంతమైనది. అది భూమికి నిటారుగా నిలబడి పెరుగుతుంది. సూర్యశక్తిని అధికశాతం గ్రహిస్తుంది. గ్రహణ సమయంలో ఈ దర్భలను ఆహారపదార్ధాల మీద, నీటి బిందెలమీద వేయడం వలన గ్రహణ కిరణాల దుష్ప్రభావాన్ని అడ్డుకుంటుంది. ఒక రాగితీగ ఇంటిని పిడుగుపాటు నుంచి రక్షించిన చంధంగా దర్భ అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తుందని వారి పరిశోధనలో తేలింది. వారు కొత్తగా చెప్పిందేమీ లేదు. ధర్మశాస్త్రం చెప్పిందన్నే ధృవపరిచారు.

ఇంట్లో ఉన్న పచ్చళ్ళ మీద, ఇతర ఆహార పదార్ధాల మీద దర్భలు వేయండి. అన్నం, కూర, పప్పు మొదలైన ఆహార పదార్ధాలు ఏవీ మిగల్చకూడదు.  గ్రహణసమయంలో ఆహారం స్వీకరించకూడదు. జైపూర్ లో జంతు ప్రదర్శనశాలలో జంతువులకు గ్రహణ సమయంలో మాంసం పెట్టి పరీక్షలు నిర్వహించారు. గ్రహణసమయంలో కౄరజంతువులు కూడా ఆహారం ముట్టుకోలేదు. (ఈ విషయాన్ని తొలి తెలుగు మహిళా జ్యోతిష్యురాళు, శ్రీమతి సంధ్యాలక్ష్మీగారు గోపురం కార్యక్రమంలో ప్రస్తావించారు.)

‪#‎గ్రహణం‬ తర్వాత తలస్నానం తప్పక చేయండి.

గ్రహణ సమయంలో వచ్చే కిరణాలు గర్భస్థ శిశువుకు మంచివికావు. అందువల్ల గర్భిణీ స్త్రీలు గ్రహణసమయంలో బయటకు రాకపోవడం మంచిది. కదలకుండా పడుకోవాలి, అటు ఇటు తిరగకూడదన్న నియమాలేమీ లేవు. ఏ విధంగా కూడా గ్రహణకిరణాలు సోకకుండా ఉండేలా జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఇంట్లో నిరభ్యంతరంగా తిరగవచ్చు. ఒకవేళ బయటకు వెళ్ళవలసివస్తే తెల్లని వస్త్రం శరీరమంతా కప్పుకుని, గ్రహణకిరణాలు శరీరం మీద పడకుండా ఉండేలా చూసుకోవాలి.

గ్రహణం విడిచిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవాలి. తర్వాత స్నానం చేయాలి. గ్రహణానంతరం నది లేదా కాలువలో స్నానం చేయగలిగితే శ్రేష్టం. గ్రహణం విడిచేవరకూ నిద్రించకూడదు. గ్రహణ సమయంలో స్త్రీపురుష సమాగమం తగదు. గ్రహణసమయంలో భగవన్నామస్మరణ చేయాలి, గురువు ఉపదేశించిన మంత్రాన్ని తప్పకుండా జపం చేయాలి. గ్రహణసమయంలో చేసే జపం, దానం, పూజ అనేక రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తాయి. మంత్రోపదేశం లేనివారు స్తోత్రాలు పారాయణ చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక సాధనకు గ్రహణం అత్యంత అనుకూలసమయం. భగవంతుడి స్తోత్రాలు, మంత్ర జపం చేయాలనుకునేవారు గ్రహాణానికి ముందు పట్టుస్నానం, గ్రహణం ముగిసిన తర్వాత విడుపుస్నాన చేయాలి. గ్రహణం తర్వాత ఇల్లు, పుజాగది శుభ్రం చేసుకుని, దీపారాధన చేయాలి. గ్రహణం అంటే భయపడిపోయేలా సినిమాల్లో చూపించారు, కానీ నిజానికి గ్రహణం అత్యంత పుణ్యసమయం, దాన్ని సద్వినియోగం చేసుకోండి.

Originally Published: Lunar eclipse October 2014
1st Edit: 03-April-2015