Tuesday, 28 April 2015

స్వామి చిదానంద సరస్వతీ సూక్తి

భగవంతుని గుర్తుంచుకోవడమే జీవితం. మర్చిపోవడమే మరణం - స్వామి చిదానంద సరస్వతీ (Divine life society, Rishikesh)



Monday, 27 April 2015

భూమాత అరోగ్యమే మన ఆరోగ్యం - భవిష్యత్తు మన చేతుల్లోనే

యత్ పిండాండే తత్ బ్రహ్మాండే అని శాస్త్రం అంటుంది. అనగా ఏది పిండాండంలో ఉందో, అదే బ్రహ్మాండంలోనూ ఉంది అని అర్దం. పిండాండం అనగా ఈ శరీరం ................ ఒకే పదార్ధం నుంచి ఈ సృష్టి ఏర్పడింది. దానిలో భాగమే ఈ భూగోళం, భూమి నుంచి వచ్చిదే ఈ దేహం. శరీరం భూమిలో భాగం. అదీగాకా హిందు ధర్మం ప్రకారం భూమి జీవం లేని మట్టి ముద్ద కాదు. భూమిలో జీవం ఉంది, శక్తి ఉంది, సర్వజీవులకు పుష్టినిచ్చే శక్తి ఉంది. శక్తి ఉంటే ఆమెను దర్శించవచ్చు, మాట్లాడవచ్చు, కబుర్లు చెపచ్చు, రోగాలను నయం చేసుకోవచ్చు. మనకులాగా భూమికి ప్రాణం ఉంది. అందుకే ఆవిడను భూమాత అన్నారు. మనకున్న శరీరంలానే, ఆవిడకు ఒక శరీరం ఉంది. అదే భూమి. మనకు శరీరంలో రోగనిరోధకశక్తి ఉన్నట్లే, భూమాతకు ఉంది. రకరకాల మార్పుల ద్వార ఆవిడ తనలో కలిగిన దోషాలను తొలగించుకుంటుంది.

మనిషికి పంచకోశాలు ఉన్నట్లే భూమాతకు పంచకోశాలున్నాయి. ప్రాణమయకోశంలో దోషాలు ఏర్పడప్పుడు వ్యక్తికి స్థూలసరీరంలో రోగాలు సంభవిస్తాయి. అట్లాగే భూమాతకు ప్రాణమయకోశంలో దోషం ఏర్పడితే అవిడకు రోగలు వస్తాయి. భూమాతకు ప్రాణమయకోశం వాతావరణమే. భూవాతవారణం చెడిపోయిన కారణంగా ఆవిడ స్థూలశరీరంలో అనారోగ్యం సంభవిస్తోంది. దాని ఫలితమే తరచూ సంభవించే ప్రకృతి ఉపద్రవాలు.

మానవుడి మనోమయకోశంలో దోషాల కారణంగా మానసిక సమస్యలు ఏర్పడతాయి. భూమాతకు అంతే. ఇది మరచిన మానవుడు ఈ రోజు రకరకాల చర్యలతో భూవాతావరణాన్ని పాడు చేస్తున్నాడు. అనగా భూమాత ప్రాణమయకోశాన్ని కలుషితం చేస్తున్నాడు. హింస, క్రూర ఆలోచనల ద్వారా మనోమయ కోశాన్ని పాడు చేస్తున్నాడు. వాటి కారణం చేతనే మానవుడు ప్రకృతి విలయాలకు అతలాకుతలమవుతున్నాడు .......................

భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మనం భూమాత గర్భంలో ఉన్నాం. భూమికి ఏం జరిగినా, అది నేరుగా మన మీదే ప్రభావం చూపిస్తుంది. కనుక మనం సుఖంగా ఉండాలన్న, మన భూతల్లి సుఖంగా ఉండాలన్న భూమాతపట్ల మానవ దృక్పధంలో మార్పు రావాలి. భూమిలో ఉన్న అమ్మను గుర్తించాలి, ఆవిడకు హాని చేసే చర్యలను మానుకోవాలి. ప్రకృతిని పరిరక్షించాలి. సర్వమానవాళి అమ్మ ఆరోగ్యాన్ని రక్షించుకునే విధంగా నడుచుకోవాలి. అమ్మ ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం.

Sunday, 26 April 2015

హిందూ ధర్మం - 156 (సామవేదం)

3. సామవేదం - గీతేషు సామాఖ్యా - గానమే సామం అని జైమిని మహర్షి నిర్వచనం. ఋక్కుల యొక్క గానమే సామం. మానవుడు ఏ జ్ఞానం పొంది, ఎటువంటి కర్మలు ఆచరిస్తే జీవాత్మ జననమరణ చక్రం నుంచి (జన్మల పరంపర నుంచి) విడుదలవుతుందో అటువంటి అంశాల గురించి సామవేదం ప్రధానంగా చెప్తుంది. భగవంతుని యొక్క స్తుతి గురించి, ఉపాసనా పద్ధతుల గురించి చెప్తుంది. భగవంతుని యొక్క అనంతమైన శక్తులే వేర్వేరు రూపాల ద్వారా వ్యక్తమవుతున్నాయి. వాటిని ఉపాసించడం వలన మానవుడికి ఆధ్యాత్మిక ఉన్నతికి కలుగుతుంది. సామవేద మంత్రాలు అత్యంత ఉత్కృష్టమైనవి, వాటిని వినడం చేత మానిషి భావావేశానికి లోనవుతాడు. సామవేదమంత్రాలు మానవుడి మనసును, ఆత్మను ప్రశాంతమైన, నిశ్చల స్థితికి తీసుకెళ్ళగల శక్తి కలిగి ఉన్నాయి. మానవుడు మానసిక, ఆధ్యాత్మిక స్థాయిలో శక్తులను సంపాదించేందుకు, అతని అభివృద్ధికి ఇవి తోడ్పడతాయి. వేదల పరంగా సామవేదం 3 వది, మంత్రాల పరంగా చిన్నదే అయినా, వేదాలపై పూర్తి అవగాహన రావలంటే సామవేదాన్ని అర్దం చేసుకోవాలని బృహద్దేవత చెప్తోంది. ఇందులో 95% మంత్రాలు ఋగ్వేదం నుంచి గ్రహించబడినవే. సామగానం దేవతలను తృప్తి పరుస్తుంది. సర్వజీవులయందు ఐక్యతను పెంచి, ప్రపంచశాంతికి దోహదం చేస్తుంది. సామవేద మంత్రపఠనం శుద్ధిని ఇస్తుంది. అణువులు, పరమాణువుల గురించి, వాటిలో ఉండే శక్తి గురించి, అన్నిటియందు పరమాత్మ శక్తి ఏ విధంగా వ్యాప్తమై ఉందో సామవేదం 222 మంత్రం చెప్తోంది. వ్యవసాయం, ఔషధం, ఖగోళం, గణితశాస్త్రల వివరణ సామవేదం, విషములు వాని లక్షణాలు, వాటి విరుగుడు గూర్చిన శాస్త్రము 221 మత్రం వెళ్ళడిస్తోంది. ముఖ్యంగా బీజగణితం గురించి చెప్పబడింది.

'న సమా యజ్ఞోభవతి' - సామవేదం లేనిదే యజ్ఞమే లేదు అని చెప్పబడింది. కృష్ణుడు కూడా గీతలో 'వేదానం సామవేదోస్మి' - నేను వేదాల్లో సామవేదాన్ని అన్నాడు. ఇతర మూడు వేదాలు కూడా సామవేదాన్ని ప్రశంసించడం, సామవేదం యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తోంది.

పతంజలి మహర్షి మాహాభాష్యం రాసే సమయానికి సామవేదానికి 1000 శాఖలు ఉండేవి. కానీ ప్రస్తుతం 3 శాఖలు మాత్రమే మిగిలాయి. వాటిలో కౌధుమశాఖ గుజరాత్‌లో, రాణాయణీ శాక మహరాష్ట్రలో, రామేశ్వరంలో, జైమిని శాఖ కర్ణాటకలో ప్రచారంలో ఉంది. కౌధుమ సంహిత పూర్వార్చికము, ఉత్తారార్చికము అని రెండు భాగాలు. ఈ రెండు భాగములు కలిపి 1824 మంత్రాలున్నాయి.

ప్రతి శాఖకు ఒక బ్రాహ్మణము, ఒక ఆరణ్యకము, కనీసం ఒక ఉపనిషత్తు ఉంటాయి. కానీ ప్రస్తుతం సామవేదానికి సంబంధించి మహాతాండ్య బ్రాహ్మణం ఒక్కటే లభ్యమవుతోంది. జైమినీ బ్రాహ్మణము దొరికిన, అది పూర్తిగా లభ్యమవ్వటంలేదు. ఆరణ్యకలలో తలవకార ఆరణ్యకము, ఛాందోగ్యారణ్యకము లభ్యమవుతున్నాయి. తలవకార ఆరణ్యకము మిక్కిలి ప్రసిద్ధము. కేనోపనిషత్తు దీని అంతర్భాగము. ఈ వేదానికి సంబంధించి ఛాందోగ్యోపనిషద్, కేనోపనిషద్ లభిస్తున్నాయి.

యజ్ఞసమయంలో సామవేద మంత్రోఛ్ఛారణ చేసే సామవేద పండితుడిని 'ఉద్గాత' అంటారు.

To be continued ............................

Saturday, 25 April 2015

స్వామి నిఖిలానంద సరస్వతీ సూక్తి

ముక్తిని పొందటానికి ధ్యానమే చివరిమెట్టు.
ధ్యానం చేయడానికి జ్ఞానం ఉండాలి
జ్ఞానం వైరాగ్యంతోనే కలుగుతుంది
వైరాగ్యం కలగాలంటే కర్మయోగంతో ప్రయాణం ప్రారంభించాలి
ముక్తి మార్గం ధ్యానంతో మొదలవ్వదు.

- స్వామి నిఖిలానంద సరస్వతీ


Friday, 24 April 2015

24 ఏప్రియల్ శ్రీ సత్యసాయి బాబా వర్ధంతి

24 ఏప్రియల్ శ్రీ సత్యసాయి బాబా వర్ధంతి 
ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం జిల్లా పుట్టపర్తిలో 24 నవంబరు 1926 లో ఈశ్వరమ్మ, పెద్దవెంకమరాజులకు జన్మించారు సత్యనారాయణరాజు (సత్య సాయి బాబా). 20 వ శతాబ్దపు ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు, గొప్ప మానవతావాది ఈయన. 24 ఏప్రియల్ 2011 న నిర్యాణం చెందారు.
"మీ హృదయాలలో ప్రేమ అనే దీపం వెలిగించి దానిని అనుదినం ప్రజ్వలింపజేయడానికే నేను వచ్చాను" అని తన సందేశాన్ని ప్రపంచానికి పంచారు సత్యసాయి. Love all, Serve all (అందరిని ప్రేమించండి, అందరికి సేవ చేయండి) అన్నది సత్యసాయి వారి సందేశం. 
ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో 1200 సత్యసాయి కేంద్రాలను సత్యసాయి సంస్థ వారు స్థాపించారు. అనేక సేవా కార్యక్రమాలు చేశారు. సత్యసాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని స్థాపించి, అత్యంత ఖరీదైన వైద్యాన్ని ఏ విధమైన ఖర్చులు లేకుండా ఉచితంగా వైద్యసేవలు, ఆపరేషన్లు చేస్తున్నారు.
166 దేశాల్లో అనేక విద్యాలయాలు, ఆసుపత్రులు, ఇతర సేవాసంస్థలను స్థాపించారు. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి విశ్వవిదాలయం, విమానాశ్రయము కట్టించారు. పుట్టపర్తిలో ఉన్న విశ్వవిద్యాలయం స్వయం ప్రతిపత్తితో కూడినది. ప్రతిభ ఆధారంగా మాత్రమే అందులోకి ప్రవేశం ఉంటుంది. అత్యంత నాణ్యతా ప్రమాణాలకు ఆ విశ్వవిద్యాలయం పెట్టింది పేరు. ఈయన విద్యాసంస్థల్లో చదువుకున్నవారు ప్రపంచంలో అత్యంత గొప్ప కంపెనీల్లో మంచి స్థానాల్లో ఉన్నారు. మంచి విలువలు కలిగి, నిజాయతీగా జీవిస్తున్నారు, తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటున్నారు. మంచి ప్రతిభను కనబరుస్తున్నారు. కులమత ప్రాంతాలకు అతీతంగా అందరికి వేదవిద్యను అందించి, కులవ్యవస్థ నిర్మూలనకు తనవంతు కృషి చేశారు.
అనంతపురం, మహబూబ్ నగర్ జిల్లాలకు, చెన్నై నగరానికి త్రాగు నీరు అందించడానికి లక్షల రూపాయల ప్రాజెక్టులు చేపట్టి విజయవంతం చేశారు. ఆ జిల్లాలో ఈ రోజు జనం దాహం తీరుతోదంటే అందుకు కారణం సత్యసాయిబాబావారి సేవా కార్యక్రమాలు తప్ప వేరొకటి కావు. ప్రభుత్వాలు చేయలేని పనిని నిస్వార్ధంగా చేశారు సత్యసాయిబాబా. సత్యసాయి బాబా గారు కనుక ఇంకొనెళ్ళు బ్రతికి ఉంటే, మహబూబ్‌నగర్ జలకళతో కళకళలాడేది.
ఎక్కడైన విదేశాల్లో స్థిరపడిన భారతీయులను చూసి ఉంటాం, కానీ పుట్టపర్తిలో మాత్రం విదేశీయులు వచ్చి స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. పూర్తి హిందూ సంప్రదాయం దుస్తులు ధరించి, ముఖాన బొట్టు పెట్టుకుని కనిపిస్తారు. హిందూ సంస్కృతిని అవలంబిస్తున్నారు. 
ఈయన మీద అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే బిల్ ఐట్కిన్ అనే సాయి భక్తుడు, ధార్మిక విశ్లేషకుడు, యాత్రికుడు,"Sri Sathya Sai Baba: A life" అనే పుస్తక రచయిత చెప్పిన ప్రకారం బాబా మీద అపనిందలు అధికంగా బాధ్యతా రహితమైనవి, దురుద్దేశ్య పూర్వకమైనవి, పరిశీలనకు నిలవనివి. కాకపోతే బి.బి.సి. వంటి ఛానళ్ళు ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించడానికి కారణం 'చర్చి' వ్యవస్థకు పోటీ నిలవ గలిగే ఉద్యమాల పట్ల వారికున్న అనాదరణా భావమేట.  ఎందుకంటే బిబిసి పోప్, క్రైస్తవ ఆదేశాలకు, ప్రయోజనాలకు లోబడి పనిచేస్తుంది. 166 దేశాల్లో ప్రజలు ప్రేమతో సత్యసాయిబాబావారిని అనుసరించడం వల్ల ఆయా దేశాల్లో క్రైస్తవం దెబ్బతింటుందని, ఈయన పోప్‌ను కూడా ఓడించి ప్రపంచాన్ని శాసిస్తారన్న భయంతో చర్చి ప్రోద్బలంతో అన్యమతాలపై ద్వేషం నింపుకున్న బి.బి.సి బాబాపై బురదచల్లే కార్యక్రమాలు చేపట్టింది. దాన్ని భారతీయ కుహనా లౌకిక మీడియా అందిపుచ్చుకుంది. కానీ బాబాపై ఆరోపణలను ఋజువు చేయలేకపోయాయి.
సత్యసాయిబాబా గారి సనాతన హిందూ ధర్మ వ్యాప్తికి చేసిన సేవ ఎనలేనిది. హిందూ ధర్మాన్ని, సంప్రదాయాలను ప్రపంచం వ్యాప్తంగా అనేకమందికి పరిచయం చేశారు. అందుకు ఉదాహరణయే ఈ వీడీయో. చూడండి, విదేశీయులు పుట్టపర్తిలో సత్యసాయిబాబా గారి సమాధి సమక్షంలో వేదాన్ని స్వరంతో ఎంత చక్కగా చదువుతున్నారో. అద్భుతం, అత్యధ్బుతం ఈ వీడియో. అందరూ తప్పక వీక్షించవలసినది.

Originally Posted: 23 April 2013
1st Edit: 23 April 2014
2nd Edit: 23 April 2015