Sunday 26 April 2015

హిందూ ధర్మం - 156 (సామవేదం)

3. సామవేదం - గీతేషు సామాఖ్యా - గానమే సామం అని జైమిని మహర్షి నిర్వచనం. ఋక్కుల యొక్క గానమే సామం. మానవుడు ఏ జ్ఞానం పొంది, ఎటువంటి కర్మలు ఆచరిస్తే జీవాత్మ జననమరణ చక్రం నుంచి (జన్మల పరంపర నుంచి) విడుదలవుతుందో అటువంటి అంశాల గురించి సామవేదం ప్రధానంగా చెప్తుంది. భగవంతుని యొక్క స్తుతి గురించి, ఉపాసనా పద్ధతుల గురించి చెప్తుంది. భగవంతుని యొక్క అనంతమైన శక్తులే వేర్వేరు రూపాల ద్వారా వ్యక్తమవుతున్నాయి. వాటిని ఉపాసించడం వలన మానవుడికి ఆధ్యాత్మిక ఉన్నతికి కలుగుతుంది. సామవేద మంత్రాలు అత్యంత ఉత్కృష్టమైనవి, వాటిని వినడం చేత మానిషి భావావేశానికి లోనవుతాడు. సామవేదమంత్రాలు మానవుడి మనసును, ఆత్మను ప్రశాంతమైన, నిశ్చల స్థితికి తీసుకెళ్ళగల శక్తి కలిగి ఉన్నాయి. మానవుడు మానసిక, ఆధ్యాత్మిక స్థాయిలో శక్తులను సంపాదించేందుకు, అతని అభివృద్ధికి ఇవి తోడ్పడతాయి. వేదల పరంగా సామవేదం 3 వది, మంత్రాల పరంగా చిన్నదే అయినా, వేదాలపై పూర్తి అవగాహన రావలంటే సామవేదాన్ని అర్దం చేసుకోవాలని బృహద్దేవత చెప్తోంది. ఇందులో 95% మంత్రాలు ఋగ్వేదం నుంచి గ్రహించబడినవే. సామగానం దేవతలను తృప్తి పరుస్తుంది. సర్వజీవులయందు ఐక్యతను పెంచి, ప్రపంచశాంతికి దోహదం చేస్తుంది. సామవేద మంత్రపఠనం శుద్ధిని ఇస్తుంది. అణువులు, పరమాణువుల గురించి, వాటిలో ఉండే శక్తి గురించి, అన్నిటియందు పరమాత్మ శక్తి ఏ విధంగా వ్యాప్తమై ఉందో సామవేదం 222 మంత్రం చెప్తోంది. వ్యవసాయం, ఔషధం, ఖగోళం, గణితశాస్త్రల వివరణ సామవేదం, విషములు వాని లక్షణాలు, వాటి విరుగుడు గూర్చిన శాస్త్రము 221 మత్రం వెళ్ళడిస్తోంది. ముఖ్యంగా బీజగణితం గురించి చెప్పబడింది.

'న సమా యజ్ఞోభవతి' - సామవేదం లేనిదే యజ్ఞమే లేదు అని చెప్పబడింది. కృష్ణుడు కూడా గీతలో 'వేదానం సామవేదోస్మి' - నేను వేదాల్లో సామవేదాన్ని అన్నాడు. ఇతర మూడు వేదాలు కూడా సామవేదాన్ని ప్రశంసించడం, సామవేదం యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తోంది.

పతంజలి మహర్షి మాహాభాష్యం రాసే సమయానికి సామవేదానికి 1000 శాఖలు ఉండేవి. కానీ ప్రస్తుతం 3 శాఖలు మాత్రమే మిగిలాయి. వాటిలో కౌధుమశాఖ గుజరాత్‌లో, రాణాయణీ శాక మహరాష్ట్రలో, రామేశ్వరంలో, జైమిని శాఖ కర్ణాటకలో ప్రచారంలో ఉంది. కౌధుమ సంహిత పూర్వార్చికము, ఉత్తారార్చికము అని రెండు భాగాలు. ఈ రెండు భాగములు కలిపి 1824 మంత్రాలున్నాయి.

ప్రతి శాఖకు ఒక బ్రాహ్మణము, ఒక ఆరణ్యకము, కనీసం ఒక ఉపనిషత్తు ఉంటాయి. కానీ ప్రస్తుతం సామవేదానికి సంబంధించి మహాతాండ్య బ్రాహ్మణం ఒక్కటే లభ్యమవుతోంది. జైమినీ బ్రాహ్మణము దొరికిన, అది పూర్తిగా లభ్యమవ్వటంలేదు. ఆరణ్యకలలో తలవకార ఆరణ్యకము, ఛాందోగ్యారణ్యకము లభ్యమవుతున్నాయి. తలవకార ఆరణ్యకము మిక్కిలి ప్రసిద్ధము. కేనోపనిషత్తు దీని అంతర్భాగము. ఈ వేదానికి సంబంధించి ఛాందోగ్యోపనిషద్, కేనోపనిషద్ లభిస్తున్నాయి.

యజ్ఞసమయంలో సామవేద మంత్రోఛ్ఛారణ చేసే సామవేద పండితుడిని 'ఉద్గాత' అంటారు.

To be continued ............................

No comments:

Post a Comment