Sunday, 2 August 2015

హిందూ ధర్మం - 169 (శిక్షా - 3)

శబ్దాల యొక్క శక్తిని, అక్షరముల వైభవాన్ని చూశాం. మరి వేదమంత్రాల యొక్క పరిపూర్ణశక్తిని మానవుడు పొందాలంటే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. నా గురువులలో ఒకరికి వారి గురువుగారు వేదంలోని ఒక అతి రహస్య విద్యను నేర్పిస్తూ మంత్రపఠనం గురించి ఇలా హెచ్చరించారు. 'నేను నీకు నేర్పే విద్య అత్యంత కఠినమైనది, అది సక్రమంగా జరిగితే శుభఫలితాలు కలుగుతాయి. మంత్రపఠనంలో కానీ, కర్మలో కానీ చిన్న పొరపాటు దొరిలినా, చాలా దుష్పరిణామాలు చవి చూడవలసి వస్తుంది. జాగ్రత్తగా చదివితే ప్రపంచానికి మేలు జరుగుతుంది, కాస్త పొరపాటు జరిగినా అది ఉపద్రవానికి దారి తీస్తుంది. అందువల నీకు చేసే విద్యాబోధన కూడా చాలా కఠినంగానే ఉంటుంది. దానికి తట్టుకుని నిలబడగలవు అనుకుంటేనే నా దగ్గర ఉండు. లేదంటే ఇప్పుడే వెళ్ళిపో' అన్నారు. అన్నిటికి తట్టుకుని నిలబడ్డారు కనుక ఈ రోజు వారు అనేక యజ్ఞాలు చేస్తూ దేవతావహన చేస్తున్నారు, దేవతలను యజ్ఞవేదికకు రప్పించగలుగుతున్నారు. వేదగానం చేస్తున్నారు. ఆ సంప్రదాయ విద్య తెలిసి, ఇప్పుడు ప్రపంచంలో జీవిస్తున్న ఏకైక వ్యక్తి వారే. వేదం నేర్చుకోవడం అంత కఠినం. ఏదో క్లాసులో కూర్చుని బట్టి కొట్టే విద్య కాదిది. గురువుకు ఎంత శ్రద్ధ ఉంటుందో, శిష్యునికి అంతే ఉండాలి. అన్నిటిని తట్టుకుని నిలబడే శక్తి, సహనం ఉండాలి. అటువంటి ఎంతోమంది వేదపండితులు, ఘణాపాఠీలు ఎందరో ఉన్నారు.  

అటువంటి వేదమంత్రోఛ్ఛారణ గురించి శిక్షా శాస్త్రం వివరిస్తుంది.
1. అక్షరశుద్ధిః - అనగా అక్షరములను సరిగ్గా పలకాలి.
2. మాత్రశుద్ధిః - ధీర్ఘాలు మొదలైనవి ఎంత సమయం పలికితే సరైన అర్దం వస్తుందో అంతే సమయం పలకాలి. ఒక్ అక్షరాన్ని ఎంత సమయం పలకాలో, అంతే సమయం పలకాలి. అంతేకంటే ఎక్కువ కానీ, తక్కువ కానీ పలకకూడదు.
3. స్వరశుద్ధిః - అక్షరములను సరైన స్వరంలోనే పలకాలి

అయితే వేదమంత్ర పఠనం సరిగ్గా జరుగుతోందా లేదా అనేది నిర్ధారించుకొనుటకు ఋషులు అనేక పద్ధతులను వివరించారు. 6 రకాల దోషాలు పారాయణలొ దొర్లే అవకాశం ఉందని చెప్పారు.

గీతి శ్రీధ్రీ శిరఃకంపి తధా లిఖితపాఠకః |
అనర్ధజ్ఞః అల్పకంఠశ్చ్య షఢైతే పాఠకాధమః ||

పాట వలే పాడేవారు, వేగంగా చదువేవారు, స్వరం పెంచకుండా, తగ్గించకుండా కేవలం తలను పైకి క్రిందకు తిప్పుతూ ఉండేవారు, పుస్తకం చూసి చదివేవారు, అర్దం తెలుసుకోకుండా పారాయణ చేసేవారు, బలహీనమైన గొంతుతో చదివేవారు వేదపారాయణంలో అధములు అంటున్నది శాస్త్రం.

అక్షరములు, వాటి సమయానుకూల ఉఛ్ఛారణ మారకుండా స్వరం మార్చడం కూడా వ్యతిరేకఫలితాలను ఇస్తుందని చరిత్ర చెప్తోంది.

పూర్వం వృత్తాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. వాడు ఇంద్రునిపై యుద్ధం చేయడానికి పూనుకున్నప్పుడు, కుమారుడి విజయం కోసం వాడి తండ్రి త్వష్ట వైదిక మంత్రాలతో యాగం చేశాడు. అందులో శృతి లోపించింది, దాని ఫలితంగా అర్దం మారిపోయింది. 'ఇంద్రశ్శత్రో వర్ధయేత్' అనే వ్యాక్యాన్ని శృతి తప్పి చదివాడు. దాంతో ఇంద్రుడి శత్రువైన వృత్తుడు వర్ధిల్లాలి అనబోయి, శత్రువైన ఇంద్రుడు వర్ధిల్లాలి అనే అర్దం వచ్చింది. అది చిన్నలోపంగా అనిపించినా, అదే వృత్తాసురిడి మరణానికి కారణమయ్యింది. వాడు సర్వనాశనమయ్యాడు.

ఈ కధ ద్వారా రెండు విషయాలు అర్దం చెసుకోవాలి. ఒకటి, ఎవరు పడితే వారు వేదం చదువరాదు, వాళ్ళు బ్రాహ్మణులైనా సరే, గురువు దగ్గర కూర్చుని నేర్చుకున్న వారు మాత్రమే పారాయణ చేయాలి. లేదంటే అందులో దొర్లే తప్పులకు కలిగే వ్యతిరేక ఫలితాలు తట్టుకోలేరు. దానికి బదులుగా అందరూ స్తోత్రాలు, శ్లోకాలు చదవవచ్చు, నామజపం చేయచ్చు. వీటికి ఇలాంటి నియమం లేదు. వేదపారాయణ వినవచ్చు కానీ గురువు దగ్గర నేర్వకుండా పఠనం చేయరాదు. రెండవది, ఎప్పటికైన ధర్మమే గెలుస్తుంది. భగవంతుని ఇచ్ఛకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించాలని చూసినా, వారు నాశనమవుతారు. అక్షరాలకు అధిదేవతలు ఉంటారు. వారు వాటిని, వేదాన్ని రక్షిస్తూ ఉంటారు, ఎవరైనా వేదాలను తప్పుడు పనుల కోసం ఉపయోగిస్తే, ఇక వాడి గొయ్యి వాడు తవ్వుకున్నట్లే, వాడి చితికి వాడి నిప్పు అంటించుకున్నట్లే. దేవతలే వాడిని పక్కదారి పట్టిస్తారు.

ఇటువంటి దుష్ప్రభావాలు మానవాళి ఎదురుకొనకూడదనే ఋషులు శిక్షా శాస్త్రాన్ని అందించారు.  

To be continued ......................

అచ్చమైన మన తెలంగాణ వేడుక

బోనాల పండుగ
దక్షిణాయణ ప్రారంభంలో వరుణుడు కరుణించి ప్రకృతి మాత పులకించగా, వ్యవసాయంపై ఆధారపడిన ప్రజలు, భక్తి ప్రపత్తులతో మహాశక్తిని విభిన్న రూపాలలో కొలుచుకోవటం అనాదిగా వస్తోంది. శక్తి ఆరాధనలలో ఇదీ ఒక భాగమే. తెలంగాణలో అసంఖ్యాక ప్రజలు జరుపుకునే ఆనందోత్సాహాల సంరంభం బోనాల.

ప్రపంచవ్యాప్తంగా ఇది ఎంతో ప్రసిద్ధిగాంచింది. అచ్ఛమైన తెలంగాణ తెలుగువారి పండుగగా దీనిని అభివర్ణిస్తారు. ప్రత్యేకించి మన హైదరాబాద్ నగరంలో అయితే, ప్రతీ కూడలిలో కొలువుదీరిన అమ్మవారి దేవాలయాలు ఆకుపచ్చని తోరణాలతో, విద్యుద్దీప కాంతులతో తళుకులీనుతుంటై. కనీసం ఆ ఒక్క రోజైనా నిఖార్సయిన గ్రామీణ వాతావరణాన్ని కన్పింపజేయడం బోనాల పండుగలోని విశిష్టతగా చెప్పాలి. బోనం అంటే భోజనమే. భక్తులు అమ్మవారికి తమ మొక్కుల్ని తీర్చుకోవడమే కాదు, తమకు అన్నాన్నిస్తున్న ఆ తల్లికి కృతజ్ఞతా సూచకంగా, పవిత్రమైన బోనం కుండలో భోజనాన్ని వండి సమర్పించుకోవడం కూడా. ఇదే ఇందులోని పరమార్థం.



పిల్లల సంరక్షణలో అమ్మవారు
జాతరలో కొందరు మొక్కుబడి చెల్లించుకునేందుకు వెళ్తారు. మరి కొందరు ఉత్సాహం ముప్పిరి గొనగా దైనందిన జీవితం నుండి మార్పు కోరి తమ వాళ్ళతో కలిసి సరదాకు వెళ్తారు. ఇంకొందరు భక్తి ఆవేశం తన్మయించగా జాతరలో తామే ఒక భాగంగా మారుతారు. ప్రధానంగా బోనాలు జాతర అంతరార్థం మరోటి ఉంది. చిన్న పిల్లలకు మశూచి, అమ్మవారు వంటి భయానక వ్యాధులు రాకుండా ఉండాలని, అందుకు అమ్మవారు వారికి రక్షణ కవచంగా ఉంటుందన్న ప్రగాఢ విశ్వాసమే ప్రజలను ఇలా ప్రతి ఏడూ బోనాలు సమర్పించుకొనేలా చేస్తున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణా సంస్కృతికి అద్దం పడుతూ, హైదరాబాద్- సికింద్రాబాద్ జంట నగరాలలో అసంఖ్యాకంగా హిందువులు జరుపుకొనే పెద్ద పండుగలలో ఒకటి బోనాలు. దీనిని ఆషాడ జాతర అనీ అంటారు. తెలంగాణలోని అంతటా వివిధ తేదీలలో జరుపుకుంటారు. హైదరాబాద్ పాతబస్తీలోని షాలిబండలో వెలసిన ప్రాచీన అక్కన్న మాదన్న మహాకాళీ ఆలయం, పాతబస్తీలోని లాల్ దర్వాజా మహాకాళి అమ్మవారు, సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహాకాళి దేవాలయాలలో అయితే అత్యంత వైభవోపేతంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారి గుడులను సందర్శించడం ఒక మహాజాతరను తలపిస్తుంది. ఈ బోనాల ఆచారం ప్రాచీనకాలంలోనూ ఉన్నదనేందుకు శ్రీనాథుని హరవిలాస కావ్యంలోనే చక్కని ఉదాహరణ ఉంది. నానావిధ పాకములుగ/ నానాలుగ జేసి నాలుగై దట్టికలన్/ బోనాము దొంతి బేర్చిరి అంటారందులో. ఈ ఆధునిక కాలంలోనూ ఏ మాత్రం తీసిపోని విధంగా జాతర జరుగుతుంది. ఈ పండుగ సమయాలలో ఇంటి ద్వారాలకు, వీధులకు, వేపమండలతో అలంకరణ చేసుకోవడం ఓ ప్రత్యేకతగా కనిపిస్తుంది.
ఈ సందర్భంగా నిర్వహించే వివిధ కార్యక్రమాల విశేషాల మాలిక ఇక్కడ-

ఘటోత్సవం:
అమ్మవారికి ఎదురువెళ్ళి పుట్టింటి నుండి తీసుకొని వచ్చే ఎదురుకోళ్ళతో ఈ ఉత్సవం ప్రారంభమౌతుంది. ఘటం అంటే కలశం. కలశంతో అమ్మవారికి స్వాగతం పల్కడం. పూర్ణకుంభ స్వాగతమన్న మాట.
ప్రత్యేకమైన కలశంలో అమ్మవారు ఆవాహన చేయబడి పురవీధులలో ఊరేగుతారు. అసలైన బోనాల ఉత్సవం ముందు రోజు వరకు ఉదయం, సాయంత్రం అమ్మవారు ఘటంపై సూక్ష్మరూపంలో ఆసీనురాలై పురవీధుల గుండా సంచారం చేస్తూ, భక్తుల పూజలు అందుకుంటారు. ఘటోత్సవం ద్వారా అమ్మవారి పూజలు ప్రారంభమైనట్లు లెక్క. ఆలయానికి వెళ్ళ లేని వృద్ధులు, వికలాంగులు తమ ఇండ్ల వద్దకు తరలివచ్చిన అమ్మవారిని సేవించి, మొక్కులు తీర్చుకొని తరిస్తారు.

సాక సమర్పణ:
సాక అంటే శాఖ. అంటే చెట్టుకొమ్మ. వేపమండను పసుపు నీటి సాకలో ఉంచి, అమ్మవారికి సమర్పించడం. దీనినే సాకివ్వడం లేదా శాఖ సమర్పణం అంటారు. వేపాకు ఉంచిన పసుపు నీరు చల్లి సాక సమర్పిస్తే, ఆ తల్లి తమను చల్లగా చూస్తుందని ప్రజల నమ్మకం.

ఫలహారపు బండ్లు:
బోనాల పండుగ రోజున భక్తులు అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను తమ ఇండ్లలో తయారు చేసుకొని, వాటిని బండ్లలో పెట్టుకొని బయల్దేరుతారు. ఆలయం చుట్టు ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి కొంత సమర్పించి, మిగిలింది తమ ఇంటికి తెచ్చుకొంటారు. కుటుంబ సభ్యులంతా దానిని మహాప్రసాదంగా స్వీకరిస్తారు. ఇలా వేల సంఖ్యలో భక్తులు బండ్లపై ప్రసాదాలు సమర్పించడం ఆనవాయితీ. వీటినే ఫలహారపు బండ్లుగా పిలుస్తారు.

పోతురాజుల వీరంగం:
బోనాలలో వీరొక ప్రత్యేకత. పోతురాజులు వీరంగం చేస్తూ అమ్మ ఆలయానికి తరలి వెళతారు. శరీరమంతా పసుపు రాసుకొని, లంగోటి (వస్త్రము) కట్టుకొంటారు. కాళ్ళకు గజ్జెలు, కళ్ళకు కాటుకతో నుదుట కుంకుమ దిద్దుకొంటారు. నోట్లో పచ్చటి నిమ్మకాయలు పెట్టుకొంటారు. నడుం చుట్టూ వేపమండలు చుట్టుకొంటారు. పసుపుతాడుతో చేసిన కొరడాను ఝుళిపిస్తూ, తప్పెట్లు వాయిద్యాలకు అనుగుణంగా నాట్యం చేస్తూ మహాభక్తి పారవశ్యంతో కదలి వెళతారు. అమ్మ వారికి సోదరుడైన పోతురాజు గ్రామాన్ని సంరక్షిస్తూ తమకు అండగా ఉంటాడని ప్రజల నమ్మకం. బోనాల పండుగ రోజున వేలాది మంది పోతురాజులు పాల్గొంటారు. లక్షలాది మంది భక్తులను తమ అభినయాలతో, నృత్యాలతో రంజింపజేయడం ఒక అపూర్వ సన్నివేశం. పోతురాజులతో కలసి, నృత్యాలు చేస్తూ, చిందులు వేస్తూ తెలంగాణ యాసలో పాటలు పాడుతూ, తన్మయత్వంతో కదలి వెళ్ళే జనాలను ప్రపంచం తనివి తీరా చూడాల్సిందే తప్ప వర్ణించ మాటలు రావు.

రంగం వేడుకలు:
రంగం అంటే భవిష్యవాణి వినిపించడం. బోనాల పండుగ ప్రతి ఏడూ నిర్ణీత ఆదివారం నాడే జరుగుతుంది. మరుసటి రోజు సోమవారం ఉదయం ముఖమండపంలో మాతంగేశ్వరి ఆలయం వద్ధ అమ్మవారికి ఎదురుగా ఒక అవివాహిత స్త్రీ వచ్చి కుండపై నిలబడుతుంది. దేవతా అమ్మవారి వంకే తదేకంగా చూస్తూ ఆమె కళనంతా ఆవహింపజేసుకొంటుంది. భవిష్యత్తులో జరిగే పరిణామాలను, ముఖ్య విశేషాలను ఆమె నోటి ద్వారా ఆ దేవతే వెల్లడిస్తుందన్నది ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఈ భవిష్యవాణిని వినడానికి భక్తులు తండోపతండాలుగా వస్తారు. రంగం కార్యక్రమంలో పాల్గొనే స్త్రీ (మాతంగి) జీవితం అమ్మవారికే అంకితం. ఒక కత్తికి మాంగల్య ధారణ చేసి జీవితాంతం అవివాహితగానే ఉండిపోతుంది. బోనాల జాతర జరిగే ప్రతి ఆలయానికి ఒక మాతంగి ఉండవచ్చు. లేదా ఒకే మాతంగి కొన్ని ఆలయాల బోనాల ఉత్సవాలకు రంగం వేడుకలో పాల్గొనవచ్చు.

గావు పట్టడం:
వంశపారంపర్యంగా వస్తున్న పోతురాజులు ఉదయం 9 గంటల ప్రాంతంలో విలయతాండవం చేస్తూ, ఉద్వేగంతో ఊగి పోతూ ఆలయం చుట్టూ నాట్య విన్యాసాలు ప్రదర్శిస్తారు. అమ్మవారికి ఎదురుగా, మేళతాళాల మధ్య, లయబద్ధంగా నాట్యం చేస్తున్నప్పుడు అమ్మవారు వారిపై ఆవహిస్తుందని అంటారు. ఈ సందర్భంలో సొరకాయ, గుమ్మడికాయలను బలి ఇస్తారు. ఈ కాయలను పోతురాజు నోటితో కొరకటమే గావు పట్టడం. అంతకు పూర్వం జంతుబలులు ఉండేవి. ఇప్పుడు వీటిని నిషేధించారు. ఈ కార్యక్రమాన్ని వేలాది మంది భక్తులు చూసి తరిస్తారు.

సాగనంపు:
గావు పట్టడం పూర్తయ్యాక అమ్మవారి చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించిన ఏనుగుపై ఉంచి, మంగళవాయిద్యాలతో పురవీధుల గుండా ఊరేగించుకుంటూ తీసుకొని వెళతారు. ఇలా ఆమెను సాగనంపి ఉత్సవాన్ని ముగిస్తారు.
By వనిత విజయకుమర్ ద్యాప

నమస్తే తెలంగాణ - ఆదివారం సంచిక - బతుకమ్మ

Source: http://goo.gl/tvk3CY

Saturday, 1 August 2015

ఇది ధర్మవైభవం

ఇది ధర్మవైభవం

కుంబమేళా లో అశేష జన వాహిని చూసిన ఒ ఆంగ్లేయుడు మన హిందూ సన్యాసిని ఇలా ప్రశ్నించాడు. కుంభమేళాలో ఇన్ని లక్షల జనం ఓ క్రమపద్ధతిలో తమ పని తాము చేసుకోవడమే కాక ఎంతో సౌభ్రాతృత్వం తో వున్నారు. వీరు మరి ఒక ప్రాంతం వారు కారు, ఒక భాషా కలిగిన వారు కాదు, ఒకే ఆచారాలు ,ఆహారము కలిగినవారు కాదు, అయినా వీరిలో ఇంత సోదర భావమా? ఇదే మా దేశములో అయితే ఎంత ఎక్కువ మంది కలిస్తే అంత గొడవలు వస్తాయి. చాలా ఆశ్చర్యం అయినా ఇంత మంది ఇక్కడా రావడానికి చాలా ప్రకటనలు, చాలా ఖర్చుతో కుడివుంటింది, కాదా? .............అంటే దానికి ఆ హిందు సన్యాసి ఇలా జవాబు ఇచ్చాడు. ఒక పైసా కుడా ఖర్చు కాలేదు. అవ్వదు కూడా. మన పంచాంగం, (జ్యోతిషం) ఆధారముగా, మీ ప్రకారం చెప్పాలంటే కాలేండర్ లో విశేష దినముగా మనవాళ్ళు ముందే రాసిపెట్టి వుండం........ ఒక చిన్న లైను చూసి ఇన్ని లక్షల మంది ఇక్కడకు రావడం జరిగింది. హిందూ ధర్మం పాటించే వారు శాంతితో ప్రతి ఒక్కరిలో దేవుని చుసే గుణం కలిగి ఉంటారు. అలా చూడగలిగినది, వుండగలినది నా హిందు ‪‎ధర్మము‬ మాత్రమే అని చెప్పడం తో ఆ విదేశీయుడు మన హిందు ధర్మానికి ధన్యవాదాలు తెలిపాడు.

చెప్పిన ఆ హిందూ సన్యాసి ఎవరో కాదు అపర ఆదిశంకరులు, కంచికామకోటి పీఠాధిపతి, శ్రీ శ్రీ శ్రీ చందశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి.

జయ జయ శంకర హర హర శంకర

ఋణ తీర్మానం - సద్గురు శివానంద మూర్తి