Showing posts with label శిక్షా. Show all posts
Showing posts with label శిక్షా. Show all posts

Sunday, 23 August 2015

హిందూ ధర్మం - 172 (శిక్షా - 6)

ఇది కేవలం వేదాన్ని రక్షించడానికే కాదు, వేదపఠనం ద్వారా వచ్చే ఫలితాన్ని ద్విగుణీకృతం చేయడానికి ఉపయోగపడుతుంది.
సంహితాపాఠమాత్రేన యత్ఫలం ప్రోచ్యతే బుదైః
పదాతు ద్విగుణం విద్యాత్ క్రమేతుచ చతుర్గుణం
వర్ణక్రమే శతగుణం జఠాయంతు సహస్రకం

అంటూ సంహితాపాఠంలో చదివితే వచ్చే ఫలితానికి రెండు రెట్ల ఫలితం పదపాఠం వలన, క్రమపాఠం వలన నాలుగు రెట్ల ఫలితం, వర్ణక్రమం వలన వందరెట్ల ఫలితం, జఠాపాఠం వలన సహస్రరెట్ల ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తున్నది.

ఒక్కసారి చేసిన ఘనాపాఠం, 13 సార్లు చేసే వేద పారాయణకు సమానం. మరియు అత్యంత ఫలప్రదం. ఘణాపాఠంలో మొదటి పదం, ఆఖరి పదం తప్పించి అన్ని పదాలు 13 సార్లు వస్తాయి.

ఈ విధంగా మొత్తం 153,826 పదాలున్న ఋగ్వేదాన్ని, 109287 పదాలున్న యజుర్వేదాన్ని అనేక కలియికలు, పాఠక్రమాలతో జత చేసి, వాటి మధ్య మంత్రాలను బిగించి, కొత్త పదాలు చేరకుండా, ఉన్నవి కోల్పోకుండా, భగవద్వాణి అయిన వేదాన్ని అట్లాగే రక్షిస్తూ, తరతరాలుగా వస్తోంది సనాతనసంస్కృతి. ఇదే ఈ సంస్కృతి గొప్పతనం, శిక్షాశాస్త్రం గొప్పతనం.

సనాతనధర్మానికి మూలస్థంభం వేదం. అది స్వచ్ఛంగా ఉంటేనే, ధర్మం స్థిరంగా ఉంటుంది. వేదం అనేది గ్రంధం కాదు, వేదమంత్రాలను గ్రంధాల్లో నిక్షిప్తం చేయడం గత 5,000 ఏళ్ళ క్రితమే మొదలైంది. వేదాన్ని పుస్తకాల్లో ముద్రించినా, అది పెద్దగా ప్రయోజనకారికాదు. వేదానికి స్వరం ప్రధానం. చదివే వ్యక్తి యొక్క సంస్కారం, మానసికస్థితి, శౌచం ప్రధానం.

ప్రపంచంలో వేదం, కొన్ని హిందూ ధార్మిక గ్రంధాలు తప్ప మిగిలిన అన్ని మతగ్రంధాలు మార్పులకు, చేర్పులకు లోనయ్యాయి. ఆయా సంస్కృతులే స్వార్ధప్రయోజనాల కోసం ధార్మికగ్రంధాల్లో అనేక విషయాలు చొప్పించారు. బైబిల్ అయితే ప్రతి ఏటా ఏదో ఒక మార్పుకు నోచుకుంటుంది. బైబిల్ అనేది దైవగ్రంధం, క్రైస్తవులకు పవిత్రగ్రంధమని ఆ మతస్థుల నమ్మకం. కానీ చరిత్ర గమనిస్తే, ప్రతి శతాబ్దంలో బైబిల్‌లో ఎన్నో కొత్తవిషయాలు ముద్రితమవుతున్నాయి, వారికి చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్న విషయాలు, ఆధునిక పరిశోధనల్లో అబద్దమని తేలిన అనేక విషయాలు తీసివేయబడుతున్నాయి. అదేమీ ప్రపంచనాగరికతతో కలిసి పయనించేందుకు జరిగే మార్పులు చేర్పులు కావు. తమ గ్రంధం ఇంత అసంబద్ధంగా ఉందని ప్రపంచానికి తెలిస్తే, ఇక ఆ మాతంలోకి మార్పిడులు చేయడం కష్టమని, ఉన్నవాళ్ళు కూడా మతాన్ని విడిచిపెడతారని భయం. మాకు తెల్సిన ఒక వ్యక్తి దగ్గర గత 50 ఏళ్ళ ప్రతి ఏటా ముద్రితమవుతున్న బైబిల్ గ్రంధాలు ఉన్నాయి. వాటిని చూస్తే అర్దమవుతుంది, ప్రతి ఏటా దాన్లో ఎన్ని మార్పులు చేస్తున్నారో.

వేదం శాశ్వతమైనది, సత్యాలతో కూడుకున్నది. అటువంటి వేదం కాలానికనుగుణంగా మార్చవలసిన పనిలేదని గర్వంగా చెప్పుకోగలిగినవారు హిందువులు మాత్రమే. తమ ధర్మానికి పునాది అయిన వేదంలో మార్పులు చేయటం సాధ్యపడదని గర్వంగా ప్రపంచం ముందు చెప్పగలిగినవాడు ఒక్క హిందువు మాత్రమే.

To be continued ..............

Sunday, 16 August 2015

హిందూ ధర్మం - 171 (శిక్షా - 5)


సహజక్రమాన్ని అనుసరించని 8 రకాల కలయికలను కూడా అందించారు మహర్షులు. వీటిని వికృతి అన్నారు.
జటామాలా శిఖా రేఖా ధ్వజో దణ్డొ రథోఘనః |
ఇత్యాష్టా వికృతయః ప్రోక్తాః క్రమపూర్వా మహర్షిభిః||

జటా, మాలా, శిఖా, రేఖా, ధ్వజా, దండ, రథ, ఘనా అనేవి అష్ట వికృతులు. వీటిన్నటిలో జటా, ఘనాలు మాత్రమే దక్షిణ భారతదేశంలో కృష్ణయజుర్వేద శాఖలో ప్రముఖంగా ఉన్నాయి. ఉత్తరభారతదేశం, ముఖ్యంగా బెనారస్‌లో శుక్ల యజుర్వేద శాఖలకు చెందిన అష్టవికృతులు ఉన్నాయని చెప్తారు. కానీ చరిత్ర గమనిస్తే, దుష్ట జీహాదీల దండయాత్రల్లో వైదికసంప్రదాయం ఎన్నో కష్టాలు పడింది. తరతరాలుగా వస్తున్న వైదిక గురుకులాలను ధ్వంసం చేసి, అందులో విద్యార్ధులను, గురువులను క్రూరంగా చంపారు అప్పటి ఇస్లాం విద్వంసకారులు. ఈ దాడులతో ఉత్తరభారతదేశంలో వేదానికి చెందిన అనేక విద్యలు చాలావరకు సమూలంగా నాశనం చేశారు. దక్షిణభారతదేశంలోని అతి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వైదిక పరంపర కొనసాగుతూ వచ్చింది. అది కూడా పైన చెప్పిన పద్ధతుల్లో ఒకటి, లేదా రెండు పద్ధతులు మాత్రమే మిగిలాయి. ఆంగ్లేయులైతే మరీ దారుణం. క్రైస్తవవ్యాప్తి కోసం స్వరంతో వేదం పలికే పండితుల స్వరపేటికల్లోకి మండుతున్న ఇనుపచువ్వలు గుచ్చి, ధర్మంపై తమ వ్యతిరేకతను చాటుకున్నారు. జీహాదీల దాడులను సైతం తట్టుకుని నిలబడ్డ అనేక వైదిక గురుకులాలను సమూలంగా తుడిచివేశారు. దాని కోసం చట్టాలు కూడా చేసి, తమ అక్రమాలను, దారుణాలను చట్టబద్ధంగా చేసే యత్నం చేశారు.

జటా పాఠం

ఒకే వరుస క్రమంలో 6 పదాలుంటే జటా పాఠంలో a-b-b-a-a-b;  b-c-c-b-b-c; c-d-d-c-c-d; d-e-e-d-d-e; e-e-f-f-e; ................. ఇలా చదువుతారు. ఆ పాఠాన్ని గమనిస్తే, ముందుకు-వెనక్కు-ముందుకు పదాల క్రమం ఉంటుంది. స్త్రీలు తమ జడను అల్లుకున్న విధంగా ఉంటుంది కనుక ఈ పాఠాన్ని జటాపాఠం అన్నారు.

ఇది జటాపాఠం :
ఓషధయః సం సం ఓషధయః ఓషధయః సం |
సం వదంతే వదంతే సం సం వదంతే |    
వదంతే సోమేన సోమేన వదంతే వదంతే సోమేన |
సోమేన సహ సహ సోమేన సోమేన సహ |
సహ రాజ్ఞా రాజ్ఞా సహ సహ రాజ్ఞా |
రాజ్ఞేతి రాజ్ఞా ||

మాలా పాఠాలు రెండు రకాలు 1) క్రమ మాల, 2)పుష్పమాల. ఇవి క్రమపాఠాన్ని పోలి రెండు పదాలను కలుపుతూ ఉంటాయి. శిఖా పద్ధతి జటా పద్ధతికి దగ్గరగా ఉన్నా, శిఖలో రెండు పదాలకు బదులు మూడు పదాలను కలిపి, ముందుకి-వెనక్కి చదువుతారు. రేఖా, ధ్వజ, దండ, రథ పాఠాలా పారాయణ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. రథాలో కూడా ద్విపాద, త్రిపాద, చతుష్పాద అని 3 రకాల పద్ధతులు ఉన్నాయి. వీటిలో ద్విపాద, చతుష్పాద పద్ధతులు ఈ రోజు విరివిగా ఉపయోగిస్తున్నారు.

అన్నిటిలోకి ప్రముఖమైనది, అత్యంత కష్టమైంది, మంచి ప్రాముఖ్యం సంతరించుకున్న పద్ధతి ఘనాపాఠం.ఈ విద్యలో ప్రావీణ్యం పొందినవారిని ఘనాపాఠీ అంటారు. ఇక్కడ పదక్రమం గంట ఆకారాన్ని సంతరించుకుంటుంది.

ఉదాహరణకు, a-b-c-d-e-f అనేవి పదసమూహం అనుకుంటే ఘనాపాఠంలో a-b-b-a-a-b-c-c-b-a-a-b-c; b-c-c-b-b-c-d-d-c-b-b-d అని చదువుతారు.

ఓషధయః సం సం ఓషధయః ఓషధయః సం వదంతే
వదంతే సం ఓషధయః ఓషధయః సం వదంతే |
సం వదంతే వదంతే సం సం వదంతే సోమేన
సోమేన వదంతే సం సం వదంతే సోమేన |
వదంతే సోమేన సోమేన వదంతే వదంతే సోమేన సహ
సహ సోమేన వదంతే వదంతే సోమేన సహ|
సోమేన సహ సహ సోమేన సోమేన సహ రాజ్ఞా
సహ రాజ్ఞా రాజ్ఞా సహ సహ రాజ్ఞా |
రాజ్ఞేతి రాజ్ఞా ||

పైన గమనిస్తే, సంహితలో 6 పదాలుంటే, ఘనాపాఠంలో అవి 60 పదాలుగా మారాయి. అనగా పదిరెట్లు పెరిగాయి. దీని బట్టే అర్దం చేసుకోవచ్చు, పెద్దపెద్ద మత్రాలను ఉచ్చరించడం ఎంత కష్టమో!! దీని ఆధారంగా ఘనాపాఠికి వేదం యందు ఎంత ప్రేమ ఉందో, దాన్ని కాపాడాలన్న పట్టుదల ఎంతగా ఉందో, ఆయన ఏదో మౌఖికంగా కాకుండా హృదయంతో నేర్చుకుని, ఘనక్రమం తప్పకుండా చదువుతున్నారో అర్దం చేసుకోవచ్చు.

ఘనాపాఠం గురించి అవగాహన కోసం శృంగేరి పీఠంలో రుద్రాభిషేక సమయంలో ఘనాపాఠీలు చదివిన రుద్రఘనాపాఠం ఈ లింక్‌లో వినవచ్చు. ఘనాపాఠం వినడం కూడా ఎంతో శాంతిని ఇస్తుంది.

https://www.youtube.com/watch?v=XiB3-uIkuPw



To be continued ................

Sunday, 9 August 2015

హిందూ ధర్మం - 170 (శిక్షా - 4)

సరైన రీతిలో ఉఛ్ఛరించే క్రమం కూడా వేదాంగం తెలిపింది.

శిక్షాం వ్యాఖ్యాస్యామః| వర్ణస్వరః| మాత్రాబలం|
సామ సంతానః| ఇత్యుక్త శిక్షాధ్యాయః||

అనగా శిక్షా శాస్త్రము వర్ణముల (అక్షరములు) గురించి, స్వరం గురించి (ప్రధానంగా మూడు స్వరాలు ఉన్నాయి. అనుదాత్తము - తక్కువ స్వరంలో చదవడం, ఉదాత్తము - గట్టిస్వరంలో చదవడం, స్వరితము (క్రమానికి అనుగుణంగా పెంచి, తగ్గించి చదవడం), మాత్రా (పాఠక్రమాన్ని అనుసరించి సమయానుకూల శృతితో చదవడం, ఒక అక్షరాన్ని ఎంత సమయం పలకాలో అంత సమయం మాత్రమే పలకడం) (prosodial unit of time), బలం (స్వర ఉఛ్ఛారణలో ఉపయోగించాల్సిన బలం), సామ (క్రమపద్ధతి పాటించడం) (uniformity), సంతానః (పాఠనా క్రమంలో కొనసాగింపు) (continuity) గురించి వివరిస్తుంది.

ఉదాత్తము, అనుదాత్తము, స్వరితములే కాక వేదపఠనం నేర్పే క్రమంలో చేతులను, తలను పైకి, క్రిందకు కదిలిస్తూ కూడా నేర్పిస్తారు. వీటివలన వేదపారాయణలో ఎక్కడా అపస్వరం దొర్లకుండా ఉంటుంది. ఒకవేళ అటువంటిది జరిగినా, చేతి కదలికలను అనుసరించి దాన్ని వెంటనే పసిగట్టగలుగుతారు.

వేదం ఈశ్వరీయం, కాలాతీతం, పరమప్రామాణికం, పవిత్రం. అటువంటి వేదమంత్రాలను భగవానుడు ఎలా అందించాడో, అలాగే వాటిని కాపాడేలా అనేక పద్ధతులను ఉపయోగించారు. ఈశ్వరప్రసాదిత వేదంలో ఒక్క అక్షరం ముక్క కూడా మారకుండా, కొత్తది చేర్చబడకుండా తరం నుంచి తరానికి పరంపరగా వచ్చేందుకు వీలుగా అనేక క్రమాలను, combinations ను ప్రవేశపెట్టారు.

ప్రధానమైన మంత్రాన్ని వ్యాక్యం అని, లేదా సంహితాపాఠం అని అన్నారు. ఇందులో అనేక పదములతో కూడిన మంత్రం ఉంటుంది.దాని ప్రతి పదాన్ని విడగొట్టి 'పద పాఠం' అన్నారు. ఇది విద్యార్ధికి ప్రతి పదానికి సంబంధించిన జ్ఞానాన్ని ఇస్తుంది. తర్వాత వచ్చేది క్రమపాఠం, ఇందులో మంత్రంలోని మొదటి పదాన్ని, రెండవపదానికి, రెండవపదాన్ని మూడవపదానికి, మూడిని నాలుగుకు, ఇలా జోడిస్తారు. ఈ పద్ధతి వలన విద్యార్ధికి విడివిడిగా ఒక్కో పదం యొక్క అర్దం తెలియడమే కాక, పారాయణ క్రమంలో పదాలను ఎలా జోడించాలి, దాని ఫలితంగా స్వరంలో ఎప్పుడు ఎలాంటి మార్పులు చేయాలి అనేవి బోధపడతాయి. పదపాఠం, క్రమపాఠాల్లో పారాయణ చేయడం వలన సంహితా పాఠంలో చెప్పబడిన పదాల యొక్క సహజక్రమం కాపాడబడుతుంది. అందుకే వీటిని ప్రకృతి అన్నారు. అనగా వేదం యొక్క సహజత్వాన్ని కాపాడేవి అని.

ఉదాహరణకు a-b-c-d-e-f అనే పదాలు సంహితపాఠంలో ఉంటే, పదపాఠంలో వాటిని విడివిడిగా ఏ పదానికి, ఆ పదంగా a, b, c, d,e, f అని చదువుతారు. క్రమపాఠంలో a-b, b-c, c-d, d-e, e-f  అని చదువుతారు. క్రమపాఠ పారాయణంలో ప్రావీణ్యం పొందిన పండితుడిని 'క్రమవిత్' అంటారు.

ఒక్కో పాఠంలో మంత్రాలు ఎలా ఉంటాయో, చిన్న ఉదాహరణలో చూడండి.

సంహితా పాఠం
ఓషధయః సం వదంతే సోమేన సహరాజ్ఞా ||

పదపాఠం
ఓషధయః| సం| వదంతే| సోమేన| సహ| రాజ్ఞా||

క్రమపాఠం
ఓషధయః సం| సం వదంతే| వదంతే సోమేన|
సోమెన సహ| సహ రాజ్ఞా| రాజ్ఞేతి రాజ్ఞా||

To be continued ......................

ఈ రచనకు సహకరించిన పుస్తకం.
శృంగేరీ పీఠం వారి Vedic Chanting 

Sunday, 2 August 2015

హిందూ ధర్మం - 169 (శిక్షా - 3)

శబ్దాల యొక్క శక్తిని, అక్షరముల వైభవాన్ని చూశాం. మరి వేదమంత్రాల యొక్క పరిపూర్ణశక్తిని మానవుడు పొందాలంటే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. నా గురువులలో ఒకరికి వారి గురువుగారు వేదంలోని ఒక అతి రహస్య విద్యను నేర్పిస్తూ మంత్రపఠనం గురించి ఇలా హెచ్చరించారు. 'నేను నీకు నేర్పే విద్య అత్యంత కఠినమైనది, అది సక్రమంగా జరిగితే శుభఫలితాలు కలుగుతాయి. మంత్రపఠనంలో కానీ, కర్మలో కానీ చిన్న పొరపాటు దొరిలినా, చాలా దుష్పరిణామాలు చవి చూడవలసి వస్తుంది. జాగ్రత్తగా చదివితే ప్రపంచానికి మేలు జరుగుతుంది, కాస్త పొరపాటు జరిగినా అది ఉపద్రవానికి దారి తీస్తుంది. అందువల నీకు చేసే విద్యాబోధన కూడా చాలా కఠినంగానే ఉంటుంది. దానికి తట్టుకుని నిలబడగలవు అనుకుంటేనే నా దగ్గర ఉండు. లేదంటే ఇప్పుడే వెళ్ళిపో' అన్నారు. అన్నిటికి తట్టుకుని నిలబడ్డారు కనుక ఈ రోజు వారు అనేక యజ్ఞాలు చేస్తూ దేవతావహన చేస్తున్నారు, దేవతలను యజ్ఞవేదికకు రప్పించగలుగుతున్నారు. వేదగానం చేస్తున్నారు. ఆ సంప్రదాయ విద్య తెలిసి, ఇప్పుడు ప్రపంచంలో జీవిస్తున్న ఏకైక వ్యక్తి వారే. వేదం నేర్చుకోవడం అంత కఠినం. ఏదో క్లాసులో కూర్చుని బట్టి కొట్టే విద్య కాదిది. గురువుకు ఎంత శ్రద్ధ ఉంటుందో, శిష్యునికి అంతే ఉండాలి. అన్నిటిని తట్టుకుని నిలబడే శక్తి, సహనం ఉండాలి. అటువంటి ఎంతోమంది వేదపండితులు, ఘణాపాఠీలు ఎందరో ఉన్నారు.  

అటువంటి వేదమంత్రోఛ్ఛారణ గురించి శిక్షా శాస్త్రం వివరిస్తుంది.
1. అక్షరశుద్ధిః - అనగా అక్షరములను సరిగ్గా పలకాలి.
2. మాత్రశుద్ధిః - ధీర్ఘాలు మొదలైనవి ఎంత సమయం పలికితే సరైన అర్దం వస్తుందో అంతే సమయం పలకాలి. ఒక్ అక్షరాన్ని ఎంత సమయం పలకాలో, అంతే సమయం పలకాలి. అంతేకంటే ఎక్కువ కానీ, తక్కువ కానీ పలకకూడదు.
3. స్వరశుద్ధిః - అక్షరములను సరైన స్వరంలోనే పలకాలి

అయితే వేదమంత్ర పఠనం సరిగ్గా జరుగుతోందా లేదా అనేది నిర్ధారించుకొనుటకు ఋషులు అనేక పద్ధతులను వివరించారు. 6 రకాల దోషాలు పారాయణలొ దొర్లే అవకాశం ఉందని చెప్పారు.

గీతి శ్రీధ్రీ శిరఃకంపి తధా లిఖితపాఠకః |
అనర్ధజ్ఞః అల్పకంఠశ్చ్య షఢైతే పాఠకాధమః ||

పాట వలే పాడేవారు, వేగంగా చదువేవారు, స్వరం పెంచకుండా, తగ్గించకుండా కేవలం తలను పైకి క్రిందకు తిప్పుతూ ఉండేవారు, పుస్తకం చూసి చదివేవారు, అర్దం తెలుసుకోకుండా పారాయణ చేసేవారు, బలహీనమైన గొంతుతో చదివేవారు వేదపారాయణంలో అధములు అంటున్నది శాస్త్రం.

అక్షరములు, వాటి సమయానుకూల ఉఛ్ఛారణ మారకుండా స్వరం మార్చడం కూడా వ్యతిరేకఫలితాలను ఇస్తుందని చరిత్ర చెప్తోంది.

పూర్వం వృత్తాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. వాడు ఇంద్రునిపై యుద్ధం చేయడానికి పూనుకున్నప్పుడు, కుమారుడి విజయం కోసం వాడి తండ్రి త్వష్ట వైదిక మంత్రాలతో యాగం చేశాడు. అందులో శృతి లోపించింది, దాని ఫలితంగా అర్దం మారిపోయింది. 'ఇంద్రశ్శత్రో వర్ధయేత్' అనే వ్యాక్యాన్ని శృతి తప్పి చదివాడు. దాంతో ఇంద్రుడి శత్రువైన వృత్తుడు వర్ధిల్లాలి అనబోయి, శత్రువైన ఇంద్రుడు వర్ధిల్లాలి అనే అర్దం వచ్చింది. అది చిన్నలోపంగా అనిపించినా, అదే వృత్తాసురిడి మరణానికి కారణమయ్యింది. వాడు సర్వనాశనమయ్యాడు.

ఈ కధ ద్వారా రెండు విషయాలు అర్దం చెసుకోవాలి. ఒకటి, ఎవరు పడితే వారు వేదం చదువరాదు, వాళ్ళు బ్రాహ్మణులైనా సరే, గురువు దగ్గర కూర్చుని నేర్చుకున్న వారు మాత్రమే పారాయణ చేయాలి. లేదంటే అందులో దొర్లే తప్పులకు కలిగే వ్యతిరేక ఫలితాలు తట్టుకోలేరు. దానికి బదులుగా అందరూ స్తోత్రాలు, శ్లోకాలు చదవవచ్చు, నామజపం చేయచ్చు. వీటికి ఇలాంటి నియమం లేదు. వేదపారాయణ వినవచ్చు కానీ గురువు దగ్గర నేర్వకుండా పఠనం చేయరాదు. రెండవది, ఎప్పటికైన ధర్మమే గెలుస్తుంది. భగవంతుని ఇచ్ఛకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించాలని చూసినా, వారు నాశనమవుతారు. అక్షరాలకు అధిదేవతలు ఉంటారు. వారు వాటిని, వేదాన్ని రక్షిస్తూ ఉంటారు, ఎవరైనా వేదాలను తప్పుడు పనుల కోసం ఉపయోగిస్తే, ఇక వాడి గొయ్యి వాడు తవ్వుకున్నట్లే, వాడి చితికి వాడి నిప్పు అంటించుకున్నట్లే. దేవతలే వాడిని పక్కదారి పట్టిస్తారు.

ఇటువంటి దుష్ప్రభావాలు మానవాళి ఎదురుకొనకూడదనే ఋషులు శిక్షా శాస్త్రాన్ని అందించారు.  

To be continued ......................

Sunday, 26 July 2015

హిందూ ధర్మం - 168 (శిక్షా - 2)

అసలు శబ్దం కోసం, ఉఛ్ఛారణ కోసం ఒక శాస్త్రం అవసరమా? అని అడుగుతారు. భాష గురించి ఆధునిక చరిత్రకారులు వివరిస్తూ, మొదట ఆదిమానవుడు ఉన్న సమయంలో అసలు లిపి అనేదే లేదని, మొదట సైగలతో బ్రతికేశారని, తరువాత బొమ్మలు వేయడం మొదలుపెట్టారని, ఆ తర్వాతి క్రమంలో భాష మొదలైందని చెప్తారు. కానీ ధర్మం అలా చెప్పదు. సృష్ట్యాదిలో భగవంతుడు మానవులను సృష్టిచడంతోనే వేదాలను వ్యక్తపరిచాడని శాస్త్రగ్రంధాలు అంటాయి. అక్కడే భాష కూడా మొదలైంది. సంస్కృతానికి ఆల్ఫబెట్ లేదు. ఆ మాటకు వస్తే తెలుగుకు కూడా లేదు. గ్రీకు లో ఆల్ఫా, బీటా,.. లాటిన్ (రోమన్)లో a, b, c.. వంటి పరస్పర సంబంధంలేని సంజ్ఞలు ఉన్నాయి. మన భాషలకు ఉన్నది వర్ణమాల. వర్ణమంటే ప్రత్యేక ఉచ్చారణ గల శబ్దాలను సూచించే సంజ్ఞలు. సంస్కృతం వ్యాకరణములలో కంఠ్యములు, తాలవ్యములు, మూర్థన్యములు, దంత్యములు, ఓష్ట్యములు అని ఉన్నాయి. అంటే కొన్ని గొంతుతో పలికేవి, కొన్ని ముక్కుతో పలికేవి, కొన్ని నాలుకతో పలికేవి, కొన్ని పన్నులతో పలికేవీ...... ఇలా అన్నమాట. ప్రపంచంలో దాదాపు 98% భాషలకు సంస్కృతమే తల్లి అని ఫోర్బ్స్ మొదలైన పత్రికలే కాక, అనేక పరిశోధనలు కూడా ఋజువు చేశాయి. అయినా ఇతర దేశాల భాషలకంటే భారతీయ భాషలకు సంస్కృతంతో ఉన్న అనుబంధం చాలా ఎక్కువ. తెలుగు, కన్నడ మొదలైన భాషలు సంపూర్ణమైనవి కావు. వాటిలో అనేక పదాలకు ఇప్పటికి సంస్కృతానికి చెందినవే. ఆ మాటకు వస్తే, ఒక్క సంస్కృతం తప్ప మరే ఇతర భాష సంపూర్ణం కాదు.



ఇంగ్లీష్ విషయం తిసుకున్నా, 'ఇంగ్లీష్ లో ఒక్క a తప్ప మిగిలినవి అన్ని ఒక్క నాలుకను మాత్రమే  ఉపయోగించే పలికే శబ్దాలే. నాలుకను ఉపయోగించకుండా మిగితావి పలకలేము. అందుకే ఆంగ్లేయులు నాలుకను భుజాన వేసుకుని ప్రపంచాన్ని పరిపాలించారు. తెలుగు, సంస్కృతం మాట్లాడటంలో మన శరీరం, నోరు, గొంతు భాగంలోని ప్రతి అవయవం పనిచేస్తుంది, అందులో చలనం వస్తుంది. 72,000 నాడులను సంస్కృతం ఉత్తేజపరుస్తుంది. అందుకే భారతీయ బాషలను, ముఖ్యంగా సంస్కృతాన్ని మాట్లాడేవారు ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా ఉంటారు' అని స్వర్గీయులు శ్రీ రాళ్ళబండి కవితాప్రసాద్ గారు అనేవారు. ఇది వారు ఏదో సరదాకి చెప్పిన విషయం కాదు. సంస్కృతం మాట్లాడటం వలన నోరు, గొంతు క్యాన్సర్లను నివారించవచ్చని విదేశీయుల పరిశోధనలో తేలింది. ఆ కారణం చేతనే బ్రిటన్, జెర్మనీ వంటి దేశాల్లోని ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో విద్యార్ధులకు సంస్కృతాన్ని తప్పనిసరిగా బోధిస్తున్నారు.

అయితే భారతీయ ఋషుల దృష్టి కోణంలో వర్ణమాల అంటే కేవలం ఏదో భావాలను వ్యక్త పరచటానికి ఉపయోగించే ఒక వ్యవస్థ కాదు. ఓం అనేది ఏ విధంగానైతే పరబ్రహ్మం యొక్క ప్రతిరూపమో, అట్లాగే సంస్కృత వాఙ్గయంలో ప్రతి ప్రతి అక్షరానికి ఒక అధిదేవత ఉంది. ఆ అధిదేవతను ఋషులు దర్శించారు. మొత్తం వర్ణమాలలోని 52 అక్షరాలకు 52 మంది అధిదేవతలు ఉన్నారు. వారికి ఒక రూపం ఉంది, ఒక నామం ఉంది, వారికీ శక్తి ఉంది, వారు కూడా శుభాలను చేకూరుస్తారు. ఈ 52 అక్షరాలకు మానవ శరీరంలోని 6 చక్రాలకు సంబంధం ఉంది, 72,000 నాడులను చైతన్యం చేసే శక్తి ఉంది. ఒక్కో అక్షరం ఒక్కో చక్రం మీద పని చేస్తుంది, మనిషికి ఒక్కో అనుభూతిని కలిగిస్తుంది. ఆయా అక్షరాలను కలిపి చదవడం వలన ఒక్కో రకమైన శక్తి పుడుతుంది. అక్షరాలను ఒక పద్ధతిలో ఏర్పరిచి భగవంతుడు మంత్రాలను, సూక్తములను ఇచ్చాడు. అక్కడ వేర్వేరు అక్షరముల కలియిక (Combination) ఉంది. అది ఇంకా శక్తివంతం. ఎంత అంటే సూక్తంలో చదివినది అర్దంకాకపోయినా, అది వినడం చేతనే, విన్నవాడు శుభాలను పొందుతున్నాడు. వాడిలో దైవీశక్తి జాగ్రతం అవుతోంది.

ఆ రకంగా చూసినప్పుడు మొత్తం సంస్కృతం, దానితో సంబంధం కలిగి ఉన్న భారతీయ భాషలన్నీ ప్రపంచంలో పెద్ద అద్భుతాలు. కేవలం సంస్కృత భాషణం(మాట్లడటం) చేత ఇంతమంది అధిదేవతల అనుగ్రహం లభిస్తుంది. అది మన సంస్కృత భాష యొక్క గొప్పతనం. సంస్కృతం దైవభాష అని చెప్పుటకు ఇది కూడా ఒక కారణం. అందుకే ఋషులు అక్షరాభ్యాసం అనే ఒక సంప్రదాయాన్ని ఏర్పరిచారు. అక్షరం అనగా నాశనం లేనిది అని అర్దం. అక్షరమే భగవంతుడు. పసిపిల్లవాడు ఏదో విద్య నేర్చుకుంటున్నాడు అని ఋషులు అనలేదు, వాడు అక్షరాన్ని అభ్యసిస్తున్నాడు, పరబ్రహ్మాన్ని ఉపాసిస్తున్నాడు అన్నారు. అందుకే పూర్వం విద్యాభ్యాసంలో పాఠశాలకు వెళ్ళిన విద్యార్ధులు చెప్పులు బయట విడిచిపెట్టి, పద్మాసనంలో కూర్చుకుని పవిత్రంగా విద్య నేర్చుకునేవారు. ఎందుకంటే వారు కేవలం విద్య నేర్చుకోవటంలేదు, నేర్చుకోవటం అనే నెపంతో దైవాన్ని ఉపాసిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే సంస్కృత శబ్దాలు, వాటి శక్తులు గురించి చాలా చెప్పుకోవచ్చు. ఇంత మహత్తు ఉన్న శబ్దముల కోసం వచ్చిన శాస్త్రమే శిక్షా.

To be continued .......................

ఈ రచనకు సాయం చేసిన రచనలు.
 Vvs Sarma గారి సంస్కృతంతో నా చెలిమి
శ్రీ రాళ్ళబండి కవితా ప్రసాద్ గారి ఉపన్యాసం
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి ప్రవచనం

Sunday, 19 July 2015

హిందూ ధర్మం - 167 (శిక్షా - 1)



శిక్షా: ఇది వేదాంగాల్లో మొదటిది. ఇది అక్షరాలకు, వాటిని ఉఛ్ఛరించే విధానం, వేదాన్ని నేర్పే పద్ధతిని వివరించే శాస్త్రం. శబ్దానికి సంబంధిచిన శాస్త్రం. దీన్ని వేదానికి నాసిక (ముక్కు)గా చెప్తారు. ముక్కు ద్వారా మాత్రమే ఊపిరి తీసుకుంటుంది జీవరాశి. ఊపిరే జివులకు ప్రాణాధారం. వేదం మంత్రసూక్తముల సమాహారం. సరైన రీతిలో మంత్రోఛ్ఛారణయే వేదానికి ఆయువు.

సృష్టి ప్రారంభంలో తొలుత శబ్దమే ఉద్భవించింది. తొలిశబ్దం ఓంకారం. అదే ఇన్నిటిగా విస్తరించింది. అన్నీ దాన్నుంచే వచ్చాయి. దృశ్యాదృశ్య ప్రపంచం తర్వాత వచ్చింది. అందుకే ఋషులు శబ్దబ్రహ్మం అని శబ్దాన్ని బ్రహ్మంగా చెప్పారు. వేదాలు కూడా ఋషులకు స్వరబద్ధంగా లభించాయి. ఏదో పుస్తకంలో చూసి చదవడం కాదు, వేదంలో ప్రతి భాగానికి ఒక స్వరం ఉంది. దాని ప్రకారమే చదవాలి. 'నాకు ఒకటే శక్తి గురించి తెలుసు. అదే భగవన్నామం. నేను నీ దగ్గరకు వచ్చి తేలు అనగానే మీవు భయంతో గెంతుతావు. నేను లడ్డూ అనగానే నీ నోరు ఊరుతుంది. అదే నేను నిన్ను గాడిద అనృఏ నీకు కోపం వస్తుంది. కోపం ఎందుకు? నీకేమైనా నాలుగు కాళ్ళు వచ్చాయా? మామూలు పదలాకే అంత శక్తి ఉంటే ఇక భగవన్నామానికి ఎంత శక్తి ఉంటుంది' అంటారు స్వామి శివానంద సరస్వతీ. నామం భగవంతుని ఒకానొక లక్షణం గురించి చెప్తుంది. అటువంటి నామానికే అంత శక్తి ఉంటే ఇక వేదమంత్రాలకు ఎంత శక్తి ఉంటుందో ఆలోచించండి . వేదంలోని శబ్దాలకు చాలా శక్తి ఉంది. యస్య నిశ్వసితం వేదాః - భగవంతుని ఊపిరియే వేదం అని శాస్త్రమే చెప్పింది. నా ఊపిరి నుంచి నేను వేరుకానట్టే భగవంతుని ఊపిరి నుంచి ఆయన వేరు కాదు. మరి అంత గొప్ప శక్తి గల వేదాలను పరిరక్షించడం ఎలా? వాటి శక్తిని అట్లాగే కాపాడటం ఏలా? తప్పులు దొర్లకుండా రక్షించండం ఏట్లాగా? ఇటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఋషులు అందించినదే శిక్షా శాస్త్రం. వేదం ఇవ్వబడిన సమయం నుంచి ద్వాపరయుగం వరకు అది ఎక్కడా రాయబడలేదు. గురువు నుంచి శిష్యునికి వారసత్వంగా ఒక గురుశిష్య పరంపరలో వచ్చింది. వస్తూనే ఉంది. మస్తకం నుంచి మస్తకానికి, పుస్తకం నుంచి పుస్తకానికి కాకుండా హృదయం నుంచి హృదయానికి అందుతూ వచ్చింది. విని నేర్చుకునే విద్య కనుకనే వేదానికి శృతి అని పేరు.

శబ్దానికి చాలా శక్తి ఉంది. వేదమంత్రాల విషయంలో అది స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ శబ్దంతో మనిషికి ఉన్నతమైన అనుభూతులను కలిగించడం, వారి స్థితిని మెరుగుపరచడం, ప్రకృతిలోకి ఆ శబ్దతరంగాలను పంపి కావలసిన ప్రతిఫలాన్ని పొందడం, మనోభావాలను మార్చడం, దుష్టభావాలను నశింపజేయడం కూడా జరుగుతుంది. ఇంతకముందు మంత్రం గురించి, దానికి ఉండే ప్రీక్వెన్సీ గురించి చెప్పుకున్నాం. http://ecoganesha.blogspot.in/2014/12/118.html

ఇక్కడ ప్రీక్వెన్సీతో పాటు రెసోనెన్స్ సిద్ధాంతం కూడా పనిచేస్తుంది.

To be continued ...................