Thursday, 29 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (69)



చంద్రగర్వ భంగం


మూషిక వాహనం ఎక్కి మహాగణపతి మూడు భువనాలు తిరుగుతున్న సమయంలో ఒకమాటు చంద్రలోకానికి వెళ్ళాడు. శశివర్ణుడు శశి (చంద్రుడు) లోకానికి వెళ్ళావన్నమాట. పిల్లలందరికీ చంద్రుడంటే ఇష్టం కదా!


తానందగాడని చంద్రునకు గర్వం హెచ్చు. భగవంతుని ముఖాన్నే చంద్రునితో పోలుస్తారు కవులు. ఇందువల్ల గర్వం నెత్తికెక్కింది. ఈ స్తుతులకు అలవాటు పడినవానికి మిగతావారందరూ తక్కువగా కనిపిస్తారు. అందమైన పిల్లవాని రూపంలో ఉన్న వినాయకుడు, ఇతని దృష్టిలో ఎందుకూ పనికి రానివాడు.


ప్రేమ, శాంతి, వివేకంగల గజముఖం, విశాలమైన చెవులు, బొజ్జ, చిన్ని కాళ్ళు - వీటిని మరీ మరీ చూడాలనిపిస్తుంది కదా! ఎవరితోనైనా పోల్చగలమా అని భావిస్తాం. మన భావాలకు విరుద్ధంగా ఈ పొట్టేమిటి? ఈ తుండమేమిటి? చేటంత చెవులేమిటి? కడవ వంటి బొజ్జ ఏమిటి? కుఱచ కాళ్ళేమిటి? అని నిరసన భావంతో చూసాడు చంద్రుడు. ఏవి భక్తికి ప్రీతిపాత్రంగా ఉంటాయో అవే ద్వేషించేవారికి  హేయవస్తువులు. చంద్రుడీ రూపాన్ని చూసి పకాలున నవ్వాడు.

Wednesday, 28 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (68)

 


ప్రశ్న-సమాధానం; కథలో కథ


ఎవరో ఒకరు ప్రశ్న వేయడం, మరొకరు సమాధానం చెప్పడం అనే పద్ధతి పురాణాలలో ఉంటుంది. సాధారణంగా నైమిశారణ్యంలో సూతుణ్ణి మిగిలిన ఋషులు ప్రశ్నిస్తూ ఉంటారు. అట్లాగే పరీక్షిత్తుకు శుకమహర్షి చెప్పడం భాగవతంలో ఉంటుంది. ఇక ఇతిహాసాలు చూస్తే మహోత్సవ గుణ సంపన్నుడెవరని వాల్మీకి అడిగిన ప్రశ్నకు నారదుడు ముందుగా రామచరితాన్ని గానం చేసాడు. దానినే వాల్మీకి విస్తారంగా వ్రాసి లవకుశులకు చెప్పగా అశ్వమేధ మహామంటపంలో కూర్చొని యున్న రామునికి ఎదురుగా వారు గానం చేసారు. ఇక నైమిశంలో సూతునిచే మహాభారతం చెప్పబడింది. ఆదికావ్యంగా పరిగణింపబడిన రామాయణానికి, నైమిశం లో ఋషులు సంబంధం లేదు. భారత కథ వైశంపాయునుడు జనమేజయునకు చెప్పబడినట్లు గా ఉంది. జనమేజయుడు పాండవుల మనుమడు. దానిని ఇతిహాసంగా వ్యాసుడు మలచగా విఘ్నేశ్వరుడు వ్రాయసకాడయ్యాడు.


ఆ పెద్ద ఇతిహాసంలో భిన్న భిన్న వ్యక్తులు ప్రశ్నించగా నారదుడు, అగస్త్యుడు, మార్కండేయుడు, మొదలైనవారు ఉపాఖ్యానాల రూపంలో సమాధానాలు చెప్పారు. రామాయణంలో ఉత్తరకాండను చూస్తే రావణ వంశానికి చెందిన అన్ని కథలు అగస్త్యుడు రామునకు చెప్పినట్లుంటుంది.


అగస్త్యుని ప్రశ్నకు హయగ్రీవుడిచ్చిన సమాధానమే లలితోపాభ్యాసం. అది బ్రహ్మాండ పురాణంలో ఉంది. భారతంలో చాలా ఉపాఖ్యానాలున్నాయి. పాండవులు వివిధ ఋషులు ప్రశ్నించడం, వారు ఉపాఖ్యానాల రూపంలో సమాధానాలియ్యడం ప్రధానంగా అరణ్యపర్వంలో ఉంటుంది. చవితినాడు చంద్రుని చూస్తే దోషమేమిటని కృష్ణుడు వేసిన ప్రశ్న స్కాందంలో ఉంది. ఈ కృష్ణ నారద సంవాదానికి సమగ్ర సమాధానం నందికేశ్వర సనత్కుమార సంవాదంలో ఉంది.


Tuesday, 27 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (67)

అన్ని పండుగలు చాంద్రమానం ప్రకారం నిర్ధారించబడతాయి. కనుక వినాయక చవితి, భాద్రపద మాసంలో శుక్ల చతుర్దశినాడే. తమిళులకు మాత్రం భాద్రపదంలో గాని లేదా శ్రావణంలో గానీ రావచ్చు. ఒకొక్కసారి సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించడానికి అమావాస్య తరువాత నాల్గు రోజులు పట్టవచ్చు. అటువంటప్పుడు తమిళులకు వినాయక చవితి శ్రావణమాసంలోనే వస్తుంది. ఎందుకనగా సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించినపుడు మాత్రమే వారికి భాద్రపద మాసం మొదలవుతుంది. అదే విధంగా శ్రీరామనవమి కూడా చాంద్రమానాన్ని అనుసరించే వారికి చైత్రమాసంలోనూ తమిళులకు ఫాల్గుణ లేదా చైత్ర మాసాలలోనూ వస్తూ ఉంటుంది. అట్లా గోకులాష్టమి కూడా. 


నారదుడిక్కడ చెపుతున్నది చాంద్రమాన భాద్రపద శుక్ల చతుర్థి గురించి. ఇదే వినాయక చవితి. కృష్ణుడట్టి ఒక్క చవితినాడు చంద్రున్ని చూసాడు. 


ఆనాడు చంద్రుణ్ణి చూసావని నారదుడన్నాడు. ఎప్పుడది? ప్రసేనునితో అడవికి వెళ్ళడం, విడిపోవడం జరిగిననాడే. ప్రొద్దు పోయిందని ఆకాశం వంక చూసాడు కృష్ణుడు. తిరిగి ఇంటికి వచ్చాడు. ఇట్లా చూడడం వల్ల విఘ్నేశ్వరుని శాపానికి గురి కావలసి వచ్చిందని అన్నాడు. 


ఆనాడు చూస్తే దురదృష్టం ఎందుకు వెంటాడుతుందని కృష్ణుడు ప్రశ్నించాడు. నారదుడు కథను చెప్పడం మొదలు పెట్టాడు.


Monday, 26 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (66)



అక్రూరుడు కనబడడం లేదేమిటి. ఒకవేళ అతనిదగ్గర ఉందా? అతడీ నగరంలో లేకపోవడమూ శుభశకునంగా భావించడం లేదు. తండ్రి పోవడం వల్ల కదా సత్యభామ కుమిలిపోతోంది? నగరం అంతా నన్ను సందేహిస్తోంది. మాటిమాటికీ నిందలేమిటి?" అని కృష్ణుడు చింతిస్తూ ఉండగా ఇంతలో నారద మహర్షి వచ్చాడు. ఎక్కడకు, ఎప్పుడు రావాలో నారదునకు బాగా తెలుసు. ఆయన కథను మలుపు త్రిప్పగల నేర్పున్నవాడు.


కుశల ప్రశ్నలయ్యాయి. నీవు దేవర్షివి, నీకు తెలియనిది ఏమీ లేదు. నాకు వచ్చిన సమస్యను పరిష్కరించు, కారణం చెప్పుమని కృష్ణుడడిగాడు. 


ఏమీలేదయ్యా! నీవు భాద్రపద చవితి నాటి చంద్రుణ్ణి చూసావు కదా, విఘ్నేశ్వరుని శాపం తగిలిందయ్యా అన్నాడు నారదుడు.


భాద్రపదం - పంచాంగంలో భేదాలు


భాద్రపద మన జంట నక్షత్రాలతో ఉన్నాయి. పూర్వా భాద్రమని, ఉత్తర భాద్రమని. ఒక్కొక్కప్పుడు ప్రోష్ఠ పదమని పిలువబడుతాయి. ఈ నక్షత్రాలలో ఏదో ఒకటి పూర్ణచంద్రునితో కలియగా దీనిని భాద్రపద మాసమని అంటారు. నక్షత్రాన్నే పేర్కొంటే అది ప్రోష్ఠపదమనే. ఇట్లా అన్ని నెలలు కూడా నక్షత్రం పేరు మీదుగానే ఉన్నాయి. ఒక్కొక్కసారి ఇది ఒక మాసం ముందుగా గాని ఆలస్యంగా గాని జరుగవచ్చు. నిజానికి సూర్యుడెప్పుడైతే ఆ నక్షత్రంలో సంక్రమణం చేస్తాడో అప్పుడు ఆ మాసం మొదలౌతుంది. అయితే ఈ సూర్యుని స్థితి, మరియు చంద్రుని స్థితి ఒక నక్షత్రంలో ప్రవేశించినపుడు సంబంధం లేకుండా ఉంటుంది. సూర్యుని ప్రవేశం ద్వారా మాసము లేర్పడడాన్ని సౌర మానం అంటారు. తమిళనాడులో ఈ పద్దతిని పాటిస్తారు. కర్ణాటక, ఆంధ్ర, ఉత్తర భారత దేశంలో ఎక్కువమంది చాంద్రమానాన్ని పాటిస్తారు. ఈ చాంద్రమానంలో అమావాస్య తరువాత వచ్చే రోజును క్రొత్తమాసానికి మొదటిరోజుగా పరిగణిస్తారు. ఇదంతా చంద్రగమనాన్ని బట్టి యుంటుంది. కనుక పున్నమి నాటి చంద్రుడు ఏ నక్షత్రానికైతే అతి సమీపంలో ఉన్నాడో ఆ నక్షత్రం పేరుతో మాసం మొదలవుతుంది.


కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (65)



అయితే అనవసరమైన భయాందోళనలున్న అక్రూరునకు కృష్ణునిపై అచంచల భక్తి విశ్వాసాలున్నాయి. ద్వారకను విడిచి కాశీయాత్రకు బయలుదేరాడు.


కాశీలో అడుగు పెట్టగానే సద్బుద్ధి కలిగింది. స్వార్థం కోసం మణిని వాడుకోవాలని భావించలేదు. ఎప్పటి మాదిరిగానే ఎనిమిది బారువుల బంగారాన్ని మణి ఇస్తూ ఉండేది. స్వార్ధం కోసం వాడక దానితో ఆలయాలను కట్టించాడు. దైవకైంకర్యమే చేసాడు.


ఇతడు సదాచార సంపన్నుడని మణికి తెలుసు. ఇది బంగారాన్ని ఇయ్యడమే కాదు. చుట్టుపక్కల రోగాలు లేకుండా కూడా చేసింది. క~ఎరు కాటకాలు లేవు. పుష్కలంగా పాడిపంటలు, అంతా సుఖశాంతులలే.


నిందకు కారణం - నేరాలు


ఇట్లా అనేక సంఘటనలచే కృష్ణుని చిత్తం కకావికలమైంది. "ఈ మణివల్ల ఇన్ని కష్టాలా? ఇది ప్రసేనుణ్ణి, సత్రాజిత్తును, శతధన్వుడిని మ్రింగివేసిందే! ఇప్పుడు నా సోదరుడే నన్ను శంకిస్తున్నాడు! దేశంవిడిచి పెట్టి వెళ్ళాడు.

Saturday, 24 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (64)



బలరాముని ఆగ్రహం ఒక పట్టాన చల్లారేది కాదు. ఎవరి మాటలునూ వినదు. నిన్ను వెదకడమేమిటి? టక్కుటమార విద్యలన్నీ నీకు తెలుసు, పచ్చి మోసగాడివని నిందించి నీ దగ్గర ఒక్కక్షణం ఉండనని బలరాముడు ద్వారకకు తిరిగి రాక విదేహ రాజ్యానికి వెళ్ళిపోయాడు.


ద్వారకకు తిరిగి వచ్చాడు కృష్ణుడు. ఇట్లా అవమానాలూ, నిందలూ ఇంకా ఎక్కువయ్యాయి. మణి పట్ల లోభంతో అన్నగారినే తరిమేసాడని లోకులన్నారు. లోకులు పలు కాకులు కదా! 


ఇతరుల గుణాలను శ్లాఘించడానికి బదులు లోపాలనే ఎత్తి చూపిస్తూ ఉంటాం. మనం కూడా పత్రికలను చదువుతూ ఇష్టమైన నాయకుల్ని పొగుడుతూ ప్రతిపక్షాలను నిందిస్తూ ఉంటాం కదా. ఇట్టి మానవ ప్రవృత్తి యొక్క వివరాలు పురాణాలలో పుష్కలంగా ఉన్నాయి.


అక్రూరుడు - మణి


కృష్ణుడి రాక అక్రూరునకు దడ పుట్టింది. ఎప్పుడూ కృష్ణునితో కలిసిమెలిసి ఉండేవాడేమో. ఇప్పుడు దూరదూరంగా ఉంటున్నాడు. తేలు కుట్టిన దొంగలా, ద్వారకనుండి చల్లగా జారుకున్నాడు. శంకరులే మన్నారు? అర్థమనర్థం భావయ నిత్యం అని అనలేదా? డబ్బెంత పని చేస్తోందో చూసారా? ఎన్ని అనర్థాలను తీసుకొని వస్తుందో!


Friday, 23 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (63)



భగవానుడు శతధన్వుని జుట్టు పట్టుకున్నాడు. కొంతసేపు ముష్టియుద్ధం జరిగింది. భగవానుని ముందు అతడు నిలబడగలడా? ఇతని చేతిలో చంపబడడం అతను చేసుకున్న అదృష్టం అనాలి. అట్లా పద్ధతి కల్గించాడు కృష్ణుడు.


ఇట్లా జాంబవంతుణ్ణి ఓడించడం, ఇతణ్ణి చంపడం జరిగినా నీలాప నిందలు మళ్ళీ మొదలు. మణికోసం అతని శరీరాన్ని తడిమితే దొరకలేదు. ఎందుకంటే అది అక్రూరుని దగ్గర ఉంచాడు కాబట్టి గీతలో భగవానుడేమన్నాడు? 


వేదాహం సమతీతాని వర్తమానాని దార్జున 

భవిష్యాణి చ భూతాని మాంతు వేద న కశ్చన (7-28)


అనగా “ఓ అర్జునా! గతంలో ఏం జరిగిందో, వర్తమానంలో ఏం జరుగుతుందో, భావికాలంలో ఏం జరగబోతుందో అన్నీ నాకు తెలుసు. కాని నన్ను తెలుసుకొన్న వాడెవ్వడూ లేడు". ఇట్లా అన్నవాడే ఏమీ తెలియనట్లు నటించి శతధన్వుని దగ్గర మణి యుందని భావించాడు. మరొక అవతారమైన అన్నగారు దొరకలేదని నివేదించాడు.


ఇట్లా మానవులు వేసే నిందలను భరించాడు. అంతేకాదు అన్నగారి కోపాన్ని భరించాడు. అతని చంపాను, అతని దగ్గర మణి లేదన్న మాటలు అన్నగారు నమ్మారా? కారాలూ, మిరియాలు నూరాడు.


"నేనేదో మణిని అడుగుతాను నా దగ్గర బుకాయిస్తున్నావు ఎక్కడో దాచి వుంటావులే. ఋజుమార్గంలో వెళ్ళేవారు నీతో సఖ్యంగా ఉండలేరని" అన్నాడు.


"ఇట్లా నన్ను సందేహించకు, నువ్వే నన్ను శంకిస్తే ఎలా? నేను చెప్పింది నిజం. నన్ను వెదికి చూడు, నీకే తెలుస్తుంది” అన్నాడు కృష్ణుడు.