Monday 26 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (66)



అక్రూరుడు కనబడడం లేదేమిటి. ఒకవేళ అతనిదగ్గర ఉందా? అతడీ నగరంలో లేకపోవడమూ శుభశకునంగా భావించడం లేదు. తండ్రి పోవడం వల్ల కదా సత్యభామ కుమిలిపోతోంది? నగరం అంతా నన్ను సందేహిస్తోంది. మాటిమాటికీ నిందలేమిటి?" అని కృష్ణుడు చింతిస్తూ ఉండగా ఇంతలో నారద మహర్షి వచ్చాడు. ఎక్కడకు, ఎప్పుడు రావాలో నారదునకు బాగా తెలుసు. ఆయన కథను మలుపు త్రిప్పగల నేర్పున్నవాడు.


కుశల ప్రశ్నలయ్యాయి. నీవు దేవర్షివి, నీకు తెలియనిది ఏమీ లేదు. నాకు వచ్చిన సమస్యను పరిష్కరించు, కారణం చెప్పుమని కృష్ణుడడిగాడు. 


ఏమీలేదయ్యా! నీవు భాద్రపద చవితి నాటి చంద్రుణ్ణి చూసావు కదా, విఘ్నేశ్వరుని శాపం తగిలిందయ్యా అన్నాడు నారదుడు.


భాద్రపదం - పంచాంగంలో భేదాలు


భాద్రపద మన జంట నక్షత్రాలతో ఉన్నాయి. పూర్వా భాద్రమని, ఉత్తర భాద్రమని. ఒక్కొక్కప్పుడు ప్రోష్ఠ పదమని పిలువబడుతాయి. ఈ నక్షత్రాలలో ఏదో ఒకటి పూర్ణచంద్రునితో కలియగా దీనిని భాద్రపద మాసమని అంటారు. నక్షత్రాన్నే పేర్కొంటే అది ప్రోష్ఠపదమనే. ఇట్లా అన్ని నెలలు కూడా నక్షత్రం పేరు మీదుగానే ఉన్నాయి. ఒక్కొక్కసారి ఇది ఒక మాసం ముందుగా గాని ఆలస్యంగా గాని జరుగవచ్చు. నిజానికి సూర్యుడెప్పుడైతే ఆ నక్షత్రంలో సంక్రమణం చేస్తాడో అప్పుడు ఆ మాసం మొదలౌతుంది. అయితే ఈ సూర్యుని స్థితి, మరియు చంద్రుని స్థితి ఒక నక్షత్రంలో ప్రవేశించినపుడు సంబంధం లేకుండా ఉంటుంది. సూర్యుని ప్రవేశం ద్వారా మాసము లేర్పడడాన్ని సౌర మానం అంటారు. తమిళనాడులో ఈ పద్దతిని పాటిస్తారు. కర్ణాటక, ఆంధ్ర, ఉత్తర భారత దేశంలో ఎక్కువమంది చాంద్రమానాన్ని పాటిస్తారు. ఈ చాంద్రమానంలో అమావాస్య తరువాత వచ్చే రోజును క్రొత్తమాసానికి మొదటిరోజుగా పరిగణిస్తారు. ఇదంతా చంద్రగమనాన్ని బట్టి యుంటుంది. కనుక పున్నమి నాటి చంద్రుడు ఏ నక్షత్రానికైతే అతి సమీపంలో ఉన్నాడో ఆ నక్షత్రం పేరుతో మాసం మొదలవుతుంది.


No comments:

Post a Comment