Tuesday 14 April 2020

మన సంస్కృతియే మనకు శ్రీ రామ రక్ష (2)



ఒకప్పుడు మన సంస్కృతిలో బయటికి వెళ్లి రాగానే కాళ్ళు, చేతులు కడుక్కుని, నోరు పుక్కిలించి, అప్పుడు లోపలికి వచ్చేవారు. మరీ దూరం వెళితే, కొన్ని సందర్భాల్లో స్నానం చేసి మళ్లీ వేరే బట్టలు కట్టుకొని లోనికి వచ్చేవారు. ఎప్పుడు కరోనా వైరస్ వచ్చిన తర్వాత మనకు ఆ ఆ వైరస్ ఎక్కడ అంటుకుంటుందో అనే భయంతో చెప్పులతో ఇంట్లోకి రాకుండా చేతులు, కాళ్ళు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వస్తున్నారు. మరీ రోడ్డు మీద వెళితే స్నానం చేసి, ఆ బట్టలు అప్పుడే ఉతికి ఆరేసి, వేరే బట్టలు కట్టుకొని వస్తున్నారు. ఒకప్పుడు ఇది మనం పాటించిన సంప్రదాయం. అయితే కేవలం ఇలాంటి వైరస్‌ల నుంచి తప్పించుకోవడానికే ఈ సంప్రదాయం రాలేదు.

మన జీవితంలో ఎక్కువ సమయం గడిపే ప్రదేశం మన ఇల్లు. కార్యాలయంలో పని చేసి వచ్చినా లేదా బయటి ఎంత తిరిగినా ఇంటికే రావాలి. కాబట్టి మన ఇల్లు ప్రశాంతంగా ఉండాలి. అంటే ఇంట్లో పాజిటివ్ శక్తి అధికంగా ఉండాలి. మనము బయటికి వెళ్ళామనుకోండి,  అక్కడ  చాలా మంది వ్యక్తులు మనకు కనబడతారు. అందరికి రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఆలోచన అనేది ఒక శక్తి, అది మంచి ఆలోచన కావచ్చు, చెడు ఆలోచన కావచ్చు. మంచి ఆలోచన పాజిటివ్ శక్తి అనగా సకారాత్మక శక్తిని మనకు ఇస్తే, చెడు ఆలోచన నెగిటివ్ అనగా నకారాత్మక శక్తిని ఇస్తుంది. మనము బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి రకరకాల ఆలోచనలు మనతోపాటే వస్తాయి. మనల్ని చూసి చాలామంది చెడుగా (అసూయ, ద్వేషం మొదలైనవి) కూడా ఆలోచించవచ్చు. అవి కూడా మన మీద ప్రభావం చూపిస్తాయి. మనం దిష్టి అంటాం కదా అదే ఇది. మరి వీటన్నింటినీ ఇంట్లోకి మోసుకుని వెళ్లడం చాలా తప్పు. ఎందుకంటే ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. అందుకే మన పూర్వీకులు బయటికి వెళ్లి రాగానే కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, ఆ తర్వాతే లోపలికి వెళ్ళాలి అని నియమం పెట్టారు. ఎందుకంటే ఇలా చేయడం వలన మాత్రమే నకారాత్మక శక్తి వెళ్లి పోతుంది. కనుక మనము ప్రశాంతంగా ఉండవచ్చు. 

రెండవది ఏమిటంటే మనమంతా హిందువులం విగ్రహారాధన చేస్తాం, కొందరు అగ్నిహోత్రం కూడా చేస్తారు. మన ఇంట్లో ఉండే విగ్రహం కేవలం బొమ్మ కాదు అది దేవుడు, అది అమ్మ. అంటే మన ఇల్లు కూడా పవిత్రమైనదే. ఈ భావన అందరిలోనూ ఉంటుంది. అందుకే మన ధర్మంలో దేవుడు అంతటా వ్యాపించి ఉన్నాడని చెప్పినా, అధికంగా శుభ్రతకు భగవంతుడికి ముడిపెడతాము. లక్ష్మీ పూజ తీసుకోండి, లక్ష్మీదేవి పూజ చేస్తున్నామంటే ముందు మనం చాలా శుభ్రతను పాటిస్తాము. దానికి కారణం ఎక్కడ శుచి శుభ్రత ఉంటే అక్కడ లక్ష్మీ ఉంటుంది. పెద్ద పెద్ద పూజలు చేయకపోయినా కనీసం రోజు దీపం పెట్టినా, మన ఇంట్లో కూడా భగవంతుడు ఉంటాడు. అందుచేతనే ఎక్కడికి వెళ్లి వచ్చినా తప్పకుండా చెప్పులు బయటే వదిలి, కాళ్లు చేతులు, కడుక్కునే ఇంట్లోకి అడుగు పెట్టే సంప్రదాయం వచ్చింది. ఎవరైనా ఇంటికి వస్తే తప్పకుండా వాళ్ళకి కాళ్లు, చేతులు శుభ్రం చేసుకోవడానికి నీళ్లు ఇస్తాము. ఈరోజు మన ఇళ్ళల్లో ప్రశాంతత లేకపోవడానికి, అనారోగ్యం రావడానికి ఇది కూడా ఒక కారణం.      

కనుక కేవలం వైరస్‌లే కాదు, చికాకుల నుంచి మన ఇంటిని రక్షించుకోవాలన్నా, ఇది మనం తిరిగి పాటించడం ప్రారంభించాలి.

2 comments:

  1. శుభోదయం మిత్రమా అగ్నిహోత్రం గురించి విస్తృతంగా తెలుగు లో చెప్పగలరు..
    https://www.sanskritimagazine.com/rituals_and_practices/benefit-of-agnihotra-homam-radioactivity/

    https://www.sanskritimagazine.com/rituals_and_practices/process-agnihotra-homam/

    https://www.sanatan.org/en/a/category/natural-disasters-and-survival-guide/agnihotra

    https://agnihotra.pl/en/agnihotra/

    https://www.youtube.com/watch?v=gdBac8u14GY

    ReplyDelete
    Replies
    1. పేజీలో ఇంతకముందు అగ్నిహోత్రం గురించి చాలా విషయాలు చెప్పానండి... సెర్చ్ బాక్సులో వెతికితే దొరుకుతాయి... మీకు మిగితావి సమయం చూసుకుని చెబుతాను...

      Delete