Tuesday, 28 April 2020

త్రిమతాచార్యుల మధ్య విభేదాలు ఉన్నాయా ?



త్రిమతాచార్యుల మధ్య విభేదాలు ఉన్నాయా ?

అద్వైత స్థాపకులు, శివుని అవతారమైన ఆదిశంకరులు సా.శ.పూ.509 లో అవతరించారు. విశిష్టాద్వైత స్థాపకులు, ఆదిశేషుని అంశ అయిన శ్రీ రామానుజులు సా.శ.1071 లో అవతరించారు. హనుమంతుని అంశ, ద్వైత సిద్ధాంతాన్ని స్థాపించిన మధ్వాచార్యుల వారు సా.శ.1238 లో అవతరించారు.

శంకరులు సనాతనధర్మాన్ని కాపాడి, గందరగోళానికి గురైన హిందువులను తిరిగి ధర్మం దిశగా నడిపించి, సనాతన ధర్మాన్ని ఉద్ధరించారు, భరతజాతి ఐక్యతను కాపాడారు. దేశమంతా కాలినడకన పర్యటించడమే గాక, తాను వెళ్ళిన ప్రతిచోటా శ్రీ చక్రాలను ప్రతిష్టాపన చేసి, కుంభాభిషేకాలు నిర్వహించారు. అవైదిక మతాల్లోకి వెళ్ళిన హిందువులను తిరిగి ధర్మంలోకి తీసుకువచ్చారు. శంకరులు అవతరించేనాటికి క్రైస్తవం, ఇస్లాం మొదలైన అబ్రహామిక్ మతాలు ఇంకా పుట్టలేదు. అంటరానితనం సమాజంలో లేదు. (మనీషాపంచకం వచ్చిన ఉదంతం ఇక్కడ ప్రస్తావించవద్దు. దాని గురించి వివరణ ఇస్తాను...)

భగవద్రామానుజులు వచ్చేసరికి దేశం మీద ఇస్లాం దండయాత్రలు ప్రారంభమయ్యాయి. మహమ్మద్ గజనీ సోమనాథ్ అలాయాన్ని లూటీ చేశాడు. ఉత్తరభారతదేశంలో ఎన్నో ఆలయాలు కూల్చివేయబడ్డాయి, వాటి సంపద కొల్లగొట్టబడింది. దక్షిణభారతదేశంలో సైతం మెల్కోటె వరకు ఉన్న ఆలయాల మీద దాడి చేసి, ఉత్సవమూర్తులు సహా ఆలయ సంపదను కొల్లగొట్టారు విదేశీ ముష్కరులు. తాము బంధించిన క్షత్రియులతో తమ ఇంటి స్త్రీల మలాన్ని ఎత్తించే పని చేయించారు మహమ్మదీయ రాజులు. ఆ పనిని నీచమని, వారిని సమాజానికి దూరంగా పెట్టారు. రామనుజుల అవతార సమయానికి అంటరానితనం వచ్చింది. వైష్ణవమతాన్ని ఉద్ధరించడంతో పాటు శ్రీ రామానుజులు బలవంతంగా ఇస్లాం స్వీకరించినవారిని, అంటరానివారిగా భావిస్తున్న వారిని సైతం శ్రీ వైష్ణవులుగా మార్చి తిరిగి స్వధర్మంలోకి తీసుకుని వచ్చారు. దండయాత్రల్లో ధ్వంసమైన వైష్ణవ ఆలయాలను పునరుద్ధరించి, పాంచరాత్ర ఆగమం ప్రకారం పూజాదికాలు నిర్వర్తించేలా ఆజ్ఞాపించారు. మధ్వాచార్యులు సైతం ఇస్లాం దండయాత్రల సమయంలోనే అవతరించారు.

మనం గమనిస్తే శంకరాచార్యులకు భగవద్రామానుజులకు మధ్యలో 1500 సంవత్సరాల కాలం ఉంది. వారిద్దరు ఒకరికి ఒకరు వ్యతిరేకమని చెప్పడం ధర్మవ్యతిరేకుల రేపిన చిచ్చు మాత్రమే. ముగ్గురు ఆచార్యులు ఆచారవ్యవహారాలను బలపరిచారు, మతం మారిన హిందువులను తిరిగి స్వధర్మంలోకి తీసుకుని వచ్చారు. ముగ్గురూ మూడు సిద్ధాంతలను ప్రవచించారు. ఆ మూడు మూడు వేదాంత దర్శనాలు అనుకోవచ్చు. వాటి ఉద్దేశం ముక్తిని పొందడం. వాటి లక్ష్యం ఒక్కటే, కాకపోతే బోధలలో కొంత వ్యత్యాసం. దాన్ని పట్టుకుని ఆ ముగ్గురు ఒకరికి ఒకరు వ్యక్తిరేకమని చెప్పరాదు.

శ్రీ వైష్ణవులంతా విశిష్టాద్వైతాన్ని అనుసరిస్తారు. మధ్వసంప్రదాయం వారు ద్వైతాన్ని అనుసరిస్తారు. మిగితా హిందువులంతా అద్వైతాన్ని అనుసరిస్తారు. శంకరాచార్యులు స్థాపించిన షణ్మతాలలో వైష్ణవం కూడా ఉంది. మధ్వులు సైతం శివుడిని ఒప్పుకుంటారు. మన కలిసి ఉండటానికి వందకారణాలు ఉన్నాయి, కానీ విచిత్రంగా విడిపోవడానికి ఏదో ఒక కారణం వెతుక్కుంటున్నాము. వాళ్ళకే లేని గొడవలు మనకెందుకు ? మనం ఏ సంప్రదాయంలో ఉంటే ఆ సంప్రదాయం ప్రకారం ముక్తికి బాటలు వేయడం, అందరం కలిసి సనాతనధర్మాన్ని రక్షించుకోవడమే ఆ ఆచార్యులకు మనం ఇచ్చే నిజమైన గౌరవం. అంతేగానీ పరస్పరం వాదులాడుకోవటం కాదు. 

No comments:

Post a Comment