ఈ రోజు ప్రపంచ ధరిత్రీ దినోత్సవం - భూమాత ఎదురుకుంటున్న విపత్తులపై అందరికీ అవగాహన కల్పించడానికి 1970 నుంచి దీన్ని జరుపుతున్నారు. ఈ ఏడాది నేపథ్యం (థీం/ theme) - క్లైమెట్ యాక్షన్ - భూమిపై జరుగుతున్న వాతావరణ మార్పులపై మనం తీసుకోవాల్సిన చర్యలు, భూమికి అపాయం పొంచి ఉందని ఊరికే చెప్పుకుంటూ కూర్చోవడం కాక, దానికి తగినట్లు చర్యలు చెప్పటాలని చెప్పడమే దీని లక్ష్యం.
ఇప్పుడు మనం కరోనా అనే ఒక వైరస్ తోనే అతలాకుతలం అవుతున్నాము. కానీ ఇదే తరహాలో మనం భూమిని కాలుషితం చేస్తూ పోతే, ఇలాంటి విష వైరస్‌లు అనేకం పుట్టుకొస్తాయని శాస్త్రవేత్తలు చాలాకాలం క్రితం చెప్పారు. ఆ మధ్య పుట్టిన డెంగ్యూకు కారణం భూతాపమే (గ్లోబల్ వార్మింగ్). అదేగాక భూమిపై ఇంతకముందున్న విషక్రిములు సైతం జన్యువులను మార్పు (gene mutation) చేసుకుని మరింత శక్తివంతమై ప్రబలుతాయి, ఇప్పుడున్న సూక్ష్మజీవినాశకాలు (యాంటీ-బయోటిక్లు) పని చేయవని అనేక నివేదికలు చెబుతున్నాయి. రేపు కరోనా సంగతి కూడా అంతే. దానికి వ్యాక్సిన్ కనుక్కోవచ్చు కానీ ఆ వ్యాక్సిన్ ఎల్లకాలం పని చేస్తుందని కాదు, కొంతకాలానికి ఆ వ్యాక్సిన్‌ను సైతం తట్టుకునేలా ఇది మళ్ళీ జన్యువుల మార్పు చేసుకోవచ్చు. ఇప్పుడు భూమ్మీదనున్న అనేక వ్యాధికారక క్రిముల పరిస్థితి ఇదే.
కరోనా అనేది వాతావరణ మార్పులు మనకు చూపిన చిన్న టీజర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది.
వైరస్‌లకు ఉన్న ఒకానొక లక్షణం gene mutation. అవి వేగంగా తమ జన్యువులను మార్పు చేసుకోగలవు. మనం వాటికి ఔషధం కనుక్కుంటే, అవి ఔషధాన్ని తట్టుకుని, ఇంకా ఎలా బలపడగలవో చూసుకుంటాయి. మందులు సైతం వాటిని ఏమీ చేయలేనంతగా వాటి జన్యువులను అవి మార్చుకుంటూ ఉంటాయి. అది నిరంతర ప్రక్రియ. దాన్ని సైన్సు ఆపలేదు. ఎందుకంటే అది వాటి లక్షణం. ఇది ప్రతీ శాస్త్రవేత్తకు తెలుసు.
కరోనా (కోవిడ్-19) సూక్ష్మక్రిమినే పరిశీలించండి. చైనాలో ప్రబలిన దాని జన్యుపటం ఒక విధంగా ఉంటే, ఐరోపాలో వ్యాపించింది ఇంకో విధంగా ఉంది. భారతదేశంలో దాని జన్యుపటం మరోలా ఉంది. అందులో కూడా తబ్లిగీ జమాత్ కు వెళ్ళివచ్చినవారి సోకిన వైరస్ మిగితావారికి సోకినదానికంటే మరింత బలంగా ఉందని వార్తాపత్రికల్లో చూశాము.
కనుక మనం చేయగలిగినది ఏమైనా ఉంటే, ఇటువంటి వైరస్‌లు కొత్తవి పుట్టకుండా చూసుకోవాలి. అంటే వాతావరణ మార్పులకు కారణమవుతున్న మానవుల చర్యలను పునఃసమీక్షించుకోవాలి. అవసరమైతే మన అభివృద్ధి విధానాలను పూర్తిగా మార్చుకోవాలి. ఇందులో తాత్సారం చేయకూడదు. లేదంటే ఇప్పుడున్న పరిస్థితులు మరలా మరలా ఉత్పన్నమవుతాయి. మానవుడు ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించడం జరగని పని, అతడు చేయగలిగింది ప్రకృతితో కలిసి జీవించండం, భూమాతను శరణువేడటం.
హిందువులుగా మనం కూడా ఈ విషయంలో తీవ్రంగా ఆలోచించాలి. మాతా భూమిః పుత్రోహం పృథివ్యాః అని అధర్వవేదం చెబుతోంది. ఈ భూమి నాకు తల్లి, నేను ఆమె పుత్రుడను అని అర్ధం. మన ధర్మం మనకు ఈమె కేవలం భూమి కాదు, భూమాత అని, నేలతల్లి అని చెప్పింది. మరి తల్లికి కీడు చేసేలా మనం బ్రతికితే ఆ బ్రతుక్కి ఒక అర్ధం ఉందా? మనం చేసే పూజలు ఫలిస్తాయా? ఉపాసనలు సిద్ధిస్తాయా ?
నా అనుభవంతో నేను చెప్పేది ఒక్కటే. మనం ఏ మంత్రోపాసన చేయకున్నా, పెద్ద పెద్ద పూజలు చేయకున్నా, భూమాతకు, ప్రకృతికి హాని కలిగించకుండా జీవించగలిగితే, ముక్తికి అవసరమైన వేదాంతజ్ఞానాన్ని భూమాతయే మనకు అందిస్తుంది. చాలా సులభంగా తీసుకెళ్ళి శ్రీ మన్నారాయణుని ఒడిలో కూర్చోబెడుతుంది. చాలా గారాభంగా చూసుకుంటుంది.
భూతాపం, వాతావరణ మార్పులు, కాలుష్యం మొదలైనవాటి మీద ఇంతకముందు అనేక విషయాలను సవివరంగా గణాంకాలతో ఫేస్‌బుక్‌తో పాటు మన బ్లాగులో 2013 నుంచి రాశాను. ఈ అంశం మీద అనేక వ్యాసాలు ఉన్నాయి.అవి చూడగలరు.
No comments:
Post a Comment