Sunday 19 April 2020

మన సంస్కృతియే మనకు శ్రీ రామ రక్ష (6)



భౌతిక దూరం

ఇది మన సంస్కృతిలో మనకు కనిపిస్తుంది. మనది షేక్‌హ్యాండ్ సంస్కృతి కాది, నమస్కారం చేసే సంస్కృతి. నమస్కారం వెనుక ఉన్న 'ఒక కారణం' చెప్పుకుందాము...

ఈ సృష్టిలో ప్రతి వస్తువుకి (కదిలేవి, కదలవిని; జీవం ఉన్నవి, లేనివి) జీవ-అయస్కాంత, జీవ-విద్యుత్ క్షేత్రం ఉంటుంది. దాన్ని 'ఆరా' అంటారు. ప్రతి వస్తువు విశ్వంలో, విశ్వాంతరాళంలో జరిగే మార్పులకు అనుకూలంగానో, ప్రతికూలంగానో ప్రతిస్పందిస్తుంది. తన నుంచి కొన్ని తరంగాలను, శక్తులను ప్రసరిస్తుంది. మనుష్యులకు కూడా ఇది వర్తిస్తుంది. గొప్ప ఉపాసకులు, సిద్ధపురుషులు, గురువులను చూసిన వెంటనే మన మనస్సు ప్రసన్నం అవుతుంది, కొందరు మన సమీపానికి వచ్చినా, లేదా మనమే వారి దగ్గరకు వెళ్ళినప్పుడు అప్రయత్నంగానే ప్రశాంతత ఆవరిస్తుంది. కొందరిని చూడగానే చికాకు, కోపం కలుగుతాయి. దానికి కారణం వారి మనస్సులో ఉన్న భావాలు, వారు ప్రసరించే శక్తి. జాలి, దయ, ప్రేమ, కరుణ మొదలైన సద్గుణాలు కలిగినవారు మంచి ఆరాను కలిగి ఉంటే, కుళ్ళు, ఈర్ష్యా, అసూయ, ద్వేషం మొదలైన దుర్గుణాలు కలిగినవారు చెడు ఆరా కలిగి ఉంటారు. మంచి వారి ఆరా గొప్ప కాంతితో ప్రజ్వలిస్తూ ఉంటే, చెడ్డవారి ఆరా చీకటి వంటి నల్లని కాంతితో ఉంటుంది. గొప్ప ఉపాసకులు ఎదుటివారి ఆరాను చూడగలరు. సాధారణ మనిషికి అయితే అతని ఆరా 4-5 అడుగుల దూరం వరకు ప్రసరిస్తూ ఉంటుంది. అంటే మనం ఒక మామూలు వ్యక్తికి మరీ దగ్గరగా వెళితే, మనం అతని క్షేత్రంలోకి ప్రవేశిస్తున్నాం అని అర్ధం. నిజానికి చెడు తరంగాల నుంచి మన ఆరా మనల్ని రక్షిస్తూ ఉంటుంది. కానీ మనమే కావాలని వెరొక వ్యక్తికి మరీ దగ్గరగా వెళ్ళినప్పుడు, అతని ఆరా బలంగా ఉంటే, అది మన ఆరా క్షేత్రంలోకి చొచ్చుకుని వస్తుంది. ఫలితంగా మన ఆరాలో అసమతుల్యత ఏర్పడి, తర్వాతా చాలా సమయంవరకు మనం ఆ చెడు ఫలాలను అనుభివిస్తాము. అందుకే మనం సాధ్యమైనంత వరకు తెలియని వారికి భౌతిక దూరం పాటిస్తాము. కుటుంబ సభ్యులతో తప్ప ఇంకెవరితోనూ రాసుకుని, పూసుకుని తిరగము. ఇదేమీ అంటరాని తనం కాదు. ఈరోజు కరోనా వచ్చాకా ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తులతో కనీసం 6 అడుగుల దూరం పాటించాలని చెబుతున్నారు. కానీ మన సంప్రదాయంలో ఇదే ముందే ఉంది. మనం అందరికీ నమస్కారం చేయడానికి ఇది కూడా ఒక కారణం. 

ఎవరు ఎలాంటి వారు, వారు మీకు మేలు చేస్తారో, కీడు చేస్తారో తెలియకుండా, వారి మనస్సులను చదివే శక్తి లేని మనం ఎవరు పడితే వారితో చేతులు ఎందుకు కలపాలి? అది అవసరమా? ఎంతైనా కరోనా మనకు చాలామంచి పాఠాలు నేర్పించింది.

కానీ గొప్ప గురువుల ఆరా చాలా దూరం వరకు తన క్షేత్రాన్ని కలిగి ఉంటుంది.అందుకే సత్పురుషుల దగ్గరకు వెళితే చాలు ఎంతో ఆనందం, ప్రశాంతత కలుగుతాయి. భగవాన్ రమణ మహర్షి, కంచి పరమాచార్య మొదలైన మహానుభావుల చిత్తరువులను చూడగానే మనస్సు చాలా ప్రసన్నమవుతుంది. దానికి కారన్ణం వాళ్ళ ఆరా అన్ని భౌతిక పరిమితులను అధిగమించింది. వారు భౌతిక దేహంతో లేకపోయినా, వారి శక్తి మొత్తం విశ్వాన్ని చైతన్యం చేస్తూనే ఉంటుంది. వారంతా మహానుభావులు, అందుకే గురువుల చిత్రాలు మన ఇంటి నిత్యం కనిపించే విధంగా పెట్టుకోవాలి. ఇంకా ఈ ఆరా గురించి అనేక విశేషాలు ఇంకోసారి చెప్పుకుందాము.   

No comments:

Post a Comment