Thursday, 23 April 2020

మన సంస్కృతియే మనకు శ్రీ రామ రక్ష (7) - మైల - శుభ్రత



మైల - శుభ్రత 

జననమరణాలు సహజము. అవి లేకుండా ప్రపంచం ఉండదు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ పంచభూతాల నుంచి వచ్చినదే. కనుక తిరిగి పంచభూతాల్లో కలిసిపోతుంది. ఒక జీవి మరణించిన మరుక్షణం నుంచి దాని దేహం క్షీణించటం (కుళ్ళిపోవటం - ఆంగ్లంలో డీకంపోజ్ (decompose) అంటారు) మొదలవుతుంది. అక్కడ కోట్లల్లో క్రిములు పుట్టి దాన్ని క్షీణింపజేస్తాయి. మనిషి దీనికి అతీతంకాదు.  

చనిపోయిన కొన్ని నిమిషాల తర్వాత ముందు క్షీణతకు గురయ్యేది మెదడు. మరణం సంభవించిన కొన్ని క్షణాల్లోనే, అందులోని కణాలు నశించి, నీరు విడుదలవుతుంది. తర్వాత శరీరంలో శక్తిని బాగా వాడుకునే అవయవాల క్షీణత మొదలవుతుంది. ఆ రాత్రికే ప్రేగులను క్రిములు తినేసి, మిగితా శరీరం మీద పడతాయి. అప్పుడవి విషవాయువులను విడుదల చేస్తాయి, ఆ కారణంగా శరీరం ఉబ్బి, వాసన రావడం మొదలవుతుది. చాలా కణజాలం (Tissues) కరిగిపోతుంది. కానీ పలుచని చర్మం కనురెప్పలు వంటివి ఎండిపోతే, శరీరంలో కొవ్వు అధికంగా ఉండే ప్రదేశాలు సబ్బులాంటి జిడ్డు గలిగిన పదార్ధంగా మారిపోతుంది. తర్వాత శరీరం పసుపు-ఆకుపచ్చ వర్ణాలకు మారిపోతుంది. రెండవ రోజు నుంచి నాల్గవ రోజు లోపు క్రిములు అంతటా వ్యాపిస్తాయి. అమోనియా, హైడ్రోజెన్ సల్ఫైడ్ లాంటి విషవాయువులను విడుదల చేయగా, శరీరం ఉబ్బుతూ, దుర్గందము వెలువడుతుంది. 8-10 రోజుల్లో శరీరం ఆకుపచ్చని వర్ణం నుంచి ఎర్రని వర్ణంలోకి మారుతుంది. కొన్ని వరాల తర్వాత గోళ్ళు మరియు పళ్ళు పడిపోతాయి. నెల తర్వాత శరీరం ద్రవంగా మారిపోతుంది. ఇది మానవ శవం యొక్క శరీరంలో జరిగే ప్రక్రియ. (మేకప్పులు, పౌడర్లు పూసి, జాగ్రత్తగా కాపాడుకున్న శరీరం చివరకు ఇలా అవుతుంది. అయినా మనకు ఎంత అహంకారం, ఎన్ని పట్టింపులు, ఎంత నిరంకుశంగా వ్యవహరిస్తామో !? అవన్నీ అవసరమా?)

ఎవరైనా చనిపోతే, తప్పకుండా చూడటానికి వెళ్ళడం మన సంస్కృతి మనకు నేర్పింది, ఇంటి ముందు నుంచి శవం వెళుతున్నా, ఒకసారి బయటకు వెళ్ళి ఆ శవానికి నమస్కరించి, 'నారాయణ, నారాయణ' అని, లేదా ఇష్టదైవాన్ని స్మరించి, ఆ జీవునకు సద్గతి లభించాలని కోరుకోవాలి. అది సాటి మనిషిగా మన కర్తవ్యం అని మన ధర్మం బోధించింది. కానీ అదే సమయంలో కొన్ని నియమాలను విధించింది. శవాన్ని చూసి ఇంటికి రాగానే, ఇంట్లోకి రాకుండా, ఏ బట్టలతో అయితే శవాన్ని చూసి వచ్చామో, అదే బట్టలతో తలస్నానం చేయమని శాస్త్రం చెప్పింది. ఒకవేళ శవం వెళ్ళిన దారిలో నడిస్తే, మాములు స్నానం సరిపోతుందని చెప్పింది.  

ఒకరి ఇంట్లో మరణం సంభవిస్తే అక్కడంతా సూక్ష్మక్రిములు ఉంటాయి. కనుక పరామర్శకు వచ్చినవారు ఇంటికి వెళ్ళి స్నానం చేస్తారు. కానీ ఆ శవం వెళ్ళేవరకు మరణం సంభవించిన ఇంట్లో పొయ్యి వెలిగించకూడదు. నిజానికి ఊర్లలో అయితే, ఈనాటికి కూడా ఎవరైనా మరణిస్తే, ఆ శవాన్ని స్మశానానికి తీసుకుని వెళ్ళేవరకు ఊరిలోని ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగదు. ఆ జీవునకు ఇచ్చే గౌరవంగా దీన్ని భావిస్తారు. శవం వెళ్ళిన తర్వాత ఇళ్ళను శుభ్రం చేస్కుని, అప్పుడు భోజనం చేస్తారు. ఊళ్ళో వాళ్ళ సంగతి దేవుడెఱుగు. ఇప్పుడు ఏ ఇంట్లో మరణం సంభవించిందో, ఆ ఇంట్లో పొయ్యి ఏంటీ, ఏకంగా శవం పక్కన కూర్చుని టిఫిన్‌లు, బిర్యానీలు తింటున్నారు, శీతలపానీయాలు త్రాగుతున్నారు. అసలు ఆ వాతావరణం అలా తినడానికి తగినదా? అది నిజంగా శుభ్రతయేనా ? చదువుకున్నవారు hygiene (హైజిన్) అంటారు కదా, మరి మీ హైజిన్ ఏదయ్యా? 

ముందు ఆ ప్రేతము (శవానికి) గౌరవం ఇవ్వాలి. శాస్త్రం ప్రకారం అయితే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అంతిమశంస్కారం పూర్తి చేయాలి. శవాన్ని పాచిపెట్టకూడదు, అంటే శవంతో రాత్రి నిద్రచేయకూడదు. సూర్యాస్తమయంలోపు దహనసంస్కారం అయిపోవాలి, ఒకవేళ రాత్రి మరణం సంభవిస్తే మరుసటి రోజు సుర్యాస్తమయంలోపు. అలాగాక శవాన్ని అలాగే ఉంచితే, దాన్ని పాచిశవం అంటారు పెద్దలు. పైన చెప్పిన విషయాలను ఇక్కడ సమన్వయం చేసుకుంటే మన సంస్కృతి మనకు ఎంత శుభ్రత నేర్పిందో అర్ధమవుతుంది. అసలు మన హిందువులు శవానికి అగ్నిసంస్కారం ఎందుకు చేస్తారనే విషయం మీద ఇంతకముందే ఒకసారి వివరణ ఇచ్చినందున ఇక్కడ మళ్ళీ దాన్ని ప్రస్తావించడంలేదు. వివరాలకు ఆ పోస్ట్ చూడండి. 
http://ecoganesha.blogspot.com/2016/05/208-2.html

No comments:

Post a Comment