మన పురాణాల్లో మనకు 'వైరి భక్తి' అనే అంశం కనిపిస్తుంది. అంటే దేవుడిని ద్వేషించడం కూడా ఒక రకమైన భక్తియే అంటాయి మన శాస్త్రాలు. ఉదాహరణకు రాక్షసులు చూడండి - ఎల్లవేళలా భగవంతుడిని ద్వేషిస్తూనే ఉన్నారు. హిరణ్యకశిపుడు విష్ణుద్వేషంతో తన మనస్సుని నింపుకుని చివరకు విష్ణుదర్శనం పొందాడు. అక్కడ ముఖ్యమైన విషయం దేని గురించి ధ్యానిస్తున్నాడని. వాళ్ళ ద్వేషం ఎంతవరకు వెళ్ళిందంటే తింటున్నా, నిద్రపోతున్నా, ఏ పని చేస్తున్నా, భగవంతుని మీద ద్వేషంతో ఆయనే గుర్తుకు వచ్చేవాడు. చివరకు ఆయన చేతిలో హతమైనా, ఆ నిరంతర ధ్యానమే వారికి ఆయన దర్శన భాగ్యాన్నిచ్చింది.
ఇప్పుడు మన సంగతి చూద్దాము. ఈ ప్రపంచంలో అత్యంత పాజిటివ్ ఆలోచన/ శక్తి ఏది అంటే భగవంతుడు. కానీ ఈ రోగం వచ్చిన తర్వాత నుంచి గమనించండి. ఏమవుతుందో అనే భయము, టి.వి.ల్లో పదే పదే కరోనా, కరోనా అంటూ వార్తలు చూపించడంతో మన మనస్సంతా ఆ కరోనా మీదనే పడింది. అదేమీ పాజిటివ్ విషయం కాదు, పైగా ఒక విషక్రిమి. దాని గురించి నిత్యం ఆలోచించడం అవసరమా? అది చాలా నెగటివ్ శక్తిని మనలో కలిగిస్తుంది. రోగం రాకుండదంటే మనలో రోగనిరోధక శక్తి ఉండాలి, శారీరికంగా దృఢంగా ఉండాలి. కానీ పదేపదే ఆ మహమ్మారి గురించి, లేదా ఏదైనా ఇలాంటి నెగటివ్ భావనలు చేస్తూ ఉంటే, భయపడుతూ ఉంటే మానసికంగా మనం బలహీనపడతాము. మనస్సు బలంగా ఉంటే శరీరం బలహీనంగా ఉన్న, ఎలాంటి విపత్తు వచ్చిన ఎదురుకోగలము. కానీ శరీరంలో బలముండి, మనస్సు బలహీనమైతే, అప్పుడు ఆ ప్రభావం శరీరం మీద ఖచ్ఛితంగా పడుతుంది. శరీరం బలహీనమై రోగాన్ని ఆహ్వానిస్తుంది. అది చాలా ప్రమాదకరము. అంటే వద్దు వద్దు అంటూ ఆ వైరస్ ను శరీరంలోకి రమ్మని పిలుస్తారా?
మన దేశంలో కరోనా ప్రభావం పెద్దగా ఉండదు. దానికి ముఖ్యమైన కారణాలు కొన్ని చెబుతాను... ఒకటి మన ఆహారపద్ధతులు. మన పూర్వీకుల నుంచి మనకు కొన్ని ఆహారపద్ధతులు వస్తున్నాయి. ఇప్పటికీ మనలో చాలామంది వాటినే అనుసరిస్తున్నారు. అందుకే మనకు రోగనిరోధక శక్తి ఎక్కువ. రెండవది, మన దేశంలో అనాదిగా కులదేవతలు (ఇలవేల్పు లేదా ఇంటిదేవుడు అని కూడ అంటారు) మరియు గ్రామదేవతల ఆరాధన జరుగుతూనే ఉంది. పైగా ఇది ఋషిభూమి. కనుక మన దేశాన్ని, మనల్ని వాళ్ళే రక్షిస్తారు. అందులో ఏ సందేహం లేదు.
కనుక మీ మనస్సును ఆ కరోనా మహమ్మారి మీద పెట్టకుండా, దైవం మీద నిలపండి. టి.వి.లు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలకు తక్కువ సమయం కేటాయించండి. భయం కలిగించేవి చూడవద్దు. సద్భావనలు చేయండి. లోకాసమస్తా సుఖినోభవంతు అని పదే పదే మనస్ఫూర్తిగా మననం చేయండి. మన కోసం కాక అందరికోసం ప్రార్ధన చేయడం హిందూధర్మం మనకు నేర్పింది. ఇప్పుడు అదే చేద్దాము. మన సంస్కృతియే మనకూ, దేశానికి, ప్రపంచానికి శ్రీ రామ రక్ష. నన్ను నమ్మండి... మనకు ఏమీ కాదు.
ఓం నమో నారాయణాయ
No comments:
Post a Comment