Thursday, 16 April 2020

మన సంస్కృతియే మనకు శ్రీ రామ రక్ష (3)



ఆహారం సిద్ధిం చేసే సమయంలో పరిశుభ్రత పాటిస్తున్నామా? 

ఈరోజు మనకు లోపించింది ఆ పరిశుభ్రతే. వంట ఈరోజు చేస్తే, దానికి ముందురోజు రాత్రే లేదంటే రెండు మూడు రోజుల క్రితమే కూరగాయలు అన్ని తిరిగేసి డబ్బాలో పెట్టి ఫ్రిజ్లో పెట్టుకుంటారు. అలా చేస్తే వాటిలో అసలు పోషకాలు ఉంటాయా లేదా అనేది దేవుడికే తెలుసు. ఇక స్నానం చేయడం లాంటిది ఏమీ ఉండదు, పొద్దున లేవగానే పాచి నోటితోనే ఈ పదార్ధాలన్నీ కుక్కర్లో పెట్టి, అప్పుడు కాలకృత్యాలు తీర్చుకుంటూ, పళ్ళు తోముకుంటూ, మధ్య మధ్యలో వంట చూస్తారు. ఏ బట్టలు పడితే ఆ బట్టలు కట్టుకుంటారు. వాటితోనే మల మూత్ర విసర్జనకు వెళ్లి వస్తూ, చేతులు సరిగ్గా శుభ్రం చేసుకోక, అవే బట్టలతో వంటింట్లోకి వెళ్ళిపోయి, కూరగాయలు  తరగాల్సినవి ఉంటే తరిగి, ఏవైనా వంటకు వాడే గిన్నెలు తుడవాల్సినవి ఉంటే ఆ బట్టలతోనే తుడిచేస్తారు. మధ్యలో ఫోన్లో మాట్లాడతారు; దగ్గినా, తుమ్మినా రుమాలు లేదా మరే ఇతర వస్త్రమైనా అడ్డు పెట్టుకోవాలన్న శ్రద్ధ ఉండదు. అమీబియాసిస్ అనే ఒక రోగం ఉంది. దానికి అల్లోపతి వైద్యంలో మందు లేదు. మలం యొక్క అవశేషాల ద్వారా అది వస్తుంది. ఇలా అపరిశుభ్రంగా ఉండి వంటజేస్తే, చేతులపై లేదా గోర్ల మధ్య కానీ ఆ క్రిములు ఉండిపోతే, రోగనిరోధకశక్తి తక్కువగా ఉండే వాళ్ళకి ఈ అమీబియాసిస్ అనే వ్యాధి సోకుతుంది. మధ్యలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడినప్పుడు నోట్లోలో ఉన్న తుంపరలు వండుతున్న ఆహారం మీద పడతాయి. వాటిలో కూడా రకరకాల క్రిములు ఉంటాయి. ఇది మనం ఇప్పుడు పాటిస్తున్నదే. ఇది ఎంతవరకు మంచిది అనేది ఆలోచించండి.  

మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది ఒకప్పుడు మన సంప్రదాయంలో మడి అనే ఆచారం ఉండేది. అది ఇప్పటికీ ఉందనుకోండి, కానీ మనం పాటించడంలేదు, ఒకప్పుడు అన్నం వండాలన్నా, పూజ చేయాలన్నా, మడి కట్టుకుని చేసేవారు. ముఖ్యంగా పితృ కార్యాలు చేసినప్పుడు మడి ఖచ్చితంగా పాటించేవారు. ముందుగా లేవగానే కాలకృత్యాలు తీర్చుకుని, శుభ్రంగా స్నానం చేసి, ఉతికి ఆరేసిన శుభ్రమైన బట్టలనే కట్టుకునేవారు. ఆ తర్వాత వేరే ఏ ఇతర వస్తువులు ముట్టుకోకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా, నేరుగా వంటింట్లోకి వెళ్ళి, వంటకు సంబంధించిన పని మొదలుపెట్టేవారు. మడిలో ఉన్నంతసేపు ముట్టుకోవడం కానీ కబుర్లు చెప్పడం కానీ చేసేవారు కాదు. పూర్తిగా దైవ ధ్యానంతో పని చేసేవారు. అందరికీ భౌతిక దూరం పాటించేవారు. మడి పాటించే చాలా కుటుంబాల వారు ముక్కుకు నోటికి కూడా ఒక గుడ్డ కట్టుకునేవారు. ఎందుకంటే ఆహారం వండుతున్న సమయంలో మాట్లాడినా, దగ్గినా, తుమ్మినా, ఆ తుంపరలు ఆహారం మీద పడకూడదు. అలా పడితే అది ఎంగిలి అవుతుంది. అప్పుడు నైవేద్యానికి పనికిరాదు అని. పైగా దేవునికి నివేదన అంటే ఎంతో పవిత్రత ఉండాలి కదా. ఒకవేళ మధ్యలో మలమూత్రాదులకు వెళితే, మళ్ళీ స్నానం చేసి, శుభ్రమైన వేరే వస్త్రాలు ధరించి వచ్చేవారు. కేవలం బ్రాహ్మణ కుటుంబాల్లో ఇలా ఉంటుంది అనుకుంటే తప్పు ఎందుకంటే నా మిత్రులు చాలామంది ఎస్సీల్లో కూడా ఈ నాటికీ ఈ ఆచారం ఉంది. దేవుడికి నివేదన చేయాలి అనుకునే రోజు అన్ని వస్తువులు శుభ్రంగా కడిగి చేస్తారు. ప్రత్యేకమైన పాత్రలను దేవునికై వాడతారు. ఎంత పరిశుభ్రత ఉందో చూడండి. ఇలా వండిన ఆహారం ఎంత మంచిది ఆరోగ్యానికి ?!. కానీ ఈ రోజు మనం చదువుకున్నాం గనక మనకు మడి మూఢాచారం. 

No comments:

Post a Comment