Saturday 18 April 2020

మన సంస్కృతియే మనకు శ్రీ రామ రక్ష (5)



నివేదన ఎందుకు?

ఆహారానికి కొన్ని దోషాలు ఉంటాయి. అనగా కొన్ని సహజంగా వస్తాయి, ఉదాహరణకు ముల్లంగి, వెల్లుల్లి తమోగుణాన్ని కలిగిస్తాయి. అది వాటి గుణదోషం. అదిగాక విత్తనాలను పండించిన విధానం, వాటిని అంగడికి తీసుకొచ్చే క్రమంలో ఏవైనా తప్పులు దొర్లితే వాటికి కొన్ని దోషాలు ఏర్పడతాయని పెద్దలు చెబుతారు. అదేగాక అన్నం వండిన వ్యక్తి ప్రభావం కూడా ఆహరం మీద పడుతుంది. అతడు ఎలాంటి వాడో, ఆ ఆహారం ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో మనకు తెలియదు. అందునా అతని చేతికి రాకముందు అతను ఏ వర్తకుని వద్ద ధాన్యం కొన్నాడో, ఆ వర్తకుడు అన్యాయం చేసి ఉండచ్చు. అది కూడా ఆ ధాన్యం గ్రహిస్తుంది. ఇలాంటి అన్ని దోషాలు పోయి, ఆ ఆహరం దోషరహితం అవ్వడానికి మనం ఆహారాన్ని నివేదన చేస్తాము. 

ఇప్పుడు బయట నుంచి ఆహారం 'ఆర్డర్' చేసేవాళ్ళు ఉన్నారు. స్విగ్గీ, జొమాటో అంటూ అనేక కంపెనీలు కూడా ఉన్నాయి. ఆ ఆహారం ఎలా సిద్ధం చేసారో తెలీదు. పైగా చాలా సందర్భాల్లో ఆహారం అమ్మే సంస్థలకు అది ఒక వ్యాపారం మాత్రమే. కనుక అలాంటివి తినడం అనేది మీ ఇష్టం. తప్పనిసరి అయితే తప్ప తినకపోవడమే మంచిది.

మళ్ళీ మళ్ళీ ఒక విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. మనం హిందువులము. విగ్రహారాధన మనకు మాత్రమే ఉంది. ఎడారి మతాలు దాన్ని అంగీకరించవు, వాళ్ళకు అలాంటి వ్యవస్థ లేదు. మన ఇంట ఉన్నది ఒక విగ్రహం కాదు, అది సాక్షాత్తు భగవంతుని స్థూలరూపము. ఇంట్లో మన పిల్లల ఎదుగుదలకు ఎలా ఆహారం పెడతామో, దైవానికి అదే భావనతో పెట్టాలి. మనం పెట్టిన ఆహారాన్ని భగవంతుడు కళ్ళ ద్వారా చూసి, దాన్ని గ్రహించి సంతృప్తి చెందుతాడు. కనుక మనం తినేది భగవంతుని ఉచ్ఛిష్టము, అనగా ఆయన తినగా మిగిలినది. దేవతల ఆహారం అమృతం గనక మనం నివేదించిన ఆహారం అమృతమై మనకు మేలు చేస్తుంది. కనుక మనం ఏమి తిన్నా, నివేదన చేసే తినాలి. టీ, కాఫీలూ అయినా సరే, భగవంతునికి ఒకసారి చూపించి, అది కూడా ప్రసాదంగానే భావించాలి. అప్పుడు అది మనశ్శుద్ధిని ఇస్తుంది. 

చాలామంది ఆ పదార్ధంలో ఆ పోషక విలువ ఉంది, ఇందులో ఈ విటమిన్ ఉందంటూ చెప్పి అవి తినమంటారు. శ్రీరామనవమికి పానకం ఎందుకంటే రోగనిరోధశక్తి పెరగడానికంటారు. అవును నిజమే. కానీ కేవలం పానకంలో మిరియాలు, బెల్లం, యాలకులు, శొంఠి కలపడం వలన అది రోగనిరోధక శక్తిని ఇవ్వదు. శ్రీ రామచంద్ర మూర్తికి నివేదన చేస్తాం చూడండి, అది దానికి మరింత శక్తినిస్తుంది. నివేదన చేయనంతవరకు అది ఒక ఎనర్జీ డ్రింక్, ఒక ఔషధం. కానీ నివేదన చేశాక అది అమృతతత్త్వాన్ని ఇచ్చే దివ్య ఔషధం. వస్తువులుకున్న గుణం కంటే హిందువులు దైవానికి చేసే నివేదన మరింత శక్తినిస్తుంది. అది మన విశ్వాసం, సత్యము.

ఇక తినే సమయంలో భగవంతుని నామస్మరణ చేయమన్నారు. అలా నామస్మరణ చేస్తూ మౌనంగా తిన్న ఆహారం శరీరాన్ని మంత్రపూతం చేస్తుంది, మనస్సుకు మంచి ఆలోచనలు కలిగిస్తుంది, ఆహారంలో ఏదైనా దోషాలుంటే అవి మనస్సుకు చేరకుండా చూస్తుంది. గుర్తుంచుకోండి, టి.వి., వాట్సాప్ చూస్తూ, ఫోన్ మాట్లాడుతూ తిన్న ఆహారం వంటబట్టదు. అలా చూస్తూ మీరు ఎంత తిన్న సంతృప్తి ఉండదు. ఊబకాయం, అజిర్తి మొదలైనవి రావడానికి కారణం అదే. ఒక సమయంలో ఒకే పని చేయాలి. కనీసం భోజనము, పూజ, యోగా మొదలైనవి చేసే సమయంలో. అంతెందుకు, ఇంట్లో గృహిణులు చాలాపని చేస్తారు. అయినప్పటికీ కొందరికి ఊబకాయం వస్తుంది, మరలా దాని కోసం వ్యాయామం చేస్తారు. ఎందుకంటే మీకు తెలియకుండా (unconscious) ఆ పని చేసినా, దాని ప్రభావం అత్యల్పం. ఆ పని చేసినా జాగరూకత (conscious) గా చేయాలి. అది భోజనమైనా సరే. అప్పుడే వంటబడుతుంది, సంతృప్తి కలుగుతుంది.

No comments:

Post a Comment