Monday, 18 March 2024

శ్రీ గరుడ పురాణము (123)

 


నవనిధుల, ఐశ్వర్యవంతుల లక్షణ, స్వభావాలు


నైమిషారణ్యంలో సూతమహర్షి అనుగ్రహభాషణం (శివాది దేవతలకు విష్ణు భగవానుని పురాణోపదేశంలాగే) కొనసాగుతోంది.


“మునులారా! విష్ణుభగవానుని ద్వారా అష్టనిధులను గూర్చి తెలుసుకొన్న బ్రహ్మదేవుడు దేవతలకా విషయాన్ని గూర్చి చెప్పాడు. మేము మా గురుదేవుల ముఖతః విన్నాము.


పద్మ, మహాపద్మ, మకర, కచ్చప, ముకుంద, కుంద (నంద), నీల, శంఖ అనేవి అష్టనిధులు. మిశ్ర అను తొమ్మిదవ నిధితో కలసి ఇవి నవనిధులైనాయి.


మానవులలో కొందరి వద్ద ఈ నిధులుంటాయి. ఏ నిధి వున్న వానికెటువంటి లక్షణాలుంటాయో చూద్దాం.


పద్మనిధి లక్షణాలుండే మనిషి సాత్త్వికుడూ, దయగలవాడూ, అయివుంటాడు. ఈయన బంగారం, వెండి వంటి విలువ గల ధాతువులను సంపాదించి యతులకూ, దేవతలకూ, యాజ్ఞికులకూ వాటిని దానంగా ఇస్తుంటాడు. మహాపద్మ చిహ్నంతో లక్షితుడైన వ్యక్తి కూడా తాను సంపాదించిన ధనాదులను ధార్మికులైన జనులకు దానం చేస్తుంటాడు. మొత్తానికి పద్మ, మహాపద్మనిధి సంపన్నులు సాత్త్వికులు.


మకరనిధి సంపన్నులు ఖడ్గ, బాణ, కుంతాదులను సంపాదిస్తుంటారు. వారు రాజులతో స్నేహం చేస్తుంటారు. శ్రోత్రియ బ్రాహ్మణులకు దానాలిస్తుంటారు. ఎల్లపుడూ యుద్ధతత్పరులై వుంటారు. యుద్ధాల వల్ల ద్రవ్య సంపాదన చేస్తారు.


కచ్ఛపనిధి లక్షణాలున్న వ్యక్తి తామసగుణాలను కలిగివుంటాడు. ఎవరినీ నమ్మడు. సంపద బాగానే వున్నా తానూ అనుభవించడు. ఎవరికీ దానమూ చేయడు. ఏ రహస్య ప్రదేశంలోకో ఏకాంతంగా పోయి తన సంపదనంతటినీ భూమిలో పాతి వుంచుతాడు.


No comments:

Post a Comment