స్నానానికి పూర్వం పాలుగారే చెట్టునుండి గానీ, మాలతి, ఉత్తరేను, మారేడు గన్నేరు కర్ర నుండిగాని తీసిన పలుదోముపుల్లతో ఉత్తరం వైపుగానీ తూర్పువైపు గానీ తిరిగి పవిత్ర స్థలంలో కూర్చొని పళ్ళు తోముకోవాలి.
ఆ తరువాత ఆ పుల్లను శుభ్రంగా కడిగి పవిత్రస్థానంలో పారవేయాలి. తరువాత స్నానం చేసి దేవతలకూ, ఋషులకూ, పితృగణాలకూ విధ్యుక్తంగా తర్పణా లివ్వాలి. శాస్త్ర ప్రకారం స్నానానికి కూడా సంధ్యోపాసనకులాగే అంగభూత ఆచమనం చేయాలి. సంధ్యోపాసనలో అంగరూపంలోనే కుశోదక బిందువులతో, ఆపోహిష్ఠా... మున్నగు వారుణ మంత్రాలనూ, సావిత్రీ మంత్రాన్నీ జపిస్తూ ఒళ్ళు తుడుచుకోవాలి. ఇదే క్రమంలో ఓంకారాన్నీ భూఃభువఃస్వః అనెడి వ్యాహృతులనూ జోడించి గాయత్రిని జపించి సూర్యభగవానునికి అర్ఘ్యమివ్వాలి *. (* సంధ్యోపాసన సంపూర్ణంగా ఈ కాండ లోనే 35వ అధ్యాయంలో విశదీకరింపబడింది.)
సంధ్య వార్చని ద్విజుడు అపవిత్రుడి క్రిందే లెక్క.
ప్రాంగ్ముఖం సతతం విప్రః సంధ్యోపాసన మాచరేత్ |
సంధ్యాహీనో, శుచిర్నిత్య మనర్హః సర్వకర్మసు ॥
యదన్యత్కురుతే కించి న్నతస్య ఫలభాగ్భవేత్ ॥
అనన్య చేతసః సంతో బ్రాహ్మణా వేదపారగాః ॥
ఉపాస్య విధి వత్సంధ్యాం ప్రాప్తాః పూర్వపరాంగతిం |
యో న్యత్ర కురుతే యత్నం ధర్మకార్యే ద్విజోత్తమః ||
విహాయ సంధ్యా ప్రణతిం సయాతి నరకాయుతం |
తస్మాత్ సర్వప్రయత్నేన సంధ్యోపాసనమాచరేత్ ॥
(ఆచార 50/21-25)
సంధ్యోపాసన ద్వారా యోగమూర్తి, పరమాత్మ, భగవంతుడునైన నారాయణుడు పూజితుడవుతాడు. కాబట్టి ద్విజుడు పవిత్రుడై తూర్పు వైపు తిరిగి కూర్చుని నిత్య సంయత భావంతో పది లేదా వంద లేదా వేయిమార్లు, వీలును బట్టి, గాయత్రి మంత్ర జపాన్ని చేయాలి. తప్పనిసరిగా రోజూ వేయిమార్లు గాయత్రి మంత్రజపాన్ని చేయడం సర్వోత్కృష్టమైన దైవకార్యంగా సర్వ వైదిక వాఙ్మయంలోనూ ప్రశంసింపబడుతోంది. గాయత్రి లేక ద్విజుడు లేడు.
ఏకాగ్రచిత్తంతో, ఉదయమే, భాస్కర భగవానుని ధ్యానించాలి. ఋగ్యజుస్సామ వేదాలలో కనుపించు వివిధ సౌరమంత్రాల ద్వారా ఆయనను ధ్యానించి, తలను నేలపై ఆనించి ఈ క్రింది మంత్రాలతో నమస్కరించాలి.
ఓం ఖఖోల్కాయ శాంతాయ కారణత్రయ హేతవే ॥
నివేదయామి చాత్మానం నమస్తే జ్ఞానరూపిణే ।
త్వమేవ బ్రహ్మ పరమమాపోజ్యోతీ రసోఽమృతం ॥
భూర్భువః స్వస్త్వ మోంకారః సర్వోరుద్రః సనాతనః । (ఆచర 50/28-30)
ఈ ఉత్తమ శ్లోకాన్నీ, ఆదిత్య హృదయాన్నీ త్రిసంధ్యలలోనూ చదివాకనే ఇంటికి రావాలి. ఇంటికి వచ్చాక మరల శాస్త్రోక్తంగా ఆచమనం చేయాలి.
No comments:
Post a Comment