Friday 29 March 2024

శ్రీ గరుడ పురాణము (134)

 


అశ్వని, అనురాధ, రేవతి, మృగశిర, మూల, పునర్వసు, పుష్య, హస్త, జ్యేష్ఠ నక్షత్రాలున్న సమయాలు యాత్రకు ప్రశస్తాలు.


హస్త, చిత్ర, స్వాతి, విశాఖ, అనురాధ నక్షత్రాలు నిత్యంగానూ, ఉత్తర ఫాల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర అశ్వని, రోహిణి, పుష్యమి, ధనిష్ఠ, పునర్వసు నక్షత్రాలు సామాన్యంగానూ నవీన వస్త్రధారణకు శ్రేష్ఠములు.


కృత్తిక, భరణి, ఆశ్లేష, మఘ, మూల, విశాఖ, పూర్వాభాద్ర, పూర్వాషాఢ, పూర్వఫల్గునీ నక్షత్రాలను అధోముఖీ నక్షత్రాలంటారు. ఈ నక్షత్రాల్లో వాపీకూప తటాకాలనూ, సరోవరాలనూ, దేవాలయాదుల నిర్మాణంలో పునాదులనూ తవ్వించుట మొదలుపెట్టాలి. అలాగే భూమిలో దాగియున్న స్వర్ణాది లోహాలకూ, ఖనిజాలకూ పాతిపెట్టబడిన నిధులకూ భూమిని త్రవ్వడానికి ఈ నక్షత్రాలు బహు ప్రశస్తమైనవి.


రేవతి, అశ్వని, చిత్ర, స్వాతి, హస్త, పునర్వసు, అనురాధ, మృగశిర, జ్యేష్ఠా నక్షత్రాలను పార్శ్వముఖి నక్షత్రాలంటారు. ఈ నక్షత్రాలున్నపుడే ఏనుగు, ఒంటె, గుఱ్ఱం, ఎద్దు వంటి పశువులను వశపఱచుకొనే ప్రయత్నం చేయాలి. అంటే తాళ్ళు కట్టుట, జీను వేయుట, మచ్చిక వంటివి చేయాలి.


పైన చెప్పబడిన పార్శ్వముఖి నక్షత్రాలలోనే పొలాలలో విత్తులు నాటడం, రాకపోకలు, చక్ర యంత్రాలు, రథాలు, నౌకాదుల క్రయాలు, నిర్మాణ ప్రారంభాలూ చేయడం శుభకరం.

రోహిణి, ఆర్ద్ర, పుష్య, ధనిష్ఠ, ఉత్తరఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, శతభిష (వారుణ) శ్రవణ ఈ తొమ్మిది నక్షత్రాలనూ ఊర్ధ్వముఖీ నక్షత్రాలంటారు. వీటిలో రాజ్యాభిషేకం, అధికార స్వీకరణం వంటి కార్యాలనుచేయాలి. అభ్యుదయ ప్రదాయకములైన కార్యాలను చేపట్టాలి.


చవితి, షష్ఠి, అష్టమి, నవమి, ద్వాదశి, చతుర్దశి, అమావాస్య, పున్నమి తిథులు అశుభకారకాలు. ఈ తిథులలో శుభకార్యాలను చేయరాదు.


No comments:

Post a Comment