Thursday, 14 March 2024

శ్రీ గరుడ పురాణము (119)

 


మరికొన్ని దానాల ఫలాలిలా వుంటాయి.


వస్త్రదానం - చంద్రలోకం,

అశ్వదానం - అశ్వనీ కుమారలోకం,

గోదానం - విపులసంపత్తి

అనడుహదానం(ఎద్దు) - సూర్యలోకం

వాహనం, శయ్య - భార్య, అభయం

ధాన్యదానం - శాశ్వతసుఖం,

వేదదానం (చదివించడం) - బ్రహ్మసాన్నిధ్యం,

జ్ఞానోపదేశం - స్వర్గలోకం,

అగ్నికోసం కట్టెల దానం - గొప్ప తేజస్సు


రోగపీడితుడైన వ్యక్తికి ఆశ్రయం, ఔషధాలు, తైలాలు, భోజనము దానమిచ్చి ఆరోగ్యవంతుని చేసి పంపించిన వారికి శాశ్వతారోగ్యం, సుఖం, దీర్ఘాయువు లభిస్తాయి. అసిపత్రవనం నరకానికి వెళ్ళే మార్గంలో వున్న ముళ్ళ అడవి. ఈ లోకంలో అవసరమున్న వారికి చెప్పులూ, గొడుగులూ విరళంగా దానం చేసినవారికి దేహాంతమైనాక ఆ వనంలో ఏ బాధా కలగదు.


ఉత్తరాయణం, దక్షిణాయనం, మహావిషువత్కాలం, సూర్య చంద్ర గ్రహణాలు, కర్కాటక, మేష, మకరాది సంక్రాంతులు వచ్చినపుడు బ్రాహ్మణులకిచ్చే దానాలు ఆ దాతకు పరలోకంలో అక్షయ సుఖాలను ప్రాప్తింపజేస్తాయి. ఈ దానాలను ప్రయాగ, గయ మున్నగు క్షేత్రాలలో చేస్తే కొన్ని రెట్లు ఫలితం లభిస్తుంది.


* ఉత్తరాయణం - సూర్యుడు మకర-మిధున రాశుల మధ్య వుండే కాలం మాఘం నుండి ఆషాఢ మాసం దాకా.


* దక్షిణాయనం - సూర్యుడు కర్కాట- ధేనురాశుల మధ్య వుండే కాలం ఇది శ్రావణ మాసం ఉండి పుష్యమాసం దాకా వుంటుంది.


* మహావిషువత్కాలం - పగలూ రాత్రీ సరిసమానంగా వుండే కాలం. ఇది తులా, మేష సూర్య సంక్రాంతులలో వస్తుంది.


No comments:

Post a Comment