తరువాత అగ్నిని ప్రజ్వలింపజేసి విధివత్తుగా అగ్నిదేవునికి ఆహుతులను ప్రదానం చేయాలి. ఇంటి యజమాని అశక్తుడైనపుడు అతని ఆజ్ఞ మేరకు పుత్ర పత్ని, శిష్య, సహోదరులలో నెవరో ఒకరు ఈ ఆహుతులనివ్వాలి. మంత్రం లేకుండా ఈ కర్మలకు ఫలం ఎక్కడా దక్కదు. అలాగే పద్ధతి లేకుండా చేసినా దక్కదు.
తరువాత దేవతలకు నమస్కరించి అర్ఘ్య, పాద్య, చందన, సుగంధ ద్రవ్యానులేపన, వస్త్ర, నైవేద్యాది ఉపచారాలతో పూజించి, తన గురువుగారిని కూడా పూజించాలి. తరువాత తన శక్తి సమయాల మేరకు కొంతసేపు వేదాధ్యయనం, వేదాభ్యాసం, ఇష్టమంత్రజపం చేసి అపుడు శిష్యులకు చదువు చెప్పాలి. ఈ చదువులో భాగములే వేదార్థ ధారణ కలిగించుట. వేదార్థ విచారమును చేయించుట. ధర్మశాస్త్రాదులను ముందు చదివించి తరువాత చర్చలను చేపట్టుట, ఉపనిషత్ వ్యాకరణాది వేదాంగాలలో తాను ముందుగా నిష్ణాతుడై శిష్యుల చేత అధ్యయనం చేయించుట మున్నగునవి. ఇదీ ఒక సద్రాహ్మణుని ద్వారా సమాజం ఆశించే వరదానం. తరువాత అవసరం మేరకు రాజు వద్దకు గానీ శ్రీమంతుల గృహాలకు గానీ పోయి వారి చేత దైవ, ఇతర కార్యాలను చేయించి ధనార్జన చేయాలి.
మధ్యాహ్నకాలంలో మరల స్నానం చేయాలి. ముందుగానే శుద్ధి చేయబడిన మట్టినీ, పూలనూ, అక్షతలనూ, తిలలనూ, కుశలనూ, ఆవుపేడనూ ఒకచోట పెట్టి సిద్ధం చేసుకోవాలి. నది, చెఱువు, తటాకము, సరోవరము వంటి చోటికి పోయి స్నానం చేయాలి. ఇందాక సిద్ధం చేసిన మట్టితో తలనూ శరీరాన్నీ తోముకొని స్నానం చేయాలి. ఆవుపేడను కూడా ఇలాగే వినియోగించాలి. (అయిదు ముద్దలను ఉసిరికాయలంతేసి తయారు చేసుకోవాలనీ ఈ పంచమృత్తికాపిండాలు లేకుండా స్నానానికి బయలుదేరడమే దోషమనీ శాస్త్రం చెప్పింది).
జలాశయం తీరంలోనే మృత్తికా గోమయాదులను వంటికి పూసుకొని వరుణదేవతకు సంబంధించిన మంత్రాలతో జలాశయంలోని నీటిని అభిమంత్రించి మరల సంపూర్ణ స్నానం చేయాలి. జలంపై భక్తి గౌరవాలను కలిగియుండాలి. ఎందుకంటే అది విష్ణు స్వరూపం. ప్రణవస్వరూపుడైన సూర్యుని దర్శిస్తూ మూడుమార్లు జలంలో మునకలు వేయడంతో స్నానం సంపూర్ణమవుతుంది. తదనంతరం ఆచమనం చేసి మిగతా మంత్రాలను చదవాలి. ముందుగా ఆచమనం చేస్తూ ఈ మంత్రాన్ని చదవాలి.
అంతశ్చరసి భూతేషు గృహాయాం విశ్వతోముఖః ॥
త్వం యజ్ఞస్త్వం వషట్కార ఆపోజ్యోతీ రసోఽమృతం। (ఆచార 50/45, 46)
ద్రుపదాదివ... అనే మంత్రాన్ని పూర్తిగా మూడుమార్లు జపించి, ప్రణవ, వ్యాహృతులతో సావిత్రీ మంత్రాన్ని మూడుమార్లు ఉచ్చరించాలి. విద్వాంసులు అఘమర్షణ మంత్రాలను కూడా చదవాలి.
No comments:
Post a Comment