భువనకోశ వర్ణన ప్రియవ్రత మహారాజు వంశం
మనుపుత్రుడైన ప్రియవ్రతునకు పదిమంది కొడుకులు కలిగారు. వారు అగ్నీధ్రుడు, అగ్నిబాహువు, వపుష్మాన్, ద్యుతిమాన్, మేధ మేధానిధి, భవ్యుడు, శబలుడు, పుత్రుడు, జ్యోతిష్మాన్.
వీరిలో మేధ, అగ్నిబాహువు, పుత్రుడు అనువారు గొప్ప యోగీశ్వరులు. జాతిస్మరులు (అనగా పూర్వజన్మజ్ఞానం కలవారు), మహా సౌభాగ్య (అంటే ధనంకాదు) శీలురు. రాజ్యం పట్ల గానీ ఇతర సాంసారిక విషయాలపై గాని వారు ఏ మాత్రమూ ఆసక్తి చూపక పోవడంతో ప్రియవ్రతుడు మిగతా ఏడుగురికీ సప్తద్వీపసమన్వితమైన పృథ్విని పంచేశాడు.
యాభైకోట్ల యోజనాల్లో విశాలంగా పఱచుకొని వున్న ఈ పృథ్వి నదిలో తేలియాడే నౌకలాగా అశేషజలరాశిపై బంతి వలె తేలియాడుతున్నది.
జంబూ, ప్లక్ష, శాల్మల, కుశ, క్రౌంచ, శాక, పుష్కర- అనునవి సప్తద్వీపాలు. ఇవి లవణ, ఇక్షు, సురా, ఘృత, దధి, దుగ్ధ, జల- అనే సప్తసముద్రాలచే చుట్టబడియున్నవి. ఈ ద్వీపాలు, సముద్రాలు మనం చెప్పుకుంటున్న క్రమములోనే ఒకదానికి తరువాతిది రెండింతల విస్తీర్ణంలో వున్నాయి.
జంబూ ద్వీపంలో మేరువను పేరు గల పర్వతమొకటుంది. అది ఒక లక్ష యోజనాల విస్తీర్ణంలో పఱచుకొనివున్నది. దాని యెత్తు ఎనభై నాలుగు వేల యోజనాలు. అది పదహారు వేల యోజనాల క్రిందికి భూమిలోకి పాతుకుపోయి వుంది. మేరు పర్వత శిఖర విస్తృతి ముప్పది రెండు వేల యోజనాలు.
No comments:
Post a Comment