మద్యపానం చేసే ద్విజుడు అగ్నివర్ణ సదృశ ద్రావకాన్ని గాని పాలు, నెయ్యి, గోమూత్రాలనుగాని సేవించి పుణ్యక్షేత్రంలో ఇక మద్యం ముట్టనని ప్రమాణం చేయడం, ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవడం ద్వారా ఆపానసంబంధి పాపాన్ని పోగొట్టుకోవచ్చు.
రాజదండన వుంటే యమదండన వుండదంటారు కదా! ఈ నానుడి స్వర్ణచోరుని విషయంలో పూర్తిగా నిజమైంది. బంగారం దొంగిలించి దొరికి పోయినవాడికి రాజదండన ద్వారా ఆ పాపం నశిస్తుంది.
గురుపత్నీగమనం చేసినవాడు తనంత పొడవే వున్న ఒక ఇనుప స్త్రీమూర్తిని తయారు చేయించి దానిని అగ్నిలో వుంచి ఇక కరిగిపోతుందనగా పైకి తీయించి దాని సర్వాంగాలూ తగిలేలాగా గాఢంగా కౌగలించుకోవాలి; లేదా బ్రహ్మహత్యా పాతకనాశక ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి; లేదా నాలుగైదుమార్లు చాంద్రాయణవ్రతాన్నాచరించాలి. అప్పుడే ఆ ద్విజుడు ఆ ఘోరపాపము నుండి విముక్తుడు కాగలడు.
మహాపాతకులతోడి సాంగత్యం వల్ల మహాపాతకుడైన వాడు దాని నుండి విముక్తి పొందాలంటే వాని సంగడికాడు చేసిన మహా పాతకానికి చెప్పబడిన సంగడికాడు చేసిన మహాపాతకానికి చెప్పబడిన ప్రాయశ్చిత్తాన్నే వాడూ చేసుకోవాలి; లేదా తనకున్న సర్వస్వాన్నీ దానమిచ్చేయాలి; లేదా చాంద్రాయణ, అతికృచ్ఛవ్రతాలను చేయాలి.
గయ మున్నగు పుణ్యక్షేత్రాలకు యాత్రలు చేయడం, ప్రతి అమావాస్యనాడూ శంకర భగవానుని పూజించడం, బ్రాహ్మణులకి భోజనాలు పెట్టడం ఈ పుణ్యకార్యాల ద్వారా కూడా పాపాలను నశింపజేసుకోవచ్చు.
ప్రతి కృష్ణ చతుర్దశినాడూ ఒక సంవత్సరం పాటు ఉపవాసముండి ప్రశాంతచిత్తులై పవిత్రనదిలో స్నానం చేసి ఓంకారయుక్తంగా యమ, ధర్మరాజ, మృత్యు, అంతక, వైవస్వత, కాల, సర్వభూతక్షయ నామమంత్రాలనుచ్చరిస్తూ ఒక్కొక్క మంత్రానికీ ఏడేసి తిలలతో జలాంజలులతో కూడిన తర్పణలివ్వడం వల్ల కూడా జనులు సమస్త పాప విముక్తులు కావచ్చు.
ఈ వ్రతాలను చేస్తున్నంత కాలం శాంతంగా ఇంద్రియ నిగ్రహంతో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉపవాసముంటూ బ్రాహ్మణులను పూజిస్తూవుండాలి.
No comments:
Post a Comment