అనంతరం
ఓం ఆపోహిష్ఠా మయోభువః, ఇదమాపః ప్రవహత, అనే మంత్రాలనూ వ్యాహృతులనూ పఠిస్తూ శరీరాన్ని తుడుచు కోవాలి. మరల ఆపోహిష్టా... ఇత్యాది మంత్రాలనూ అఘమర్షణ మంత్రాలనూ మూడేసి మార్లు జపించడం ద్వారా అఘమర్షణ విధిని పూర్తిచేయాలి. పిమ్మట ద్రుపదాదివ... లేదా గాయత్రి లేదా 'తద్విష్ణోః పరమం పదం' మున్నగు మంత్రాలను చదవాలి. ఓంకారాన్ని పలుమార్లుచ్చరిస్తూ శ్రీహరిని స్మరించాలి. అఘమర్షణ మంత్రాలను చదువుతున్నప్పుడు దోసిట్లో నీటి నుంచుకొని చివర్లో దానిని తలపై జల్లుకొంటే పాతకాలన్నీ పారిపోతాయి. సంధ్యోపాసన ముగియగానే ఆచమనం చేసి పరమేశ్వరుని స్తుతించాలి. పుష్పాంజలిని తలపై పెట్టుకొని సూర్యభగవానుని తలచుకొంటూ మంత్రం చదివి నీటిలో వదలివేయాలి.
ఉదయిస్తున్న సూర్యుని చూడరాదు. విశేష ముద్ర ద్వారానే ఆయనను దర్శించాలి. ఓం ఉదుత్యం..., చిత్రం... తశ్చక్షు.... ఓం హం సః శుచిషద్... అనే మంత్రాలనూ, సావిత్రి మంత్రాన్నీ, సూర్య సంబంధి వైదిక మంత్రాలనూ సూర్యునుద్దేశించి చదవాలి. తరువాత పూర్వాగ్రకుశాసనంపై కూర్చుని సూర్యుని దర్శిస్తూ స్పటిక, రుద్రాక్ష లేదా పుత్ర జీవ రుండమాలను తిప్పుతూ విధిహితంగా మంత్రం జపించాలి.
శక్తిగలవారు తడిబట్టలతో జలాశయ మధ్యంలో మొల లోతుననిలబడి ఈ మంత్ర జపాలన్నీ చేసుకోవాలి. లేనివారు పొడిబట్టలు కట్టుకొని పవిత్ర స్థలంలో కుశాసనంపై కూర్చుని చేసుకోవచ్చు. జపానంతరం ప్రదక్షిణ చేసి భూమి పై సాష్టాంగపడి సూర్యునికి నమస్కరించి లేచి ఆచమనం చేసి తన శాఖానుసారము, స్వాధ్యాయం చేసుకోవాలి. తరువాత దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణలివ్వాలి. మంత్రప్రారంభంలో ఓం కారాన్నీ, చివర్లో నమఃను ప్రయోగిస్తూ ప్రత్యేక దేవ, ఋషి, పితృగణాలకు 'తర్పణలిస్తు న్నాను' అని శబ్దిస్తూ ఇవ్వాలి. క్రమంగా జంధ్యాన్ని ఉపవీతీ, నివీతీ, ప్రాచీనవీతీ దశలలోకి మార్చుకోవడం మరచిపోరాదు. క్రోధాదులను మనసులోకి రానీయకుండా పుష్పాలను పట్టుకొని పురుషసూక్తాన్ని చదివి వాటిని భగవంతునికి సమర్పించాలి. సమస్త దేవతలూ జలంలో వ్యాపించి వుంటారు. కాబట్టి జలం ద్వారా వారందరూ పూజింపబడతారు. ఈ పూజను చేసేవానికి అనగా పూజకునికి సమాహితచిత్తము అత్యంతావశ్యకము. దేవతలందరినీ తలచుకొని ఒక్కొక్కరికీ వేరువేరుగా పుష్పాంజలులను సమర్పించడం ప్రశస్తమైన పూజావిధి.
No comments:
Post a Comment