Monday, 11 March 2024

శ్రీ గరుడ పురాణము (116)

 


మునులారా!* దేవతారాధన లేకుండా ఏ వైదిక కర్మయు పుణ్యప్రదంకానేరదు. కాబట్టి సమస్త కార్యాల ఆదిమధ్యాంతాలలో హృదయంలో హరిని ధ్యానించుకోవాలి. 


(*ఇక్కడ భారతీయులారా! మానవులారా! అని పెట్టుకోవాలి. ఎందుకంటే విష్ణువు, బ్రహ్మ, సూతమహర్షి బోధించినది శివాదిదేవతలకు, వ్యాసునికి, శౌనకాది మహామునులకు కాదు; వారి ద్వారా మనకి)

ఓం తద్విష్ణోరితి... అనే మంత్రాన్నీ పురుషసూక్తాన్నీ మనసులో అనుకుంటూనే వుండాలి. శరణాగతి చేస్తూనే వుండాలి.


విష్ణువు పట్ల అనురక్తచిత్తుడు, శాంతస్వభావుడునైన భక్తుడు తద్విష్ణో..., అప్రేతే సశిరాః అనే మంత్రాలతో పూలనభిమంత్రించి విష్ణువుకి సమర్పించాలి. * పంచయజ్ఞాలను ఆ దేవదేవుని కంకితంగా నిర్వర్తించాలి. (* దేవయజ్ఞ, భూత యజ్ఞ, పితృయజ్ఞ, మానుష యజ్ఞ, బ్రహ్మ యజ్ఞాలు పంచయజ్ఞాలు.)


వైశ్యదేవమే దేవయజ్ఞం. కాకి మున్నగు ప్రాణులకు బలులిచ్చేది భూతయజ్ఞం. బిచ్చగాళ్ళకు ఇంటి వెలుపల అన్నం పెట్టాలి. పితృదేవతలు ప్రీతి చెందాలంటే వారినుద్దేశించి ప్రతిరోజూ ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి. పితరులకు నిత్యం చేసే శ్రాద్ధకర్మనే పితృయజ్ఞమంటారు. ఇది ఉత్తమ గతులను ప్రాప్తింపజేస్తుంది. తరువాత బంధువులతో కలసి మౌనంగా భోంచెయ్యాలి. ఎట్టి పరిస్థితిల్లోనూ అన్నాన్ని నిందించరాదు.


మునులారా! ఈ పంచయజ్ఞాలు చేయకుండా అన్నం తినేసే మూఢాత్ముడు వచ్చే జన్మలో పక్షి కడుపున పుడతాడు. ప్రతిదినమూ యథాశక్తి వేదాభ్యాసమూ, పంచయజ్ఞాలూ చేసే వారి పాపాలన్నీ శీఘ్రమే పటాపంచలయిపోతాయి. మోహం వల్ల గాని బద్దకం చేత గానీ దేవతార్చన చేయకుండానే అన్నం తినేసేవాడు కష్టదాయకమైన నరకంలో పడి ఆ తరువాత పంది కడుపున పుడతాడు.


ఇక అశౌచమనగా అపవిత్రము. అపవిత్రము నిత్య పాపవర్ధకము. అపవిత్ర వ్యక్తుల సంసర్గం అశౌచాన్ని తెస్తుంది. వారిని త్యజిస్తే మానవుడు పవిత్రుడవుతాడు.


విద్వాంసులైన బ్రాహ్మణులు మైల పట్టిన పది దినాలనూ అశౌచంగానే పరిగణిస్తారు. ఇవి జనన, మృత్యువుల కారణంగా ఏర్పడతాయి.


మైల నుండి క్షత్రియులు పన్నెండు దినాలకూ, వైశ్యులు పదిహేను రోజులకూ, శూద్రులయితే ఒక నెలకి శుద్ధులౌతారు. ఎందుకంటే వారికి క్రమంగా అన్నేసి రోజులూ అశుచి వుంటుంది.


సన్యాసులకు మైల అంటదు. అశౌచముండదు. గర్భస్రావం జరిగిన ఇంట్లో అది ఎన్ని నెలలకు జరిగిందో అన్ని రాత్రుల పాటు అశౌచముంటుంది. (అధ్యాయం - 50) 

No comments:

Post a Comment