Saturday 30 March 2024

శ్రీ గరుడ పురాణము (135)

 


కృష్ణపాడ్యమి, బుధవారంనాడు పడిన విదియ శుభదినాలు. మంగళునితో కలిసిన తదియ, శనితో కలిసిన చవితి, గురువారం నాడు పడిన పంచమి, శుక్రవారం షష్టి, షష్టి మంగళగ్రహం కలిసి పడిన రోజులు మంచి రోజులు. అలాగే బుధవారం సప్తమి, మంగళ లేదా ఆదివారాల్లో అష్టమి, సోమవారం నవమి, గురువారం దశమి కలసి వచ్చిన రోజులు శుభదినాలు. ఏకాదశి రోజున గురు లేదా శుక్రవారాలు, బుధవారం ద్వాదశి, శుక్ర మంగళవారాల్లో త్రయోదశి, శనివారం చతుర్దశి, గురువారం నాడు పడిన అమావాస్య పున్నమి రోజులు కూడా శుభప్రదాలే.


ద్వాదశి - ఆదివారం, ఏకాదశి సోమవారం, దశమి మంగళవారం, నవమి - బుధవారం, అష్టమి - గురువారం, సప్తమి - శుక్రవారం, షష్టి - శనివారం యోగించిన వాటిని దగ్ధ దినాలంటారు. ఇటువంటి తిథి - దగ్ధ యోగ సమయాల్లో యాత్రల వంటి శుభకార్యాలను మొదలెట్టకూడదు. పాడ్యమి, నవమి, చతుర్దశి అష్టమి తిథులు బుధవారం నాడు పడితే మరీ ప్రమాదం. ఆ రోజుల్లో పక్క వూరికి కూడా బయలుదేరే ఆలోచనే చేయరాదు.


మేష-కర్కాటక సంక్రాంతి అష్టమితో గాని, కన్య-మిథున సంక్రాంతి అష్టమితో, వృష కుంభ సంక్రాంతి చవితితో, మకర తుల సంక్రాంతి ద్వాదశితో, వృశ్చిక సింహ సంక్రాంతి ద్వాదశితో, వృశ్చిక సింహ సంక్రాంతి దశమితో, ధను- మీన సంక్రాంతి చతుర్దశితో కలసి పడిన రోజులు మహాదగ్ధ దినాలు. ఇవి కష్టదాయకాలు. ఈ తిథుల్లో నూతన ప్రయత్నాలు చేయరాదు.


మహాదేవాదులారా! రవివారంతో విశాఖ, అనురాధతో జ్యేష్టతిథి, సోమవారంతో పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాలు, మంగళవారంతో ధనిష్ఠ, శతభిష, పూర్వాభాద్రలు, బుధవారంతో రేవతి, అశ్వని, భరణులు, గురువారంతో రోహిణి, మృగశిర, ఆర్ద్రలు, శుక్రవారంతో పుష్య, ఆశ్లేష ముఖలూ, శనివారంతో ఉత్తరఫల్గుని, హస్త, చిత్రలూ యోగిస్తే ఆ దుర్యోగం ఉత్పాతాలను కలిగిస్తుంది. ఆయా కాలాల్లో యాత్రాదికార్యాలు ప్రారంభిస్తే ఉత్పాతాలు, మృత్యువు రోగాలు సంభవించవచ్చును.


ఆదివారంతో మూల, సోమవారముతో శ్రవణ, మంగళవారంతో ఉత్తరాభాద్ర, బుధవారంతో కృత్తిక, గురువారంతో పునర్వసు, శుక్రవారంతో పూర్వఫల్గుని, శనివారంతో స్వాతి కలిసొస్తే మాత్రం అది అద్భుత శుభయోగం. దాన్ని అమృత యోగమంటారు. ఆ రోజుల్లో చేపట్టే కార్యాలన్నీ సిద్ధిని పొందుతాయి.


విష్కంభయోగం అయిదు గడియలూ (120 నిముషాలు) శూలయోగం ఏడు గడియలూ, గండ, అతి గండయోగాల్లో ఆరేసి గడియలూ, వ్యాఘాత, వజ్ర యోగాల్లో తొమ్మిదేసి గడియలూ, వ్యతీపాత, వైదృతి, పరిఘ యోగాల్లో పూర్తికాలమూ మృత్యుతుల్యములు. మిక్కిలి కష్టదాయకములు. సర్వకర్మలనూ పరిత్యజించవలసిన సమయాలివి.


ఆదివారంతో హస్త, గురువారంతో పుష్య, బుధవారంతో అనురాధా నక్షత్రాలు, శనివారంతో రోహిణి, సోమవారంతో మృగశిర, శుక్రవారంతో రేవతి, మంగళవారంతో అశ్వని, యోగించినవి ఉత్తమ, శుభదినాలు. ఈ దినాలలో చేసే పనులకు సిద్ధియోగమూ, పాపనాశనమూ కూడా వుంటాయి. ఇవి సర్వదోషహరములు.


No comments:

Post a Comment