Saturday, 23 March 2024

శ్రీ గరుడ పురాణము (128)

 


ప్లక్ష పుష్కరాది ద్వీపాలు, పాతాళం


ప్లక్ష ద్వీపాధీశుడైన మేధాతిథికి ఏడుగురుపుత్రులు. వారు క్రమంగా శాంతభవుడు, శిశిరుడు, సుభోదయుడు, నందుడు, శివుడు, క్షేమకుడు, ధ్రువుడు. కాగా వారందరూ ఈ ద్వీపాన్ని పరిపాలించారు.


ఈ ద్వీపంలో గోమేద, చంద్ర, నారద, దుందుభి, సోమక, సుమనస, వైభ్రాజమను పేర్లు గల సప్త పర్వతాలున్నాయి. ఇక్కడ అనుతప్త శిఖి విపాశా, త్రిదివ, క్రము, అమృత, సుకృత నామకములైన నదులు ప్రవహిస్తున్నాయి.


వపుష్మాన్ (లేదా వపుష్మంతుడు) శాల్మక ద్వీపానికి రాజు. అతనికి ఏడుగురు కొడుకులు. శ్వేత, హరిత, జీమూత, రోహిత, వైద్యుత, మానస, సప్రభ అనే వారి పేర్లతోనే ఆ వర్షాలు -అంటే రాజ్యాలు కూడా ప్రసిద్ధి చెందాయి. ప్లక్ష ద్వీపంలో కుముద, ఉన్నత, ద్రోణ, మహిష, బలాహక, క్రౌంచ, కకుద్మాన అను పేళ్ళు గల ఏడు పర్వతాలున్నాయి. యోని, తోయ, వితృష్ణ, చంద్ర, శుక్ల, విమోచని, విధృతి నామకములైన సప్తనదులు కూడా వున్నాయి. ఇవన్నీ పాపనాశకాలే.


కుశద్వీపానికి స్వామి జ్యోతిష్మాన్ (జ్యోతిష్మంతుడు) ఆయనకూ ఏడుగురు కొడుకులే. వారు ఉద్భిద, వేణుమాన్, ద్వైరథ, లంబన, ధృతి, ప్రభాకర, కపిల నామధేయులు. వారి పేర్లతోనే వారు పాలించిన ఇక్కడి వర్షాలు ప్రసిద్ధికెక్కాయి. ఈ ద్వీపంలో విద్రుమ, హేమశైల, ద్యుమాన్, పుష్పవాన్, కుశేశయ, హరి, మందరాచలము అను పేర్లు గల యేడు వర్ష పర్వతాలున్నాయి. ఇక్కడ ధూతపాప, శివా, పవిత్ర, సన్మతి, విద్యుదభ్ర, మహీ, కాశాయను సప్త పాపనాశకాలైన నదులు ప్రవహిస్తున్నాయి.


No comments:

Post a Comment