వాయువును నిరోధించి క్రమబద్ధీకరించడం ప్రాణాయామం. మంత్రోచ్ఛారణ చేస్తూ దేవధ్యానంలో వుండి చేసే ప్రాణాయామాన్ని సగర్భ ప్రాణాయామమంటారు. అమంత్రక ప్రాణాయామాన్ని అగర్భప్రాణాయామమంటారు. వీటిలో మరల వాయువును లోపలికి పీల్చి అలాగే వుండి పోవడాన్ని పూరకమనీ, వాయువును పీల్చుట నాపి దేహాన్నీ ఇంద్రియాలనూ స్థిరంగా వుంచడం కుంభకమనీ, అంతవఱకు లోపల ఆపిన వాయువును మెలమెల్లగా బయటకు వదలుట రేచకమనీ వ్యవహరింపబడుతున్నాయి.
ప్రణవ (ఓంకార) జప ప్రక్రియలో 'మాత్ర' (అంటే రెప్పపాటు కాలం)కి విశేష మాహాత్మ్యముంది. ఆ మాత్రానుసారము పన్నెండుమార్లు ప్రణవ-జపంతో చేసే ప్రాణాయామాన్ని ద్వాదశమాత్రిక (లఘు) అనీ, ఇరవై నాలుగు మార్లు చేస్తే చతుర్వింశతి మాత్రిక (మధ్యమ) అనీ, అదే ముప్పదియారు పర్యాయములైతే 'షట్' త్రింశన్మాత్రిక (ఉత్తమ) అనీ అంటారు.
ఈ యామాల్లోనే నిరోధం ప్రత్యాహారం, బ్రహ్మచింతన ధ్యానం, మనోధైర్యం ధారణ. ఇవి పారిభాషిక పదాలు.
అహంబ్రహ్మా నేను బ్రహ్మను అను అభేదజ్ఞానంతో బ్రహ్మరూపంలో ప్రవేశించి నిలిచి పోవడమే సమాధి. తరువాత ఆనంద స్వరూపుడైన పరమాత్మను తత్త్వమసి అను శ్రుతి ద్వారా తెలుసుకోవడమే బ్రహ్మానందము.
'నేను అశరీరిని, ఇంద్రియాతీతుడను. మనోబుద్ధ్యహంకారాల నుండి జాగృతుడను, జాగ్రత్ స్వప్న సుషుప్త్యాది అవస్థల నుండి ముక్తుడను, బ్రహ్మ యొక్క తేజః స్వరూపమేదైతే వుందో అదే నేను. నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త, సత్య, ఆనందస్వరూప, అద్వయ అనే లక్షణాలున్న ఆదిత్య పురుషుడు, పూర్ణ పురుషుడు నేనే' అని భావించుకుంటూ సమాధి నుండి ఆత్మ విడివడి ఊర్ధ్వలోకాలకు పోయి బ్రహ్మలోకంలో నిలిచిపోతుంది. ఆ వ్యక్తి ముక్తిని పొందాడని అర్థం. ఇది తపస్సు.
(అధ్యాయం 49)
No comments:
Post a Comment