Monday 2 September 2024

శ్రీ గరుడ పురాణము (282)

 


తమ తమ నెలవులు దప్పిన తమ వారే శత్రులగుట తథ్యము కదా!


వర్ణం, వంశం, దేశం, స్నేహం, భోజనం వాటంతటవే తెలుస్తాయి. ఎవరూ ఎవరినీ అడగనక్కరలేదు. ఆచారాన్ని చూసి వర్ణ, వంశాలనూ, భాష, భాషణల తీరును బట్టి దేశాన్ని, మనిషి మరో మనిషిని చూడగానే పలకరించే పద్దతిని బట్టి వారి మధ్య గల స్నేహాన్ని, శరీరపుష్టిని గమనించి భోజనాన్నీ పోల్చివేయవచ్చు. ఆచారాదులే చెప్తాయి. సముద్రంలో వాన, బాగా కడుపు నిండిన వానిని భోజనం చేయమంటూ పట్టుదల పట్టడం, అఖిల ఐశ్వర్యవంతునికి దానమిచ్చుట, నీచునికి చేసే ఉపకారాలు వ్యర్థము.


దూరసో ఽపి సమీపస్థో 

యోయస్య హృదయేస్థితః |

హృదయా దపి నిష్క్రంతః

సమీప స్థోఽపి దూరతః ||


(ఆచార .. 115/76)


గుండెలో గూడు కట్టుకొని కూర్చున్న ప్రాణి ఎంతదూరంలో వున్నా మనకు దగ్గరలో నున్నట్లే అనిపిస్తుంటుంది. హృదయంలోంచి తొలగించబడినవారు కాని హృదయం దాకా రాలేనివారు గాని పొరుగింట్లోనే వున్నా పరాయిదేశంలోనున్నట్లే లెక్క.


ముఖంలో వికృతి, గొంతుపూడుకుపోత, దైన్యభావం, చెమటతో తడిసి ముద్దైన శరీరం, అత్యంత భయంకర చిహ్నాలు. అవి సామాన్యమానవుని ఆకృతి పై వాని మృత్యు సమయంలో కనిపిస్తాయి. కాని, బిచ్చమెత్తుకొని బతికేవాని ఆకారం నిరంతరం ఇలాగే వుంటుంది.


మనిషి కుంచించుకుపోవడం, క్రిమిదోషంతో సదా పీడితుడై వుండడం, వాయు వికారగ్రస్తుడై వుండడం, రాజ్యం లేదా గృహం నుండి తగిలేయబడడం, పర్వత శిఖరంపై నివసించడం ఇవన్నీ కూడా ముష్టి వానిగా బతకడం కన్నా మంచివే. యాచననే వృత్తిగా స్వీకరించి బతికేయాలనుకోవడం అనుచితం.


జగత్పతిర్హి యాచిత్వా 

విష్ణుర్వామనతాం యతః |

కోన్యోఽధిక తరస్తస్య

యోర్థీ యాతి న లాఘవం ॥


(ఆచార 115/71)


జగత్పతీ, కొండంత దేవుడూనైన శ్రీ మహావిష్ణువే బలిచక్రవర్తిని యాచించడానికి వెళ్ళినపుడు అంతటి ఐశ్వర్యవంతుడూ కుంచించుకుపోయి వామనుడై పోయాడంటే ఇక కడమ వారిని గూర్చి చెప్పాలా?


ఇక విద్య యొక్క గొప్పదనాన్ని గూర్చి వినండి.

(*తెలుగు వారు భర్తృహరి సుభాషితాల ద్వారా దీనిని చిన్నపుడే వినేశారు. ఆ భర్తృహరికే మూలం గరుడపురాణం)


విద్యానామ కురూపరూప మధికం విద్యాతి గుప్తం ధనం 

విద్యాసాధుకరీ జనప్రియకరీ విద్యా గురూణాం గురుః |

విద్యా బంధుజనార్తి నాశనకరీ విద్యా పరం దైవతం 

విద్యా రాజసుపూజితాహి మనుజో విద్యా విహీనః పశుః||


(ఆచార .. 15/81) 

No comments:

Post a Comment