Tuesday 3 September 2024

శ్రీ గరుడ పురాణము (283)

 


కురూపికి కూడా విద్య వుంటే కళ, కాంతి వస్తాయి. రూపాన్నంటే తల్లిదండ్రులివ్వలేక పోవచ్చుగానీ అవకాశముండీ పిల్లలకు మంచి చదువు చెప్పించని వారు ఆ పిల్లలకు శత్రువులకిందే లెక్క, విద్యరూపాన్నిస్తుంది. దాచుకున్న సొమ్ములాగా అక్కరకొస్తుంది. ఎవరి చేతిలోనైతే తాను వుంటుందో వానిని సాధు స్వభావిగా మారుస్తుంది. లోకులందరికీ ప్రీతిపాత్రునిగా చేస్తుంది. గురువులకు కూడా గురువైనది విద్య. అది విద్యావంతుని యొక్క బంధు బాంధవుల కష్టాలను కూడా దూరం చేసి కాపాడగలదు. విద్యయే పరమ దేవత. రాజుల చేత కూడ సామాన్యుడైన విద్యావంతుడు పూజింపబడతాడు. విద్యగల వాడే మనిషి, అది లేనినాడు పశువు. ఎట్టి ద్రవ్యమైనను దొంగలనుండి సంపూర్ణంగా సురక్షితమనలేము. కాని, విద్య దొంగలచేతికి దొరకని దైవం, ద్రవ్యం. (అనంతర కాలంలో తెలుగులో వెలసిన విద్యా పద్యాలకు ముఖ్యంగా విద్యలేనివాడు వింతపశువు. విద్య నిగూఢ గుప్తమగు విత్తము, విద్య నెఱుంగని వాడు మర్త్యుడే - వంటి సుప్రసిద్ధ భావాలకు గరుడపురాణమే మూలము)


(అధ్యాయం -115)


తిథులూ - వ్రతాలూ


బ్రహ్మదేవుడు వ్యాసమహర్షికి ఇంకా ఇలా చెప్పాడు. 'హే వ్యాసమునీ! ఇపుడు నేను కొన్ని వ్రతాలను నీకుపదేశిస్తాను. వీటిని శ్రద్ధాభక్తులతో చేసే వారికి విష్ణువు అన్నీ ఇస్తాడు. అన్నిమాసాల్లో, అన్ని నక్షత్రాల్లో, అన్నితిథుల్లో హరికి ప్రియమైన వ్రతాలున్నాయి. 


ఏకభుక్తం, నక్తవ్రతం, ఉపవాసం లేదా ఫలాహారవ్రతం- ఏది చేసినా శ్రీహరి ఆ వ్రతికి ధన, ధాన్య, పుత్ర, రాజ్య, విజయాలలో ఎన్నెనా గానీ అన్నీ అయినా గాని ప్రసాదిస్తాడు.


దినార్ధ సమయే తీతే భుజ్యతే నియమేనయత్ | 

ఏకభుక్త మితిప్రోక్తం రాత్రే తన్న కదాచన ॥


పగటిలో సగం కాలం గడిచాక భోజనం చేసి మరల ఇరువది నాలుగు గంటలు గడిచేదాకా ఏమీ తినకుండా చేసే వ్రతం ఏకభుక్తం.


దివ సస్యాష్టమే భాగే మందీభూతే దివాకరే | 

నక్తం తచ్చ విజానీయాన్న నక్తం నిశిభోజనం ॥

నక్షత్ర దర్శనాన్నక్తం గృహస్థేన విధీయతే |

యతేర్ది నాష్టమే భాగే రాత్రే తస్య నిషేధనం ॥


పగటిలో ఎనిమిదవ భాగం గడిచాక, సూర్య ప్రభలు మందమైపోతున్నపుడు భోజనం చేసి మరల ఇరువది నాలుగు గంటలలోపల ఏమీ తినకుండా వుండడాన్ని నక్తవ్రతమంటారు. గృహస్థు నక్షత్ర దర్శనమయ్యాక తినాలి. యతులు సూర్యాస్తమయానికి కాస్తముందు భిక్షాటన చేసి తినాలి.


పాడ్యమి తిథి నాడు వైశ్వానరునీ, కుబేరునీ పూజించాలి. వారు సాధకునికి అర్థలాభాన్ని అంటే ధన, కనక, వస్తు వాహనాదులను ప్రదానం చేస్తారు. పాడ్యమీ, అశ్వనీ నక్షత్రాలు కలిసిన నాడు ఉపవాసం చేస్తే బ్రహ్మదేవుడు, సంతోషించి అర్ధాన్నిస్తాడు.


తిథి       పూజ్యదైవతాలు             ఫలాలు


విదియ      యముడు, లక్ష్మీనారాయణుడు   అర్థలాభం

తదియ      గౌరి, శివుడు, గణేశుడు

చవితి       చతుర్వ్యూహాలతో విష్ణువు

పంచమి     హరి

షష్ఠి        కార్తికేయుడు, సూర్యుడు (రవి)

సప్తమి      భాస్కరుడు (ఉపవాసంచేయాలి)  అర్థలాభం

అష్టమి      దుర్గ

నవమి      మాతృకలు, దిశలు           అర్థలాభం

దశమి      యముడు, చంద్రుడు

ఏకాదశి     ఋషిగణాలు

ద్వాదశి    హరి, మన్మథుడు

త్రయోదశి   శివుడు

చతుర్దశి, పున్నమి బ్రహ్మ               

అమావాస్య  పితృగణాలు               ధనసంపత్తి


ఆదివారం అశ్వనితో మొదలుపెట్టి వరుసగా నాలుగు నక్షత్రాలను సోమవారం అయిదునుండి మరోనాల్గింటిని అలా శనివారం మూడిటితో మొత్తం ఇరవైయేడు నక్షత్రాలనూ పూజించినవారి కోరికలన్నిటినీ ఆ నక్షత్రాలు నెరవేర్చగలవు. (అధ్యాయం 116)


No comments:

Post a Comment