Monday 16 September 2024

శ్రీ గరుడ పురాణము (290)

 


ఏకాదశీ* మహాత్మ్యం

* ఈ పురాణంలో వైష్ణవంలోని ఏకాదశిని మాత్రమే చర్చించడం జరిగింది.


ఒకప్పుడు మాంధాతయని ఒక రాజుండేవాడు. ఆయన ఈ వ్రతాన్ని చేసి చక్రవర్తి, సమ్రాట్ అనిపించుకొనే స్థాయికి ఎదిగాడు. ఈ వ్రతపుణ్యం అంత గొప్పది. ఈ వ్రతంలో ప్రథమ నియమం కృష్ణ, శుద్ధ రెండు ఏకాదశులలోనూ జీవితాంతమూ భోజనం చేయకుండా వుండుట.


కౌరవ సమ్రాజ్ఞి గాంధారి దశమీ విద్ద ఏకాదశినాడు ఈ వ్రతాన్ని చేసింది. ఆ దోషం వల్ల ఆమె పుత్రులామె జీవితకాలంలోనే నశించారు. కాబట్టి దశమితో యుక్తమైన ఏకాదశినాడు వ్రతం చేయరాదు.


ద్వాదశితో కలిసిన ఏకాదశినాడు శ్రీ హరి వ్రతుల వద్దకు వచ్చి వుంటాడు. దశమితో కలిసిన ఏకాదశినాడు రాక్షసులు వచ్చి వుంటారు. తిథి విషయంలో సందేహాలున్నవారు ద్వాదశినాడు కూడా ఉపవసించి త్రయోదశినాడు పారణం చేయడం మంచిది.


ఒకరోజులో ఏకాదశి ఏకకళ మాత్రమే వుంటే ద్వాదశినాడీ వ్రతాన్ని చేయాలి. (తగులు, మిగులు అనే మాటలు తెలుగు కుటుంబాలలో వాడుకలో వున్నాయి. తగులు మరీ తక్కువగా వుంటే మిగులులో చేయవచ్చని అర్థం) ఒకే రోజులో దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులు వస్తే ఆ రోజు తప్పనిసరిగా వ్రతం చేయాలి. అది పరమమంగళకరమైన రోజు; సర్వపాపవినాశకరమైన రోజు.


రాత్రి జాగరణ, పురాణ శ్రవణం, గదాధర విష్ణుదేవుని పూజ ఈ మూడిన్టినీ కృష్ణ శుద్ద ఏకాదశులలో, ఉపవాసంతో సహా జీవితాంతమూ చేసిన రుక్మాంగద మహారాజుకి మోక్షం లభించింది. కాబట్టి ఈ వ్రతాన్ని ఎవరుచేసినా సుఖజీవనం, మోక్షప్రాప్తి కలుగుతాయి.


(అధ్యాయం -125)

No comments:

Post a Comment