చాతుర్మాస్యవ్రతం
ఈ వ్రతాన్ని ఆషాఢమాసంలో ఏకాదశినాడుగాని పున్నమనాడు గాని భగవానుడైన హరిని వీలైనన్ని విధాల పూజించి ఈ క్రింది శ్లోకాలతో ప్రార్థించి ప్రారంభించాలి.
ఇదం వ్రతం మయాదేవ గృహీతం పురతస్తవ |
నిర్విఘ్నం సిద్ధి మాప్నోతు ప్రసన్నే త్వయి కేశవ ॥
గృహీతేఽస్మిన్ ప్రతేదేవ యద్య పూర్ణే మ్నియామ్యహం ।
తన్మే భవతు సంపూర్ణం త్వత్ప్రసాదాజ్జనార్ధన ॥ (ఆచార ..121/2,3)
ఒకవేళ ఈ వ్రతం చేస్తూ పూర్తికాకుండా నేను మరణిస్తే సంపూర్ణ వ్రత ఫలాన్నే దయచేయించుమని ఈ శ్లోకం ద్వారా హరిని ప్రార్థించడం జరుగుతోంది.
ఈలాగున ప్రార్థించి హరిని పూజించి వ్రత, పూజన, జపాదిక నియమ గ్రహణం చేయాలి. ఈ సంకల్పంతోనే పాపాలు దూరమవుతాయి. సాధకుడు స్నానం చేసి సంకల్పం చెప్పుకొని ఆషాఢంనుండి (తో) మొదలుపెట్టి నాలుగు మాసాల పాటు ఏకభుక్తముంటూ విష్ణుపూజ చేస్తే ఆయన యొక్క పరమ పవిత్రనిర్మల లోకాన్ని చేరుకుంటాడు.
నూనెలను,మద్యమాంసాదులను విసర్జించి, వేద పారంగతుడనిపించుకొని కృచ్ఛపాదవ్రతి* యైన విష్ణుభక్తుడీ వ్రతాన్ని చేస్తే విష్ణులోకానికి వెళతాడు. 'ఇది మూడురోజుల వ్రతం. తొలిరోజు ఒకేమారు హవిష్యాన్నాన్ని తినాలి. రెండవరోజు అయాచిత హవిష్యాన్నాన్నే తినాలి. మూడవరోజంతా ఏమీ తినరాదు (యాజ్ఞవల్క్యస్మృతి, ప్రాయ.. శ్లో 318).
ఒక రాత్రి ఉపవాసాన్ని చేసిన ప్రతి వైమానిక దేవతగా పదోన్నతిని పొందుతాడు. మూడు రాత్రులు ఉపవాసం చేసి ఆ తరువాత మూడురాత్రులపాటు ఆరవ అంశనే భోజనం చేయు వ్రతికి శ్రీ ద్వీప నివాసం ప్రాప్తిస్తుంది. చాంద్రాయణ వ్రతం చేసిన చాతుర్మాస్య వ్రతికి ముక్తి, విష్ణులోక ప్రాప్తి కోరకుండానే లభిస్తాయి. ప్రాజాపత్యవ్రతం చేసిన వ్రతికి కూడా విష్ణులోకం ప్రాప్తిస్తుంది. ఈ వ్రతం చేసిన పరాకవ్రతికి సాక్షాత్తూ హరిప్రాప్తి యే చెప్పబడింది.
* చాంద్రాయణ వ్రతం మనుధర్మశాస్త్రం 11/216 లో పేర్కొనబడింది. తదనుసారము ఇది ఒక నెలపాటు పడవలసినపాటు త్రికాల స్నానం, పున్నం నాడు వ్రతం మొదలు, పదిహేను గ్రాసాల హవిష్యాన్న గ్రహణం, మరునాటి నుండి ఒక్కొక్క గ్రాసాన్ని తగ్గించుకుంటూ తిని కృష్ణపక్ష చతుర్దశినాడు ఒకే ఒక్క గ్రాసం తిని, అమావాస్యనాడు పూర్ణ ఉపవాసం, మరునాడు అనగా శుద్ధ పాడ్యమి నాడు ఒకే గ్రాసంతిని అలా రోజుకొకటి పెంచుకుంటూ పోయి పున్నంనాడు మరిల పదిహేనుగ్రాసాల హవిష్యాన్నాన్ని తిని వ్రత సమాప్తి చేయుట. *ప్రాజాపత్యవ్రతం పన్నెండు రోజుల వ్రతం. ఏనాడైనా నియమగ్రహణం చేసి తొలిమూడు రోజుల్లో పగలు మాత్రమే హవిష్యాన్నాన్ని తినాలి. మలి మూడురోజుల్లో రాత్రి మాత్రమే. తరువాతి మూడు రోజులు అయాచితం. చివరి మూడురోజులూ సంపూర్ణఉపవాసం (మను11/211)
పరాక వ్రతమనగా పన్నెండు రోజులపాటు ఏ ఘనపదార్థాన్నీ తినకుండా నీరు మాత్రమే త్రాగి ఉండిపోవుట.
(యా.స్మృ.ప్రా.320, మను 11/215)
ఈ చాతుర్మాస్య వ్రతంలో సత్తుపిండినీ, యవాన్నాన్నీ మాత్రమే ఎవరైనా పెడితే తింటూ, పాలు, పెరుగు, నెయ్యిలను ఒక మారే నోటిలో వేసుకొని వుంటూ, గోమూత్ర యావకాన్ని తింటూ, పంచగవ్యాలను మాత్రమే త్రాగుతూ జీవించాలి. లేదా షడ్రసాలను పరిత్యజించి శాక-మూల- ఫలాలను మాత్రమే తినాలి. ఈ విధంగా చేసినవారు విష్ణులోక ప్రాప్తి నందగలరు.
(అధ్యాయం -121)
No comments:
Post a Comment