Tuesday 24 September 2024

శ్రీ గరుడ పురాణము (298)

 


దూర్వాష్టమి, శ్రీకృష్ణాష్టమి


భాద్రపద శుద్ధ అష్టమినాడు దూర్వాష్టమి వ్రతాన్ని చేయాలి. దూర్వ యనగా గరిక. ఆ రోజు ఉపవాసం చేసి గౌరీ, గణేశ, శివ ప్రతిరూపాలను గరికెతోనూ ఆపై ఫల పుష్పాదులతోనూ పూజించాలి. ప్రతి పూజాద్రవ్యాన్నీ శంభవేనమః, శివాయనమః అంటూ శివునిపై వేయాలి. దూర్వను కూడా ఇలా ప్రార్థించాలి.


త్వందూర్వేఽమృతజన్మాసి వందితా చ సురాసురైః | 

సౌభాగ్యం సంతతిం కృత్వా సర్వకార్య కరీభవ ॥ 

యథాశాఖా ప్రశాఖాభిర్విస్తు తాసి మహీతలే । 

తథా మమాపి సంతానం దేహి త్వమజరామరే ॥


ఈ దూర్వాష్టమి వ్రతాన్ని చేసిన వారికి సర్వస్వ ప్రదానాన్ని దేవతలు చేస్తారు. ఈ వ్రతం చేసి అగ్ని పక్వం కాని భోజనం చేసేవారు బ్రహ్మహత్యాపాతకం నుండి విముక్తులౌతారు.


శ్రీకృష్ణాష్టమి భాద్రపద కృష్ణ అష్టమి నాడు జరపబడుతుంది. ఆ రోజు అర్ధరాత్రి రోహిణినక్షత్రంలో ఆ యుగపురుషునిగా భగవానుడైన శ్రీహరి పుడమిపై నవతరించాడు. సప్తమితో కలిసిన ఈ అష్టమి కూడా వ్రతయోగ్యమే. ఈనాడు కృష్ణుని పూజించిన వారికి మూడు జన్మల పాపాలు నశిస్తాయి. ముందుగా 


ఓం యోగాయ యోగపతయే యోగేశ్వరాయ | 

యోగ సంభవాయ గోవిందాయ నమోనమః ॥


అనే మంత్రంతో యోగేశ్వరుడూ యోగీశ్వరుడునైన శ్రీకృష్ణుని ధ్యానించి ఈ క్రింది మంత్రంతో ఆయన ప్రతిమకు స్నానం చేయించాలి.


ఓం యజ్ఞాయ యజ్ఞేశ్వరాయ యజ్ఞపతయే యజ్ఞ సంభవాయ గోవిందాయ నమో నమః । అనంతరం ఈ మంత్రంతో ఆయనను పూజించాలి.


ఓం విశ్వాయ విశ్వేశ్వరాయ విశ్వపతయే 

విశ్వ సంభవాయ గోవిందాయ నమో నమః । 


పిమ్మట ఈ మంత్రంతో స్వామిని శయనింపజేయాలి.


ఓం సర్వాయ సర్వేశ్వరాయ సర్వపతయే

సర్వసంభవాయ గోవిందాయ నమోనమః ।


ఒక స్థండిలం (వేది) పై చంద్రునీ, రోహిణీనీ శ్రీకృష్ణభగవానునీ ఉంచి పూజించాలి. పుష్ప, జల, చందనయుక్త జలాన్ని ఒక శంఖంలో తీసి పట్టుకొని మోకాళ్ళపై కూర్చుని క్రింది మంత్రాన్ని చదువుతూ చంద్రునికి అర్ఘ్యమివ్వాలి.


క్షీరోదార్ణవ సంభూత అత్రినేత్ర సముద్భవ |

గృహాణార్ఘ్యం శశాంకేశ రోహిణ్యా సహితో మమ ॥


(ఆచార .. 131/8,9)

No comments:

Post a Comment