Sunday, 22 September 2024

శ్రీ గరుడ పురాణము (296)

 


ఆవాహన తరువాత ఒక ప్రత్యేక గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ అంగుష్ఠాదిన్యాసం చేయాలి. ఇలా:


ఓం మహా కర్ణాయ విద్మహే

వక్రతుండాయ ధీమహి

తన్నో దంతిః ప్రచోదయాత్!


కరన్యాసం కడముట్టినాక ఈ మంత్రాన్నే పరిస్తూ తిలాదులతో వినాయకుని పూజించి వాటినే ఆహుతులుగా ఇవ్వాలి. గణాలను కూడా స్మరిస్తూ 

గణపతయేనమః ఓం కూష్మాండకాయనమః అంటూ పూజించాలి. ఇదేవిధంగా ఇతర గణాలను పూజిస్తూ 'స్వాహా'ను చేర్చి ఆహుతులిలా ఇవ్వాలి.


ఓం నమ అమోఘోల్కాయ స్వాహా

ఓం నమః ఏకదంతాయ స్వాహా

ఓం నమస్ త్రిపురాంతక రూపాయ స్వాహా

ఓం నమశ్శ్యామదంతాయ స్వాహా

ఓం నమో వికారలా స్యాయ స్వాహా

ఓం నమ ఆహవేషాయ స్వాహా

ఓం నమః పద్మ దంష్టాయ స్వాహా ।


అనంతరం ప్రతి గణదేవునికి ముద్రలను ప్రదర్శించి, నృత్యం చేసి, చప్పట్లు కొట్టి, హాస్య ప్రసంగాలను చేయాలి. ఇలా చేసిన వారికి సకల సౌభాగ్యాలూ కలుగుతాయి.


మార్గశిరశుద్ధ చవితినాడు దేవగణముల వారిని పూజించాలి. సోమవారము, చవితిరోజులలో ఉపవాసముండి గణపతి దేవుని పూజించి ఆయనను జప, హవన, స్మరణల ద్వారా ప్రసన్నం చేసుకోగలిగినవారికి విద్య, స్వర్గం, మోక్షం లభిస్తాయి.


ప్రతి శుద్ధ చవితినాడు చక్కెర లడ్లతో, కుడుములతో విఘ్నేశ్వరుని పూజించేవారికి సర్వకామనలూ సిద్ధిస్తాయి, సర్వసౌభాగ్యాలూ అబ్బుతాయి. దమనకాలతో ఇదే విధంగా పూజించేవారికి పుత్ర ప్రాప్తి కలుగుతుంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో శుద్ధ చవితిని దమనా అని కూడా అంటారు.


ఓం గణపతయేనమః ఈ మంత్రంతో గణపతిని పూజించాలి. ఏ మాసపు శుద్ధచవితి నాడైనా గణపతిని పూజించి హోమ, జప, స్మరణములను చేస్తే అన్ని విఘ్నాలూ నశించి అన్ని కోరికలూ తీరతాయి. గణపతికి గల విభిన్న నామాలను జపిస్తూ గాని స్మరిస్తూ గాని ఆ ఆద్యదేవుని పూజిస్తే సద్గతి ప్రాప్తిస్తుంది. ప్రతి ఈ లోకంలో నున్నంతకాలం సమస్త సుఖాలనూ అనుభవిస్తాడు. అంతలో స్వర్గాన్నీ మోక్షాన్నీ పొందుతాడు.


వినాయకుని పన్నెండు నామములూ ఈ శ్లోకంలో చెప్పబడ్డాయి.


గణపూజ్యో వక్రతుండ ఏకదంష్ట్రీ త్రియంబకః | 

నీలగ్రీవో లంబోదరో వికటో విఘ్న రాజకః ॥


ధూమ్రవర్లో భాలచంద్రో దశమస్తు వినాయకః | 

గణపతి ర్హస్తిముఖో ద్వాదశారే యజేద్గణం ॥


(ఆచార ... 129/25,26)


ఒక్కొక్క నామాన్నే జపిస్తూ ఒక్కొక్క చవితి నాడూ యథావిధిగా పూజ చేసి అలా ఒక ఏడాది చేసినవారికి అభీష్ట సిద్ది కలుగుతుంది.


ఇక పంచమి నాడు నాగులను పూజించాలి. శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తిక మాసాలలో శుక్ల పంచమి తిథుల్లో వాసుకి, తక్షక, కాళియ, మణిభద్రక, ఐరావత, ధృతరాష్ట్ర, కర్కోటక, ధనుంజయ నామకులైన ఎనమండుగురు నాగరాజు లనూ పూజించాలి. వీరికి నేతితో స్నానం చేయించి పూజ చేయాలి. ఈ నాగాధీశులు తమ భక్తులకు ఆయురారోగ్యాలనూ, స్వర్గలోక నివాసాన్నీ ప్రసాదించగలరు. అనంతుడు, వాసుకి, శంఖుడు, పద్ముడు, కంబలుడు, కర్కోటకుడు, ధృతరాష్ట్రుడు, శంఖకుడు, కాళియుడు, తక్షకుడు, పింగళుడు - ఈ పన్నిద్దరు నాగులనూ ఇదే క్రమంలో నెలకొకరిని పూజించాలి. భాద్రపద శుద్ధపంచమి నాడు ఎనమండుగురు నాగులనూ ఒకేసారి పూజించాలి. నాగరాజులు స్వర్గాన్నీ మోక్షాన్నీ ప్రసాదించగలరు.


శ్రావణశుద్ధ పంచమినాడు ద్వారానికి రెండువైపులా ఈ నాగుల చిత్రపటాలను పెట్టి పూజించాలి. నైవేద్యంగా పాలనూ నేతినీ వుంచాలి. ఈ పూజవల్ల విషదోషాలా యింటి కంటవు. పాము కాటు ఆ ఇంటివారినేమీ చేయలేదు. అందుకే ఈ పంచమిని దంష్ట్రో ద్వార పంచమి అంటారు.


(అధ్యాయం -129)

No comments:

Post a Comment