Monday, 23 September 2024

శ్రీ గరుడ పురాణము (297)

 


షష్ఠి, సప్తమి వ్రతాలు


భాద్రపద షష్ఠినాడు కార్తికేయుని పూజించాలి. ఈ పూజలో చేసే స్నానాది పవిత్ర కృత్యాలన్నీ అక్షయ ఫలదాయకాలవుతాయి. ప్రతి షష్ఠినాడుపవాసం చేసి సప్తమి నాడు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి ముందుగా ఓం ఖఖోల్కాయనమః అనే మంత్రంతో సూర్యుని పూజించాలి. అష్టమినాడు మిరియాలతో భోజనం చేసి పారణ చేయాలి. (సప్తమి నాటి భోజనం సంగతి ఇక్కడ చెప్పబడలేదు. గాని కొన్ని ప్రాంతాల్లో ఆరోజు 'చప్పిడి' చేస్తారు. అనగా ఉప్పుకారములు లేని భోజనం చేస్తారు - అను) మిరియాన్ని ‘మరిచ’ అంటారు. కాబట్టి ఈ సప్తమి వ్రతానికి మరిచ సప్తమివ్రతమనే పేరుంది. ఈ వ్రతం చేసిన వారికి దూరమైన ప్రియజనులు దగ్గరౌతారు. ఇక ఎడబాటన్నది వుండదు. ఈ రోజు సంయమనాన్ని పాటిస్తూ స్నానాదికములను చేసి మార్తండః ప్రీయతాం అంటూ యథావిధి సూర్యుని పూజించి, అదే వాక్యాన్ని పలుకుతూ బ్రాహ్మణులకు ఖర్జూరం, నారికేళం, గజనిమ్మ మున్నగు పండ్లను దానం చేయాలి. ప్రతి కూడా ఆ రాత్రికి వాటినే తిని శయనించాలి. ఈ వ్రతాన్ని ఫల సప్తమీ వ్రతమని ఇందువల్లనే అంటారు. 


సప్తమి నాడు సూర్యదేవుని పూజించిన తరువాత బ్రాహ్మణునికి పాయసంతో భోజనం పెట్టి దక్షిణనిచ్చి వ్రతి స్వయంగా పాలను త్రాగి వ్రతాన్ని ముగిస్తే పుణ్యప్రదుడౌతాడు. కోరికని బట్టి ఆహారముండే వ్రతమిది. ధన- పుత్ర లాభం కావలసినవారు ఓదన, భక్ష్యాదులను తీసుకోరాదు. దీనిని అనౌదక సప్తమీ వ్రతమంటారు.


అలాగే విజయాన్ని కోరుకునేవారు వాయు భక్షణ మాత్రమే చేయాలి. దానిని విజయ సప్తమి వ్రతమంటారు. మధు, మైధునాదులనూ, ఉడద, యవ, తిలాదులనూ, తైలమర్దన, అంజనాదులనూ ఇతర సర్వభోగాలనూ పరిత్యజించి చేస్తేనే ఈ వ్రతం పూర్తి ఫలితాన్నిస్తుంది.


(అధ్యాయం -130)

No comments:

Post a Comment